అటవీ ఉత్పత్తులతో జీవనోపాధి - ఆర్థిక స్వావలంబన దిశగా మగువలు
మన్యం జిల్లా అటవీ ఉత్పత్తులకు పెట్టింది పేరు - పసుపు, జీడీ, చిరు ధాన్యాలు, పైనాపిల్‌తో పాటు కొండ చీపుర్లు వంటి పంటలు ఎక్కువగా సాగు- రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించిన కేంద్రం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 13, 2026 at 5:21 PM IST
|Updated : February 13, 2026 at 5:28 PM IST
Food Production in Parvathipuram Manyam District : గిరిజన ప్రాంతం. పంట దిగుబడి తక్కువే. మార్కెటింగ్ వ్యవస్థ అంతంత మాత్రమే. అందులోనూ దళారుల బెడద. మద్దతు ధర, తూకాల్లో మోసాలు, తేమ శాతం పేరుతో కొర్రీలే కాకుండా నాణ్యత లేదన్న సాకుతో తక్కువ ధరకే పంట కొనుగోలు చేస్తున్న పరిస్థితి. అలాగని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళదామా అంటే రవాణా ఖర్చులు సహా అనేక సమస్యలు.
పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన రైతులకు ఎదురవుతున్న కష్టాలివి. ఈ ఇబ్బందులే వారిని విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ దిశగా నడిపించాయి. కొందరు ఔత్సాహికులను ప్రాసెసింగ్ యూనిట్లు ఏకం చేయగా, మరికొందరిని రైతు ఉత్పత్తిదారు సంఘాలు సంఘటితం చేశాయి. వీటి ద్వారా పంట ఉత్పత్తులను స్వయంగా ప్రాసెసింగ్, మార్కెటింగ్ చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. మరి, వారు తయారు చేస్తున్న ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు? ప్రాసెసింగ్ యూనిట్లు, రైతు ఉత్పత్తిదారు కేంద్రాలతో గిరిజన రైతులకు కలుగుతున్న ప్రయోజానాలేంటి?
పార్వతీపురం మన్యం జిల్లా అటవీ ఉత్పత్తులకు పెట్టింది పేరు. పసుపు, జీడి, చిరు ధాన్యాలు, పైనాపిల్‌తో పాటు కొండ చీపుర్లు వంటి పంటలు విరివిగా సాగవుతాయి. ఇక్కడ సహజంగా పండే పసుపు, జీడికి గిరాకీ అధికంగా ఉంటుంది. ప్రకృతి సేద్యం విధానంలో సాగయ్యే చిరుధాన్యాల్లో పోషకాలు ఎక్కువ. అటువంటి పంటలను విక్రయిస్తే వచ్చే ఫలాలు రైతులకు దక్కేది అంతంత మాత్రమే. అందుకు మార్కెట్ సదుపాయాలు, మద్దతు ధర, దళారులు వంటి కారణాలు అనేకం ఉన్నాయి.
ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు: ఈ నేపథ్యంలో నష్టపోతున్న మన్యం రైతులకు వన్ ధన్ వికాస కేంద్రాలు-వీడీవీకే, నాబార్డు, బ్యాంకులు, గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్-జీసీసీలు అండగా నిలుస్తున్నాయి. వీటితో పాటు ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం-పీఎంఈజీపీ, ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్-పీఎంఎఫ్ఎంఈ, కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్-సీఐఎఫ్, స్త్రీనిధి, ఉన్నతి వంటి పథకాల ద్వారా ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని పంట ఉత్పత్తులకు అదనపు విలువలు జోడించి విక్రయిస్తున్నారు మన్యం ప్రాంత రైతులు. ఫలితంగా జీవనోపాధి పొందుతూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగేస్తున్నారు.
మార్కెటింగ్ చేస్తున్న మహిళలు: అధిక పోషకాలున్న తృణ ధాన్యాలతో చేసే ఆహార పదార్థాలకు గిరాకీ పెరుగుతోంది. ఈ విషయాన్ని గుర్తించి సొంత యూనిట్లు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారీ గిరిజన మహిళలు. సీతంపేట మండలం పెదరామలో ఆర్ట్స్, వాసన్ సంస్థలు, నాబార్డు సహకారంతో 10 మంది మహిళలు బృందంగా ఏర్పడి చిరుధాన్యాలతో వివిధ ఆహార పదార్థాలు తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నారు.
ఇందుకోసం భువనేశ్వర్‌లోని భారతీయ మిల్లెట్ పరిశోధన కేంద్రంతో పాటు హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. అక్కడ నేర్చుకున్న అంశాల ఆధారంగా చిరుధాన్యాలతో ఆహార పదార్ధాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. రాగులు, కొర్రలు, జొన్నలతో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించి నెలకు రూ.10 నుంచి రూ.15 వేల దాకా ఆదాయం పొందుతున్నారు. మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
కేంద్ర సర్కారు నుంచి ఆర్థిక సహాయం: పాచిపెంట మండలం కూనంబందవలసకు చెందిన గిరిజన మహిళలు శ్రీవేంకటేశ్వర వన్ ధన్ వికాస్ కేంద్రం ద్వారా సంఘటితమయ్యారు. వీడీవీకె స్కీం ద్వారా కేంద్రం సర్కారు నుంచి రూ.2 లక్షల ఆర్థిక సహాయంతో పాటు ప్రత్యేక శిక్షణ పొందారు. తాము పండించిన పంటతో పాటు గ్రామంలోని ఇతర రైతుల నుంచి చిరుధాన్యాలు కొనుగోలు చేస్తున్నారు. వాటిని ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తున్నారు. జంతికలు, కారం బూందీ, వడియాలు వంటివి తయారు చేస్తూ స్వయంగా మార్కెటింగ్ చేస్తున్నారు.
వన్‌ధన్ వికాస కేంద్రాల ద్వారా శిక్షణ: మొదట దళారులు, వ్యాపారులకు విక్రయించి నష్టపోయారు. దీంతో తామే స్వయంగా విక్రయించాలని నిర్ణయించుకుని చిరుధాన్యాల ప్రాసెసింగ్, ఆహార ఉత్పత్తుల తయారీ, ప్యాకింగ్ చేపట్టి నేరుగా అమ్ముతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. వెదురుతో తయారు చేసే గృహోపకరణాలకు మంచి డిమాండ్ ఉంది.
సీతం పేట మండలం మేకవ గ్రామానికి చెందిన 30 మంది ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాబార్డు సహకారంతో మన్యం వన్‌ధన్ వికాస కేంద్రాల ద్వారా శిక్షణ పొందారు. వ్యవసాయ, కూలీ పనులు అయిపోయిన తర్వాత వెదురు సేకరిస్తున్నారు. వాటితో స్టాండ్లు, స్టూళ్లు, బ్యాగులు, కుర్చీలు, టేబుళ్లు, సోఫాలు వంటివి తయారు చేస్తున్నారు. వాటిని మార్కెట్లు, ఎగ్జిబిషన్ల ద్వారా విక్రయిస్తూ నెలకు రూ.15 వేల వరకు ఆదాయం పొందుతున్నారు.
ప్రత్యేక్షంగా, పరోక్షంగా 100 మందికి పైగా జీవనోపాధి: అలాగే, మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధాన పంట జీడి. అత్యధిక శాతం గిరిజనులకు ఈ పంటే ఆదరువు. ఐతే, ఇక్కడో సమస్య ఉంది. 64 వేల ఎకరాల్లో సాగవుతున్న జీడికి తెగుళ్లు సోకుతున్నాయి. అందులోనూ చేతికొచ్చిన పంటకు గిట్టబాటు ధర దక్కని పరిస్థితి. దీంతో అన్నదాతలకు నష్టాలే మిగులుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి జీడి రైతులను గట్టెక్కించేందుకు వన్ ధన్ వికాస్ యోజన ద్వారా జిల్లా కేంద్రంలో జీడి ప్రాసెసింగ్ మెగా యూనిట్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా రైతులకు ధర పరంగా ఊరట లభించటమే కాకుండా ప్రత్యేక్షంగా, పరోక్షంగా 100మందికి పైగా జీవనోపాధి లభిస్తోంది.
ఇక సీతంపేట మండలంలో అన్నదాతలు ఏకమై "మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ"గా ఏర్పడ్డారు. 2017లో ప్రారంభమైన ఈ సంఘంలో 70 గ్రామాల నుంచి 1,507 మంది సభ్యులుగా ఉన్నారు. ఆర్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రోద్బలం, నాబార్డ్ ఆర్థిక సహకారంతో గ్రామీణ మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
ఏడాదికి రూ.3 కోట్ల విలువైన ఉత్పత్తులు: గిరిజన ప్రాంతాల్లో సాగయ్యే పంట ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, ఇతర వ్యవహారాల కోసం 2 గోదాములు, ప్రాసెసింగ్ యంత్ర పరికరాలు వంటి మౌలిక వసతులు సమకూర్చుకున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట ఉత్పత్తుల రవాణా కోసం వాహనాలు కొనుగోలు చేశారు. వీటి ద్వారా ఏడాదికి రూ.3 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయగలుగుతున్నారు.
సహజ పంట ఉత్పత్తులకు నెలవైన మన్యంలో కుటీర పరిశ్రమల ద్వారా వివిధ రకాల పిండి వంటలు తయారీ, ప్రాసెసింగ్ యూనిట్లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వ పథకాలు అండగా నిలుస్తున్నాయి. ఆర్థిక, సాంకేతిక సాయం అందిస్తూ స్థానికులకు ఉపాధి బాటలు వేస్తున్నాయి.
అరకు అభివృద్ధికి పలు వరాలు - త్వరలో మారునున్న రూపురేఖలు
కొబ్బరి రైతులకు గుడ్‌న్యూస్ - అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయింపు

