ETV Bharat / opinion

పారిశ్రామికవేత్తగా మారిన రైతు - మేడిన్ ఏపీ చాక్లెట్స్‌

పారిశ్రామికవేత్తగా ఎదిగిన కోకో రైతు - సొంతంగా చాక్లెట్ తయారీ యూనిట్‌ - తన పొలంలో వేసిన కోకో పంటతోనే - చాక్లెట్స్‌ తయారు చేస్తున్న శ్రీనివాసరావు

Cocoa Farmers Principles In Crop Management
Cocoa Farmers Principles In Crop Management (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 20, 2026 at 2:07 PM IST

5 Min Read
Choose ETV Bharat

Cocoa Farmers Principles In Crop Management : పండించిన పంట ముడిసరుకుగా అమ్మితే ఒక ధర ఉంటుంది. అదే విలువ జోడించి విక్రయిస్తే అదనపు ఆదాయం వస్తుంది. ఈ సూత్రాన్నే పాటించారు ఓ కోకో రైతు. తన పొలంలో పండిన పంటకు విలువ జోడించి విక్రయాలు మొదలు పెట్టారు. దీనికి ప్రభుత్వ సహకారం కూడా తోడైంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం, అందించిన ప్రోత్సాహకాలు, రాయితీలతో వ్యాపారం మరింత ఊపందుకుంది. దీంతో సాధారణ రైతు స్థాయి నుంచి కోకో పారిశ్రామికవేత్తగా ఎదిగారు.

అంతర్జాతీయ బ్రాండ్లకు దీటుగా కోకో ఉత్పత్తులు తయారు చేసి మంచి లాభాలు పొందుతున్నారు. అంతేకాదు, సర్కారు సహకారంతో మేడిన్ ఏపీ పేరుతో కోకో ఉత్పత్తులు దేశ విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్దం అవుతున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొండపాటి శ్రీనివాసరావు. మరి, ఆయన అనుసరిస్తున్న వ్యాపార పద్దతులు ఏంటి? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతోంది?

పారిశ్రామిక వేత్తగ మారిన రైతు (ETV Bharat)

20 ఎకరాల్లో కోకో పంట : కొండపాటి శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా చాగళ్లు మండలం కలవపల్లి గ్రామానికి చెందిన సాధారణ రైతు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో స్థిరపడ్డ శ్రీనివాసరావు తనకున్న 20 ఎకరాల్లో కోకో పండిస్తున్నారు. మొదట కోకో గింజలను పలు సంస్థలకు సరఫరా చేసేవారు. నాణ్యమైన సరకు పండించినా కొనుగోలుదారులు ఇచ్చే ధర గిట్టుబాటు అయ్యేది కాదు.

ఏజెంట్ల వల్ల ఆశించిన స్థాయిలో ఆదాయం ఉండేది కాదు. పంటను తక్కువ ధరకే చాక్లెట్ తయారీ సంస్థలకు అమ్మడం, ధర కోసం వారిని బ్రతిమలాడుకోవడం జరిగేది. కోకో రైతులందరిదీ ఇదే పరిస్ధితి. ఇది ఏమాత్రం నచ్చలేదు శ్రీనివాసరావుకి. ముడిసరకుగా అమ్మడంతోపాటు ఏజెంట్ల ద్వారా నష్టపోకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ఎలా అని ఆలోచించారు. అందులో భాగంగానే సొంతంగా చాక్లెట్‌ పరిశ్రమను ఏర్పాటు చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని గ్రహించారు.

పండించిన పంటను ఉత్పత్తిగా మార్చేందుకు ఇంట్లో చిన్నపాటి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేశారు శ్రీనివాస రావు. లాభాలు రావడంతో యూనిట్ ప్రారంభించాలని భావించారు. అదే సమయంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీ-2024 గురించి తెలుసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం దరఖాస్తు చేశారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2024 లో రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ఇండస్ట్రియల్ పార్కులో యూనిట్ ప్రారంభించారు.

"ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ పరిశుభ్రత ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తారు. చాక్లెట్ తయారీ ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉండదు. ఇంటికి దగ్గరగా ఉండటమే కాకుండా, జీతాలు కూడా సకాలంలో చెల్లిస్తారు" -కార్మికులు

ప్రభుత్వ అధికారుల నిర్దేశం : శుచి, శుభ్రత, నాణ్యత, అందుబాటు ధరల్లో ఉత్పత్తులు తయారు చేస్తే వినియోగదారులను ఆకట్టుకోవచ్చని గ్రహించారు శ్రీనివాసరావు. దానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన శిక్షణ పూర్తి చేశారు. తన పొలంలో సేంద్రీయ విధానంలో పండిన కోకో గింజలను శుద్ధి చేసి, ఆధునిక సాంకేతికతతో వివిధ రకాల చాక్లెట్లు తయారు చేస్తున్నారు. అందుకోసం ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, చుట్టుపక్కల రైతుల నుంచి సేంద్రీయ పద్ధతుల్లో పండించిన కోకో పంటను గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. వారికి కూడా లాభాలు వచ్చేలా చేస్తున్నారు.

చాక్లెట్‌ పరిశ్రమ నిర్వహణలో భాగంగా రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి పలు రాయితీలు, పోత్సాహకాలు అందుకుంటున్నారు శ్రీనివాస రావు . మార్కెట్‌లో ఉత్పత్తులు విక్రయించేందుకు నూతన పద్ధతులు అనుసరిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల మార్గనిర్దేశనం, సహకారంతో పాటు యాంత్రీకరణ పద్ధతుల గురించి తెలుసుకోవడం వల్ల నాణ్యమైన చాక్లెటు తయారు చేయడం సులభతరం అయిందని చెబుతున్నారు. మిగతా రైతులు కూడా ఈ తరహాలోనే విలువ ఆధారిత ఉత్పత్తుల వైపు అడుగులు వేయాలని సూచిస్తున్నారు.

శ్రీనివాసరావు ఆధునిక పద్ధతులు అనుసరించడంతో చిన్నస్థాయిలో ప్రారంభమైన చాక్లెట్ తయారీ యూనిట్ ప్రస్తుతం పరిశ్రమగా ఎదిగింది. రైతుల నుంచి నేరుగా సేకరించిన కోకో గింజలతో రుచి, నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ చాక్లెట్లు తయారు చేయడంతో వినియోగదారుల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం పరిశ్రమలో 55 రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. వాటిని స్థానిక మార్కెట్లతో పాటు ఇతర జిల్లాలకు విక్రయిస్తున్నారు. అలాగే, కేరళ, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అంతేకాదు, ప్రభుత్వ సహకారంతో యూకే, అమెరికాల్లో అమ్మకాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి దరఖాస్తు కూడా చేసుకున్నారు. శ్రీనివాసరావు ప్రారంభించిన చాక్లెట్ తయారీ పరిశ్రమ ద్వారా స్థానికంగా ఉన్న కోకో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. దాంతోపాటు పరిశ్రమ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇక్కడ రోజుకు 20 మంది కార్మికులు పని చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ప్రోత్సాహంతో యూనిట్​ : దేశంలో అత్యధికంగా కోకో సాగు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి , తూర్పు గోదావరి , డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కోకో సాగు ఎక్కువగా జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులను చాక్లెట్ తయారీ పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఏపీ ఆహారశుద్ధి సొసైటీ ద్వారా రైతులకు చాక్లెట్ల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ . పథకం ద్వారా గతేడాది 17 యూనిట్లకు 1 కోటి 13 లక్షల రూపాయలు రాయితీ ఇచ్చింది.

2026-27లో 18 యూనిట్లకు 1 కోటి 70 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. PMFME కింద ప్రాజెక్టు వ్యయంలో 35% గరిష్టంగా 10 లక్షల వరకు రాయితీ ఇస్తున్నారు. హోం మేడ్ చాక్లెట్లు తయారు చేసే మహిళలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు. వాటికి విలువ జోడించి మార్కెట్‌కు తీసుకెళ్తే ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారీ కోకో రైతు. ప్రభుత్వం అందించే పథకాలను అందిపుచ్చుకుని వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఐతే, జిల్లాలో దగ్గర డార్క్ చాక్లెట్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కోకో కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

రైతుల జీవితాల్లో ఆశాకిరణం 'హంద్రీనీవా సుజల స్రవంతి' - కరవు నేలపై పచ్చదనం

రీల్స్ చూసి ఆ పంటల సాగు లాభమనుకుంటే భ్రమే! క్షేత్రస్థాయిలో అన్నదాతలకు అవాంతరాలెన్నో