ETV Bharat / opinion

జీవితంలో మరిచిపోలేని అనుభూతి - మేఘాల కొండపై అద్భుతమైన సూర్యోదయం

సూర్యుడిని చూసి ఎంతో తన్మయత్వంతో నమస్కారం చేస్తున్న పర్యాటకులు - సూర్యోదయం చూసేందుకు అర్ధరాత్రి 2గంటలకు బయల్దేరుతున్న వైనం - సూర్యోదయం వేళ పర్యాటకులు ఆసక్తిగా చూసే ఎదురు చూపులు ఎంతో ప్రత్యేకం

Idisangathi on Vanjangi Sunrise in AP
Idisangathi on Vanjangi Sunrise in AP (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 8, 2026 at 4:04 PM IST

|

Updated : January 8, 2026 at 4:15 PM IST

4 Min Read
Choose ETV Bharat

Idisangathi on Vanjangi Sunrise in AP : హడావుడి లైఫ్‌స్టైల్‌ నుంచి కాస్తంత ఉపశమనం పొందాలి. ఓ నాలుగు రోజులు ఎక్కడైనా గడిపి రావాలి. ఇలా ఉంటోంది ఈ రోజుల్లో చాలా మంది ఆలోచన. సెలవులు దొరికినప్పుడే కాదు. ప్రత్యేకంగా సెలవులు పెట్టుకుని మరీ పర్యాటక ప్రదేశాలు చుట్టొస్తున్న వారున్నారు. సోషల్ మీడియాలోనూ రకరకాల ప్రాంతాలకు సంబంధించిన పోస్ట్‌లు ఎక్కువగా కనబడుతున్నాయి. అలా సామాజిక మాధ్యమాల ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పర్యాటక ప్రదేశం వంజంగి. ఆంధ్రప్రదేశ్‌ అల్లూరి జిల్లాలో ఉందీ ప్రాంతం. ఇది కేవలం టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు. అంతకుమించి. ఇక్కడికి వెళ్లడమే ఓ సాహస యాత్ర. సరైన మార్గం లేకపోయినా కొండ ఎక్కి దిగాల్సి ఉన్నా సరే పర్యాటకులు ఈ అడ్వెంచర్‌ను ఎంతో ఇష్టపడుతున్నారు.

సూర్యుడిని చూసి ఎంత తన్మయత్వంతో నమస్కారం చేసుకుంటున్నారో చూశారా. ఇది ఈ ఒక్కరి అనుభూతి మాత్రమే కాదు. ఆ క్షణంలో చుట్టూ ఉన్న వారందరూ దాదాపు అంతే ఆనందానికి లోనవుతారు. సూర్యుడిని చూసి ఇంత సంతోషించాల్సిన పనేముంది? రోజూ సూర్యోదయం అవుతూనే ఉంటుంది కదా అనిపిస్తుందేమో. కానీ మిగతా చోట్ల సూర్యోదయానికి ఇక్కడికి చాలా తేడా ఉంది. ఇది మాటల్లో చెప్తే అర్థమయ్యేది కాదు. అక్కడికి వెళ్లి మాత్రమే అనుభూతి చెందాల్సింది.

జీవితంలో మరిచిపోలేని అనుభూతి - మేఘాల కొండపై అద్భుతమైన సూర్యోదయం (ETV)

అద్భుత దృశ్యాన్ని కళ్లారా : ఇదంతా సరే. ఇంతకీ ఈ ప్రాంతం ఏంటి? అనేది చెప్పలేదు కదూ. అల్లూరి జిల్లా పాడేరు మండలంలోని వంజంగి ఇది. పాడేరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బహుశా ఈ పర్యాటక ప్రాంతం గురించి మీరు సోషల్ మీడియాలో ఇప్పటికే విని ఉంటారు. ఇన్‌స్టా రీల్స్‌ చూసే ఉంటారు. ఈ మధ్య కాలంలో అంతగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడికి వెళ్లిన అందరూ ఫొటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం వల్ల ఫేమస్ అయిపోయింది. అక్కడికి వెళ్లేది ఎందుకంటే కేవలం సూర్యోదయం చూడడానికే. కానీ ఇది చెప్పినంత సులభం కాదు. ఎంతో శ్రమకు ఓర్చుకుంటే తప్ప అద్భుతమైన దృశ్యాన్ని కళ్లారా చూసేందుకు వీలు పడదు.

ఈ కొండపైకి వెళ్లాలంటే ఎలాంటి దారి ఉండదు. మరెలా అంటే ట్రెకింగ్ చేయడమే. కింద మీద పడుతూ వెళ్లాల్సిందే. ఈ టూర్‌లో చాలా ప్రత్యేకంగా చెప్పుకో వాల్సిన విషయం మరొకటి ఉంది. జీవితంలోనే మరిచిపోలేని అనుభూతిని పంచే ఈ సూర్యోదయం చూడాలంటే అర్ధరాత్రి 2గంటలకు బయల్దేరాలి. అప్పుడు ప్రయాణం మొదలైతే కానీ కొండ పైకి ఎక్కి సూర్యోదయాన్ని ఆస్వాదించడానికి వీలవదు.

ఆ విధంగానే ప్లాన్ చేసుకుని పర్యాటకులు సిద్ధమవుతారు. చుట్టూ పొగ మంచు. ఆ మంచును చీల్చుకుంటూ వాహనాలన్నీ ముందుకు సాగుతాయి. నరాలు తోడేసే చలిలో వంజంగి కొండలవైపు ప్రయాణిస్తారు. కాకపోతే ఆ వేగానికి ఓ చోట బ్రేక్ పడుతుంది. అక్కడే అటవీ శాఖకు సంబంధించిన ఓ గేటు వస్తుంది. ఇక్కడ టోల్ వసూలు చేస్తారు. ఉదయం 3 గంటల సమయం దాటితే కానీ సిబ్బంది రారు. ఫలితంగా అక్కడే ట్రాఫిక్ నిలిచిపోతుంది.

కాలిబాటనే వెళ్లక తప్పదు : అటవీ శాఖ గేటు దాటిన తరవాతే అసలైన సాహసయాత్ర మొదలవుతుంది. వాహనాలు అక్కడే వదిలేసి ట్రెకింగ్‌ ప్రారంభిస్తారు పర్యాటకులు. సుమారు 2 కిలోమీటర్లు కొండ ఎక్కి "కల్లాల బయలు" పాయింట్‌కు చేరుకుంటారు. పైకి వెళ్లేందుకు వాహనాల అనుమతి లేనందున కాలిబాటనే వెళ్లక తప్పదు. ఇక్కడి నుంచి అటవీ మార్గంలో కొండ మార్గం బయలు దేరుతారు.

అటవీ మార్గం సుమారు కిలోమీటన్నర ఉంటుంది. చీకట్లో సెల్ వెలుతురు వేసుకొని చలిలో అలా ప్రయాణం సాగించాలి. మధ్యలో కొందరు ఎక్కలేక ఆగిపోతుంటారు. ఇలా కొండ మధ్యలో చేరుకుంటారు. మైదానం మధ్య సేద తీరుతారు. కొంచెం ముందుకు వెళితే మేఘాల కొండ కనిపిస్తుంది. అది కూడా చాలా నిటారుగా ఉంటుంది. అక్కడి రాళ్ల మధ్య పాక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఏదేమైనా సూర్యోదయాన్ని చూడాలని అవస్థలు పడుతూ అక్కడి నుంచి అరగంటలో పైకి చేరుకుంటారు. అక్కడే కనిపిస్తుంది సూర్యోదయం. మంచు, మబ్బుల నుంచి చీల్చుకుని వచ్చే సూర్యుడుని చూడగానే అప్పటి వరకూ ఉన్న అలసట అంతా మరిచిపోతారు పర్యాటకులు.

కెమెరాలు, మొబైల్స్‌ సిద్ధం : ఈ సన్‌రైజ్ పాయింట్‌కు చేరుకున్న తరవాత పర్యాటకులకు అసలు సమయమే తెలియదు. అంతగా అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. సూర్యోదయం అయ్యే సమయానికి తమ వద్ద ఉన్న కెమెరాలు, మొబైల్స్‌ సిద్ధం చేసుకుంటారు. సూర్యుడు ఉదయిస్తున్న ఆ క్షణాలను వాటిలో బంధిస్తారు. కొందరైతే పిల్లల్లా కేరింతలు కొడతారు. ఈలలు, చప్పట్లతో కాసేపటి వరకూ ఆ ప్రాంతం అంతా సందడిగా మారిపోతుంది.

సూర్యోదయం చూసిన తరవాత మళ్లీ 4 కిలోమీటర్ల మేర రాళ్లు రప్పల మధ్య నుంచి కొండ దిగిపోవాల్సి ఉంటుంది. కాకపోతే ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. పైగా సరైన వసతులు లేవు అన్న అసంతృప్తి కూడా వ్యక్తం అవుతోంది. సరిపడ సిబ్బంది లేకపోవడం మరో సమస్య. ఇవన్నీ పక్కన పెడితే ఈ యాత్ర మాత్రం ఎంతో సాహసంతో కూడుకున్నదని తప్పకుండా చెప్పాలి. సూర్యోదయం అయ్యే ముందు పర్యాటకులు ఆసక్తిగా చూసే ఎదురు చూపులు ఈ యాత్ర మొత్తంలోనే ఎంతో ప్రత్యేకం.

వాట్సాప్​లో 'హ్యాపీ న్యూ ఇయర్' మెసేజ్ వచ్చిందా? అయితే తస్మాత్ జాగ్రత్త!

స్వర్ణకారుల జీవితాల్లో కొత్త వెలుగులు - స్వర్ణాభరణాల తయారీ కేంద్రంగా మంగళగిరి

Last Updated : January 8, 2026 at 4:15 PM IST