గంజాయి సాగును వదిలి కాఫీ తోటల పెంపకం - సాగులో అరకుతో పోటీ
కాఫీ సాగులో అరకుతో పోటీపడుతున్న పార్వతీపురం మన్యం జిల్లా గ్రామాలు - కాఫీ సాగులోకి జిల్లాలోని పలు ప్రాంతాలు - జిల్లాలో కాఫీ సాగుకు అనుకూల వాతావరణం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 24, 2026 at 12:21 PM IST
|Updated : February 24, 2026 at 6:46 PM IST
Coffee Cultivation in Parvathipuram Manyam District : అరకు కాఫీ ఘుమఘుమలకు పెట్టింది పేరు. దేశ ప్రధానమంత్రి మోదీ సైతం అరకు కాఫీపై ప్రశంసలు కురిపించారంటే, దీనికున్న ప్రాధాన్యం అర్ధం చేసుకోవచ్చు. అటువంటి కాఫీ తోటలకు దీటుగా పార్వతీపురం మన్యం జిల్లాలోనూ ఇటీవల కాఫీ తోటల సాగు పెరుగుతోంది. పాచిపెంట మండలం శతాభి, చిల్లమామిడి, తంగ్లాం, గరిసిగుడ్డ తదితర గిరిశిఖర గ్రామాల్లో కాఫీ సాగు విస్తారంగా సాగుతోంది. ఈ తోటల నుంచి వెలువడే సువాసనలను ఆ మార్గంలో ప్రయాణించే వారు ఆస్వాదిస్తున్నారు. మన్యంలో పెరుగుతున్న కాఫీ సాగు విస్తీర్ణం, ఉత్పత్తుల విక్రయాలు తదితర అంశాలు వివరంగా తెలుసుకుందాం.
రాష్ట్రంలో కాఫీ సాగు విస్తరిస్తోంది. కొత్త ప్రాంతాలు సాగు పరిధిలోకి వస్తున్నాయి. అరకు తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనులు ఈ వృత్తిలోకి అడుగు పెట్టారు. జిల్లాలోని పాచిపెంట మండలం శతాభి, తంగ్లాం గిరిశిఖర గ్రామాలు, అల్లూరి జిల్లా అరకు సరిహద్దుల వరకు విస్తరించాయి. ఈ గ్రామాల్లో నివసించే గిరిజనుల్లో కొంతమంది గతంలో గంజాయి సాగు చేసేవారు.
గంజాయి సాగును వదిలి కాఫీ తోటల పెంపకం: 1997లో అప్పటి పార్వతీపురం ఐటీడీఏ పీవో దమయంతి చొరవతో చాలా వరకూ మార్పు వచ్చింది. క్రమంగా గంజాయి సాగు తగ్గిపోయింది. కాఫీ తోటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఈ క్రమంలో 1998లో కాఫీ తోటల పెంపకం ప్రారంభించారు. కాఫీ గింజలను అప్పట్లో ప్రభుత్వమే కొనుగోలు చేసేది. దీంతో ఈ ప్రాంతం వారు క్రమంగా గంజాయి సాగుకు దూరమయ్యారు. ప్రస్తుతం శతాబి, తంగ్లాం గ్రామాల్లో 50 మంది రైతులు కాఫీ తోటలు పెంచుతున్నారు.
సాధారణంగా కాఫీ సాగుకు చల్లని వాతావరణం అవసరం. పాచిపెంట మండలంలోని శతాబి నుంచి తంగ్లాం వరకు కాఫీ తోటలు సాగయ్యే భూములు సముద్ర మట్టానికి ఎత్తులో ఉండటం అనుకూల అంశంగా మారింది. ఇదే సమయంలో కాఫీ గింజల ధర కూడా కలిసొచ్చేదిగానే ఉంది. కిలో కాఫీ గింజల ధర రూ.400 వరకు ఉంది. ఎకరా విస్తీర్ణంలో కాఫీ తోటల సాగులో లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. సాగుకు ఖర్చయ్యేది వేలల్లోనే ఉంటోంది.
ఫలితంగా ఈ సాగు రైతులకు ఆదాయాన్ని ఇచ్చేదిగా మారింది. కాఫీ తోటలు వేసిన మూడేళ్లకు గింజల దిగుబడి ప్రారంభమవుతుంది. నాలుగవ ఏడాది నుంచి పూర్తిస్థాయిలో దిగుబడులు వస్తాయి. అదే సమయంలో ఎకరా తోటలో దిగుబడి బాగుంటే, 220 నుంచి 250 కిలోల వరకు పంట వచ్చే అవకాశం ఉంది.
కాఫీ సాగు క్రమంగా పెరుగుతూ: మన్యం ప్రాంతంలో గతంతో పోలిస్తే కాఫీ సాగు క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1998లో 30 ఎకరాల్లో ప్రారంభమైన ఈ పంట సాగు, నేడు సుమారు 100 ఎకరాలకు విస్తరించింది. కాఫీపై ఆదాయంతో పాటు, డిమాండ్ అధికంగా ఉండటంతో ఇక్కడి రైతులు తోటల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా కాఫీ సాగు విస్తీర్ణం మరింత పెరిగేలా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో మన్యం జిల్లాకు గతంలో కలెక్టర్‌గా పని చేసిన శ్యాంప్రసాద్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనిపై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు శాస్త్రవేత్తలు, అధికారుల బృందం ఈ ప్రాంతంలో కాఫీ సాగును పరిశీలించారు. సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులను ప్రోత్సహించేలా పలు సూచనలు అందించారు.
లాభాలు బాగున్నా రైతులకు మార్కెటింగ్ కష్టాలు: మన్యం ప్రాంతంలో కాఫీ సాగు పెరుగుతున్నా రైతులను కొన్ని సమస్యలు వేధిస్తున్నాయి. అప్పట్లో టీడీపీ అందచేసిన ఆర్థిక సాయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపివేసింది. అది ఇప్పటికీ అందడం లేదు. మార్కెటింగ్ సమస్యలు కూడా ఉన్నాయి. కాఫీ గింజల కొనుగోలు కేంద్రాలు మన్యంలో కానరావటం లేదు. దీంతో రైతులు అరకు, పాడేరు, గుమ్మికోట ప్రాంతాలకు వెళ్లి, తమ పంటను విక్రయిస్తున్నారు. ఇది వారికి అదనపు భారంగా మారింది.
ఈ నేపథ్యంలో మంచి డిమాండ్ ఉన్న కాఫీ గింజలను మన్యం జిల్లా ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేపట్టాలని ఈ ప్రాంత గిరిజన రైతులు కోరుతున్నారు. అలా చేస్తే, తమకు మరింత కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీసీసీ ద్వారా పంటను కొనుగోలు చేసి మరింత ఎక్కువ గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.
ఏవోబి ప్రాంతంలో సాలూరు మండలంలో కొఠియా గ్రూప్ ఒడిశా గ్రామాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం, కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం కొఠియాలోని ఆంధ్ర ప్రాంతంలో కానీ, పాచిపెంట మండలం గిరిశిఖర గ్రామాలలో కానీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఈ సాగును మరింత ప్రోత్సహిస్తే, మన్యానికి ప్రత్యేక గుర్తింపుతో పాటు, గిరిజన రైతులకు ఉపాధి కూడా లభిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని గిరిజన సంఘాల నేతలు కోరుతున్నారు.

