ETV Bharat / opinion

వాట్సాప్​లో 'హ్యాపీ న్యూ ఇయర్' మెసేజ్ వచ్చిందా? అయితే తస్మాత్ జాగ్రత్త!

న్యూ ఇయర్ విషెస్ పేరుతో కొత్త మోసాలు - వాట్సాప్ మెసేజ్​ల ద్వారా సైబర్​ నేరాలు, ఇయర్ ఎండ్ రివార్డుల పేర్లతో రకరకాల లింక్స్, ఒక్క మెసేజ్​తోనే బోల్తా కొట్టించి ఖాతాలు ఖాళీ

Idisangathi on New Year Greeting Scam
Idisangathi on New Year Greeting Scam (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 31, 2025 at 2:41 PM IST

8 Min Read
Choose ETV Bharat

Idisangathi on Beware of New Year Greeting Scam: న్యూ ఇయర్ సందడి మొదలైపోయింది. ఎవరిని ఎలా విష్ చేయాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు అంతా. స్పెషల్ వీడియోలు, గ్రీటింగ్స్‌తో శుభాకాంక్షలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ హడావుడిలో పడిపోయి కొన్ని సార్లు సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. న్యూ ఇయర్ గ్రీటింగ్స్, ఇయర్ ఎండ్ రివార్డుల పేర్లతో రకరకాల లింక్స్‌ ఫార్వర్డ్‌ అయ్యే సమయం ఇది.

సైబర్ నేరాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉండేది కూడా ఇప్పుడే. కాస్త ఏమరపాటుగా ఉన్నా సరే అంతా దోచేందుకు అన్ని అస్త్రాలనూ సిద్ధం చేసుకుని కాచుకుని ఉంటారు సైబర్ నేరస్థులు. వాటిలో ఒకటే న్యూ ఇయర్ గ్రీటింగ్ స్కామ్. ఒక్క మెసేజ్‌తోనే బోల్తా కొట్టించి బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసేస్తారు. ఇంతకీ ఏంటీ గ్రీటింగ్ స్కామ్. డబ్బులు కొల్లగొట్టేందుకు సైబర్ నేరస్థులు ఎలా స్కెచ్ వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సాప్​లో హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ వచ్చిందా? అయితే తస్మాత్ జాగ్రత్త! (ETV)

అసలేంటీ గ్రీటింగ్​ స్కామ్?: కొత్త ఏడాది అంటే హడావుడి అంతా ఇంతా ఉండదు. అప్పటి వరకూ ఎన్ని చిరాకులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు అనిపించినా సరే నయా సాల్‌ జోష్‌లో అన్నీ మరిచిపోతారు. సంబరాలు చేసుకుంటారు. తెలిసిన వాళ్లందరినీ పలకరిస్తారు. సోషల్ మీడియాలోనూ ఇదే జోరు. ముఖ్యంగా న్యూ ఇయర్ విషెస్ చెప్పడంలో అయితే క్రియేటివిటీ చూపించాలని అనుకుంటారు. వాట్సాప్‌లో వచ్చే రకరకాల స్టికర్స్, మెసేజ్‌లను అందరికీ ఫార్వర్డ్ చేసి కొత్త ఏడాది శుభాకాంక్షలు చెబుతారు.

ఇదిగో సరిగ్గా ఇక్కడే చాలా మంది తమకు తెలియకుండానే చిక్కుల్లో పడిపోతారు. వాట్సాప్‌లో వచ్చిన ప్రతి మెసేజ్‌ కేవలం న్యూ ఇయర్ విషెస్‌కి మాత్రమే పరిమితం కాకపోవచ్చు. ఈ ఎర వేసి సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని వలలోకి లాగుతుండొచ్చు. అందుకే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు.

న్యూ ఇయర్ గ్రీటింగ్ స్కామ్. ఇదో పెద్ద దందా. ఏడాదంతా ఏదో విధంగా మోసాలకు పాల్పడే ముఠాలు కొత్త ఏడాది వస్తుంది అనగానే ఇంకాస్త అప్‌డేట్ అవుతారు. ఏం చేస్తే జనాలు త్వరగా తమ వలలో చిక్కుకుంటారు? అని పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగుతారు. ఈ స్కెచ్‌లో భాగమే ఈ గ్రీటింగ్ స్కామ్. క్లుప్తంగా చెప్పాలంటే మీకు శుభాకాంక్షలు చెప్పినట్టే చెప్పి మెల్లగా బురిడీ కొట్టిస్తారు.

ఆ తరవాతే అసలు డ్రామా: ఇందుకోసం వాళ్లు పెద్దగా శ్రమపడరు. చాలా సింపుల్‌గా వాట్సాప్‌లో ఓ మెసేజ్ పంపిస్తారు. (special personalised greeting) ప్రత్యేక వ్యక్తిగత శుభాకాంక్షలు తయారు చేసుకోండి అన్నది ఆ మెసేజ్‌లోని సారాంశం. ఇదేదో బానే ఉందే అని వెనక ముందు ఆలోచించకుండా క్లిక్ చేసి నచ్చిన విధంగా గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తారు. ఇక్కడి వరకూ కథ బాగానే ఉంటుంది. ఆ తరవాతే అసలు డ్రామా మొదలవుతుంది.

మీరు గ్రీటింగ్‌ కార్డ్ తయారు చేసినంత సింపుల్‌గా వాళ్లు మొత్తం హ్యాక్ చేసేస్తారు. తరవాత ఎంత మొత్తుకున్నా ఏ లాభమూ ఉండదు. చేయాల్సిన పని చాలా చాకచక్యంగా చేసి సైడ్ అయిపోతారు సైబర్ నేరగాళ్లు. ఆన్‌లైన్‌ గిఫ్టుల కోసం ఫలానా లింక్ క్లిక్ చేయండి అంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతుంటారు. వాట్సాప్‌లో న్యూ ఇయర్‌కు సంబంధించిన మెసేజ్ ఊరికే రాదు.

సైబర్ నేరస్థుల పన్నాగం: దీంతో పాటు ఓ (APK) ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్న మెసేజ్ కూడా ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేస్తే కానీ మీకు నచ్చినట్టుగా గ్రీటింగ్‌ను తయారు చేసుకోడానికి వీలుండదు. అంతే కాదు. కొన్ని తరహా గ్రీటింగ్స్‌ తయారు చేసిన తరవాత వాటిని ఫార్వర్డ్ చేసినప్పుడు దాంతో పాటు లింక్ కూడా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అంటే మెసేజ్ రిసీవ్ చేసుకున్న వారు కూడా ఆ లింక్‌పై క్లిక్ చేస్తే వాళ్లనూ బుట్టలో వేసుకోవచ్చన్నది సైబర్ నేరస్థుల పన్నాగం.

ఇలా వచ్చిన లింక్‌లు క్లిక్ చేసిన తరవాత ఫోన్‌లో మీకు తెలియకుండానే ఏవేవో జరిగిపోతాయి. యూజర్‌ ప్రమేయం లేకుండానే యాప్స్‌ ఓపెన్ అవుతాయి. కాంటాక్ట్స్‌ వివరాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాంక్ ట్రాన్‌జాక్షన్స్‌ కూడా జరుగుతాయి. అంటే ఒక్కసారి ఈ ఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ చేశారంటే ఆ మొబైల్ పూర్తిగా సైబర్ నేరస్థుల నియంత్రణలోకి వెళ్లిపోతుంది. మరి ఈ వలలో చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి..? సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్‌లలో మాల్‌వేర్ లింక్స్‌ ఉన్నట్టు ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సైబర్ నేరాలకు వేదికలివే: పండగలు, పబ్బాలతో పాటు న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఈ తరహా మెసేజ్‌లు ఎక్కువగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతుంటాయి. కేవలం వాట్సాప్‌లోనే కాదు. టెలిగ్రామ్‌ కూడా ఈ తరహా సైబర్ నేరాలకు వేదికగా మారుతోంది. “న్యూ ఇయర్ గిఫ్ట్‌" లేదా "ఫలానా బ్యాంక్‌కు సంబంధించిన ఇయర్ ఎండ్ రివార్డ్" అంటూ లింక్స్ వస్తాయి. ఈ లింక్‌పై క్లిక్ చేయగానే ఏపీకే మాల్‌వేర్ ఫైల్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది.

ఈ-మెయిల్స్, ఎస్​ఎంఎస్ లలోనూ ఈ తరహా లింక్స్‌ వస్తుంటాయి. ఈ కొత్త ఏడాది సందర్భంగా కనీసం రెండు మూడు రోజుల పాటు ఈ లింక్స్ ఫార్వర్డ్‌ చేయడం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే హైదరాబాద్‌ సైబర్ విభాగం పోలీసులు పబ్లిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఈ వేడుకల సమయాన్ని అవకాశంగా చూసుకుని సైబర్ నేరస్థులు మోసాలకు పాల్పడేందుకు సిద్ధంగా ఉంటారని, వారి వలలో చిక్కుకోవద్దని అప్రమత్తం చేశారు.

రోజుకి 20 నుంచి 30 కేసులు: కొన్ని అధ్యయనాల ప్రకారం ఏపీకే ఫైల్స్‌ కారణంగా నమోదవుతున్న మోసాల సంఖ్య రోజువారీగా చూస్తే 20 నుంచి 30 కేసుల వరకూ ఉంటున్నాయి. తక్కువలో తక్కువ రోజుకు రూ.10 లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోంది. అంటే ఈ ఏపీకే ఫైల్స్ ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. అసలు ఏంటీ ఏపీకే ఫైల్స్? వీటి వల్ల ఎందుకీ స్థాయిలో ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి. ఈ విషయాలను కాస్త లోతుగా చూస్తే ఏపీకే అంటే (Android Package Kit) ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్. యాండ్రాయిడ్ ఫోన్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే విధంగా ఇవి తయారవుతాయి.

సాధారణంగా అయితే ప్లే స్టోర్ నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇవే సేఫ్ కూడా. అయితే కొన్ని వెబ్‌సైట్స్‌తో పాటు, వాట్సాప్, ఎస్‌ఎమ్ఎస్, మెయిల్ ద్వారా కూడా కొంత మంది ఈ లింక్‌లు పంపుతుంటారు. ఇక్కడి నుంచి ఫైల్స్ డౌన్‌లోడ్ అవుతాయి. దీన్నే సైడ్ లోడింగ్‌ అని పిలుస్తారు. దీని వల్లే సమస్యలన్నీ మొదలవుతాయి.

అధికారికంగానే డౌన్​లోడ్​ చేయాలి: అనధికారిక వెబ్‌సైట్స్‌ నుంచి ఏపీకే ఫైల్‌ డౌన్‌లోడ్ చేయడం వల్ల ఫోన్‌లోకి మాల్‌వేర్ చొరబడుతుంది. వ్యక్తిగత సమాచారం చోరీకి గురవడంతో పాటు ఆర్థికంగానూ నష్టపోవాల్సి వస్తుంది. అందుకే అధికారిక సోర్స్‌ల నుంచి మాత్రమే వీటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్‌పర్ట్స్. మళ్లీ గ్రీటింగ్ స్కామ్‌ విషయానికొస్తే సైబర్ నేరస్థులు చాలా తెలివిగా ఈ గేమ్ ఆడతారు. పరిచయస్థులే ఈ మెసేజ్ పంపారేమో అనేట్టుగా మాయ చేస్తారు.

ఈ లింక్స్‌ను షేర్ చేయడానికి కొత్త వాట్సాప్ అకౌంట్స్‌ ఓపెన్ చేస్తారు. కేవలం మాల్‌వేర్‌ని స్ప్రెడ్ చేయడానికి ఈ అకౌంట్స్ వాడతారు. ఈ లింక్‌పై క్లిక్ చేయగానే ముందు రకరకాల హంగులు స్క్రీన్‌పైన కనిపిస్తాయి. యానిమేషన్స్, న్యూ ఇయర్ విషెస్ ఉంటాయి. హిందీతో పాటు ఇంగ్లీష్‌లోనూ ఇవి కనిపిస్తాయి. గ్రీటింగ్‌ చూడాలంటే ఫలానా యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని మెలిక పెడతారు. మీ బొటనవేలు ఆ లింక్‌ వరకూ వెళ్లిందంటే ఇక ట్రాప్‌లో పడ్డట్టే.

ఫేక్​ ఏపీకే ఫైల్స్: సాధారణంగా ఏపీకే ఫైల్స్ పంపించేటప్పుడు వాటికి ప్రభుత్వ సంస్థల పేర్లు పెడతారు. ఉదాహరణకు కిసాన్​యోజన.ఏపీకే (KisanYojna.apk) అని ఉంటుంది. క్లిక్ చేస్తే ఏమైనా డబ్బులు వస్తాయేమో అని ఆశ పడితే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఇవే ఏపీకే ఫైల్స్‌కు పేర్లు మార్చి న్యూఇయర్​గిఫ్ట్​.ఏపీకే (New Year Gift.apk) రూపంలో పంపుతున్నారు సైబర్ నేరస్థులు. కొన్ని సార్లు ఇవి న్యూఇయర్​ పార్టీ పిక్స్​.ఏపీకే (New Year Party Pics.apk) పేరుతోనూ ఉంటాయి. ఫొటోల కోసం అని లింక్ క్లిక్ చేస్తుంటారు కొందరు. అక్కడి నుంచి చిక్కులన్నీ మొదలవుతాయి.

ఈ ఫైల్స్ ద్వారా బ్యాంక్‌ లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలు చోరీ చేస్తారు. అకౌంట్‌లో డబ్బులు పడిన విషయాన్ని కూడా పరిశీలిస్తారు సైబర్ నేరస్థులు. అప్పుడే ఓటీపీతో సహా తెలుసుకుని ఆ డబ్బు కొట్టేస్తారు. ఓ వ్యక్తి ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్‌ నంబర్స్‌ అన్నీ తీసుకుని వాళ్ల నేర నెట్‌వర్క్‌ పెంచుకుంటారు. ఈ ఏపీకే ఇన్‌స్టాల్ అయిన తరవాత గంటల వ్యవధిలోనే చిన్న చిన్న లావాదేవీలు జరుగుతాయి.

మరి భారత్‌లోనే ఎందుకీ స్థాయిలో ఏపీకే ఫైల్స్ ద్వారా మోసాలు జరుగుతున్నాయి? ఈ ప్రశ్నకు మొట్టమొదటి సమాధానం ఇక్కడ వాట్సాప్ వినియోగదారులు ఎక్కువగా ఉండడం. అంతే కాదు. వాట్సాప్‌ను విశ్వసించే వారూ ఎక్కువే. ఒకప్పుడు మెసేజ్ పంపించాలంటే మొబైల్‌లో డిఫాల్ట్‌గా వచ్చే టెక్ట్సింగ్ యాప్ మాత్రమే అందుబాటులో ఉండేది. వాట్సాప్ వచ్చిన తరవాత ఈ యాప్ వినియోగం విపరీతంగా పెరిగింది.

స్నేహితులు, బంధువులతో మాట్లాడడం నుంచి ఆఫీస్‌కు సంబంధించిన వ్యవహారాలు కూడా వాట్సాప్‌లోనే చక్కదిద్దుతున్నారు. పైగా యాండ్రాయిడ్ ఫోన్‌ల వినియోగం అధికంగా ఉంది. అందుకే చాలా సులువుగా ఏపీకే ఫైల్స్ పంపించి బోల్తా కొట్టించగలుగుతున్నారు నేరస్థులు. స్థానిక భాషల్లోనూ ఈ తరహా మెసేజ్‌లు పంపిస్తుండడం వల్ల చాలా త్వరగా ఆయా మెసేజ్‌లకు ఆకర్షితులవుతున్నారు.

అసలు క్లిక్ చేయకూడదు: ఇలాంటి మెసేజ్‌లు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకోవడం ద్వారా చాలా వరకూ సైబర్ నేరాలను అరికట్టవచ్చు. అధికారిక వెబ్‌సైట్స్ నుంచి తప్ప మరెక్కడా ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయకూడదు. అంతే కాదు. ఈ తరహా మెసేజ్‌లను మరెవరికీ ఫార్వర్డ్ చేయకూడదు. హ్యాపీ న్యూ ఇయర్ అనే టెక్స్ట్ మెసేజ్‌ ఉంటేనే ఓపెన్ చేయాలి తప్ప లింక్‌లు ఉంటే అసలు క్లిక్ చేయకూడదు. ముఖ్యంగా వీడియో, ఆడియో ఫైల్స్ ఉంటే అసలు వాటి జోలికి వెళ్లకూడదు. తెలియని వ్యక్తుల ఫోన్‌ నంబర్స్ నుంచి వాట్సాప్ మెసేజ్‌లు వస్తే వాటిని ఓపెన్ చేయకపోవడమే మంచిది.

పొరపాటున క్లిక్ చేసినా, యాప్ డౌన్‌లోడ్ చేసినా వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. ఇంటర్నెట్‌ డిస్‌కనెక్ట్ చేయాలి. మొబైల్‌లో సెక్యూరిటీ స్కాన్ రన్ చేయాలి. వాట్సాప్, ఇమెయిల్‌, బ్యాంకింగ్ యాప్స్‌లో పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలి. బ్యాంక్‌కు కాల్ చేసి లావాదేవీలను పరిశీలించాలని రిక్వెస్ట్ పెట్టుకోవాలి. కాంటాక్ట్స్‌లో ఉన్న వారందరికీ తెలిసేలా మీరు ఎలాంటి మెసేజ్‌లు పంపలేదనీ, వాటిని నమ్మకూడదని సమాచారం అందించాలి. cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి. లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేసి వివరాలు చెప్పాల్సి ఉంటుంది.

అప్రమత్తతే మేలు: ఎన్ని సైబర్ మోసాలు జరుగుతున్నా, ఎంత అవగాహన కల్పిస్తున్నా సరే పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండడం లేదు. పోలీసు అధికారులే కొన్ని సందర్భాల్లో ఈ తరహా మోసాల్లో బాధితులుగా మారుతున్నారంటే ఈ నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఈ న్యూ ఇయర్ సంబరాల్లో పడి ఇలాంటి చిక్కులు మాత్రం కొనితెచ్చుకోకండి. పోలీసులు మళ్లీ మళ్లీ చెప్పే మాట ఒకటే వాట్సాప్‌లో వచ్చే లింక్స్‌ పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది.

"వాట్సాప్​లో వచ్చేటటువంటి ఏపీకే ఫైల్స్​, పీడీఎఫ్​లను ఓపెన్ చేయవద్దు. మీకు పంపించిన మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన తర్వాత ఏ నిర్ధరణకు వచ్చిన తర్వాతనే ఓపెన్ చేయాలి. ఎందుకంటే వీటిని ఓపెన్ చేయడం ద్వారా మీ మొబైల్ హ్యాక్ అయి సైబర్ మోసగాళ్ల ఆధీనంలోనికి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాట్సాప్​లో వచ్చే ఏపీకే ఫైల్స్​పై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి"-పోరెడ్డి మాధవరెడ్డి,సైబర్ నిపుణులు

వాట్సాప్ గ్రూప్ పేరు మారిందా - అయితే హ్యాక్​ అయ్యిందంటున్న నిపుణులు

ఆఫర్ల పేరిట ఏపీకే ఫైల్స్​ - క్లిక్​ చేస్తే అంతే