ETV Bharat / opinion

ప్రభుత్వ పాఠశాలలకు పెరిగిన క్రేజ్ - నెల్లూరులో 'నో అడ్మిషన్' బోర్డులు

సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ స్కూళ్లకు కొత్తరూపు - ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు సంస్థల చేయూత - నెల్లూరులో 15 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి - ప్రత్యేక చొరవ తీసుకుంటున్న మంత్రి నారాయణ

Development of 15 Government Schools
Development of 15 Government Schools (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 14, 2026 at 7:11 PM IST

|

Updated : July 14, 2026 at 7:19 PM IST

5 Min Read
Choose ETV Bharat

Development of 15 Government Schools : ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నాయి. దీనికి కార్పొరేట్‌ సంస్థలు కూడా చేయూత అందిస్తున్నాయి. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR) కింద పాఠశాలల అభివృద్ధికి ముందుకొస్తున్నాయి.

మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పలు సంస్థలు ప్రభుత్వ స్కూళ్లకు నిధులు కేటాయిస్తున్నాయి. ఫలితంగా నెల్లూరులోని ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలు కాదని ప్రభుత్వ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నో అడ్మిషన్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలకు పెరిగిన క్రేజ్ - నెల్లూరులో "నో అడ్మిషన్" బోర్డులు (ETV Bharat)

సీఎస్ఆర్ నిధులతో స్కూళ్లకు కొత్తరూపు: పేద, మధ్య తరగతి, రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థుల భవితను తీర్చిదిద్దేది ప్రభుత్వ పాఠశాలలే. అలాంటి స్కూళ్లను అభివృద్ధి చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. సీఎస్‌ఆర్ నిధులతో స్కూల్ భవనాల నిర్మాణం, క్రీడా మైదానాలు, ల్యాబ్‌లు, లైబ్రరీలు వంటి ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి నారాయణ సైతం ప్రత్యేక చొరవ చూపించడంతో నెల్లూరులో సీఎస్ఆర్ నిధులతో 15 ప్రభుత్వ పాఠశాలలను సకల సౌకర్యాలు, అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఫలితంగా ఆయా ప్రభుత్వ స్కూళ్లలో చదివేందుకు విద్యార్థులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు.

మంత్రి నారాయణ ప్రత్యేక చొరవ: CSR నిధులతో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో ముందుగా మాట్లాడుకోవాల్సింది వీఆర్‌ హైస్కూల్ గురించి. 1875లో నెల్లూరు నగరం నడిబొడ్డున 12 ఎకరాల్లో ఏర్పాటైన ఈ పాఠశాలకు జిల్లాతో పాటు ఇతర జిల్లాల విద్యార్థులు కూడా వచ్చి చదువుకుంటున్నారు. అలాంటి పాఠశాల ఒకానొక సందర్భంలో నిరాదరణకు గురైంది. పాఠశాలను అధికారులు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

ఈ క్రమంలో గతంలో ఇక్కడే చదువుకున్న రాష్ట్ర పురపాలక శాఖామంత్రి ఉన్న నారాయణ చొరవ తీసుకుని పాఠశాలకు 20 కోట్ల రూపాయలతో అత్యాధునిక మౌలిక వసతులు కల్పించారు. వెయ్యి మందికి పైగా నిరుపేద విద్యార్థులను చేర్చుకునేలా వసతులు కల్పించారు.

అంతర్జాతీయ విద్యా విధానాలతో కూడిన ఉచిత విద్య, బస్సు సౌకర్యం, సైకిళ్లు, భోజనం, స్నాక్స్, ఉచిత పుస్తకాలు, దుస్తులు వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో ఈ పాఠశాలలో అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన తొలిరోజు కొన్ని వందల మంది తమ పిల్లలను చేర్చుకోవాలంటూ ఇక్కడికి రావడం విశేషం.

ఈ స్కూల్ తరహాలోనే సకల సౌకర్యాలు: నెల్లూరులో మొత్తం 15 ప్రభుత్వ పాఠశాలల్లో 2 వందల కోట్ల 77 లక్షల రూపాయలతో అధునాతన భవనాల నిర్మాణంతో పాటు సకల సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వ బడుల్ని ఆధునికీకరిస్తున్నారు. వీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ను ఆదర్శంగా తీసుకుని పలువురు దాతలు ముందుకొచ్చారు. ఈ స్కూల్ తరహాలోనే మిగతా వాటిల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అదనపు తరగతి గదులు, ప్రహరీ, మోడ్రన్‌ ప్లేగ్రౌండ్, సోలార్‌ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు.

అలాగే, ఆట వస్తువులు, బల్లలు, తరగతి గదుల్లో డిజిటల్‌ బోర్డులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టాయిలెట్లతో పాటు మధ్యాహ్న భోజనానికి డైనింగ్‌ టేబుల్స్‌తో కూడిన గదులు. ఇలా కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ 15 పాఠశాలల్లో సుమారు 15 వేల మంది పేద విద్యార్థులు ప్రవేశం పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏయే సంస్థ ఎన్ని నిధులు కేటాయించిందంటే?
CSR నిధుల కింద ఆభివృద్ధి చేస్తున్న పాఠశాలలు ఏంటి వాటికి ఏయే సంస్థ ఎన్ని నిధులు కేటాయిస్తోంది అనే వివరాలు ఒకసారి చూద్దాం. సంతపేట గుంటబడికి ఎన్​సీసీ సంస్థ 6 కోట్ల 30 లక్షల రూపాయల నిధులు కేటాయించింది. అలాగే, పీఎన్​ఎం పాఠశాల అభివృద్ధికి 5 కోట్ల 43 లక్షలు ఇచ్చారు.

మరో పీఎన్​ఎం ఉన్నత పాఠశాలను 6 కోట్ల 63 లక్షలతో తీర్చిదిద్దనున్నారు. ఆర్​ఎన్ పేటలోని పీఎంఆర్ స్కూల్‌కి ప్రియ ఇంజినీరింగ్ ప్రాజెక్టు వారు 8 కోట్ల 86 లక్షలు కేటాయించారు. ZH నగర్‌లోని పాఠశాలను ఆంథోని గ్రూపు 13కోట్లు 8లక్షల రూపాయలతో అభివృద్ధి చేయనుంది. కర్నాలమిట్ట ఎంసీహెచ్​ఎస్​ పాఠశాలను 10కోట్ల 34లక్షలతో తీర్చిదిద్దనున్నారు.

సీబీ నగర్ ప్రత్తివారి హైస్కూల్‌ను రెడ్డిల్యాబ్స్ వారు 7కోట్ల 98లక్షలతో అభివృద్ధి చేయనున్నారు. స్టోన్ హౌస్ పేట వైవీ MC హైస్కూల్‌ను ఎంపీ బీదా మస్తాన్ రావు 2కోట్ల 14లక్షలతో తీర్చిదిద్దనున్నారు. నవాబ్ పేట బీవీఎస్​ ఉన్నత పాఠశాలలో సౌరాష్ట్ర గ్రూపు వారు 7కోట్ల 26లక్షలతో ఆధునిక సదుపాయాలు కల్పించనున్నారు.

AC నగర్ MS ప్రభుత్వ పాఠశాలకు జిగ్మా గ్రూపువారు 9కోట్ల 69లక్షల నిధులు ఇచ్చారు. ఆర్​ఎస్​ఆర్​ పాఠశాలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 15కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక మూలపేట జీజీహెచ్​ ఉన్నత పాఠశాలకు డీఎస్​ఆర్ సంస్థ 25 కోట్ల రూపాయలు కేటాయించింది. వీ పురం టిడ్కో హౌసెస్ వద్ద ఉన్న పాఠశాలకు ఎన్​సీసీ సంస్థ 20కోట్ల నిధులు మంజూరు చేసింది. పొదలకూరు రోడ్డులోని మరో ప్రభుత్వ పాఠశాలను AMR గ్రూపు 25కోట్లతో అభివృద్ధి చేయనుంది. అలాగే, ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్‌ను రిత్విక్ ఇన్‌ఫ్రా కంపెనీ 25కోట్లుతో తీర్చిదిద్దనుంది.

మంత్రి పిలుపుతోనే సామాజిక బాధ్యత: మంత్రి నారాయణ పిలుపుతోనే సామాజిక బాధ్యత కింద రెడ్డి ల్యాబ్స్, టీవీఎస్, జిగ్మా, ఏఎమ్‌ఆర్‌ సహా అనేక ప్రైవేటు సంస్థలు, దాతలు ప్రభుత్వ పాఠశాలలను విడతల వారీగా అభివృద్ధి చేయనున్నారు. అలాగే సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులోనూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 2 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు.

ఇలా ప్రైవేటు సంస్థల సహకారంలో నెల్లూరులోని ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. ఇప్పటికే డీఎస్‌ఆర్, ఆర్‌ఎస్‌ఆర్, బీవీఎస్, పీఎంఆర్, ఏపీజేఅబ్దుల్‌కలాం పాఠశాలల భవనాల నిర్మాణ పనులు 90% వరకు పూర్తయ్యాయి. మిగతా పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పనులను వచ్చే ఏడాదికి పూర్తి చేసి బడులను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

ఏటా పెరుగుతోన్న అడ్మిషన్ల సంఖ్య: ప్రభుత్వ పాఠశాలను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్ది సరైన విద్యను అందిస్తే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు అందిస్తారు. అందుకు నెల్లూరులోని బీబీనగర్‌లోని KNR ఉన్నత పాఠశాలే ఉదాహరణ. 2010నుంచి ఈ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూనే ఉన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థుల్లో 167 మంది ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు సంపాదించారు.

2022, 23, 24 విద్యాసంవత్సరంలో స్టేట్ ర్యాంకర్లుగా నిలిచారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తుండటంతో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌-NMMSకి 120మంది ఎంపిక అయ్యారు. పాఠశాలలో సుమారు 2 వేల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ అడ్మిషన్లు పొందడానికి వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిధులు మంజూరు చేసి కొత్తభవనాలు నిర్మిస్తున్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా: మొత్తంగా సామాజిక బాధ్యతగా కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు ముందుకు రావడం పేద, మధ్య తరగతి విద్యార్థులకు వరంగా మారింది. CSR నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. విద్యతో పాటు ల్యాబ్స్‌ నుంచి లైబ్రరీ వరకు, క్రీడా మైదానాల నుంచి కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ వరకు అన్నింటినీ ఈ పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు.

దీంతో ఏటా ప్రభుత్వ స్కూళ్లలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నో అడ్మిషన్ బోర్టులు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ తరహాలోనే ప్రభుత్వ బడుల ఆధునికీకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో కొత్త అధ్యాయం - "ఏఐ" ద్వారా పాఠాలు

రూపు మారిన ప్రభుత్వ పాఠశాలలు - దర్శనమిస్తున్న 'అడ్మిషన్స్​ ఫుల్​' బోర్డులు

Last Updated : July 14, 2026 at 7:19 PM IST