ఎలక్ట్రిక్ బస్సుల్లో మంటలు - 'ఈ-వాహనాల్లో' ప్రయాణం సురక్షితమేనా?
ఇటీవల ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో తరచూ మంటలు - బ్యాటరీలు విఫలమై చెలరేగుతున్న అగ్నికీలలు - నెలల వ్యవధిలోనే నాలుగు సంఘటనలు - సిబ్బంది కొరత, నిర్వహణ లోపాలే ప్రధాన కారణాలు

Published : July 9, 2026 at 2:26 PM IST
Electric Busses fire accidents in Telangana : పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఎలక్ట్రిక్ వాహనాలు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రజలూ ఈ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసి కూడా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసింది. అయితే ఎంతో గొప్ప లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ బస్సుల్లో ప్రయాణం సురక్షితమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల నిజామాబాద్, వరంగల్, కరీంనగర్‌లో వరుసగా 4 ఎలక్ట్రిక్ బస్సుల్లో మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆర్టీసీ సుమారు 500 బస్సు సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేసింది.
ఎలక్ట్రిక్ వాహనాలు సురక్షితం అని ధ్రువీకరణ జరిగిన తర్వాతే బస్సులను నడుపుతామని ఆర్టీసీ తెలిపింది. ఈ నిర్ణయంతో ఎలక్ట్రిక్ బస్సుల భవితవ్యంపై తీవ్ర చర్చ మొదలైంది. మరి, ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? బ్యాటరీల్లో తరచూ మంటలు ఎందుకు అంటుకుంటున్నాయి? అసలు ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణం సురక్షితమేనా ఈ పూర్తి కథనంలో తెలుసుకుందాం.
అలారం మోగలేదు : 2026 జూన్ 21న కరీంనగర్-2 డిపో నుంచి జేబీఎస్‌కు బయలుదేరిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సును నగరం దాటగానే అలుగునూరు వద్ద డ్రైవర్ నిలిపి వేశాడు. అందరూ దిగితేనే బస్సు స్టార్ట్ అవుతుందని ప్రయాణీకులందరినీ దింపేశాడు. కానీ, అసలు కారణం వేరే. సాఫీగా నడవాల్సిన ఎలక్ట్రిక్ బస్సులో ఏదో లోపం కనిపించింది. పొగలు వస్తున్నట్లుగా వాసన వచ్చింది. ఫైర్ అలారం మోగలేదు. కానీ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. ప్రయాణీకులను దింపేశాడు. చూస్తుండగానే బ్యాటరీలో మంటలు అంటుకున్నాయి. క్రమంగా విస్తరించాయి. నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది.
కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇన్నేళ్లు ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకులను ఆందోళనలకు గురిచేసింది. ఎలక్ట్రిక్ బస్సులు సురక్షితమేనా అనే అనుమానాలు కలిగేలా చేసింది. ఈ ఘటనపై ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ జేబీఎం నిపుణులు సైతం దిల్లీ నుంచి వచ్చారు. ప్రమాదం జరిగిన బస్సు, బ్యాటరీలు అన్నింటినీ పరిశీలించారు.
పార్కింగ్ చేసిన చోటే : మొదటి ప్రమాదంపై నిపుణులు ఓ అభిప్రాయానికి రాకముందే అదే కరీంనగర్-2 డిపోలో జులై 1 తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఛార్జింగ్ పూర్తి చేసుకుని, పార్కింగ్ చేసిన మరో ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ సేఫ్టి వింగ్‌తో కలిసి మంటలను ఆర్పేశారు. మొదటి ఘటనలో బస్ రన్నింగ్‌లో ఉండగా జరిగింది. రెండో ఘటన బస్సు పార్కింగ్ చేసి ఉండగా చోటుచేసుకుంది.
పది రోజుల్లోనే రెండు బస్సులు : రెండు ఘటనల్లోనూ బ్యాటరీల్లో మొదలైన పొగలు మంటలుగా మారాయి. ఈ సంఘటనల్లో బస్సులు దగ్ధమయ్యాయే కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఊహించని ప్రమాదం జరిగితే ఏంటని ఎలక్ట్రిక్ బస్సులపై పలు అనుమానాలు తలెత్తేలా చేశాయి. పది రోజుల వ్యవధిలో రెండు ఘటనలు జరగడంతో కరీంనగర్-2 డిపో పరిధిలోని 104 బస్సుల్ని నిలిపి వేశారు. పరీక్షలు జరిపి ప్రస్తుతం సురక్షితం అనుకున్న 40 వరకు బస్సులు తిరిగేందుకు అధికారులు అనుమతిచ్చారు.
షార్ట్ సర్య్కూట్ కారణంగా : ఎలక్ట్రిక్ బస్సుల్లో మంటలు అంటుకోవడం కరీంనగర్‌లోనే కాదు, గతంలో వరంగల్-2 డిపోలోనూ జరిగింది. ఇక్కడ ఓ ఎలక్ట్రిక్ బస్సులో మార్చి 29న తెల్లవారుఝామున ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఛార్జింగ్ అనంతరం పార్కింగ్‌లో ఉంచిన బస్సులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు వెనుక భాగం దగ్ధమైంది. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపుచేశారు.
నివారణపై స్పష్టత లేదు : వరంగల్ బస్సు ప్రమాదంలో బస్సులోని 4 బ్యాటరీలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఇదే జూన్ 9న మరో ప్రమాదం జరిగింది. వరుస ఘటనల నేపథ్యంలో వరంగల్ రీజినల్ మేనేజర్ పరిధిలోని 110 బస్సుల్ని నిలిపి వేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ వాటిని బయటకు తీయొద్దని అధికారులు నిర్ణయించారు. 2 ప్రమాదాలనూ జేబీఎం నిపుణులు పరిశీలించి కారణాలను విశ్లేషించారు . కానీ ఇలాంటి ఘటనల నివారణకు ఏం చేయాలన్న దానిపై నిర్ణయానికి రాలేకపోయారు.
ఛార్జింగ్ పెడుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు తరచుగా ఎలక్ట్రిక్ బస్సులు అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి. నిపుణుల బృందం వాటిని పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. వాటిని పాటిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు బస్సుల్లో మంటలు చెలరేగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బందితో ఉన్న ప్రత్యేక పరికరాలతో పొగలు వచ్చే బ్యాటరీలకు రంధ్రం చేసి, నీటితో ఆర్పుతున్నా, బ్యాటరీల్లో ఉండే రసాయనాల వల్ల మంటలు త్వరగా అదుపులోకి రావడం లేదు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన తర్వాతే చర్యలు తీసుకోగలుగుతున్నాం. ముందస్తు నివారణ కోసం సాంకేతిక నిపుణులు తగిన ఏర్పాట్లు చేయాలి - భవానీ ప్రసాద్, వరంగల్ రీజినల్ మేనేజర్
మార్గమధ్యలో మొరాయిస్తున్నాయి : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజియన్ పరిధిలోని నిజామాబాద్ డిపో-2లో 89 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. వీటిల్లో 66 ఎక్స్ ప్రెస్, 18 సూపర్ లగ్జరీలు, 5 డీలక్సులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ సరిగా లేదు. ముఖ్యంగా బ్యాటరీల్లోంచి మంటలు చెలరేగే ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ప్రమాదాల కారణంగా బాడీ సైతం దెబ్బతింటోంది. బ్యాటరీల వద్ద కనీస రక్షణ ఉండటం లేదు. మరోవైపు సెల్ఫ్ బ్యాటరీలు పనిచేయక మార్గమధ్యలో ఎక్కడ పడితే అక్కడే మొరాయిస్తున్నాయి.
వారం వరకు ఎలక్ట్రిక్ బస్సులు బంద్ : జూన్‌లో 33/11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి డిపో-2లోని 20 ఛార్జింగ్ పాయింట్లకు వచ్చే ప్రధాన కేబుల్ దగ్ధమైంది. సెప్టెంబర్‌లో డిచ్‌పల్లి మండలం ధర్మారం వద్ద ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీ నుంచి పొగ వచ్చింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును అక్కడే ఆపి ప్రయాణికులను దించేశాడు. ఈ కారణంగా అప్పట్లో వారం రోజుల పాటు ఎలక్ట్రిక్ బస్సులన్నీ ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ఆ తర్వాత సురక్షితమే అనుకున్న వాటిని పునరించారు.
బస్సు భవన్‌లో కమాండ్ కంట్రోల్ : ఎలక్ట్రిక్ బస్సుల్లో వరుసగా మంటలు చెలరేగుతున్న ఘటనల నేపథ్యంలో ప్రస్తుతం ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 10 డిపోల పరిధిలో జేబీఎం సంస్థ నడిపే సుమారు 500 సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. తనిఖీలు చేసి సురక్షితం అనుకున్న వాటిని ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తోంది. ప్రయాణీకుల భద్రత రీత్యా హైదరాబాద్ బస్ భవన్‌లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. బస్సు రోడ్ల మీదకు రావడానికి ముందే వాహనం నడపడానికి సిద్ధమా లేదా అన్నది సర్టిఫై చేయాలని సూచించింది. ప్రమాదాల విశ్లేషణ నివేదిక, శాశ్వత నివారణ చర్యలు, బ్యాటరీ ఫిట్‌నెస్ సర్టిఫికేషన్, హైదరాబాద్ బస్సు భవన్‌లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు , భద్రతకు సంబంధించిన నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించింది.
కరీంనగర్‌లో రెండు బస్సులు కాలిపోయాయి. జేబీఎం సంస్థ వారు వచ్చి అన్ని ఎలక్ట్రిక్ బస్సులను తనిఖీ చేశారు. వారి సూచించిన బస్సులను నడిపిస్తున్నాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏయే బస్సు సర్వీసులు రద్దయ్యాయ్యో వాటి స్థానంలో మా బస్సులను ఏర్పాటు చేశాం - జ్యోతి, నిజామాబాద్ డిప్యూటీ రీజనల్ మేనేజర్
జేబీఎం సమర్పించే నివేదికలను ఆర్టీసీ ఉన్నతాధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. జేబీఎం టెక్నికల్ బృందం బస్సులు నడిపేందుకు పూర్తి ఫిట్ గా ఉన్నాయని ధ్రువీకరించిన తర్వాతే మొత్తం అన్ని బస్సుల పునరుద్ధరణ పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం, సంస్థ నిర్దేశించిన అన్ని షరతులను జేబీఎమ్ యాజమాన్యం పూర్తిగా పాటించినట్లు సంతృప్తి చెందితేనే తిరిగి మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డు మీదకు రానున్నాయి
ప్రత్యేక సిబ్బంది అవసరం : ఎలక్ట్రిక్ బస్సులను నిలిపివేయాలన్న ఆర్టీసీ నిర్ణయం తర్వాత ఆ వాహనాల్లో ఏం జరుగుతోందనే చర్చ నడుస్తోంది. సంప్రదాయ డీజిల్ వాహనాల నిర్వహణతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది. ఈ బస్సుల నిర్వహణ, బ్యాటరీల నిర్వహణ అందరికీ కొత్తే. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు, సిబ్బంది అవసరం. అలాంటి సిబ్బంది కొరత, నిర్వహణ లోపాల కారణంగానే అగ్ని ప్రమాదాలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది.
అన్నీ అనుకూలంగా ఉంటేనే : సాధారణ ఆర్టీసీ బస్సులను రోడ్డు మీదకు తెచ్చే ముందు పూర్తిగా చెక్ చేస్తారు. ఫిట్‌గా ఉందని ధ్రువీకరిస్తేనే బయటకు పంపుతారు. ఘాట్ రోడ్‌లు, సుదూర మార్గాలు, మట్టి రోడ్‌లు ప్రయాణించే మార్గాలను బట్టి ఆ బస్సును నడపవచ్చా లేదా అని నిర్ణయిస్తారు. ఇలాంటి చెకింగ్‌లు ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత అవసరం. ముఖ్యంగా వైరింగ్, బ్యాటరీ అసెంబ్లింగ్, ఛార్జింగ్ విభాగాల్లో క్రమం తప్పని తనిఖీలు ఎలక్ట్రిక్ వాహనాలకూ జరుగుతాయి. కానీ సున్నిత, క్లిష్టమైన సాంకేతికత ఇమిడి ఉన్న కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
నిమిషాల వ్యవధిలోనే దగ్ధం : ఎలక్ట్రిక్ బస్సుల్లోని బ్యాటరీ తయారీ, అసెంబ్లింగ్, వాటి నిర్వహణలో తప్పిదాలే ప్రమాదాలకు కారణమవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతిక లోపాలపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని ఇటీవలి సంఘటలు గుర్తు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై డ్రైవర్లకు కూడా ప్రత్యేక శిక్షణ అవసరం. కొత్త సాంకేతిక పరిజ్ఞానం కావడంతో బ్యాటరీలు, వైరింగ్, సహా ఇతర వ్యవస్థల్లో చిన్నచిన్న లోపాలను డ్రైవర్లు గుర్తించలేకపోతున్నారు. ఈ బస్సుల్లో అగ్నిప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నందు వల్లే ప్రతి ఎలక్ట్రిక్ బస్సులో ఫైర్ సేఫ్టీ అలారం వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. అది డ్రైవర్లను ముందుగానే అలెర్ట్ చేస్తుంది. బస్సును ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది. ఇలాంటి ఏర్పాట్లు కాస్త సురక్షితమే అయినా పొగలు వచ్చిన నిమిషాల్లోపే బస్సులు పూర్తిగా దగ్ధమైపోతున్నాయి. అదే ప్రమాదకరంగా మారుతోంది.
తనిఖీలు అవసరం : ఇటీవల కాలంలో సాధారణ ఆర్టీసీ బస్సుల్లోనూ మంటలు చెలరేగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయితే సాధారణ బస్సులతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలు మరింత ప్రమాదకరం. అందువల్ల ప్రయాణికుల ప్రాణాలతో ముడిపడిన ఈ అంశంపై ఆర్టీసీ యాజమాన్యం మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదాలు గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం సురక్షితం అనుకున్న కొన్ని ఎలక్ట్రిక్ బస్సులను అనుమతిస్తున్నా, మిగతా బస్సుల విషయంలోనూ అవే చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులోనూ ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి.
పెట్రోల్‌లో ఇథనాల్ - డీజిల్‌లో ఐసోబ్యుటనాల్ : అసలెందుకు ఈ నూతన పద్ధతులు?
చిన్న సమస్యేనని వదిలేస్తున్నారు - లిఫ్ట్ ప్రమాదాలకు అదే మూల కారమణవుతోంది!

