ETV Bharat / opinion

ప్రజారోగ్యంతో ఆటలా? - ప్యాకేజ్డ్ ఫుడ్ లేబులింగ్‌పై సుప్రీం అసహనం

ప్యాకేజ్డ్ ఫుడ్ లేబులింగ్‌పై అస్పష్టత - ప్రజారోగ్యంతో ఆటలా అంటూ ఘాటుగా హెచ్చరించిన సుప్రీంకోర్టు - న్యూట్రిషన్ వివరాలను ముద్రించడంలో పలు తయారీ సంస్థల నిర్లక్ష్యం - ఎఫ్ఎస్ఎస్ఏఐ రంగంలోకి దిగాల్సిందేనని ఆదేశాలు

Supreme Court on Packaged Food Label
Supreme Court on Packaged Food Label (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 20, 2026 at 5:22 PM IST

|

Updated : February 20, 2026 at 5:28 PM IST

8 Min Read
Choose ETV Bharat

Supreme Court on Packaged Food Label: పైన పటారం, లోన లొటారం అనే సామెతను వినే ఉంటాం. కొన్ని రకాల ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌కు ఈ మాట సరిగ్గా సరిపోతుంది. ఆకర్షణీయమైన ప్యాక్‌లతో తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే సంస్థలు లేబులింగ్ విషయంలో మాత్రం బాధ్యత తీసుకోవడం లేదు. ఫలానా ఫుడ్ ఐటమ్‌కు సంబంధించిన న్యూట్రిషన్ వివరాలను ముద్రించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. అందుకే సుప్రీంకోర్టు ఇప్పుడు చురకలు అంటించింది.

సుప్రీం ఓ పిటిషన్‌పై విచారణ జరుపుతూ ఆహార భద్రతకు బాధ్యత వహించాల్సిన ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ కి కీలక ఆదేశాలు జారీ చేసింది. లేబులింగ్‌లో పారదర్శకత వహించేలా అన్ని వివరాలూ సరైన విధంగా ముద్రించేలా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ప్రజారోగ్యంతో ఆటలు ఆడకూడదంటూ చాలా ఘాటుగా హెచ్చరించింది. ఇంతకీ లేబులింగ్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రమాదంలో ప్రజారోగ్యం - ప్యాకేజ్డ్ ఫుడ్ లేబులింగ్‌పై అసహనం వ్యక్తం చేసిన సుప్రీం (ETV)

ప్రమాదంలో ప్రజారోగ్యం: ఏదైనా సూపర్ మార్కెట్‌లోకి వెళ్లగానే రంగు రంగుల ప్యాకేజ్డ్ ఫుడ్స్ కనిపిస్తాయి. బ్రెడ్‌ మొదలు పచ్చళ్లు, స్నాక్స్ సహా ఎన్నో రకాల ఆహార పదార్థాలు ప్యాక్‌ల రూపంలో దొరుకుతున్నాయి. ఇన్‌స్టంట్ మిక్స్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. పైకి చూడడానికి ఇవి చాలా ఆకర్షణీయంగా కనబడతాయి. మరి లోపల సంగతేంటి? ఏం తింటున్నామో స్పష్టంగా తెలుస్తోందా? ఫలానా ఫుడ్ ఐటమ్‌లో అసలు ఏమేం పదార్థాలున్నాయి? చక్కెర శాతం ఎంత, ఉప్పు ఎంత కలిపారు? కొవ్వు ఏమైనా ఉందా? అన్న వివరాలు తెలుస్తున్నాయా? ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు అంటారా. ఈ చిన్న నిర్లక్ష్యమే ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో నెట్టేస్తుందని స్వయంగా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అంతే కాదు. ప్యాకేజ్డ్ ఫుడ్‌పై మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారా అంటూ సుప్రీంకోర్టు చాలా ఘాటుగానే స్పందించింది ఈ విషయంపై. అసలు సర్వోన్నత న్యాయస్థానం ఈ స్థాయిలో అసహనం వ్యక్తం చేయడానికి ఓ కారణముంది. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌పై స్పష్టమైన లేబుల్స్ ఉండడం లేదంటూ ఓ హెల్త్ సొసైటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇకపై ప్యాకేజ్డ్ ఆహారంపై హెచ్చరిక ముద్ర కచ్చితంగా ఉండాల్సిందే అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ) కు ఆదేశాలు జారీ చేసింది.

వార్నింగ్ లేబుల్ తప్పనిసరి: ఉదాహరణకు ఓ ప్యాక్‌లో అధిక చక్కెర ఉంటే అందుకు సంబంధించి తప్పకుండా ఓ వార్నింగ్ లేబుల్ అనేది ఉండాలి. సాధారణంగా ప్యాక్‌ల వెనకభాగంలో ఈ తరహా వివరాలు ముద్రిస్తుంటాయి సంస్థలు. కానీ అలా కాకుండా ప్యాకెట్ ముందు భాగంలోనే ఈ వివరాలన్నీ వినియోగదారుడికి కనిపించేలా ముద్రించాలన్నది సుప్రీం కోర్టు ఆదేశం. షుగర్, సోడియం, కొవ్వుకు సంబంధించిన వివరాలు బోల్డ్ అక్షరాలతో ఉండాలన్నది పిటిషనర్ వ్యక్తం చేసిన అభిప్రాయం. ఇదే విషయమై నాలుగు వారాల్లో ఓ నివేదిక అందజేయాలని ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ని ఆదేశించింది సుప్రీంకోర్టు.

నిజానికి ఇది కొత్త వివాదమేమీ కాదు. ఎప్పటి నుంచో నడుస్తున్నదే. కాకపోతే ఇలా మధ్య మధ్యలో కోర్టులు మొట్టికాయలు వేస్తుంటే తప్ప పెద్దగా ఈ సమస్య చర్చకు రావడం లేదు. ఫలానా ఫుడ్ ఐటమ్‌లో ఎక్కువ మొత్తంలో చక్కెర, కొవ్వు ఉన్నట్టైతే అది అనారోగ్యకరమని లేబుల్ తప్పకుండా ఉండాలన్నది సామాజిక కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మామూలుగా అయితే ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌పై గ్రీన్, రెడ్ కలర్‌లో డాట్స్ ఉంటాయి. ఇందులో గ్రీన్ అంటే శాకాహారం అని, రెడ్ ఉంటే మాంసాహారం అని అర్థం.

హై ఇన్​ షుగర్ తప్పనిసరి: ఇదే తరహాలో ఆ ఆహార పదార్థంలో షుగర్, సాల్ట్, కొవ్వు శాతాలు తప్పనిసరిగా మెన్షన్ చేయాలన్నది ఇప్పుడు వినిపిస్తున్న మరో డిమాండ్. అయితే ఇప్పటికే ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ఇండియన్ న్యూట్రిషన్ రేటింగ్ తీసుకురావాలనే యోచనలో ఉంది. అంటే ఓ ఫుడ్ ఐటమ్‌ నాణ్యత, భద్రత ఆధారంగా 0.5 నుంచి 5 స్టార్స్ వరకూ ఇచ్చేలా ప్రతిపాదనలు తీసుకొచ్చింది. కానీ ఈ అంశంపై ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరగడం లేదు.

ఫలానా ఫుడ్‌ ఐటమ్‌లో చక్కెర, ఉప్పు, కొవ్వు శాతం ఎంత ఉందో ముద్రించడంతో పాటు రోజులో ఎంత మొత్తంలో ఈ ఆహారం తీసుకోవచ్చు అనేది కూడా ప్రింట్ చేయాలన్నది కొందరి వాదన. ఇలా చేయడం చాలా సులభం అని కొందరి నిపుణులు గట్టిగానే వాదిస్తున్నారు. ఇదే సమయంలో ఇలాంటి లేబుల్స్‌తో పెద్దగా ప్రయోజనం ఉండదన్నది మరి కొందరి వాదన. సగటున ఓ వ్యక్తి రోజుకు 2,000 క్యాలరీలు తీసుకోవచ్చు అన్నది ఓ ప్రమాణం. అంటే ఓ ఆహార పదార్థం ఓ సారి తీసుకుంటే ఎన్ని క్యాలరీలు అందుతాయి అన్నది లేబుల్స్‌పై ముద్రించాలి అన్నది ఎక్స్‌పర్ట్స్ ఆలోచన.

ఇలా భిన్నాభిప్రాయాలు, ప్రతిపాదనల కారణంగా లేబులింగ్‌లో ఓస్పష్టత ఉండడం లేదు. అందుకే రానురాను సమస్య తీవ్రమవుతోంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఈ ఏడాది ఆర్థిక సర్వే కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజారోగ్యానికి ఇదో ముప్పుగా మారిందనీ చెప్పింది. అందుకే ఫుడ్ లేబులింగ్‌లో మరింత పారదర్శకత ఉండాల్సిందేనన్న ప్రతిపాదనలు చేసింది. ప్యాక్‌ల ముందు భాగంలోనే హై ఇన్​ ఫ్యాట్, హై ఇన్ ఘుగర్ లాంటి స్పష్టమైన లేబుల్స్ ఉండాలని తేల్చి చెప్పింది.

అంతే కాదు, ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ ప్రతిపాదించిన స్టార్ రేటింగ్ సిస్టమ్‌ను వ్యతిరేకించింది ఈ ఆర్థిక సర్వే. సరైన విధంగా ఈ వ్యవస్థ పని చేయడం లేదని అసహనం వ్యక్తం చేసింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌పైన హెల్త్, ఎనర్జీ, న్యూట్రిషన్ లాంటి పదాలను తప్పనిసరిగా తొలగించాలన్నది సర్వే చేసిన మరో కీలక ప్రతిపాదన. అంతే కాదు. ఏ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అయినా సరే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల సమయంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు సంబంధించిన ప్రకటనలు నిషేధించాలనీ మరో సూచన చేసింది. ఇవన్నీ సాధ్యపడతాయా అన్నది పక్కన పెడితే కనీసం ఇవి పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు అని మాత్రం గుర్తించాలి.

గత 2009-23 మధ్య కాలంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ విక్రయాలు భారత్‌లో 150%కి పైగా పెరిగినట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదే క్రమంగా ఊబకాయానికి దారి తీస్తోంది. చక్కెర, ఉప్పు అత్యధికంగా ఉండే ఆహార పదార్థాలతో హైపర్‌ టెన్షన్‌తో పాటు డయాబెటిస్‌, గుండె సంబంధిత వ్యాధులూ వస్తాయి. కొన్ని రకాల డ్రింక్స్‌లో షుగర్ అధికంగా ఉండడం వల్ల ఒబెసిటీతో పాటు మెటబాలిక్ సిండ్రోమ్, ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తున్నాయి.

ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం,సోడియం లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇది చివరకు కిడ్నీలపై ఒత్తిడి పెంచుతాయి. అదే లేబులింగ్ వ్యవస్థ సరిగ్గా ఉండి ఉంటే సేల్స్‌ ఈ స్థాయిలో ఉండకపోవచ్చు అన్నది కొందరి అభిప్రాయం. ఇక ప్రస్తుతం ఉన్న లేబులింగ్‌ను చూస్తే చాలా వరకు సంస్థలు వీటిపై న్యూట్రిషన్ టేబుల్స్‌ని చిన్న అక్షరాలతో ముద్రిస్తాయి. ఫలితంగా అవి చదవడానికి వీలుగా ఉండవు.

ఆశించిన స్థాయిలో లేదని వెల్లడి: అందుకే వినియోగదారులు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం ఎక్స్‌పైరీడేట్, ధర మాత్రమే చూసి కొనుగోలు చేస్తున్నారు. పైగా కొన్ని సంస్థలు తమ ఉత్పత్తులను 100% స్వచ్ఛమైనవి అంటూ మార్కెటింగ్ చేసుకుంటాయి. ఇది కూడా వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తోందన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. తేనె, నెయ్యి లాంటి ఉత్పత్తుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడే ఓ అధ్యయనం గురించి మాట్లాడుకోవాలి.

ఇటీవలే నిర్వహించిన లేబుల్ బ్లైండ్ అనే స్టడీ ఆధారంగా చూస్తే 18 కేటగిరీలలో 227 బ్రాండ్స్‌కు చెందిన మొత్తం 586 రకాల ప్యాకేజ్డ్‌ ఫుడ్ ప్రొడక్ట్స్‌ను పరిశీలించగా సగటున 5 ఉత్పత్తుల్లో ఒక ప్రొడక్ట్‌లో లేబులింగ్ సరిగ్గా లేదని తేలింది. ఇక ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తుల్లో సగానికి పైగా లేబులింగ్ ఆశించిన స్థాయిలో లేదని వెల్లడైంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలను ఏదీ అందుకోలేదని స్పష్టమైంది. అసలు కొన్ని లేబుల్స్‌లో అయితే అవసరానికి మించిన సమాచారం ఇస్తున్నారన్నది ఈ స్టడీ చెప్పిన మరో ముఖ్యమైన విషయం.

అన్ని వివరాలు ఉన్నప్పుడు వినియోగదారుడు వాటన్నింటినీ చదివేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. అందుకే కచ్చితంగా అవసరమైన వివరాలు మాత్రమే ఉండేలా లేబులింగ్‌ ఉండాలన్నది ఎక్కువ మంది చేసే సూచన. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఇదే. ఇదంతా సరే లేబుల్, లేబుల్ అంటున్నాం కదా అసలు ఇంతకీ లేబులింగ్ అంటే ఏంటి?

సంస్థలు ఇచ్చే డిక్లరేషనే లేబుల్: లేబుల్ అనేది వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆయా సంస్థలు ఇచ్చే ఓ డిక్లరేషన్. అంటే మా సంస్థకు చెందిన ఫలానా ఉత్పత్తి ఆరోగ్యకరమైనదే అని చెప్పడం అన్నమాట. అదే సమయంలో ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన న్యూట్రిషన్ వివరాలతో పాటు ప్యాకేజింగ్ వివరాలూ ముద్రించాలి. ప్యాక్‌ల ముందు భాగంలోనే ఈ లేబుల్ కనిపించాలి. ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ తో పాటు లీగల్ మెట్రాలజీ అధికారులు ఈ ఫుడ్ లేబులింగ్‌ను పర్యవేక్షిస్తారు.

ఆహార పదార్థంలోని ఇన్‌గ్రీడియెంట్స్‌, రుచి రంగు కోసం ఏమైనా కలిపితే ఆ వివరాలు, తయారీ సంస్థ వివరాలు అన్నీ లేబులింగ్‌లో ఉండాలి. సింపుల్‌గా చెప్పాలంటే తయారీ సంస్థకు, వినియోగదారుడికి లేబులింగ్‌ అనేది ఓ కమ్యూనికేషన్ వ్యవస్థ. కాకపోతే చాలా వరకు సంస్థలు దీన్ని ఓ మొక్కుబడిగా చేసేస్తున్నాయన్నది ఎక్కువగా వినిపించే విమర్శలు. ప్యాక్‌లు ఆకర్షణీయంగా ఉండేలా చూసుకుంటున్నారే తప్ప లేబులింగ్‌పై మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు.
లేబులింగ్‌లో భాగంగా ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ లోగో, లైసెన్స్ నంబర్, న్యూట్రిషనల్ వివరాలు కచ్చితంగా ముద్రించాలి. ఇక ఈ అన్ని వివరాలకు సంబంధించి అక్షరాల పరిమాణం 3 మిల్లీ మీటర్ల కన్నా తక్కువగా ఉండకూడదు. కొన్ని ఆహార పదార్థాల్లో కలిపే ఇన్‌గ్రీడియెంట్స్ మారినప్పుడు అందుకు సంబంధించిన వివరాలు లేబులింగ్‌లో కనిపించడం లేదు. అంటే లేబుల్స్ అప్‌డేట్ అవ్వడం లేదు.

ఇక కేలరీలు, కొవ్వు, సోడియం శాతాలు ముద్రించనప్పుడు అందులో అక్యురసీ కనిపించడం లేదన్నది ఎక్కువగా వస్తున్న ఫిర్యాదు. ఇక కొన్ని సంస్థలైతే ప్యాకేజింగ్ మెటీరియల్‌లో కూడా నాణ్యత పాటించడం లేదు. చెప్పుకోడానికి ఇలాంటి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. కానీ ఇందులో పాటించేవి కొన్ని మాత్రమే. అందుకే లేబుల్స్ విషయంలో ఇప్పటికీ వినియోగదారుల్లో ఓ రకమైన సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

సంస్కరణలు జరగాలి: ప్రస్తుతానికైతే ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ (FSSAI) కొన్ని కీలక ప్రతిపాదనలపై చర్చలు జరుపుతోంది. లేబులింగ్ వ్యవస్థను పకడ్బందీగా ఎలా మార్చాలన్న అంశంపై దృష్టి సారించింది. మరింత కచ్చితంగా, వివరంగా, పారదర్శకంగా లేబులింగ్ ఉండేలా మార్పులు చేర్పులు చేస్తోంది. కాకపోతే వీటన్నింటినీ తుదిరూపు ఎప్పటికి వస్తుందో అన్న స్పష్టతే లేదు. అనుకున్న విధంగా సంస్కరణలు జరిగితే ప్రజారోగ్యాన్ని ప్రమాదం నుంచి బయటపడేసేందుకు అవకాశం ఎంతైనా ఉంటుంది.

'హార్లిక్స్​ హెల్త్​ డ్రింక్​ కాదు'- లేబుల్​ మార్చేసిన కంపెనీ

కంటికి కలర్​ఫుల్​గా, రుచిగా ఉందని తింటున్నారా? అసలు విషయం తెలిస్తే అంతే!

Last Updated : February 20, 2026 at 5:28 PM IST