ETV Bharat / opinion

తెలుగు రాష్ట్రాల మధ్య గ్రీన్ ఫీల్డ్ - త్వరలో అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి హైవే

అందుబాటులోకి రానున్న ఖమ్మం-దేవరపల్లి హైవే - హైదరాబాద్‌ - విశాఖ మధ్య తగ్గనున్న సమయం, 2017లో ఖమ్మం-దేవరపల్లి ప్రాజెక్టుకు ప్రతిపాదన, 2018లో రహదారికి ఆమోదం, ఏప్రిల్‌లో నాటికి పూర్తి కానున్న హైవే

Idi Sangathi on Khammam Devarapalli 4 Lane Highway
Idi Sangathi on Khammam Devarapalli 4 Lane Highway (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 27, 2026 at 1:44 PM IST

3 Min Read
Choose ETV Bharat

Idi Sangathi Story on Khammam Devarapalli 4 Lane Highway: దేశాభివృద్ధిలో రవాణా వ్యవస్థది కీలక పాత్ర. అందుకే, కేంద్ర ప్రభుత్వం రహదారి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే 2 తెలుగు రాష్ట్రాలను కలిపే ఖమ్మం-దేవరపల్లి మధ్య 4 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా.

సుమారు రూ. 4,451 కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారి నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఏప్రిల్‌లో నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రహదారి అందుబాటులోకి వస్తే హైదరాబాద్-విశాఖ ప్రయాణ సమయంతో పాటు దూరం కూడా తగ్గే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఖమ్మం-దేవరపల్లి జాతీయ రహదారి ప్రత్యేకతలేంటి? నిర్మాణ ప్రక్రియ, రహదారి భద్రతకు తీసుకుంటున్న చర్యలు, వినియోగిస్తున్న సాంకేతికత తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల మధ్య గ్రీన్ ఫీల్డ్ - త్వరలో అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి హైవే (ETV Bharat)

తగ్గనున్న ప్రయాణ దూరం: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి ఒక్కటి కూడా లేదు. ఖమ్మం-దేవరపల్లి హైవేనే మొదటిది. మొత్తం 162 కిలోమీటర్లు ఉన్న ఈ హైవే తెలంగాణలో 106 కిలోమీటర్లు, ఏపీలో 57 కిలోమీటర్లు ఉంది. ఖమ్మం నుంచి ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా దేవరపల్లి వరకు నిర్మించారు. దీనికి ఎన్​హెచ్-365 బీజీ నంబరును కేటాయించారు. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌, విశాఖ మధ్య సుమారు 56 కిలోమీటర్లు దూరం తగ్గనుంది.

2017లో ఖమ్మం-దేవరపల్లి ప్రాజెక్టుకు ప్రతిపాదనలు రూపొందించారు. 2018లో ఆమోదం లభించింది. రహదారి నిర్మాణానికి కేంద్రం రూ.4,451.87 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ మార్గంలో 10 పెద్ద వంతెనలు, 49 చిన్న వంతెనలు, 295 కల్వర్టులు, ఒక ఆర్వోబీ, 98 అండర్‌పాస్‌లు ఉన్నాయి. కర్బన ఉద్గారాల నివారణకు నిర్మాణంలో రామగుండం ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్‌ తెచ్చి వినియోగించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 116 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తైంది. అయితే ఈ రహదారి నిర్మాణంలో కీలకమైంది. రైల్వే ట్రాక్‌పై వంపు తిరిగినట్లు ఉండే బో స్ట్రింగ్ గిడ్డర్ వంతెన.

నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు: ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల ఆధారంగా మాత్రమే హైవేపై ప్రయాణించిన దూరానికే టోల్‌ట్యాక్స్‌ వసూలు చేయనున్నారు. 5ప్రాంతాల్లో అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ఏటీఎంఎస్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ఎక్కడైనా ప్రమాదం జరిగినా, వాహనదారులు మితిమీరిన వేగంతో నడిపినా, సీటు బెల్టు పెట్టుకోకున్నా, రాంగ్‌ రూట్‌లో వచ్చినా సమాచారం అందుతుంది. వెంటనే అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటారు.

నిబంధనలను అతిక్రమించిన వారికి చలాన్లు పంపిస్తారు. ఐతే, సాధారణ జాతీయ రహదారుల్లా కాకుండా కొత్త రహదారిపై కేవలం 9 చోట్ల మాత్రమే. అంటే సుమారు 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు ఉన్నాయి. ప్రమాదాలు, అత్యవసర సందర్భాల్లో బాధితులను తరలించడానికి ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ మీడియన్‌ ఓపెనింగ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రాజెక్టు డైరెక్టర్‌ దివ్య చెబుతున్నారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక 360 డిగ్రీల కోణంలో పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా: అలాగే, సోలార్‌ ఆధారిత దీపాలు ఏర్పాటు చేశారు. ప్రతి 50 కిలోమీటర్లకు రోడ్డుకు 2 వైపులా ఐదేసి ఎకరాల్లో ప్రయాణికులు సేద తీరడానికి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో హోటళ్లు, పెట్రోల్‌ బంకులు, వాష్‌రూమ్స్‌ ఉంటాయి. రహదారిపై ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ బోర్డులను స్కాన్‌ చేయడం ద్వారా మనం ఏ ప్రాంతంలో ఉన్నాం, దగ్గరలోని పోలీసు స్టేషన్, పెట్రోల్‌బంకులు తదితర సమాచారం తెలుస్తుందని ఎన్​హెచ్​ఏఐ రీజనల్ ఆఫీసర్ శివశంకర్ చెబుతున్నారు.

క్యాన్సర్లు, చర్మవ్యాధులు, గర్భస్రావాలు - 'యురేనియం'తో అల్లాడుతున్న ప్రజలు

గంజాయి సాగును వదిలి కాఫీ తోటల పెంపకం - సాగులో అరకుతో పోటీ