ETV Bharat / opinion

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ నోట 'సబ్‌ సీ కేబుళ్ల' మాట - ఇదేంటో మీకు తెలుసా?

డేటా సరఫరాలో కీలకంగా సబ్‌ సీ కేబుళ్లు - 95% నెట్‌ డేటా వీటి ద్వారానే సరఫరా - ఇందుకు సముద్ర గర్భంలో కేబుళ్లు - ఒక దేశం నుంచి ఒక దేశానికి సరఫరా

Idi Sangathi on Why Submarine Cables Are More Important Than Ever
Idi Sangathi on Why Submarine Cables Are More Important Than Ever (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 20, 2026 at 3:39 PM IST

7 Min Read
Choose ETV Bharat

Idi Sangathi on Why Submarine Cables Are More Important Than Ever: ప్రపంచం ఇంటర్నెట్‌ యుగాన్ని దాటి ఏఐ యుగంలోకి వచ్చేసింది. కంపెనీలు మాత్రమే కాకుండా సాధారణ పౌరులు కూడా ఏఐని విస్తృతంగా వాడుతున్నారు. దీంతో డేటా వినియోగం ఊహించని వేగంతో పెరిగిపోతోంది. ఇంతటి డేటాను నిల్వ చేసేందుకు డేటా సెంటర్ల ఏర్పాటు కూడా ఊపందుకుంది. సమాచార నిల్వకు డేటా సెంటర్లు వస్తున్నాయి. మరి సమాచార మార్పిడి ఎలా జరుగుతుంది? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సమాచారం ఎలా వెళుతుంది? అంటే దీనికి సమాధానం సముద్ర లోతుల్లో కనిపించకుండా ఉండే సబ్‌ సీ కేబుళ్లు? దిల్లీ ఏఐ సమ్మిట్‌లో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కూడా ఈ సబ్‌ సీ కేబుళ్ల గురించి ప్రస్తావించారు. మరి ఏమిటి ఈ సబ్‌ సీ కేబుళ్లు. డేటా సరఫరాలో ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తాయి. వంటి పలు ముఖ్యమైన అంశాల గురించి ఈ ప్రతిధ్వని ద్వారా తెలుసుకుందాం.

సముద్ర గర్భంలో సబ్‌ సీ కేబుళ్లు: వీటిని ఎలా ఏర్పాటు చేస్తారు. ఇంతకీ ఏంటీ సీ కేబుల్స్? ఏంటి వాటి వల్ల ఉపయోగాలు. ఇప్పుడు చాలామంది ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెదుకుతు న్నారు. ఉదాహరణకు అమెరికాలో ఉన్న బంధువులతో వీడియోకాల్‌ మాట్లాడతాం. యూట్యూబ్‌ వీడియోను సెకన్లలోనే డౌన్‌లోడ్‌ చేసుకుంటాం. ఇంటర్నెట్‌ సౌకర్యంతో సమాచారాన్ని ఇలా ఉపయోగించడం వరకే మనకు తెలుసు. ఆ వీడియో కాల్‌ ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళుతుంది, వీడియో ఎలా డౌన్‌లోడ్‌ జరుగుతుంది అన్నది చాలా మందికి తెలియదు. ఈ పాత్రను పోషించేది సముద్ర గర్భంలో ఉండే సబ్‌ సీ కేబుళ్లు. ఈ పదం కాస్త కొత్తగా ఉన్నా దేశాలు, ప్రాంతాల మధ్య డేటా సరఫరా అయ్యేది ఈ సబ్‌ సీ కేబుళ్ల ద్వారానే. ప్రపంచవ్యాప్తంగా 95%కి పైగా డేటా వీటి ద్వారానే బట్వాడా అవుతుంది.

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ నోట -సబ్‌ సీ కేబుళ్ల మాట- ఇదేంటో మీకు తెలుసా? (ETV Bharat)

సాగర గర్భంలో ఓ గొలుసులాగా వేల కిలోమీటర్లు విస్తరించిన ఈ కేబుళ్లు ఖండాలు, దేశాలు, నగరాలను అనుసంధానిస్తున్నాయి. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహాల ద్వారానే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి డేటా మార్పిడి జరుగుతుందని చాలా మంది భావన. అయితే ఉపగ్రహాలు భారీ స్థాయి సమాచార ప్రవాహాన్ని నిర్వహించలేవు. పైగా అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రసార సమయంలో సిగ్నళ్లు, డేటా బలహీనపడడం వంటి ఇబ్బందులు వస్తాయి. అంతరిక్ష మార్గంలో పెద్దమొత్తంలో డేటాను పంపాలంటే ఖర్చు భారీగా పెరుగుతుంది. ఈ ఖర్చు, సాంకేతికంగా ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు ఉపయోగించే సాధనమే సబ్‌ సీ కేబుల్‌.

వీడియో వెనుక వేల కిలోమీటర్ల సముద్ర గర్భ ప్రయాణం: ఈ సబ్‌ సీ కేబుల్‌లో లేటెన్సీ మిల్లీసెకన్లలో ఉండగా, ఉపగ్రహాల్లో అది ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్‌ వినియోగం ఎంత పెరుగుతూ ఉంటే సబ్‌ సీ కేబుళ్ల అవసరం అంతగా పెరుగుతూ ఉంటుంది. ఏఐ రాక తర్వాత యావత్‌ ప్రపంచంలో ఆ అవసరం నిజంగానే పెరిగింది కూడా. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు కోట్లాదిమంది ప్రజల చేతుల్లోని స్మార్ట్‌ ఫోన్‌ల ద్వారా చూసేది స్క్రీన్‌పై వీడియో మాత్రమే. కానీ ఆ వీడియో వెనుక వేల కిలోమీటర్ల సముద్ర గర్భ ప్రయాణం దాగి ఉంది. ఈ మేరకు సబ్‌ సీ కేబుళ్లు కూడా ఆ స్థాయిలో కావాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో దిగ్గజ కంపెనీలు కొత్త లైన్ల ఏర్పాటుపై దృష్టి సారించాయి. దిల్లీలో ఏఐ సదస్సులో పాల్గొన్న గూగుల్‌ C.E.O సుందర్‌ పిచాయ్‌ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు.

4 స్ట్రాటజిక్‌ ఫైబర్‌ ఆప్టిక్‌ రూట్లు: సుందర్‌ పిచాయ్‌ చెప్పిన దాని ప్రకారం భారత్‌-అమెరికా మధ్య కనెక్టివిటీలో భాగంగా కొత్త సబ్‌ సీ కేబుల్‌ రూట్లు, ఫైబర్‌ ఆప్టిక్‌ రూట్లు, అంతర్జాతీయ ల్యాండింగ్‌ స్టేషన్లు అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం గూగుల్‌ ఐదేళ్లలో 15బిలియన్‌ డాలర్లను వెచ్చించనుంది. దీని వల్ల భారత్‌-అమెరికాతో పాటు దక్షిణార్థ గోళంలోని ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్‌కు కూడా అనుసంధానత పెరుగుతుంది. నెట్‌వర్క్‌, రీచ్‌ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా భారత్‌ నుంచి సింగపూర్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాకు 3 సబ్‌ సీ రూట్లు ఏర్పాటు చేస్తారు. అమెరికా-భారత్‌ మధ్య దక్షిణార్థ గోళంలోని ఇతర ప్రాంతాలను కలుపుతూ 4 స్ట్రాటజిక్‌ ఫైబర్‌ ఆప్టిక్‌ రూట్లు ఏర్పాటు చేస్తారు. ముంబయి, చెన్నైలో ఉన్న ల్యాండింగ్‌ పాయింట్లపైనే ఆధారపడకుండా విశాఖపట్నంలో సబ్‌ సీ గేట్‌వే ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌తో దీన్ని అనుసంధానిస్తారు. గూగుల్‌ విశాఖను డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం ఎంపిక చేయడానికి కారణం అక్కడ సముద్రం ఉండడం ప్రధాన కారణం.

లోడ్‌ చేయడానికే 4వారాల సమయం: గూగుల్‌ సహా అంతర్జాతీయ టెక్‌ కంపెనీలు కొత్త సబ్‌ సీ కేబుళ్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్నా అది చాలా కష్టమైన ప్రక్రియ. సముద్రంలో ప్రతికూల వాతావరణం సహా అనేక ఆటుపోట్లను తట్టుకుంటూ వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక నౌకల ద్వారా మాత్రమే వీటిని వేయడం సాధ్యం. దీన్ని నౌకలో లోడ్‌ చేయడానికే 4వారాల సమయం పడుతుంది. తీర ప్రాంతం నుంచి ఈ నౌక కేబుల్‌ను వేసుకుంటూ వెళుతుంది. అక్కడ కేబుల్‌ను వేయడానికి నాగలి లాంటి సాధనాన్ని వాడతారు. సముద్రంలో పర్వతాలు, లోయలు, శిలలు, పగడపు దిబ్బలు, భూఫలకాలకు సంబంధించిన ఫాల్ట్‌ లైన్స్‌ ఉంటాయి. వీటిని అధిగమించి కేబుళ్లను వేయడానికి చాలా ప్రణాళిక అవసరం.

అలాగే నౌకల లంగర్లు, మత్స్యకారుల పడవల వల్ల దెబ్బతినని ప్రాంతంలోనే వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సబ్‌ సీ కేబుళ్లకు సొర చేపల ముప్పు కూడా ఉంటుంది. వీటిని అవి కొరికేస్తూ ఉండడంతో గూగుల్‌ వంటి కంపెనీలు షార్క్‌-ప్రూఫ్‌ వైర్‌ కేబుళ్లతో తమ కేబుళ్లను మెరుగుపర్చుకుంటున్నాయి. ఇక సాగర కేబుళ్లకు గూఢచర్య ముప్పు కూడా ఉంటుంది. విద్రోహ చర్యల వల్ల ఒక్కోసారి ఇవి తెగిపోతుంటాయి. కొన్నిసార్లు ఫిషింగ్ ట్రాలర్స్ యాంకర్‌ల వల్ల నష్టం జరుగుతుంటుంది. సముద్ర లోతుల్లోని పీడనాన్నీ ఈ కేబుళ్లు తట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ అధిగమించేందుకు అధునాతన సాంకేతికత అవసరం.

సెకనుకు 200టెరాబిట్స్‌ డేటాను సరఫరా: సబ్‌ సీ కేబుళ్లను ఇప్పుడు ఇంటర్నెట్‌ బట్వాడా కోసం వేస్తున్నా 168 ఏళ్లుగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. 1858లో తొలి ట్రాన్స్‌ అట్లాంటిక్‌ కేబుల్‌ను టెలిగ్రాఫ్‌ కమ్యూనికేషన్‌ కోసం వేశారు. దీని ద్వారా న్యూ ఫౌండ్‌లాండ్‌ను ఐర్లాండ్‌తో అనుసంధానించారు. అయితే ఆ కనెక్షన్‌ సిగ్నల్‌ క్షీణించడం ప్రారంభించింది. సంకేతాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో ఇంజినీర్లు ఓల్టేజీని పెంచినప్పుడు కేబుళ్లు కాలిపోయాయి. ఇలా కొన్నేళ్లలో మరో రెండు కేబుళ్లు దెబ్బతిన్నాయి. చివరకు ఈ సమస్యను పరిష్కరించడానికి 1865లో మరో కేబుల్‌ వేశారు. 1866లో స్థిరమైన కనెక్ష న్ ఏర్పాటు చేయగలిగారు. ప్రస్తుతం సబ్‌ సీ కేబుళ్లకు ప్రతి 50నుంచి 80కిలోమీటర్లకు ఒక రిపీటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. అవి సిగ్నల్‌ బలాన్ని పెంచడంతో పాటు వేల కిలోమీటర్లు ప్రయాణించేలా చేస్తాయి. ఈ కేబుళ్లు ప్రతి సెకనుకు 200టెరాబిట్స్‌ డేటాను సరఫరా చేయగలవు. ఇంత వేగం వెంట్రుక మందం కల్గిన ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్ల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. ఒక కేబుల్‌ ఎంత పెద్దగా ఉన్నాఅందులో డేటాను చేరవేసే ఫైబర్ ఆప్టిక్‌ వెంట్రుక పరిణామంలోనే ఉంటుంది.

ప్రస్తుతం ప్రపంచంలో 500కు పైగా యాక్టివ్ సబ్‌మరైన్ కేబుల్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటి మొత్తం పొడవు 1.4 మిలియన్ కిలోమీటర్లకు పైగానే. అయితే ఈ సబ్‌ సీ కేబుళ్ల తయారీ కూడా కాస్త క్లిష్టతరంగా ఉంటుంది. సముద్ర గర్భంలోని పీడనం, కఠిన వాతావరణాన్ని తట్టుకునేలా కేబుల్‌ను పొరలుపొరలుగా పటిష్ఠపరుస్తారు. కనీసం 25ఏళ్ల పాటు సేవలు అందించేలా వీటిని తయారు చేస్తారు. కేబుల్‌ మధ్య భాగంలో జెల్‌ పూత కల్గిన ఫైబర్‌ ఆప్టిక్‌ పోగులు ఉంటాయి. వాటిని రాగి గొట్టంలో ఉంచుతారు. ఈ ట్యూబ్‌లో విద్యుత్‌ ప్రవహిస్తుంది. ఈ రాగి గొట్టానికి పైభాగంలో ప్లాస్టిక్‌ ట్యూబ్‌ ఉంటుంది. దానికి ఎగువన అల్యూమినియం వాటర్‌ బ్యారియర్‌, పోగులుగా స్టీల్‌ వైర్లు ఉంటాయి. అదనపు రక్షణ అవసరమైతే దానిపై స్టీలు వైరుతో మరో అల్లికను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత నైలాన్‌ తాడు, తారు పొర ఉంటుంది. అన్నింటి కన్నా పైన ప్లాస్టిక్‌ పూత ఉంటుంది. మొత్తం ప్యాకేజీని ఇది సీల్‌ చేస్తుంది. లైట్ సిగ్నల్‌ బలాన్ని పెంచడానికి వాడే రిపీటర్లు పని చేయడానికి రాగి ట్యూబ్‌ ద్వారా విద్యుత్‌ను పంపుతారు.

భవిష్యత్తులో కీలకపాత్ర: స్మార్ట్‌ఫోన్‌ ఓ విప్లవం అనుకుంటే ఏఐ దాన్ని మించిన మహా విప్లవంగా మారిపోయింది. దీనికి భారీగా డేటా అవసరం. ఆ డేటా సరఫరాకు అదే స్థాయిలో సబ్‌ సీ కేబుళ్లు కూడా అవసరం. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వీటి తయారీ ఊపందుకుని ఆ మేరకు ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయి. సాంకేతికత ఏఐతోనే ఆగిపోయేలా లేదు. దాన్ని మించినది వచ్చినా రావచ్చు. అంతేకాదు.. యుద్ధ సమయాల్లో ఈ సబ్‌సీ కేబుళ్లు వ్యూహాత్మక ఆస్తులుగా మారతాయి. ఇవి దెబ్బతింటే దేశాల మధ్య బ్యాంకింగ్ వ్యవస్థలు, స్టాక్ మార్కెట్లు, ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవస్థలు సైతం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందువల్ల సబ్‌ సీ కేబుళ్లది భవిష్యత్తులో ఇక కీలకపాత్రే.

ఒకేసారి 3 ఉత్సవాలు - విశాఖ తీరంలో భారత నౌకాదళం మహా ప్రదర్శన

గ్లోబల్ సౌత్‌లో మొదటిసారి - దేశ రాజధాని దిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌