ఒకేసారి 3 ఉత్సవాలు - విశాఖ తీరంలో భారత నౌకాదళం మహా ప్రదర్శన
సాగర జలాలలో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పే మహత్తర ఘట్టం - ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026 - మిలాన్-2026 - ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియంలో వివిధ విన్యాసాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 18, 2026 at 4:55 PM IST
Indian Navy Grand Events At Visakhapatnam Coast: అనంత సాగర జలాలలో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే మహత్తర ఘట్టానికి విశాఖ మహా నగరం వేదికైంది. తొలిసారిగా ఒకేసారి 3 ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026, మిలాన్-2026, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియంలో వివిధ విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. సాగర జలాల్లో స్నేహ వారధుల బలోపేతం అన్న నినాదంతో జరుగుతున్న ఈ వేడుకలు కేవలం యుద్ధ నౌకలు, పాటవాల ప్రదర్శనకే పరిమితం కాకుండా దేశాల మధ్య స్నేహం, సహకారానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ బలమైన శక్తి అని చాటిచెప్పేలా వేడుకల సందర్భంగా స్నేహపూర్వక దేశాలన్నీ ఒకేచోట చేరాయి. వీటి ద్వారా ప్రపంచ శాంతి, సముద్ర భద్రతకు కొత్తదారులు వేయాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఐఎఫ్‌ఆర్, మిలాన్, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియంలు చరిత్రలోనే అతి పెద్దవిగా నిలవనున్నాయి.
18వ శతాబ్దంలోనే మరాఠా నౌకాదళాధిపతి కాన్హోజ్ అంగ్రే నేతృత్వంలో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన మహాసాగర్ దార్శనికత ఆధారంగా సముద్ర జలాలపై ప్రాంతీయ భద్రత, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా రూపుదిద్దుకున్న చర్యలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇందులో భాగంగా విశాఖపట్నం తీరంలో భారత నౌకాదళం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026, మిలన్-2026, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియంలను నిర్వహిస్తోంది. మూడింటిని ఒకేసారి నిర్వహించడం ద్వారా నౌకాదళ సత్తా విషయంలో భారత్ ప్రపంచానికి ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపుతోంది. ఫ్లీట్ రివ్యూల సంప్రదాయం భారత్‌కు కొత్తేమీ కాదు. 18వ శతాబ్దంలోనే మరాఠా నౌకాదళాధిపతి కాన్హోజ్ అంగ్రే నేతృత్వంలో రత్నగిరి తీరంలో తొలి నౌకల సమీక్ష జరిగింది. స్వాతంత్య్రం తర్వాత 1953లో తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించిన ఫ్లీట్ రివ్యూతో ఈ సంప్రదాయానికి నూతన రూపం లభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 12 సార్లు ఫ్లీట్ రివ్యూలు నిర్వహించారు. ఇది మూడవ అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన కావడం విశేషం.
నేవీ సెయిలర్స్ విన్యాసాలు: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026లో అమెరికా, రష్యా పాల్గొంటూ ఉండగా, జర్మనీ, ఫిలిప్పీన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తొలిసారిగా యుద్ధనౌకలు పాల్గొంటున్నాయి. చైనా, టర్కీ, పాక్ దేశాలను ఈ కార్యక్రమాలకు భారత్ ఆహ్వానించలేదు. ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఉత్తర అరేబియా సముద్రంలో మోహరించి పాక్‌ను వణికించిన విక్రాంత్ ఇప్పుడు విశాఖ తీరంలో ప్రపంచ దేశాలకు తన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించేందుకు విచ్చేసింది. ఐఎఫ్‌ఆర్-2026, మిలన్-2026, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియంకు అతిధ్యమిస్తున్న విశాఖనగరంలో నౌకాదళ సత్తా అందరికీ తెలిసేలా ఈ నెల 19 సాయంత్రం ఆర్కే బీచ్‌లో పరేడ్ జరగనుంది. ఇందులో 8 వరకు విదేశీ నావికా బ్యాండ్లు పాల్గొంటాయి. 45 బృందాలు పరేడ్‌లో భాగస్వామ్యం అవుతాయి. ఈ సందర్భంగా జరిగే సాహస విన్యాసాల ప్రదర్శన కోసం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు ముమ్మర కసరత్తు చేశాయి. కమోవ్, ధ్రువ్, సీ కింగ్ హెలికాప్టర్లు, డార్నియర్, హాక్, మిగ్-29కే నౌకాదళ యుద్ధ విమానాలు ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేస్తాయి. చేతక్ హెలికాప్టర్లు రెస్క్యూ ఆపరేషన్ చేపడతాయి. ఈ పరేడ్‌కు అనుబంధంగా యుద్ధ నౌకలపై నేవీ సెయిలర్స్ విన్యాసాలు కూడా నిర్వహిస్తారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి: విశాఖలో మిలన్ విన్యాసాలు పదేళ్ల తర్వాత జరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా నగరవాసులు మిలన్‌పై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి నౌకాదళ బహుముఖ విన్యాసాలు జరిపేలా మిలన్ రూపకల్పన చేశారు. 1995లో అండమాన్ నికోబార్ రాజధాని పోర్టు బ్లెయిర్‌లో కేవలం నాలుగు దేశాలతో మిలన్ ప్రారంభమైంది. అప్పుడు లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలు భారత్ ఆధ్వర్యంలో సంయుక్త విన్యాసాలు చేపట్టాయి. తర్వాత 2022లో విశాఖ తీరాన జరిగిన మిలన్‌లో 39 దేశాలు పాల్గొన్నాయి. ఈ సారి మిలన్‌కి భారత్ అధ్యక్షస్ధానంలో బాధ్యతలను నిర్వర్తిస్తుండగా 65దేశాలు పాల్గొంటున్నాయి. మిలన్ విలేజ్‌లో మిలన్, ఐఎఫ్‌ఆర్‌కు సంబంధించిన టోపీలు, బ్యాగులు, కొయ్య బొమ్మలు, మట్టి కుండలు, రుచికరమైన వంటల స్టాల్స్, చేనేత, హస్తకళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈనెల 21 వరకు మిలన్ విలేజ్ కొనసాగుతుంది. ఈనెల 21 నుంచి 25 వరకు హార్బర్ ఫేజ్ లో భాగంగా విదేశీ యుద్ధ నౌకలు, భారత నౌకాదళం కలిసి బంగాళా ఖాతం మధ్యలో రకరకాల విన్యాసాలు నిర్వహిస్తాయి.
65 దేశాల నుంచి నేవీ ప్రతినిధులు: హిందూ మహా సముద్రం, పసిఫిక్ ప్రాంతానికి చెందిన నౌకాదళాల చీఫ్‌లు, ఉన్నతాధికారులు పాల్గొనే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం ఈనెల 20న విశాఖలోనే నిర్వహిస్తారు. దీనికి కూడా 65 దేశాల నేవీ ప్రతినిధులు హాజరవుతారు. పరస్పర సహకారం, అభివృద్ది, సాంకేతిక మార్పిడి వంటి వాటిపై చర్చించనున్నారు. ఈనెల 21 నుంచి 25 వరకు బంగాళాఖాతంలో మిలన్ 2026 సీఫేజ్ విన్యాసాలు పూర్తి చేసుకుని విదేశాల నుంచి వచ్చిన యుద్ధ నౌకలు ఆయా దేశాలకు పయనమవుతాయి. మన నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు కూడా ఈ సీఫేజ్ తర్వాత తమ తమ స్థావరాలకు చేరుకుంటాయి.
విద్యార్థులకు పోలవరం ప్రాజెక్టు వీక్షించే అవకాశం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
గిరిపుత్రుల భవిష్యత్‌కు భరోసా - 60 రోజుల పాటు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ

