ETV Bharat / opinion

ఏపీలో తగ్గిపోతున్న చెరకు సాగు - అసలెందుకీ కష్ణకాలం!

రాష్ట్రంలో చెరకు పరిశ్రమకు తీవ్ర ఇబ్బందులు - పెరుగుతున్న పెట్టుబడులు - తగ్గిపోతున్న రాబడి - కోతలు, రవాణా ఖర్చులతో పాటు కూలీల కొరత - చెరకు వేసేందుకు ఆసక్తి చూపని అన్నదాతలు

Idi Sangathi story on Sugarcane Cultivation
Idi Sangathi story on Sugarcane Cultivation (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 24, 2026 at 1:23 PM IST

|

Updated : February 24, 2026 at 1:28 PM IST

5 Min Read
Choose ETV Bharat

Idi Sangathi story on Farmers Quitting Sugarcane Cultivation: రాష్ట్రంలో ఒకప్పుడు వరికి సమానంగా చెరకు పంట వేయడానికి రైతులు ఆసక్తి చూపేవారు. సీజన్ ప్రారంభమైందంటే చాలు చక్కెర కర్మాగారాలు కళకళలాడేవి. కోతలు, రవాణా వంటి పనుల కోసం ఇతర ప్రాంతాల కూలీలు వలస వచ్చేవారు. ఎడ్లబండ్ల నుంచి పెద్ద పెద్ద లారీల వరకు చెరకు లోడ్‌తో ఫ్యాక్టరీలకు పరుగులు పెట్టేవారు రైతన్నలు.

ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గిపోతున్న రాబడి, కోతలు, రవాణా ఖర్చులతో పాటు కూలీల కొరత, కర్మాగారాలు మూతపడటం వంటి కారణాలతో తీపిని పంచే చెరకు పంట నేడు చేదుని మిగుల్చుతోంది. ఫలితంగా రాష్ట్రంలో చెరకు సాగు చేసే వారి సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది. మరి, ఎందుకీ పరిస్థితి? చెరకు సాగు పెంచేదెలా? ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏపీలో తగ్గిపోతున్న చెరకు సాగు - అసలెందుకీ కష్ణకాలం! (ETV)

చెరకు పంట వేయడానికి అన్నదాతలు వెనకడుగు వేస్తున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనబడుతోంది. దీర్ఘకాలిక పంట కావడం, పెట్టుబడి భారం భరించ లేకపోవడం వంటి కారణాలతో చక్కెర పంటకు దూరంగా ఉంటున్నారు రైతన్నలు. ఫలితంగా రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. చెరకు కర్మాగారాల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. విభజన అనంతరం రాష్ట్రంలో 24 షుగర్ ఫ్యాక్టరీలు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 3కి చేరింది. కృష్టా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గం లక్ష్మీపురం, గన్నవరం దగ్గర వీరవల్లితో పాటు ఉయ్యూరు చక్కెర పరిశ్రమలు ఉండేవి.

క్రమంగా తగ్గుతున్న చెరకు సాగు: జిల్లా నలుమూలల నుంచి రైతులు చెరకును పండించి ఆయా కంపెనీలకు తీసుకొచ్చేవారు. సీజన్ ప్రారంభమైతే కర్మాగారాలన్నీ రద్దీగా ఉండేవి. పంట దిగుబడులు బాగా ఉండేవి. వేలాది మంది వలస కూలీలకు ఉపాధి లభించేది. అన్నదాతలకు ఆశించినంత ఆదాయం ఉండేది. అదంతా గతం. ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం. చెరకు సాగు చేసే వారు తగ్గిపోవడంతో జిల్లాలో ఉన్న 3 ఫ్యాక్టరీల్లో 2 మూత పడిపోయి ఇప్పుడు ఉయ్యూరు కేసీపీ కర్మాగారం మాత్రమే నడుస్తోంది.

చెరకు సాగు క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2008-09 నుంచి సాగు విస్తీర్ణంలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. 4ఏళ్లలో చూసుకుంటే 2020-21లో 11,448 ఎకరాలు, 2021-22లో 11,500 ఎకరాల్లో చెరకు సాగైంది. 2022-23లో 12,700 ఎకరాలు, 2023-24లో 11,492 ఎకరాలు, 2024 -25లో మరీ దారుణంగా 7,598 ఎకరాల్లో చెరకు పంట వేశారు. ఈ ఏడాది కేసీపీ పరిధిలో 230 గ్రామాల్లో 2,898 మంది రైతులు మాత్రమే చెరకు సాగు చేస్తున్నారు. అంటే పరిస్థితి తీవ్రత ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సాగులో ప్రధాన సమస్యలు: చెరకు విస్తీర్ణం తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక పంట కావడంతో నేటితరం చెరకు వేయడానికి ముందుకు రావడం లేదు. దాంతోపాటు పెట్టుబడులు పెరిగాయి. ఎకరాకు దాదాపు లక్షకు పైగా ఖర్చవుతోంది. పైగా కూలీల కొరత, రవాణా వంటి సమస్యలు చెరకు వేయడానికి అడ్డంకిగా మారుతున్నాయి. చెరకు కోతలకు కూలీలకు ముందుగానే అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తోంది. తీరా డబ్బులు తీసుకున్న కూలీలు పంట కోతల సమయానికి రాకపోవడం లేదా పూర్తిగా మానేయడం లాంటివి చేస్తున్నారు.

ఫలితంగా కొన్నిచోట్ల వివాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అనుభవాల దృష్ణ్యా చాలామంది రైతులు చెరకు పంట వేయడానికి మొగ్గు చూపడం లేదు. ఒకప్పుడు ఉయ్యూరు చక్కెర కర్మాగారంలో ఏడాదికి 12 లక్షల టన్నులు చెరకు గానుగ ఆడేది. లక్ష్మీపురం చెరకు కర్మాగారంలో 4 లక్షల వరకు, హనుమాన్ జంక్షన్ చెరకు కర్మాగారంలో ఏడాదికి 4 లక్షల టన్నుల చెరకు గానుగ ఆడేది. 2007 నుంచి కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న రికవరీ విధానాలు చెరకు సాగు విస్తీర్ణంపై ప్రభావం పడింది. దేశమంతటా ఒకే విధంగా 10.5 రికవరీ శాతంపై ధర నిర్ణయించడంతో చెరకు ఫ్యాక్టరీలతో పాటు రైతులకు ఇది గుదిబండగా మారింది.

మద్దతు ధర ప్రకటించింన కేంద్రం: ఎందుకంటే, ఎకరా చెరకు సాగు చేయడానికి లక్ష 25 వేలు పెట్టుబడి అవుతోంది. ఇందులో విత్తనం, కూలీ, కోత ఖర్చులే రైతుల నడ్డి విరుస్తున్నాయి. ఎకరా విత్తనానికి 20 వేలు, కోత, రవాణా ఖర్చులు టన్నుకి 2 వేలకు పైగానే అవుతోంది. ఈ ఏడాది కేంద్రం టన్నుకి 3,290 రుపాయాల మద్దతు ధర ప్రకటించింది. కానీ, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో పోలిస్తే ఇది తక్కువే అని రైతులు చెబుతున్నారు.

చెరకు వేయడానికి దూరం అవుతున్న రైతులను తిరిగి సాగులోకి తీసుకు వచ్చేందుకు చక్కెర కర్మాగారాలు చర్యలు చేపట్టాయి. రైతులను ప్రోత్సహించి అధిక లాభాలు చేకూర్చే విధంగా ఉయ్యూరు కేసీపీ చక్కెర కర్మాగారం అడుగులు వేస్తోంది. చెరుకు కోత, ఎగుమతి, దిగుమతికి రవాణకు సంబంధించి చర్యలు తీసుకుంటోంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే అదనంగా టన్నుకు రూ. 400 రూపాయలు ఇస్తోంది.

కుంగదీస్తోన్న కూలీల కొరత: రైతులకు చెరకు సాగు చేస్తే యంత్రాలు అందిస్తోంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చెరకు వేసే వారికి రూ. 10,000 ను ఉచితంగా ఇస్తోంది. ఫలితంగా కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుంచి ఈ ఏడాది 2,898 మంది రైతులు కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. సాధారణంగా ఒక ఎకరా చెరకు పంటకు 3నుంచి 4 టన్నుల విత్తనాలు కావాలి. కూలీల కొరత అధికంగా ఉన్న తరుణంలో విత్తనాలు నాటడంతో పాటు పొలాన్ని సిద్ధం చేయడం అన్నదాతలను ఆర్థికంగా కుంగతీస్తోంది.

"చెరకు విస్తీర్ణం తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక పంట కావడంతో నేటితరం చెరకు వేయడానికి ముందుకు రావడం లేదు. దాంతోపాటు పెట్టుబడులు పెరిగాయి. ఎకరాకు దాదాపు లక్షకు పైగా ఖర్చవుతోంది. పైగా కూలీల కొరత, రవాణా వంటి సమస్యలు చెరకు వేయడానికి అడ్డంకిగా మారుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరకు సాగుపై ప్రత్యేక పథకాలు, ప్రోత్సాహకాలు అందించాలని ఈ సందర్భంగా మేమంతా కోరుతున్నాం"-చెరకు రైతులు

రికవరీ శాతాన్ని పెంచేందుకు: ఈ తరుణంలో రికవరీ శాతాన్ని పెంచేందుకు వ్యవసాయ పరిశోధన స్థానంలో కొత్త విత్తనాలు రూపొందిచినట్లు కేసీపీ జనరల్ మేనేజర్ చెబుతున్నారు. విభజన తర్వాత రాష్ట్రంలో 24 ఉన్న షుగర్ ప్యాక్టరీల సంఖ్య ఇప్పుడు 3కి చేరింది. చెరకు సాగు విస్తీర్ణం కూడా క్రమంగా తగ్గపోతోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరకు సాగుపై ప్రత్యేక పథకాలు, ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉందని అన్నదాతలు చెబుతున్నారు. మద్దతు ధరతో పాటు విత్తనాలు, ఎరువులు, సాగు చేసే యంత్రాల కొనుగోళ్లలో రాయితీలు ఇవ్వాలని కోరుతున్నారు.

"ఒకప్పుడు సీజన్‌లో కేసీపీ లో 12 లక్షల 25 వేల టన్నుల చెరకు గానుగ ఆడితే 10.5% రికవరీ వచ్చింది. ఇప్పుడు 3 లక్షల టన్నుల గానుగ ఆడటమే గగనంగా ఉంది. ఈ తరుణంలో రికవరీ శాతాన్ని పెంచేందుకు వ్యవసాయ పరిశోధన స్థానంలో కొత్త విత్తనాలు రూపొందిచాం"-వి.వి పున్నారావు, జనరల్ మేనేజర్,కేసీపీ కర్మాగారం

కరవు సీమలో ఉపాధి అవకాశాలు - ఇండస్ట్రీ హబ్​గా ఓర్వకల్లు

ప్రజారోగ్యంతో ఆటలా? - ప్యాకేజ్డ్ ఫుడ్ లేబులింగ్‌పై సుప్రీం అసహనం

Last Updated : February 24, 2026 at 1:28 PM IST