ఆఫ్రికాలో ఎబోలా విజృంభన - వైరస్ కారణంగా అప్రమత్తమైన భారత్
ఆఫ్రికాలో వెయ్యి మందికి పైగా వైరస్ వ్యాప్తి, 223 మంది మృతి - నిబంధనలు పాటించక వేగంగా వ్యాప్తి - అధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్ష - తగిన చర్యలు తీసుకోవాలని సూచన

Published : May 27, 2026 at 3:01 PM IST
Ebola Alert in India Telugu : ఆరేళ్ల క్రితం ప్రపంచాన్ని కలవరపెట్టి లక్షలాది మంది ప్రాణాలు తీసిన కరోనాను ఎప్పటికీ మర్చిపోలేం. వ్యాక్సిన్‌లు, వైద్య చికిత్సల ద్వారా దాన్ని అంతం చేసినా .ఆఫ్రికా ఖండాన్ని ఇప్పుడు ఎబోలా వైరస్ వణికిస్తోంది. కాంగోలో బయటపడి మరో రెండు దేశాలకు విస్తరించిన ఈ వైరస్ వెయ్యి మందికి పైగా సోకింది. దీని బారిన పడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దీని తీవ్రత దృష్ట్యా భారత్ కూడా అప్రమత్తమైంది. విదేశాలకు అనవసర ప్రయాణాలు వద్దని కేంద్రం సూచించింది. కాంగో, ఉగాండా నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది. మరి ఏమిటి ఈ ఎబోలా? ఇది ఎంత ప్రమాదకరం? భారత్‌కు దీని వల్ల ముప్పు ఉందా?
ప్రపంచానికి సవాల్ విసురుతున్న రోగాలు : శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతున్నా రోగాలు, వైరస్‌లు ప్రపంచానికి సవాల్ విసురుతూనే ఉన్నాయి. ఔషధాలు, చికిత్సలు, వ్యాక్సిన్‌ల ద్వారా వాటిని అంతం చేస్తున్నా కొత్త కొత్త రూపాల్లో పుట్టుకొస్తూనే ఉన్నాయి. అదే క్రమంలో ఆఫ్రికాను ఇప్పుడు ఎబోలా వైరస్ వణికిస్తోంది. ఈ నెల 15న కాంగోలో బయటపడ్డ ఈ వైరస్ ఉగాండా, దక్షిణ సూడాన్‌లకు విస్తరించింది. మూడు దేశాల్లో కలిపి మంగళవారం వరకు ఇది వెయ్యి మందికి పైగా సోకగా, 223 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య కాంగోలోని యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఉగాండా సరిహద్దులో మొదటి ఎబోలా కేసు నమోదైంది.
లక్షణాలు బయటపడకపోవడంతో : అక్కడ ఓ హెల్త్ వర్కర్ వాంతులు, జ్వరంతో చికిత్స తీసుకుని కొన్ని రోజుల్లోనే మరణించారు. ఆ తర్వాత మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తరలించగా దాన్ని తాకిన చాలా మందిలో కొన్ని రోజుల్లోనే ఎబోలా లక్షణాలు బయటపడ్డాయి. వైరస్ సోకిన వారికి కొన్ని వారాల పాటు వ్యాధి లక్షణాలు బయటపడకపోవడంతో ఎక్కువ మందికి సోకే అవకాశం కల్గుతోంది. భౌగోళికంగా కూడా ఈ వ్యాధి వ్యాపించిన ప్రదేశంలో కట్టడి చేయడం చాలా కష్టం అని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు దీనికి వ్యాక్సిన్, చికిత్స లేకపోవడం ఇబ్బందిగా మారింది.
ల్యాబ్ పరీక్షల్లో గుర్తించే సౌకర్యం లేక : ఆఫ్రికాలో విస్తరిస్తున్న వైరస్ బుండిబుగ్యో రకానికి చెందినది. మనుషులకు సోకే నాలుగు రకాల ఎబోలా వైరస్‌లలో ఇది ఒకటి. దీన్ని ఉగాండాలోని ఓ పర్వత ప్రాంతంలో తొలిసారిగా కనుగొన్నారు. గతంలో రెండు సార్లు మాత్రమే వ్యాప్తి చెందడంతో అధికారులు పెద్దగా దృష్టి సారించలేదు. ఫలితంగా ఇప్పుడు వ్యాపించిన ప్రదేశంలోని ల్యాబ్ పరీక్షల్లో దీన్ని గుర్తించే సౌకర్యం లేకపోవడంతో గుర్తించేందుకు ఆలస్యం జరిగింది. మొదట దీన్ని గుర్తించేందుకు నమూనాను వేల మైళ్ల దూరంలో ఉన్న ల్యాబ్‌కు పంపించాల్సి వచ్చింది.
ఎబోలాలో జైర్ రకం అనే స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో పోలిస్తే బుండిబుగ్యో ఎబోలా వైరస్ నెమ్మదిగానే విస్తరిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. పశ్చిమాఫ్రికా ప్రాంతంలో జైర్ వేరియంట్ 2014లో 11,300 మంది ప్రాణాలను తీసింది. దాన్ని చరిత్రలోనే అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా చెబుతారు. దీంతో పోలిస్తే బుండిబుగ్యో వేరియంట్ సోకిన వారిలో 30% మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు.
"ఈ వ్యాధి బారిన పడిన వారి రక్తం తగలటం, వారితో మాస్క్ లేకుండా మాట్లాడటం, రక్షణకు సంబంధించిన నియమాలు పాటించకుండా వ్యవహరిస్తే ఎబోలా సోకుతుంది. వ్యాధిబారిన పడిన కోతులు, గబ్బిలాలు, చిపాంజీల మాంసం తినేవాళ్లు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన 2 -21 రోజుల్లో లక్షణాలు గుర్తించవచ్చు. దీని లక్షణాలు జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి చిన్న వాటితో మొదలై 5 రోజుల తర్వాత (నవరంధ్రాల్లో నుంచి) రక్తం వస్తుంది. తర్వాత ఛాతీలో నొప్పి, ఆయాసం, దద్దుర్లు వచ్చే ప్రమాదముంది. ఫిట్స్ వచ్చిందంటే ప్రాణాంతకం అవుతుంది" - ఎంవీఎన్ సురేశ్, హెచ్ఓడీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి
లక్షణాలు కనిపించడానికి 21 రోజుల సమయం : సాధారణంగా ఎబోలా వైరస్ గబ్బిలాలు, జంతువులకు సోకుతుంది. ఆ వైరస్ సోకిన జంతువులను వేటాడి తినడం వల్ల మనుషులకు సోకుతుంది. వ్యాధి లక్షణాలు కనిపించడానికి 21రోజులు పడుతుంది. మొదట ఫ్లూ, మలేరియా, జ్వరం వంటి లక్షణాలు కనిపించినా చివరకు అవయవాల వైఫల్యానికి దారి తీయవచ్చు. కొన్ని కేసుల్లో శరీరం లోపల, బయట రక్తస్రావం అవుతుంది. వైరస్ సోకిన వ్యక్తి ద్రవాల ద్వారా ఇతరులకు సోకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ లక్షణాలతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పీపీఈ కిట్లు ధరించిన ప్రత్యేక బృందాలు మాత్రమే ఖననం చేయాలని అంతర్జాతీయ వైద్య సంస్థలు ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చాయి. కానీ ఆఫ్రికా దేశాల్లో అంత్యక్రియలను సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహిస్తారు. భారీగా జనం గుమిగూడి మృతదేహాన్ని తాకుతారు. దీని వల్ల వైరస్ వ్యాప్తి చెందే ముప్పు అధికం అవుతుంది.
వైద్యులు నిరాకరించడంతో : వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఆఫ్రికాలో ఉన్నఈ సంప్రదాయాలు కూడా కారణం. అక్కడ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే అంత్యక్రియలు నిర్వహించాలని భావిస్తారు. అయితే వైరస్ వ్యాప్తి చెందుతుందని మృతదేహాలను అప్పగించేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు. దీనిపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఆసుపత్రుల్లోకి చొరబడి నిప్పు పెడుతున్నారు. మృతదేహాలను ఎత్తుకెళుతూ వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారు. కాంగోలోని ర్వాంపారా ప్రాంతంలో ఎబోలాతో ఓ వ్యక్తి మృతి చెందగా మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఆసుపత్రిలోకి చొరబడి నిప్పంటించారు.
విస్తరించడానికి కారణం అదే : ఎబోలా తీవ్ర స్థాయిలో ఉన్నా కాంగోలో అక్కడి ప్రజల దుందుడుకుతనం, నిర్లక్ష్యం కూడా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణం అవుతోంది. వైరస్ బాధితుల కోసం మొంగ్‌బ్వాలూ పట్టణంలో ఓ స్వచ్ఛంద సంస్థ టెంట్ ఏర్పాటు చేసింది. దీనికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ చికిత్స పొందుతున్న 18 మంది తప్పించుకుపోయారు. వైరస్ సోకిన వ్యక్తులు ఇలా సాధారణ ప్రజలతో కలిసిపోయి అది మరింత వేగంగా విస్తరించడానికి కారణం అవుతున్నారు. ఓ వైపు వైరస్ వేగంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం కావడం, అందుబాటులో ఉన్న పరిమిత వైద్య మౌలిక సదుపాయాలతోనే వైద్యులు చికిత్స చేస్తూ ఉంటే మరోవైపు అక్కడి ప్రజలు ఇలా వ్యవహరిస్తూ ఉండడం కలవరపెడుతోంది.
ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న ఇతర దేశాలు : ఎబోలా ప్రస్తుతానికి ఆఫ్రికాలోని మూడు దేశాల్లో మాత్రమే ఉంది. ప్రపంచంలోని మరే ఇతర దేశానికి విస్తరించిన దాఖలాలు లేవు. అయినా అనేక దేశాలు అది తమ వరకూ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. భారత్ కూడా ఈ విషయంలో అప్రమత్తమైంది. సోమవారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జే.పీ.నడ్డా సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోని ఎయిర్‌పోర్టులు, సీ పోర్టులు, సరిహద్దుల్లో ఎబోలా స్క్రీనింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
చర్యలు ప్రారంభం : ఎబోలా గుర్తింపు, టెస్టింగ్‌లు, నిఘా కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు మంత్రి సూచనలు చేశారు. భారత్‌లో కేసులు లేవని నడ్డా తెలిపారు. కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి వివిధ శాఖలు, ఏజెన్సీల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభం అయ్యాయి కూడా. కాంగో, ఉగాండా, సూడాన్ నుంచి వచ్చిన వారికి వివిధ ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.
లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్ : ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్ చేస్తామని తెలిపారు. అటు కాంగో, ఉగాండా, సూడాన్‌ల నుంచి విశాఖలో గీతం, ఆంధ్రా వర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు నాలుగు వందల మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో కొంత మంది అక్కడి వసతి గృహాల్లో ఉండగా, మరికొంత మంది స్వదేశాలకు వెళ్లారు. వీరంతా త్వరలో తిరిగి వర్సిటీలకు రానున్నారు. అలాగే కొత్త అడ్మిషన్లు వంద వరకు జరిగినట్లు సమాచారం. ఇలాంటి వారి జాబితాను అధికారులు సేకరించారు. ఎబోలా నుంచి ప్రస్తుతానికైతే భారత్‌కు ముప్పు లేదు. అయినా అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే కరోనా సృష్టించిన విలయం తెలిసిందే. అందువల్ల అది రాకుండా సదా ఓ కన్నేసి ఉంచడం ప్రభుత్వాలు, అధికార యంత్రాంగంతో పౌరుల బాధ్యత కూడా.
ఎబోలా వైరస్ అలర్ట్ - ఆ దేశాలకు ప్రయాణాలు వద్దు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది : WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్

