ఇంట్లో కాలుష్యాన్ని తగ్గించే మొక్కలు - వీటి వల్ల లాభాలు ఏమిటంటే?
డిటర్జెంట్లు, ఫ్లోర్ క్లీనింగ్‌లలో ఉండే రసాయనాలతో ఇళ్లలో కనిపించకుండానే కాలుష్యం విడుదల - ఏసీల నుంచి కూడా వెలువడుతున్న కాలుష్యం - వీటి కట్టడికి అందుబాటులో అనేక రకాల మొక్కలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 16, 2026 at 3:56 PM IST
How to Control Indoor Pollution with Plants : వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం వీటి గురించి మనం తరచూ మాట్లాడుకుంటూనే ఉంటాం. మరి ఎప్పుడైనా ఇంట్లోని కాలుష్యం గురించి ఆలోచించారా? వంట నూనెల నుంచి ఫ్లోర్ క్లీనర్ల వరకు ఎన్నో రసాయనాలు గృహంలోని గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయని మీకు తెలుసా? మనకు తెలియకుండానే ఇవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి కాలుష్యానికి ఇప్పుడు విరుగుడు వచ్చేసింది. కొన్ని రకాల మొక్కలు పెంచడం ద్వారా ఇంట్లో వెలువడే కాలుష్యాన్నిఅరికట్టి గాలి నాణ్యతను పెంచుకోవచ్చు. తక్కువ ఖర్చుతోనే సులభంగా వీటి పెంపకం చేపట్టవచ్చు. ఎయిర్ ప్యూరిఫైయర్‌ల కంటే కూడా ఈ మొక్కలు అద్భుతంగా పని చేస్తాయి. మరి ఏమిటా మొక్కలు. దీని ద్వారా ఏయే లాభాలు కల్గనున్నాయి. వీటిపై నిపుణులు ఏమంటున్నారు.
పట్టణీకరణతో ఇరుకు గదులున్న ఇళ్లు పెరుగుతున్నాయి. అపార్ట్ మెంట్లలో ఉండే ఫ్లాట్లలో అయితే సరైన వెంటిలేషన్ సౌకర్యం కూడా ఉండట్లేదు. చివరకు మనం వాడే డిటర్జెంట్లు, ఫ్లోర్ క్లీనింగ్‌లలో ఉండే రసాయనాలూ బయటకు వెళ్లడం లేదు. దీంతో ఇళ్లలో మనకు తెలియకుండానే కాలుష్యం కోరలు చాస్తోంది. గాలి నాణ్యత పడిపోతోంది. అయితే ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెంచుకుంటే స్వచ్ఛత చాలా వరకు మెరుగవుతుందని వైద్యులు చెబుతున్నారు.
గాలి శుద్ధిలో డ్రాకెనా: ఇందులో ఒకటి డ్రాకేనా. గాలి శుద్ధి చేయడంలో ఈ మొక్క అత్యంత ప్రాచుర్యం పొందింది. గాలి శుద్ధిలో డ్రాకెనా ముందు వరుసలో ఉంటుంది. ఈ మొక్కను సాంగ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. వివిధ రంగులు, ఆకర్షణీయమైన ఆకారాల్లో లభిస్తుంది. వేర్లు, విత్తనాలతోనే కాకుండా కాండాన్ని కత్తిరించి నాటినా 15 రోజుల్లో పెరుగుతుంది. దీనికి ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. ఈ మొక్కలు ఎలాంటి సూర్యరశ్మి పరిస్థితుల్లోనైనా పెరుగుతాయి.
విషపూరితమైన వాయువులను పీల్చుకునే: గాలి శుద్ధిలో కీలక పాత్ర పోషించే మరో మొక్క ఆంగ్లోనెమా. దీని ఆకులు వినూత్నంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. సుమారు 15 రంగుల్లో ఈ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఆకు అడుగు కంటే ఎక్కువగా పెరుగుతుంది. వీటికి పూలు పూస్తాయి. ఈ మొక్కకు విషపూరితమైన వాయువులను పీల్చుకునే స్వభావం ఉంది. దీనికి ప్రత్యేకంగా కాండం ఉండదు. దోమలను కూడా నివారిస్తుంది. సూర్యరశ్మి నేరుగా తగలకుండా వెలుగు సోకే చోట ఈ మొక్కని ఉంచాలి. ఈ మొక్కకు పూర్తిగా సేంద్రియ ఎరువునే వాడాలి. గాలి ఎక్కువగా వీచే ప్రదేశాల్లో వీటిని పెట్టకూడదు.
అధిక ఉష్ణోగ్రతను గ్రహించే మొక్క: పెపరోమియా అనే మొక్కను రేడియేటర్ మినీ రబ్బర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. చుట్టుపక్కల పరిసరాల్లోని అధిక ఉష్ణోగ్రతను గ్రహించే శక్తి దీనికి ఉంది. ఈ మొక్కల్ని బెడ్ రూమ్, లివింగ్ రూమ్, వాష్ రూమ్, బాల్కనీల్లో పెట్టుకోవచ్చు. గాలిలో ఉండే నీటి బిందువులను గ్రహించడం వల్ల దీనికి తక్కువ నీరు అవసరమవుతుంది. ఈ మొక్కకు కొద్ది వెలుతురే సరిపోతుంది. వీటి ఆకులు ఎక్కువ మందంగా ఉండడం వల్ల గాలిని బాగా శుద్ధి చేస్తాయి.
గాలిని శుద్ధి చేయడంతో పాటు అందంగానూ: ఆంథూరియం అనే మొక్కకు ఫ్లెమింగో ఫ్లవర్, టేల్ లీఫ్ ఫ్లవర్ వంటి పేర్లున్నాయి. ఈ జాతి మొక్కల్లో సుమారు 800 రకాలు ఉన్నాయి. దీని ఆకులు, పూలు ఆకర్షణీయంగా ఉంటాయి. చిన్నగా, పొడవుగా ఉండే పువ్వు చుట్టూ రంగుల ఆకులు ఉండి, కీటకాలను ఆకర్షిస్తాయి. ఇది గాలిని శుద్ధి చేయడంతో పాటు అందంగానూ కనిపిస్తుంది. తక్కువ సూర్యరశ్మిలో ఈ మొక్క బాగా పెరుగుతుంది. చలికాలంలో మాత్రం పూర్తిగా నిద్రావస్థలోకి వెళ్తుంది. ఆ సమయంలో జాగ్రత్తగా కాపాడుకుంటే వేసవి కాలంలో తిరిగి పెరుగుతుంది.
బ్లాక్ జీజీ మొక్క పెరుగుతున్నప్పుడు ఆకుపచ్చ ఆకులతో ఉంటుంది. క్రమంగా నల్లగా మారడం దీని ప్రత్యేకత. ఆకులు ఒకటి నుంచి మూడు అంగుళాల వరకు పెరుగుతాయి. ఆకులు నీటిని నిల్వ చేసుకుంటాయి. గాలిని బాగా శుద్ధి చేస్తుందీ మొక్క. తక్కువ వెలుతురులో కూడా బాగా పెరుగుతుంది. స్నేక్ ప్లాంట్ అనే మొక్కను మదర్ ఇన్ లా టంగ్ అని పిలుస్తారు. పొడవైన, పదునైన ఆకులు పామును పోలి ఉండటం వల్ల దీనికి స్నేక్ ప్లాంట్ అని పేరు వచ్చింది. ఇవి రాత్రి సమయాల్లో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. వీటిని పడక గదుల్లో పెట్టుకోవచ్చు. ఎక్కువ కెమికల్స్ ఉండే కర్మాగారాల్లో వీటిని విరివిగా పెంచాలని నిపుణులు సూచిస్తుంటారు. తక్కువ వెలుతురున్నా ఈ మొక్క తట్టుకుంటుంది. ఎక్కువ నారు పోస్తే మాత్రం వేర్లు బలహీనమై చనిపోయే అవకాశం ఉంటుంది.
ఈ మొక్కల పెంపకంతో ఉపశమనం: మనీప్లాంట్‌గా పిలిచే పోలోస్, సాన్సవేరియా, పీన్లిల్లీ, అలోవీరా, బోస్టెన్ పెర్న్, పిండెండ్రాన్ వంటి రకాల్ని సులువుగా ఇళ్లల్లో పెంచుకోవచ్చు. ఇవన్నీ ఇళ్లలోని కాలుష్యాన్ని కట్టడి చేసి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు ఇళ్లల్లో ఉండే కాలుష్యం కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటువంటి వారికి ఈ మొక్కల పెంపకం ఉపశమనం కలిగిస్తుంది.
మొక్కల్ని పెంచాలంటే ఎండ అవసరం అనుకుంటాం. కానీ ఇంట్లోనే తగిన వెలుతురుతో అందంగా ఎదిగే మొక్కలెన్నో ఉన్నాయి. ఇలా ఇండోర్‌లో వాటిని పెంచితే ఎన్నో లాభాలు ఉన్నాయి. మొక్కలున్న పరిసరాల్లో ప్రాణవాయువు ఉంటుంది. కళ్లకు ఇంపుగా, మనసుకి ఆహ్లాదం కలుగుతుంది. పనిచేసే చోట పెంచితే ఒత్తిడి అదుపులో ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. వీటిని పరోక్షంగా వెలుతురు వచ్చే చోటకానీ, లైట్ కింద కానీ పెడితే చాలు చక్కగా ఎదుగుతాయి.
గాలిలోని దుమ్ము 30 శాతం తగ్గినట్లు: ఏసీల వల్ల కిటికీలు మూసి ఉంచుతాం. ఫలితంగా ఉపిరి అందకపోవడం, ఆస్తమా, దగ్గు, అలర్జీల వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు మనం ఇంట్లో వాడే క్లీనింగ్ సొల్యూషన్స్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటివాటి నుంచి విడుదలయ్యే రసాయనాలను కొన్ని రకాల మొక్కలు గ్రహిస్తాయి. గాలిలోని దుమ్ముని తగ్గిస్తాయి. వీటిని ఇంటిలో అమర్చుకోవడం వల్ల గాలిలోని దుమ్ము 30 శాతం తగ్గినట్లుగా అనేక అధ్యయనాలూ చెబుతున్నాయి. శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉన్నచోట మొక్కల్ని పెంచితే ఇబ్బంది కచ్చితంగా కొంతైనా తగ్గుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. అనేక రకాల ఇండోర్ మొక్కల్ని సులువుగా ఇంటిలోనే పెంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని హితవు పలుకుతున్నారు.
ఇండోర్ ప్లాంట్స్ వల్ల ఆరోగ్యం పెరగడంతో పాటు ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుందని వీటిని పెంచుకుంటున్న వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇండోర్, అవుట్ డోర్ మొక్కల అమ్మకాలు, కొనుగోళ్లు పెరిగాయంటున్నారు. దీంతో ఈ రంగం మీద ఆధారపడి ఉపాధి పొందుతున్న వారికి సంఖ్య పెరుగుతోంది. వేడుకల సందర్భంగా, పెద్దలను మర్యాద పూర్వకంగా కలిసే సమయంలోనూ బొకేలకు బదులు ఈ మొక్కలను అందించాలని కోరుతున్నారు. దీని వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయంటున్నారు. గతంతో పోలిస్తే ఇండోర్ ఆవుట్‌డోర్ మొక్కల పెంపకానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మొక్కల పెంపకానికి అందమైన కుండీలను ఎంపిక చేసుకుంటున్నారు.
కాలుష్య కారకాలను శుద్ధి చేసే మొక్కలు: ఆరోగ్యాన్ని పెంచే మొక్కలకు ఏదైనా తెగులు వస్తే వివిధ రకాల మందులు సైతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పూలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరల మొక్కలతో పాటు ఈ మొక్కలు పెంచుకునేందుకు ఎంతో మంది ఇష్టపడుతున్నారు. నగరాలు, పట్టణాల్లో అయితే వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. నగరాలు, పట్టణాలు కాంక్రీట్ జంగిల్ గా మారుతున్నాయి. బహుళ అంతస్తు భవనాలతో నిండిపోతున్నాయి. దీంతో మొక్కలు పెంచుకోవడానికి కాస్త స్థలం కూడా ఉండటం లేదు. ఈ తరుణంలో ఇటువంటి స్థలమే అవసరం లేని మొక్కల పెంపకం పెరుగుతోంది.
ఇండోర్‌లో మొక్కలు ఇంట్లోని గాలి నుంచి హానికరమైన రసాయనాలు, కాలుష్య కారకాలను శుద్ధి చేస్తాయి. ఆకులు, వేర్ల ద్వారా ఫిల్టర్ చేయడంతో గాలి నాణ్యత మెరుగవుతుంది. చాలా మంది ఎలక్ట్రిక్ ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడుతున్నారు. వాటి కంటే మెరుగ్గా ఈ మొక్కలు గాలిని శుద్ధిచేస్తాయని నాసా సైతం నిర్థారించింది. వీటిని పెంచుకోవడం వల్ల ఇటు ఇల్లు ఆకర్షణీయంగా ఉంటుంది. అటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. వీటిని పెంచడానికి ఎక్కుల స్థలం అవసరం లేదు. చిన్న చిన్న కుండీల్లో పెంచడం ద్వారా ఇంట్లోని మూలమూలను ఆకుపచ్చగా స్టైలిష్‌గా మార్చవచ్చు.
కొబ్బరి రైతులకు గుడ్‌న్యూస్ - అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయింపు

