ETV Bharat / opinion

ఒకప్పుడు లాభాలు కురిపించిన శనగ - ఇప్పుడు ధర లేక రైతులకు ఇక్కట్లు

ఏడాదికి దాదాపు 4 లక్షల టన్నుల శనగ ఉత్పత్తి - అనంతపురం, ప్రకాశం, వైఎస్‌ఆర్ కడప, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా శనగ సాగు

Chickpeas Farmers Are In Trouble As Import Duty Is Reduced
Chickpeas Farmers Are In Trouble As Import Duty Is Reduced (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 18, 2026 at 6:50 PM IST

6 Min Read
Choose ETV Bharat

Chickpeas Farmers Are In Trouble As Import Duty Is Reduced: అమ్ముదామంటే మార్కెట్ లేదు. పోనీ అలా వదిలేద్దాం అంటే నిండా మునగక తప్పదు. ఇలా ఉంది శనగ రైతుల దుస్థితి. రాష్ట్రంలోని సాగు ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఇదే సమస్య. ఉమ్మడి ప్రకాశం జిల్లా అందుకు ఓ ఉదాహరణ. అవసరానికి మించి పంట సాగైంది. ఆ దిగుబడినంతా ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. నిల్వ ఉంచేందుకు గోదాముల్లోనూ ఖాళీ లేకుండా కుప్పలు తెప్పలుగా శనగలు పేరుకుపోయాయి.

వేల రూపాయల పెట్టుబడులు పెడితే దక్కింది ఏమీ లేదు. అక్కడక్కడా కొనుగోళ్లు సాగినా అనుకున్న ధర రావడం లేదు. రైతన్నలు దాదాపు రెండు మూడేళ్లుగా ఇవే ఇక్కట్లతో కాలం గడుపుతున్నారు. సరైన సహకారం అందక, సాగు చేసిన పంటను ఏం చేయాలో అర్థంకాక సతమతం అవుతున్నారు. మరి ఎందుకీ పరిస్థితి వచ్చింది? ఒకప్పుడు లాభాలు కురిపించిన శనగసాగు ఇప్పుడు ఎందుకిలా అయిందో తెలుసుకుందాం.

దిగుమతి సుంకం తగ్గడంతో శనగ రైతులకు శాపం (ETV Bharat)

లాభాలు వస్తాయని గంపెడాశలు: లాభాలు వస్తాయని గంపెడాశలు పెట్టుకున్నారు. ఎప్పుడూ లేనంతగా సాగు చేశారు. వాళ్ల ఆశలు అన్నీ అడియాసలయ్యాయి. వాతావరణం అనుకూలించక కొంత, గిరాకీ లేక మరికొంత నష్టాల పాలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో శనగ రైతుల దుస్థితి ఇది. నిజానికి పప్పు ధాన్యాల్లో అతి ముఖ్యమైన పంట శనగ. ఏపీతో పాటు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో విస్తారంగా సాగు చేస్తారు. మిగతా పంటలతో పోల్చి చూస్తే ఈ సాగు కాస్త సులభమైందని రైతులు భావిస్తారు.

అందుకే పెద్ద ఎత్తున సాగు చేస్తుంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో శనగకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అక్కడి రైతులు అవసరాలకు తగ్గట్టుగానే ఉత్పత్తి చేస్తుంటారు. ఏపీ విషయానికి వస్తే కర్నూలు, అనంతపురం, ప్రకాశం, వైఎస్‌ఆర్ కడప, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా శనగ సాగవుతోంది. ఇది వర్షాధారిత పంట. రాష్ట్రవ్యాప్తంగా శనగ పంట ఉత్పత్తి అధికంగానే ఉంటుంది. ఈ స్థాయిలో ఉత్పత్తి ఉన్నప్పుడు డిమాండ్ కూడా అదే విధంగా ఉండాలి. కానీ ఈ రెండింటికీ పొంతన కుదరక పోవడం వల్ల రైతులకు నష్టం తప్పడం లేదు.

2.8 లక్షల హెక్టార్లలో శనగ సాగు: రైతులు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.8 లక్షల హెక్టార్లలో శనగ సాగు చేస్తూ ఏడాదికి దాదాపు 4 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏటా 115 నుంచి 121 లక్షల టన్నుల మేర ఉత్పత్తి అవుతుందని అంచనా. నిజానికి ఈ స్థాయిలో సాగు అయితే దేశీయ అవసరాలకు సరిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కానీ అంతకు మించినప్పుడే సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. దేశీయ అవసరాలతో పోల్చి చూసినప్పుడు నిల్వలు అధికంగా ఉన్నాయి. క్రమంగా శనగ నిల్వలు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం విదేశాల నుంచి ఎక్కువ మొత్తంలో దిగుమతులు అవ్వడం. ఇప్పటికే నిల్వలు అధికంగా ఉండడం, దిగుమతులూ పెరగడం వల్ల మొత్తంగా శనగ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్‌లో తేమ, ఉష్ణోగ్రతల పేరుతో ఇప్పటికే సరైన ధర లభించక ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఈ సమస్య కూడా తోడైంది.

ఎకరా కౌలుకు 30వేల రూపాయల ఖర్చు: సులువైన పంట అని అంతా ఈ సాగువైపే మళ్లారు. ఇప్పుడు చూస్తే ఖర్చులు కొండలా పెరిగిపోతున్నాయి. ఎకరా కౌలుకు 30వేల రూపాయల ఖర్చవుతోంది. ఇక విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చులు కలుపుకుంటే మరో 30 వేల రూపాయలు. అంటే సగటున ఎకరాకు 50-60 వేల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. ఒకప్పుడంటే మంచి దిగుబడితో పాటు డిమాండ్, ధర ఉండేవి. అందుకే ఆ స్థాయిలో పెట్టుబడి పెట్టినా మంచి లాభాలే వచ్చేవి. ఇప్పుడేమో పరిస్థితి మారి పోయింది. అన్నీ అనుకూలిస్తే 10 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. కానీ ఇప్పుడు ఎకరాకు 6, 7 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం ఇందుకు ఓ కారణం. ప్రస్తుతానికి దేశీయ రకం ఎర్ర శనగ క్వింటా 5వేలు, తెల్ల శనగ 5400, కాబూలీ 8000 రూపాయలు ధర పలుకుతోంది. మూడేళ్ల క్రితం ఇవే రకాల ధరలు వరుసగా 8వేలు, 8500, 14వేల రూపాయల వరకూ ఉండేవి. అంటే ఏ స్థాయిలో ధరలు తగ్గాయో అర్థం చేసుకోవచ్చు. దిగుమతులు ఎక్కువవడం వల్లే తమ పంటకు సరైన గిరాకీ ఉండడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

విదేశీ దిగుమతుల సుంకం తక్కువగా ఉండడంతోనే: శనగలపై కేంద్ర ప్రభుత్వం విధించిన విదేశీ దిగుమతుల సుంకం తక్కువగా ఉండడం దేశీయ రైతులకు సమస్యగా మారింది. 2017-18 సమయంలో శనగ దిగుమతులపై 40% మేర సుంకాలు విధించారు. అప్పటి నుంచి ఈ పన్ను తగ్గిస్తూ 10%కి తీసుకొచ్చారు. 2024 మే నుంచి 2025 మార్చి వరకు పూర్తిగా సుంకాన్ని రద్దు చేశారు. ఆ సమయంలో దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోయింది. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి పుంజుకున్న తరవాత మళ్లీ 2025 ఏప్రిల్‌ నుంచి 10% మేర సుంకాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చారు. అంటే ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగకు ఎగుమతి దారులు కట్టాల్సిన పన్ను 10% మాత్రమే. అందుకే ఎగుమతులు పెరుగుతూ వచ్చాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 15 లక్షల టన్నుల వరకు దిగుమతి చేసుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ తరవాత కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ అవి దేశీయ అవసరాలకు మించే ఉంటున్నాయన్నది మాత్రం వాస్తవం.

అప్పులకు పెరిగిపోతున్న వడ్డీలు: విదేశీ శనగల ధరలు తక్కువగా ఉండడం మరో సమస్య. ఫలితంగా దేశీయ ఉత్పత్తి అయ్యే శనగకు మార్కెట్ ఉండడం లేదు. ఇదే పరిస్థితి ఏపీలోనూ కనిపిస్తోంది. శనగ సాగు ఎక్కువగా ఉండే ప్రకాశం జిల్లాలో రైతులు మరీ డీలా పడిపోతున్నారు. పెట్టుబడులకు తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. కోల్డ్ స్టోరేజ్‌లలో శనగలు నిల్వ చేయడానికి సంవత్సరానికి క్వింటాకు అద్దె కనీసం 150 రూపాయల మేర చెల్లించాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి నిల్వ చేయడం వల్ల రైతులకు అద్దెలు భారంగా మారాయి. ఆ ఖర్చులు భరించలేక మామూలు గోదాముల్లో ఉంచుదాం అనుకుంటే కొద్ది రోజులకే శనగలు పుచ్చిపోతున్నాయి. అప్పుడు రైతులు పూర్తిగా నష్టపోవాల్సి వస్తోంది. కొన్ని చోట్ల అసలు గిడ్డంగుల్లో నిల్వ చేయడానికి ఖాళీ కూడా ఉండడం లేదు. ఉత్పత్తి పెరగడం వల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వ సామర్థ్యం చాలడం లేదు.

కోల్డ్ స్టోరేజ్‌లలోనే పేరుకుపోతున్న శనగలు: శనగకు సరైన మార్కెట్‌ లేక రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్‌లలోనే శనగలు పేరుకు పోతున్నాయి. వ్యాపారులు ఎవరూ కొనేందుకు ముందుకు రావడం లేదు. ఒక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే దాదాపు 1.5 లక్షల మెట్రిక్‌ టన్నుల శనగ పంట రెండేళ్లుగా నిల్వ ఉండిపోయింది. ఒకరో, ఇద్దరో వ్యాపారులు ముందుకొచ్చి కొన్నా తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది. ఇక ఈ ఏడాది దిగుబడి సిద్ధమైంది. ఇప్పటికే వీటిని ఎక్కడ నిల్వ చేయాలో అర్థం కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా వచ్చిన సరుకు ఎక్కడ దాచాలో తెలియని పరిస్థితి. సాధారణంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మార్క్‌ఫెడ్ నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటుంది. లేదంటే ప్రోత్సాహక నిధి కింద కొంత మొత్తమైనా చెల్లిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఊతమే అందించాలని రైతులు కోరుకుంటున్నారు.

వీలైనంత త్వరగా ప్రభుత్వం స్పందించాలి: మార్క్‌ఫెడ్ ద్వారా సరుకంతా కొనుగోలు చేయాలన్నది రైతుల ప్రధాన విజ్ఞప్తి. ఇక మరో కీలకమైన విషయం ఏంటంటే విదేశీ దిగుమతులపై సుంకం 40-50% మేర ఉండాలన్న అభిప్రాయం వీరి నుంచి వ్యక్తమవుతోంది. అలా చేస్తేనే దేశీయంగా ఉత్పత్తి అయిన శనగకు డిమాండ్ ఉంటుందని, తద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని రైతులు అంటున్నారు. ఇది సాధ్యం అవుతుందో లేదా అన్నది పక్కన పెడితే ఈ రైతులకు ఎంతో కొంత ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే స్పష్టంగానే కనబడుతోంది. ఇప్పటికే లక్షలాది మెట్రిక్ టన్నుల నిల్వలు పోగుపడిపోయాయి. ఇంకొన్నాళ్లు ఇవి ఇలాగే ఉంటే పాడైపోయి ఎందుకూ పనికి రాకుండా పోతాయి. అందుకే వీలైనంత త్వరగా ప్రభుత్వం స్పందించాలని రైతులు కోరుకుంటున్నారు.

విశాఖ తీరంలో ప్లీట్ రివ్యూ - యుద్ధనౌకల పరేడ్‌ను తిలకించిన రాష్ట్రపతి ముర్ము

నగరాలు, పట్టణాల్లో ఖాళీ భూముల పన్ను తగ్గింపు - చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు శాసనసభ ఆమోదం