సెప్టెంబర్‌లోనైనా గండం గట్టెక్కుతుందా? - ఎల్‌నినో ప్రభావం పడకుండా ఉంటుందా?
సెప్టెంబర్ నాటికి తీవ్రరూపం దాల్చనున్న ఎల్‌నినో - వర్షపాతం లేకపోతే ఉత్పత్తి లేక ఆకాశాన్ని తాకనున్న ధరలు - వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ సాగు పద్ధతులే కీలకం

Published : July 8, 2026 at 3:53 PM IST
Elnino Effect On September : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదే ఎల్‌నినో. పసిఫిక్ మహా సముద్రంలో పుట్టి, భారత రుతుపవనాల గమనాన్ని మార్చేసే ఈ అదృశ్య రాక్షసి ఇప్పుడు సెప్టెంబర్ నాటికి తీవ్ర రూపం దాల్చబోతోంది. ఇది ఎవరో నోటి మాట కాదు. భారత వాతావరణ విభాగం ఐఎండీనే చెబుతున్న నివేదికల సారాంశం. ఇప్పటికే ఈ ఎల్‌నినో ప్రభావం వాతావరణంపై చాలా స్పష్టంగా కనబడుతోంది. అదిగో వాన ఇదిగో వాన అని ఎదురు చూస్తున్నాం. మబ్బులు పడుతున్నా వాన జాడ మాత్రం లేదు. ఖరీఫ్ పంటలపై రైతులకు ఎన్నో ఆందోళనలున్నాయి. పైగా సెప్టెంబర్ గండం పొంచి ఉంది. మరి ఇంతగా ఇబ్బంది పెడుతున్న ఎల్‌నినో కండీషన్ అంటే ఏంటి? ఇది మన దేశ 75-80 శాతం వర్షపాతాన్ని అందించే నైరుతి రుతుపవనాలపై ఎలాంటి దెబ్బ కొట్టనుంది? ప్రాజెక్టులు, పంటలు, చివరికి తాగే గుక్కెడు నీళ్ల పరిస్థితి ఏం కావాలి?
ముందు ముందు ఎల్‌నినో తీవ్ర రూపం దాల్చుతుంది. వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చూడబోతున్నాం. ప్రపంచ వాతావరణ సంస్థతో పాటు భారత వాతావరణ విభాగం చాలా కచ్చితంగా చెప్పిన విషయాలు ఇవి. మరోలా చెప్పాలంటే ఇప్పటి వరకూ చూసింది ఓ లెక్క. ఇకపైన చూడబోయేది మరో లెక్క. ఎల్‌నినో ప్రభావం ఇప్పుడే స్థాయిలో కనబడుతోందో అంతా చూస్తూనే ఉన్నాం. జూన్ పోయింది. జులై వచ్చింది. అయినా ఇప్పటి వరకూ వానల జాడే లేదు. అప్పుడప్పుడూ చిరు జల్లులు తప్ప సాధారణ వర్షపాతం మాత్రం నమోదు కావడం లేదు. ఇప్పుడే ఇలా ఉందంటే సెప్టెంబర్ నాటికి ఎల్‌నినో ప్రభావం ఇంకా గట్టిగా ఉంటుందని ఐఎండీ చెప్పిన విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది.
సెప్టెంబర్ నాటికి ఎల్‌నినో తీవ్రరూపం : సాధారణంగా పసిఫిక్ మహాసముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని ఎల్‌నినో అని పిలుస్తారు. ఈ ఏడాది మే నెలలోనే ఈ పరిస్థితులు మొదలయ్యాయి. కాకపోతే ప్రస్తుతం శాస్త్రవేత్తలు, అధ్యయనాల అంచనాల ప్రకారం, ఇప్పటి వరకు బలహీనంగా ఉన్న ఎల్‌నినో, జులై, ఆగస్టు నెలల్లో మధ్యస్థంగా మారి, సెప్టెంబర్ నాటికి తీవ్ర రూపం దాల్చనుంది. ఇది వచ్చే ఏడాది వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అంచనా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అంటే 2027 ప్రారంభం పరిస్థితులు అనుకూలించకుంటే చివరి వరకు దీని ప్రభావం కొనసాగే ప్రమాదం ఉంది. ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎమ్‌వో, భారత వాతావరణ శాఖ - ఐఎండీ నివేదికల ప్రకారం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల వరకు పెరిగాయి. ఇది భారత ఉపఖండంపై వీచే గాలుల దిశ మార్చివేసి, వర్షాలను పసిఫిక్ వైపు నెట్టివేస్తుంది. నైరుతిలో మనకు సమృద్ధిగా అందాల్సిన వానలు ఈ కారణంగానే మొహం చాటేస్తాయి. ఇప్పటికే అది జరుగుతోంది కూడా.
వర్షపాతం ఆశించినంత స్థాయిలో ఉండకపోవచ్చు : భారతదేశ వార్షిక వర్షపాతంలో దాదాపు 80% కేవలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చే నైరుతి రుతుపవనాల వల్లే లభిస్తుంది. దురదృష్టవశాత్తూ, ఎల్‌నినో ప్రభావం నేరుగా వీటిపైనే పడుతోంది. ఫలితంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం దీర్ఘకాలిక సగటు - ఎల్పీఏలో కేవలం 90 శాతమే ఉండవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం 84 శాతంగా ఉంది. ఇప్పటికే జూన్ నెలలో దేశవ్యాప్తంగా 40 శాతం వర్షపాత లోటు నమోదైంది. ముఖ్యంగా మధ్యభారతంలో ఇది 50.4 శాతంగా ఉంది. అత్యంత కీలకమైన జులై నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలే కురుస్తాయని, ఇది కేవలం 94 శాతానికే పరిమితం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈసారి రుతుపవనాల రాకే ఆలస్యమైంది. మే చివరి వారమే వస్తాయనుకున్నా జూన్ మొదటి వారం వరకూ రుతు పవనాలు కేరళను తాకలేదు. అప్పుడే భారత వాతావరణ సంస్థ కొన్ని అంచనాలు వేసింది. ఈసారి వర్షపాతం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు అని చెప్పింది. ఇప్పుడా పరిస్థితి స్పష్టంగానే కనబడుతోంది.
మాన్సూన్ సమయంలో ఎల్‌నినో ప్రభావం ఉందని ఐఎండీ గత రెండు నెలలుగా చెప్తూ వస్తుంది. ఎల్‌నినో ఎఫెక్ట్ జూన్ నుంచి మొదలయ్యింది. రోజులు గడిచిన కొద్దీ తీవ్రత నాలుగు నెలల్లో పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల వర్షపాతం తగ్గుతుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు భారీ వర్షాలు పడడం జరుగుతాయి. మాన్సూన్లో ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి - శ్రీనివాస్ రావు, వాతావరణ శాఖ అధికారి
రుతుపవనాలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక : ఇప్పుడు ఎల్‌నినో కారణంగా వర్షాలు తగ్గితే కలిగే పరిణామాలు తీవ్రంగానే ఉండబోతున్నాయి. కొన్ని ప్రధాన ఉదాహరణలు చూస్తే రుతుపవనాలు సకాలంలో వచ్చి సమృద్ధిగా వర్షాలు కురవకపోతే నదుల్లో నీటి ప్రవాహం తగ్గి, ప్రధాన జలాశయాలు నిండవు. దీనివల్ల నీటిపారుదల ప్రాజెక్టుల కింద సాగు నీరు అందదు. అంతే కాకుండా జలవిద్యుత్ ఉత్పాదనపైనా ప్రభావం పడుతుంది. మరొక ఆందోళనకరమైన విషయం ఏమిటంటే మన దేశ సాగు రంగంలో 60% రైతులు కేవలం వర్షాలపైనే ఆధారపడి ఉన్నారు. పప్పు ధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగు చేసే వీరికి ఎల్‌నినో పెద్ద శాపం. వర్షపాతం తగ్గితే ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయి, ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే రికార్డు స్థాయి ఉత్పత్తి ఉన్నప్పటికీ, భవిష్యత్తు ముప్పును ఊహించి గోధుమలు, బియ్యం, చక్కెర ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించాల్సి వచ్చింది. ఆ ప్రభావాలు ఇప్పటికే కొంత చూస్తున్నాం.
ఎల్‌నినో ఇయర్ : ఇప్పటి వరకూ ఉన్న డేటా ఆధారంగా చూస్తే ప్రతి రెండు నుంచి ఏడేళ్ల మధ్య కాలంలో ఎల్‌నినో ఏర్పడుతుంది. వచ్చిన ప్రతిసారీ 9-12 నెలల పాటు ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి వాతావరణం ఉన్న సంవత్సరాన్ని ఎల్‌నినో ఇయర్‌గా పిలుస్తారు. ఆ సమాచారం ప్రకారం చూస్తే ఎల్‌నినో సంవత్సరాల్లో దాదాపు 60% మేర సాధారణం కన్నా తక్కువ వర్షపాతమే నమోదైంది. కొన్ని చోట్ల అయితే కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ డేటా అంతా గమనించిన తరవాతే ఈ సంవత్సరం కూడా ఇంతే ఉంటుందని చెప్పింది భారత వాతావరణ విభాగం. వర్షాలు లేకపోతే ప్రాజెక్టులకే కాదు, అది మన రోజువారీ జీవితాలకీ ముప్పే. జలాశయాలు నిండక, భూగర్భ జలాలు పునరుద్ధరణ కాకపోవడంతో నగరాలు, గ్రామాల్లో తాగునీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి.
వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలు : ఎల్‌నినో అంటే కరవు మాత్రమే కాదు. ఇది వాతావరణంలో తీవ్ర అనిశ్చితిని తీసుకొస్తుంది. ఒకవైపు తీవ్రమైన హీట్‌వేవ్స్, మరోవైపు అకస్మాత్తుగా కురిసే కుంభవృష్టి వానలు పంటల్ని దెబ్బ తీస్తాయి. సముద్ర ఉష్ణతరంగాల వల్ల పగడపు దిబ్బలు నాశనమవ్వడమే కాకుండా, మత్స్య పరిశ్రమకు భారీ నష్టం కలుగుతుంది. మరి ఇప్పుడేం చేయాలి. వచ్చే విపత్తును ఆపలేం. వాతావరణానికి ఎదురెళ్లి యుద్ధం చేయలేం. కాకపోతే ఆందోళన కన్నా సంసిద్ధత ముఖ్యం. అని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎల్‌నినోను తట్టుకోవాలంటే ఈ చర్యలు తప్పనిసరి అంటున్నారు.
ముఖ్యంగా విత్తనాల్లో మార్పు. వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించాలి. నీటి సంరక్షణ చేపట్టాలి. అలానే భూసార పెంపు. నేల నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచేలా సేంద్రియ ఎరువులు, బయోచార్ వంటి పద్ధతులను పాటించాలి. అన్నింటి కంటే కీలకమైనది. నిల్వ సామర్థ్యం.
ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు పాటించాలి : ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి, తద్వారా ధరల నియంత్రణ సాధ్యమవుతుంది. లేదంటే ఎల్‌నినో కారణంగా కరవు తరిమి కొరత ఉరిమినప్పుడు బ్లాక్ మార్కెట్ రాబందుల చేతుల్లో జనాలు విలవిల్లాడే దుస్థితి రావొచ్చు. ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు ఎల్‌నినో అనేది ఒక ప్రకృతి వైపరీత్యం. దీన్ని ఆపలేం కానీ, సరైన ప్రణాళికతో దాని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. వర్షాలు తక్కువగా ఉన్నాయనో, ఆలస్యంగా వస్తున్నాయనో నిరాశ చెందకుండా, ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ, ప్రత్యామ్నాయ సాగు పద్ధతులకు మళ్లడమే ప్రస్తుతానికి మన అందరి ముందున్న మార్గం. ఇప్పటికే ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత వరకూ ప్రయత్నాలు మొదలు పెట్టాయి. విధాన పరమైన చర్యలు తీసుకున్నా రైతుల్లో అవగాహన కల్పించడం అత్యంత కీలకం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రస్తుతానికి ఇదే పనిలో ఉన్నాయి.
చల్లటి కబురు - తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
'వానలు లేవు - మళ్లీ వలసే దిక్కయ్యేలా ఉంది! - 'ఎల్‌నినో'తో చతికిలపడ్డ సాగు పనులు

