కరవు సీమలో ఉపాధి అవకాశాలు - ఇండస్ట్రీ హబ్‌గా ఓర్వకల్లు
ఇండస్ట్రియల్ హబ్‌గా ఓర్వకల్లు కారిడార్ - కూటమి రాకతో వేగంగా నిర్మాణ పనులు, కర్నూలుకు వరస కడుతున్న పరిశ్రమలు, త్వరలోనే అందుబాటులోకి పలు పరిశ్రమలు, స్థానికులకు లభించనున్న ఉపాధి అవకాశాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 4:49 PM IST
Idi Sangathi Story on orvakallu Industrial Corridor: మొన్నటి దాకా కరవు సీమలో ఉపాధి దొరకడం కష్టంగా ఉండేది. బతుకుదెరువు కోసం వలస వెళ్లాల్సి వచ్చేది. అపారమైన వనరులు ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. కానీ, నేడు కరవు సీమలో ఉపాధి ఆశలు చిగురిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం చొరవతో పారిశ్రామిక ప్రగతి కొత్త పుంతలు తొక్కుతోంది. ఉపాధి కల్పనకు సర్కారు పూనుకోవడం వల్ల అనతి కాలంలోనే వేలాది కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు కర్నూలు జిల్లాకు వరస కడుతున్నాయి.
ఫలితంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్‌లో గతంలో ఆగిపోయిన పరిశ్రమలు దాదాపు పూర్తి కావస్తుండగా కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఫలితంగా ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ రూపురేఖలు మరికొద్ది రోజుల్లోనే మారనున్నాయి. తద్వారా స్థానిక యువతకు ఉపాధి లభించనుంది. పెట్టుబడులు రాబట్టాలి,యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
పారిశ్రామికవేత్తలకు గమ్యస్థానం: అంతేకాకుండా పారిశ్రామికవేత్తలకు ఏపీ స్వర్గధామం కావాలి. తద్వారా రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించాలి. ఇదే కూటమి సర్కారు సంకల్పం. తగ్గట్టే ఏపీలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ పారిశ్రామికవేత్తలకు గమ్యస్థానం అవుతోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ముందు చూపుతో పెద్ద ఎత్తున భూ సేకరణ చేపట్టి మౌలిక వసతులు కల్పించారు. ఫలితంగా ఓర్వకల్లుకు పెట్టుబడిదారులు వరుస కట్టారు.
అప్పుడే కొన్ని పరిశ్రమలకు భూమి పూజ కూడా చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, వైఎస్సార్సీపీ సర్కారు ఓర్వకల్లు పారిశ్రామికవాడను పట్టించుకోకపోవడంతో పెట్టుబడులు వెనుదిరిగాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో పారిశ్రామికవాడ పనులు ఊపందుకున్నాయి. కర్నూలు జిల్లాలో అపారమైన వనరులు ఉన్నప్పటికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి.
అభివృద్ధే లక్ష్యంగా అడుగులు: ఈ నేపథ్యంలో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఓర్వకల్లు మెగా ఇండస్ట్రీయల్ హబ్- ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఓర్వకల్లు వద్ద పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఓర్వకల్లు మండలంలో 22,000 ఎకరాలు భూమి గుర్తించింది.
ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్- ఏపీఐఐసీ కి 13,830 ఎకరాలను కేటాయించింది. గుట్టపాడు వద్ద ప్రతిపాదించిన ఉత్తర, దక్షిణ క్లస్టర్లలో 2,471 ఎకరాల్లో ప్రతిపాదించిన క్లస్టర్‌ను ఏపీఐఐసీ ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ. 2,870 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులోనే సుమారు 1,754 ఎకరాలు పారిశ్రామిక అవసరాలకు కేటాయించనుంది.
భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు: గుట్టపాడు సమీపంలోని జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలోనే పరిశ్రమను ప్రారంభించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఇందులో 2.2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని చేపట్టనున్నారు. ఫలితంగా 3,200 మందికి ప్రత్యక్షంగా, 12,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. పారిశ్రామికవాడ అభివృద్ధికి కేంద్రం ముందు కొచ్చింది.
ఇందులో భాగంగా మొదటి దశలో 2,600 ఎకరాలు, రెండో దశలో 2,100 ఎకరాలు మొత్తం కలిపి 4,700 ఎకరాల్లో అభివృద్ధి చేయనుంది. రోడ్లు, డ్రైనేజీలు, నీటి వసతి, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించనుంది. ఇప్పటికే ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధికి మొదటి దశలో రూ. 2,786 కోట్లను ఖర్చు చేస్తోంది. తద్వారా రూ. 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
మొత్తం రూ.14,000 కోట్ల పెట్టుబడులు: అదే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు ఇక్కడ పనులు చేస్తున్నారు. ఇండీచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ సంస్థ తన భాగస్వామ్య సంస్థ అయిన జపాన్‌కు చెందిన మైక్రో టెక్నాలజీ కంపెనీతో కలిసి సెమీకండక్టర్ పరిశ్రమ స్థాపించనున్నారు. రూ.14,000 కోట్లకు పైగా పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ పరిశ్రమకు అవసరమైన 130 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ఆ భూమిని కూడా ఓర్వకల్లు సమీపంలో గుర్తించడం విశేషం. దీని ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి అవకాశాలు ఉండనున్నాయి. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్‌లో సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే మొట్ట మొదటి డ్రోన్ సిటీని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే పదేళ్లలో సుమారు 40,000 మందికి ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం.
డ్రోన్ టెక్నాలజీకి చిరునామాగా! ఇక్కడ డ్రోన్ల తయారీ, పరిశోధన, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ కోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటు లోకి రానున్నాయి. సుమారు 25,000 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చేలా అంతర్జాతీయ స్థాయి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. గరుడ ఏరోస్పేస్ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఓర్వకల్లును దేశంలోనే డ్రోన్ టెక్నాలజీకి ప్రధాన చిరునామాగా మార్చడానికి సర్కారు కృషి చేస్తోంది.
అదే విధంగా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా, నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామాల మధ్య గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభానికి సిద్ధమైంది. 4,766.28 ఎకరాల్లో 5,230 మెగావాట్ల పవర్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు- ఐఆర్ఏఎస్పీ నిర్మాణం పూర్తైంది. ఇది దేశంలోనే తొలి ప్రాజెక్టు. 1,680 మెగావాట్లు స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు, 3,000 మెగావాట్లు సోలార్, 550 మెగావాట్లు విండ్ పవర్ ఉత్పత్తి చేస్తారు. ఒకే చోట 3 రకాల విద్యుత్ ఉత్పత్తి చేసి, నిల్వచేసే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కావటం విశేషం.
శరవేగంగా సాగుతున్న పనులు: ఓర్వకల్లులోని గుట్టపాడు సమీపంలో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ వెయ్యి 90 కోట్ల అంచనాతో 100 ఎకరాల్లో సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా 1,200 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. బ్రాహ్మణపల్లి సమీపంలో 80 ఎకరాల విస్తీర్ణంలో రిలయన్స్ సంస్థ రూ. 1,622 కోట్లతో పెట్టుబడితో కూల్‌డ్రింక్స్, జ్యూస్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. దాంతో వీటి పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా 1,200 మందికి, 18 వందల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది ఆసియాలోనే అతిపెద్ద శీతల పానీయాల కంపెనీ అని కంపెనీ ప్రతినిధులు ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్‌లో గ్రీన్ కో సోలార్ ప్లాంట్‌తోపాటు రక్షణ రంగ సంస్థ డీఆర్ తదితర సంస్థలు ఏర్పాటయ్యాయి.
త్వరలోనే పైలెట్ శిక్షణ: గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కూడా అందుబాటులో ఉంది. ఈ మధ్యే మంత్రి టీజీ భరత్ కృషితో విజయవాడకు విమాన సేవలు ప్రారంభమయ్యాయి. రాత్రిపూట విమానాలు ల్యాండ్ కావటానికి అనుమతుల కోసం కృషి చేస్తున్నారు. మరో 2సంస్థలు పైలెట్ శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. త్వరలోనే ఓర్వకల్లులో పైలెట్ శిక్షణ ప్రారంభం కానుంది. ఇవి అందుబాటులోకి వస్తే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత ఓర్వకల్లుకు వచ్చి పైలెట్లుగా శిక్షణ తీసుకోనున్నారు.
మొత్తంగా కూటమి ముందుచూపుతో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం కూడా అందుకు తగిన సౌకర్యాలు కల్పిస్తోంది. ఫలితంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అదే సమయంలో రాష్ట్రాభివృద్ధిలో ఓర్వకల్లు భాగం కానుంది.
"గడచిన 5 సంవత్సరాల కాలంలో ఓర్వకల్లులో పరిశ్రమలు రాకపోవడంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వ రాకతో ఓర్వకల్లుకు పరిశ్రమలు వస్తుండటం ఎంతో శుభపరిణామం. దీని ద్వారా మాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి" -స్థానికులు
"అన్ని సంస్థల పెట్టుబడులతో కలిపి దాదాపు రూ.10,000 కోట్ల పనులు ప్రస్తుతం ప్రారంభమయ్యాయి. ఇవి కాకుండా సెమీకండక్టర్కు సంబంధించి రూ.24,000 కోట్లు వరకు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అన్నీ పూర్తయిన తర్వాత ఈ పనులు కార్యరూపం దాలుస్తాయి. పరిశ్రమల అభివృద్ధికి గాను కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కనీసం రూ.50,000 కోట్ల పెట్టుబడులు కావాలని మా ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించి సానుకూల ఫలితాలనేవి వస్తాయని ఆశిస్తున్నాం"-టీజీ భరత్, పరిశ్రమల శాఖ మంత్రి
సీమ ప్రగతికి కేంద్రాలుగా ఓర్వకల్లు, కొప్పర్తి నడవాలు - రూ.వేల కోట్ల పెట్టుబడులు
లక్షల ఉద్యోగాల దిశగా రాయలసీమ - ఓర్వకల్లు, కొప్పర్తి కారిడార్లకు శంకుస్థాపన

