వందేభారత్ వందో రైలు - పట్టాలపై దూసుకెళ్లడానికి ట్రయల్ రన్‌కు సిద్ధం!
తొలి రైలు గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలిగే సామర్థ్యం - ముంబయి-బెంగళూరు స్లీపర్ నడిపేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ - జోధ్‌పూర్‌లో 360 కోట్లతో వందేభారత్ స్లీపర్

Published : May 6, 2026 at 3:19 PM IST
|Updated : May 6, 2026 at 4:59 PM IST
Hundredth Vande Bharat Train : వందే భారత్ రైల్వేలో ఓ కీలక మలుపు. అప్పటి వరకూ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నా వందేభారత్ రాకతో లెక్కలన్నీ మారిపోయాయి. అత్యున్నత సౌకర్యాలు. అనువైన సీటింగ్. వేగంగా గమ్యస్థానం చేరుకునే వెసులుబాటు. ఇవన్నీ ఈ రైళ్లను ప్రత్యేకంగా నిలబెట్టాయి. పైగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దశలవారీగా సర్వీస్‌లు పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఓ కీలక మైలురాయి అధిగమించింది. వందో వందేభారత్ ట్రైన్ తయారై ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉంది. త్వరలోనే అది కూడా పట్టాలెక్కనుంది. అంటే సెంచరీ మార్క్‌ను చేరుకోడానికి సిద్ధంగా ఉందన్నమాట. తొలి ట్రైన్ సర్వీస్‌లు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ రకరకాల మార్పులు చేస్తూ సరికొత్త ప్రయాణ అనుభూతిని పంచుతూ వచ్చాయి ఈ రైళ్లు. స్లీపర్ వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. జమ్మూ, శ్రీనగర్ మార్గంలోనూ తొలి వందేభారత్ ట్రైన్ ఇటీవలే పరుగులు తీసింది. ఇలాంటి మరెన్నో కీలక మైలురాళ్లను దాటేందుకు నిత్యం కృషి చేస్తోంది రైల్వే శాఖ.
మొట్టమొదటి వందేభారత్ ట్రైన్ : 2019 ఫిబ్రవరి 15వ తేదీ. రైల్వే చరిత్రలో కీలక మలుపు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైల్ ప్రారంభమైంది ఆ రోజే. న్యూ దిల్లీ నుంచి వారణాసికి తొలి సర్వీస్‌ను అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ఆ ట్రైన్‌ను ప్రారంభించారు. అప్పటి వరకూ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులో ఉన్నా సెమీ హై స్పీడ్ రైల్‌గా అందరి ముందుకు వచ్చింది వందేభారత్ ట్రైన్. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారవడమే కాదు. గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలిగే సామర్థ్యంతో తొలి వందేభారత్ రైలు పట్టాలెక్కింది. దిల్లీ నుంచి వారణాసికి 755 కిలోమీటర్లు కాగా 8 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఆ ట్రైన్‌కు "Train 18” అనే పేరు పెట్టింది కేంద్రం. అలా మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైల్ సర్వీస్‌లు మొదలయ్యాయి. ఇప్పుడీ ప్రయాణం ఓ కీలక మైలురాయిని దాటింది. సెంచరీ మార్క్‌ను అధిగమించింది. వందో వందేభారత్ ట్రైన్ తయారై ట్రయల్ రన్‌కు అంతా సిద్ధమవుతోంది.
నిజానికి 2018లోనే వందేభారత్ ట్రైన్‌ను పట్టాలెక్కించాలని భావించింది కేంద్రం. కానీ కొన్ని సాంకేతికత సవాళ్ల కారణంగా కాస్త ఆలస్యమైంది. కాకపోతే సెమీ హై స్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన 2018లోనే మొదలైంది కనుక టెక్నికల్‌గా ఇవి ఆ సంవత్సరమే ప్రారంభమైనట్టుగా చెబుతోంది కేంద్రం. అంటే ఇప్పటికే 8 ఏళ్లు గడిచాయన్నమాట.
మొట్టమొదటి వందేభారత్ ట్రైన్ ఇక్కడే : చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో మొట్టమొదటి వందేభారత్ ట్రైన్ తయారైంది. మేక్ ఇన్ ఇండియాలో ఇదీ ఓ భాగమే. సుమారు 18 నెలల్లోనే తయారీ పూర్తైంది. 2018లో కేవలం రెండు ట్రైన్‌ల తయారీతో ప్రయాణం మొదలైంది. ఇప్పుడు వందో రైల్‌నే తయారు చేసి ట్రయల్స్‌కు సిద్ధంగా ఉంచారు. యూపీలోని రాయ్‌బరేలీలో మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ వందో వందేభారత్ ట్రైన్‌ను తయారు చేశారు. ఇందులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. 140 సెకన్లలోనే గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. త్వరలోనే ట్రయల్ రన్స్ చేయడానికి అంతా సిద్ధం చేస్తున్నారు. ఇంజినీరింగ్, భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పకడ్బందీగా ఈ ట్రైన్ తయారు చేసినట్టు చెబుతోంది రైల్వే శాఖ.
దివ్యాంగుల కోసం స్పెషల్‌గా : వందేభారత్ రైళ్ల తయారీ కోసం కేంద్రం మొత్తం మూడు చోట్ల కోచ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసింది. చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇందులో మొదటిది. ఆ తరవాత కపుర్తలాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ, రాయ్ బరెలీలో మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ ఉన్నాయి. వందో వందేభారత్ ట్రైన్‌లో సీటింగ్ మరింత సౌకర్యంగా ఉంటుందని చెబుతోంది రైల్వే. ఎక్కడా చిన్న కుదుపు లేకుండా ప్రయాణించవచ్చు అని అంటోంది. అంతే కాదు శబ్దం చాలా తక్కువగా ఉంటుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే రైల్వేలో భద్రత కోసం తీసుకొచ్చిన కవచ్ ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను ఇందులో పొందుపరిచారు.
అడ్వాన్స్‌డ్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ కూడా ఉందని వివరించింది కేంద్రం. దివ్యాంగులకు ప్రత్యేకంగా ర్యాంప్‌లు ఏర్పాటు చేసింది. ఇలా ఎన్నో అధునాతన ఫీచర్లు ఈ వందో వందేభారత్ ట్రైన్‌లో ఉన్నాయి. నిజానికి వందే భారత్ ట్రైన్స్ డిజైన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది కేంద్రం. ఎప్పటికప్పుడు ఇందులో మార్పులు, చేర్పులు చేస్తూ వస్తోంది.
మొత్తం 164 సర్వీస్‌లు అందుబాటు : విశాఖపట్నం-సికింద్రాబాద్, విశాఖపట్నం-భువనేశ్వర్, సికింద్రాబాద్-నాగ్‌పూర్, శ్రీనగర్- శ్రీమాతా వైష్ణో దేవీ కట్రా ఇలా ప్రస్తుతానికి మొత్తం 164 సర్వీస్‌లు అందుబాటులో ఉన్నాయి. 2024-25 లెక్కల ప్రకారం ఈ అన్ని వందేభారత్ రైళ్లలో ఆక్యుపెన్సీ 100% ఉందని చెబుతోంది రైల్వే శాఖ. వీటిలో చైర్ కార్ సర్వీస్‌లతో పాటు స్లీపర్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లు కూడా ఉన్నాయి. నిజానికి ఈ ఏడాది మొదట్లోనే స్లీపర్ సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. 16 ఏసీ కోచ్‌లతో, కవచ్ 4.0 వ్యవస్థతో ఇవి తయారయ్యాయి. హౌరా నుంచి కామాఖ్యకు సర్వీస్‌లు నడుస్తున్నాయి.
ముంబయి-బెంగళూరు మధ్యలో స్లీపర్ వందేభారత్ నడిపేందుకు ఇటీవలే రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణంగా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం చేయాలంటే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కనీసం 21 గంటల సమయం పడుతుంది. అదే వందేభారత్ స్లీపర్ అందుబాటులోకి వస్తే 15-17 గంటల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చు. మొత్తం 823 మంది ప్రయాణికులు ఇందులో ట్రావెల్ చేయవచ్చు. ఈ ఏడాది మొత్తం 16 స్లీపర్ రైళ్లు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో కనీస ఛార్జి 960 రూపాయలుగా ఉంది. ఇందులో సీసీ కెమెరాలూ ఉంటాయి.
వందేమాతరంలో ఫీచర్స్ ఇలా ఉంటాయి : ఎప్పటికప్పుడు సర్వీస్‌లను పెంచుతూ వెళ్తోంది రైల్వే. ఈ మధ్యే జమ్మూ-శ్రీనగర్ మార్గంలో తొలి వందేభారత్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చినాబ్ వంతెనపై ఈ రైల్ పరుగులు తీయనుంది. తద్వారా పూంఛ్, ఉరీ, రాజౌరి లాంటి మారుమూల ప్రాంతాలకూ కనెక్టివిటీ పెరగనుంది. ఇప్పటికే కట్రా-శ్రీనగర్ వందేభారత్‌కు ఆదరణ లభించడం వల్ల కోచ్‌ల సంఖ్యను 8 నుంచి 20కి పెంచినట్టు చెబుతోంది రైల్వే శాఖ. ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి కారణం వీటిలో ప్రయాణం సౌకర్యంగా ఉండడం. ఇందులో ఉన్న ఫీచర్స్ కూడా మరో కారణం. చాలా త్వరగా వేగం పుంజుకుంటాయి ఈ రైళ్లు. కేవలం 52 సెకన్లలోనే గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. భద్రత విషయంలోనూ ఎక్కడా రాజీ పడలేదు. కవచ్ సిస్టమ్ ఇందులో పొందు పరిచారు.
ఓవర్ స్పీడింగ్, కొలిజన్ లాంటివి జరగకుండా ఇది కాపాడుతుంది. ఇక వీటిలో జెర్క్ ఫ్రీ కప్లర్స్ ఉంటాయి. అంటే ఎంత వేగంగా వెళ్లినా చిన్న కుదుపు కూడా అనిపించదు. సీటింగ్, ఇంటీరియర్‌లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. స్టాండర్డ్ కోచ్‌లలో రిక్లైనింగ్ సీట్స్ ఉంటాయి. అదే ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో అయితే 180 డిగ్రీల రొటేటింగ్ ఛైర్స్ ఉంటాయి. టాయిలెట్స్‌లో బయో వాక్యూమ్ సిస్టమ్ ఉంటుంది. విమానాల్లో ఈ తరహా వ్యవస్థ ఉంటుంది. ఇక వైఫై సౌకర్యమూ ఉంటుంది. ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్స్, మొబైల్, ల్యాప్‌టాప్ చార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి.
ఏడేళ్లలో మూడు రకాల రంగులు : వందేభారత్ రైళ్లతో ప్రయాణ సమయం తగ్గడమే కాదు. సరికొత్త అనుభూతి కూడా కలుగుతోంది. దేశవ్యాప్తంగా రైల్ నెట్‌వర్క్ విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వందేభారత్ రైళ్ల సర్వీస్‌లు పెరుగుతున్నాయి. 2025 డిసెంబర్ నాటికి మొత్తం 164 వందేభారత్ సర్వీస్‌లు అందుబాటులో ఉన్నాయి. 274 జిల్లాలను కవర్ చేస్తున్నాయి ఈ రైళ్లు. మొత్తంగా 7.5 కోట్ల మంది ప్రయాణి కులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చాయి.
ఓ సారి ఈ రైళ్లలోని మార్పులను గమనిస్తే ఈ 7 ఏళ్లలో మూడు రకాల రంగులతో వీటిని తీసుకొచ్చారు. మొదట్లో తెలుపు, నీలి రంగుల్లో ఉండేది. ఆ తరవాత ఇది నారింజ, తెలుపు రంగులోకి మారింది. ఇప్పుడు కొత్తగా ఆరెంజ్, గ్రే కలర్ వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. మొట్టమొదట తీసుకొచ్చిన రైళ్లను వందేభారత్ వర్షన్ 1గా చెప్పింది రైల్వే. ఆ తరవాత భద్రతా పరమైన కొన్ని ఫీచర్స్ జోడించి వర్షన్ 2 తీసుకొచ్చింది. ఈ వర్షన్ 2 రైళ్లు 2022 సెప్టెంబర్‌లో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతోంది.
పెరుగుతున్న వందేభారత్ రైళ్ల డిమాండ్ : క్రమంగా మరి కొన్ని మార్పులు చేర్పులు చేసి వందేభారత్ వర్షన్ 3.0 ని తీసుకొచ్చింది రైల్వే. ప్రస్తుతం కొన్ని మార్గాల్లో ఇవి సేవలు అందిస్తున్నాయి. త్వరగా వేగం పుంజుకోవడం, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన అనుభూతి అందించడం ఈ రైళ్ల ప్రత్యేకత. 2019లో వచ్చిన వందేభారత్ రైళ్ల గరిష్ఠ వేగం 160 కిలోమీటర్లు కాగా వర్షన్ 2.0లో అది 180 కిలోమీటర్లకు పెరిగింది. ఆపరేషనల్ స్పీడ్ మాత్రం 160 కిలోమీటర్లకు పరిమితం చేశారు. వర్షన్ 3.0లోనూ వేగపరిమితి ఇదే విధంగా ఉంది. ఇక ప్రస్తుతానికి వందేభారత్ రైళ్లు మొత్తం మూడు కోచ్ కాన్ఫిగరేషన్స్‌తో నడుస్తున్నాయి. కొన్నింటిలో 8 కోచ్‌లు, మరి కొన్నింటిలో 16, మరి కొని రైళ్లలో 20 కోచ్‌లు ఉన్నాయి. డిమాండ్‌ను బట్టి వీటి సంఖ్య పెంచుతోంది రైల్వే. పలు మార్గాల్లో వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. 2030నాటికి సర్వీస్‌ల సంఖ్య 800కి, 2047 నాటికి ఏకంగా 4,500 కు పెంచాలని భారీ లక్ష్యం పెట్టుకుంది కేంద్రం. తగ్గట్టుగానే నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది.
హైడ్రోజన్‌తో నడిచే ట్రైన్స్ : వందేభారత్ 4.0 వర్షన్‌పై ప్రస్తుతం మేధోమథనం జరుగుతోంది. 2027 మధ్య నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇందులో కవచ్ 5.0 వ్యవస్థ పొందుపరచనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో బిల్డ్ క్వాలిటీ ఉంటుందని రైల్వే చాలా ధీమాగా చెబుతోంది. 100-150 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు వీలుగా వందే మెట్రోలనూ అందుబాటులోకి తీసుకు రావాలని రైల్వే భావిస్తోంది. భువనేశ్వర్-బాలాసోర్, లఖ్‌నవూ-ఖాన్‌పూర్ మార్గాల్లో ఈ సర్వీస్‌లు మొదలవుతాయని అంచనా. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ప్రస్తుతానికి వందేభారత్ రైళ్లు తయార వుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి పూర్తిగా విద్యుదీకరణతో రైళ్లు నడుస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ అవసరం కూడా లేకుండా హైడ్రోజన్‌తో నడిచే విధంగా ట్రైన్స్ తయారు చేయాలని కేంద్రం భావిస్తోంది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 360 కోట్లతో వందేభారత్ స్లీపర్ మెయింటేనెన్స్ కేంద్రం ఏర్పాటవుతోంది. మొత్తంగా వందేభారత్ రైల్ నెట్‌వర్క్‌ను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్ లక్ష్యాలను ఇప్పుడే నిర్దేశించుకుని తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరెన్నో మైలురాళ్లు దాటేందుకు సన్నద్ధమవుతోంది.
రైలులో ఆహార నాణ్యతపై ప్రయాణికుడి ఫిర్యాదు- IRCTCకి రూ. 10 లక్షల ఫైన్
పట్టాలు తప్పిన వందే భారత్ రైలు- రైల్వేస్టేషన్ దగ్గర్లోనే ప్రమాదం- చివరకు!

