క్యాన్సర్లు, చర్మవ్యాధులు, గర్భస్రావాలు - 'యురేనియం'తో అల్లాడుతున్న ప్రజలు
యురేనియం తవ్వకాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైఎస్సార్ కడప జిల్లా ప్రజలు - క్యాన్సర్లు, చర్మవ్యాధులు, ఊపిరితిత్తులు, గర్భ సంబంధమైన వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు - సమస్య పరిష్కారం కోసం బాధితుల పోరాటం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 25, 2026 at 4:52 PM IST
People Suffering from Uranium Mining in YSR Kadapa District : యురేనియం ఎంతటి విలువైన ఖనిజమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, దీనివల్ల కలిగే అనర్థాలు, కాలుష్యం, రేడియేషన్ ప్రభావం ఎక్కువే. 13 ఏళ్ల కిందట పులివెందుల సమీపంలో యురేనియం కర్మాగారం ప్రారంభించారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం పక్కన పెట్టేశారు. ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు మారుతున్నా బాధిత గ్రామ ప్రజల గోడును పట్టించుకునే నాథులు కరవయ్యారు.
సమస్య పరిష్కారం కోసం బాధితులతో పాటు నాయకులు ఆందోళనలు చేసినా ఫలితం శూన్యంగానే ఉంది. అందులోనూ యురేనియం ఉత్పత్తి ద్వారా వెలువడే వ్యర్థాలు నిల్వచేసే టెయిలింగ్ పాండ్ ఎత్తు 380 మీటర్లకు చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల అక్కడి భూగర్భజలాలు తీవ్ర కాలుష్యమై ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నాయి.
భూమి, నీటిలో సహజసిద్ధంగా లభించే అణుధార్మిక రసాయన మూలకం యురేనియం. దీన్ని అణ్వాయుధాలు, అణు రియాక్టర్లలో ఇంధనంగా వాడతారు. యురేనియం ప్రధానంగా యూ-238, యూ-235, యూ-234 3రూపాల్లో లభిస్తోంది. అణ్వాయుధాల్లో ఉపయోగించే అత్యంత శక్తిమంతమైన ఇంధనం యూ-235. తక్కువలో తక్కువ 7 కిలోల యురేనియంతో అణుబాంబు తయారు చేయవచ్చు. ఐతే, భారత్‌లో ఏపీ, తెలంగాణతో పాటు మేఘాలయ, అసోం, నాగాలాండ్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా తుమ్మలపల్లిలో దేశంలోనే అత్యధికంగా యురేనియం నిల్వలు ఉండటం గమనార్హం. యురేనియం భూమిలో ఉన్నంత వరకు ఎలాంటి సమస్య లేదు. కానీ, భూమిలోంచి బయటకు రాగానే అది గాలిలో కలిసి సమీపంలో ఉండే ప్రజల అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం సమీపంలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూడా ఇదే.
ఊపిరితిత్తుల క్యాన్సర్, సంతానలేమి సమస్యలు : యురేనియం సాంద్రత సీసం కంటే 75% ఎక్కువ. న్యూక్లియర్ రియాక్టర్లలో చర్య జరిగినపుడు అత్యధిక వేడిని విడుదల చేస్తుంది. అంతేకాదు, యురేనియంతో జరిపే ప్రతి రసాయనిక చర్యలో ప్రమాదకరమైన బీటా, గామా కిరణాలు విడుదల అవుతాయి. యురేనియం తవ్వకాలు జరిపే ప్రాంతం నుంచి వెలువడే రేడియో ధార్మిక పదార్థాలు కొన్ని వందల ఏళ్లు వాతావరణంలో ఉండిపోతాయి. వీటి ప్రభావంతో మనుషులు, జంతువులకు ఊపిరితిత్తుల క్యాన్సర్, సంతానలేమి, పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవడం, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది.
US ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నివేదిక ప్రకారం యురేనియం గాలి, నీరు, మట్టి, ఆహారాన్ని వేగంగా కలుషితం చేస్తుంది. అందుకే యురేనియం తవ్వే ప్రాంతాల్లో తాగునీటిపై ప్రభావం అధికంగా ఉంటుంది. నీటిలో అణుధార్మిక పదార్థాలు కలవడం వల్ల నీటి వనరులు కలుషితమై విషతుల్యంగా మారుతుంది. అంతేకాదు, యురేనియం తవ్వకాల కోసం వెయ్యి అడుగుల వరకు బావులు తవ్వడం వల్ల 200 నుంచి 300 అడుగులలోతు వరకు నీటి వనరులు కిందికి దిగిపోతాయి. తద్వారా భూగర్భ జలాలు అడుగంటి పోయి నీటి కొరత ఏర్పడుతుంది. ఇలాంటి విపత్కర పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి 40 వేల మెగా వాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం.
నిబంధనలకు విరుద్ధంగా పాండు నిర్మాణం : 2007లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో కడప జిల్లా తుమ్మలపల్లిలో యురేనియం కర్మాగారం ఏర్పాటు చేశారు. 2013 నుంచి యురేనియం ఉత్పత్తి ప్రారంభించారు. ముడి యురేనియం వెలికి తీసి శుద్ధి చేస్తున్నారు. శుద్ధి చేసిన తర్వాత వెలువడే వ్యర్థాలు వేముల మండలంలోని కేకే కొట్టాల గ్రామం సమీపంలోని టెయిల్ పాండులో నిల్వ చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు టెయిలింగ్ పాండు నిర్మించలేదనే ఆరోపణలు ఉన్నాయి.
దీనివల్ల వ్యర్థాలు భూమిలోకి ఇంకి భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. దీంతో కేకే కొట్టాల, కనంపల్లె, మబ్బుచింతలపల్లి, తుమ్మలపల్లి, భూమయ్య గారిపల్లి, రాచకుంటపల్లి గ్రామాల్లో రైతుల పంట పొలాలు దెబ్బతింటున్నాయి. తాగునీరు కలుషితం అవుతోంది. ఏళ్ల తరబడి గ్రామస్థులు పోరాటం చేసినా UCIL అధికారులు స్పందించడం లేదు. 2017 నుంచి యురేనియం కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో ఆయా గ్రామాల్లో చర్మవ్యాధులు, గర్భ సంబంధమైన వ్యాధులు, క్యాన్సర్లు, ఊపిరితిత్తుల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పాండు ఎత్తు 380 మీటర్లకు మించి : ఏటా 9 లక్షల టన్నుల యురేనియం వ్యర్థాలు టెయిలింగ్ పాండులో నిల్వ చేస్తున్నారు. ఉత్పత్తి చేసే క్రమంలో వ్యర్థాలతోపాటు ఏటా 30 వేల టన్నుల సోడియం సల్ఫేట్ టెయిలింగ్ పాండులో కలుపుతున్నారు. వాస్తవానికి సోడియం సల్ఫేట్ వేరుగా చేసి పక్కకు తరలించాలి. కానీ, 2013 నుంచి 2018 వరకు టెయిలింగ్ పాండులోనే కలిపేశారు. 2019 తర్వాత సోడియం సల్ఫేట్ వేరు చేస్తున్నప్పటికీ ఇంకా 50% టెయిలింగ్ పాండులో కలుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం టెయిలింగ్ పాండు PCB నిబంధనల ప్రకారం కాంటూరు లెవల్ ఎత్తు 380 మీటర్లు మించకూడదు. ఇంకా తక్కువే ఉండటం మంచిది. కానీ, ఇప్పటికే 3 సార్లు పెంచిన కారణంగా పాండ్ ఎత్తు 380కి చేరుకుంది. మరోసారి ఎత్తు పెంచడానికి అధికారులు ప్రయత్నిస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు : 2021లో 30 ఎకరాల్లో మరో ప్రదేశంలో రెండో టెయిలింగ్ పాండు నిర్మించాలని ప్రతి పాదించారు. కానీ, అది సాధ్యం కాలేదు. ఐతే, మళ్లీ పాత టెయిలింగ్ పాండు ఎత్తు పెంచాలనే ప్రతిపాదనలు రావడంతో కేకే కొట్టాల, మబ్బు చింతలపల్లి గ్రామస్థులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తమ 2 గ్రామాల్లోని భూములను తీసుకుని పరిహారం, పునరావాసం, ఉద్యోగాలు కల్పించిన తర్వాత పాండు ఎత్తు పెంచాలని కోరుతున్నారు. ఈ సమస్యపై నాలుగేళ్ల నుంచి UCIL అధికారులతో ప్రజాప్రతినిధులు చర్చలు జరిపినా ఫలితం దక్కడం లేదని వాపోతున్నారు. ఈ విషయంపై పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో కేకే కొట్టాల గ్రామస్థులు జిల్లా కలెక్టర్ శ్రీధర్‌ను కలిసి చర్చించారు.
యురేనియం కర్మాగారం వల్ల స్థానికంగా ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. కొందరు మహిళలకు గర్భస్రావం అయినట్లు బాధితులు చెబుతున్నారు. గతంలో పలు నిపుణుల కమిటీలు బాధిత ప్రభావిత గ్రామాల్లో పర్యటించి యురేనియం కారణంగా నీరు కలుషితం అవుతోందని నివేదికలు ఇచ్చినా PCB అధికారులు, ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకర విషయం. ఐతే ఈ సమస్యలు కొద్ది నెలల్లో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.
తుమ్మలపల్లి, భూమయ్యగారి గ్రామాల్లో గతంలో ఇక్కడ 600 అడుగుల్లో నీళ్లు లభించేవి. యురేనియం ప్లాంట్, మైనింగ్ కారణంగా 1200 అడుగులు వేసినా బోర్లలో నీళ్లు పడని పరిస్థితి. అందులోనూ అనారోగ్య సమస్యలు అక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని బాధిత గ్రామ ప్రజలు కోరుతున్నారు.

