ETV Bharat / opinion

మహిళల ప్రాణాలకు రక్షణనిచ్చే హెచ్​పీవీ - ఉచిత టీకాల పంపిణీ షురూ

140 దేశాలకు హెచ్​పీవీ జాతీయ టీకా విధానం - మహిళల ప్రాణాలకు పెనుముప్పుగా హెచ్​పీవీ - ఏటా సుమారు 1.28లక్షల మందికి పైగా బాధితులు - వ్యాధి లక్షణాలు ఇవే

గర్బాశయ క్యాన్సర్ టీకాలు
Human Papilloma virus vaccines (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 28, 2026 at 5:07 PM IST

4 Min Read
Choose ETV Bharat

Human Papilloma virus vaccines : శాస్త్ర, వైద్య విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా కొన్ని రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు మానవాళికి సవాల్‌ విసురుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువైన తర్వాత ఈ అనారోగ్య సవాళ్లు మరింత పెరిగాయి. అందులో ఒకటి మహిళ ప్రాణాలకు పెనుముప్పుగా మారిన గర్భాశయ క్యాన్సర్‌. భారత్‌లో ఈ సమస్య ఆందోళనకరంగా ఉంది. గ్లోబకాన్‌-2022 నివేదిక ప్రకారం దేశంలోని మహిళల్లో ఎక్కువ కనిపించే క్యాన్సర్లలో ఇది రెండవది. దీని వల్ల ఏటా 77వేల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ప్రపంచ సగటు కన్నా మన సగటు ఎక్కువ. ఏటా సుమారు 1.28లక్షల మంది దీని బారిన పడుతున్నారు. తొలిదశలో గుర్తించలేక పోవడం వల్ల మరణాల రేటు అధికంగా ఉంది.

దేశవ్యాప్తంగా ప్రారంభం : నిజానికి గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను ​సకాలంలో స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ ద్వారా పూర్తిగా నివారించవచ్చు. ఈ నేపథ్యంలోనే దీని నివారణకు కేంద్రం అడుగులు వేసింది. దేశవ్యాప్తంగా హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (HPV) వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు 'గార్డాసిల్‌' అనే టీకా ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందజేస్తుంది. ప్రభుత్వం నిర్వహించే సార్వజనీన టీకాల కార్యక్రమంలో భాగంగా కాకుండా ఇందుకోసం ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు ప్రపంచ స్థాయి వ్యూహంలో భాగంగా HPV వ్యాక్సినేషన్‌ చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సిఫార్సుల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. దశలవారీగా దేశం మొత్తం అమలు చేశారు.

మహిళల ప్రాణాలకు రక్షణనిచ్చే హెచ్​పీవీ - ఉచిత టీకాల పంపిణీ షురూ (ETV Bharat)

ఎన్ని డోసులు వేసుకోవాలి? : గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రావడానికి హ్యూమన్‌ పాపిలోమా వైరస్​ ప్రధాన కారణం. ఒక డోసు వ్యాక్సిన్‌ అందించడం వల్ల బాలికలకు సంబంధిత వైరస్‌ల నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని దేశీయ, అంతర్జాతీయ శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. 15ఏళ్లలోపు బాలికల కోసం ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న గార్డాసిల్‌-4టీకాను 2 డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అదే 15ఏళ్లు పైబడిన బాలికలు 3 డోసులు తీసుకోవాలి. ఒక్కో డోసు ధర సుమారు 4వేల రూపాయలు. ఈ టీకా 2006లో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కోట్ల కొద్దీ డోసులు పంపిణీ చేశారు. దీంతో అనేక దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌లు తగ్గుముఖం పట్టినట్లు అంచనా. మొత్తం 140 దేశాలు హెచ్​పీవీ జాతీయ టీకా విధానాల్లో చేరాయి. డబ్యూహెచ్​ఓ తాజా మార్గదర్శకాల ప్రకారం ఒక్క డోసు కూడా ప్రభావితంగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

మాములు కణాలు క్యాన్సర్​ సెల్స్​గా : హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌లో చాలా రకాలు ఉన్నాయి. 16, 18 ఈ రెండు రకాలు అన్నింటి కంటే ఎక్కువ ప్రమాదకరమైనవి. తరచూ వీటి ఇన్‌ఫెక్షన్‌ తలెత్తడం, వదలకుండా వేధిస్తూ ఉంటే వైరస్‌లు గర్భాశయ ముఖద్వార కణాల్లోని DNAతో కలిసిపోయి కొన్ని ప్రొటీన్లను విడుదల చేస్తాయి. ఇవి మామూలు కణాల తీరు దెబ్బతీసి క్యాన్సర్‌కు బీజం వేస్తాయి. హెచ్​పీవీ వైరస్‌ సోకినంత మాత్రాన క్యాన్సర్‌కు దారి తీస్తుందని చెప్పలేం. దీనికి కొన్ని ప్రతికూల అలవాట్లు తోడైతే సమస్య తీవ్రత పెరుగుతుంది. ఇందులో ముఖ్యమైనది పొగ తాగడం. ధుమపానం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి వైరస్ ప్రభావం పెరుగుతుంది. హెచ్​పీవీకి నికోటిన్‌ కూడా తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్లే అని నిపుణులు అంటారు.

"స్క్రీనింగ్​​ విధానం చాలా ముఖ్యమైనది. ఒకవేళ 14 లేదా 20 ఏళ్లు దాటితే కనీసం స్క్రీనింగ్​ చేయించుకోవాలి. ఇలా ప్రారంభంలోనే గుర్తిస్తే మనం ఈ వ్యాధిని దాదాపుగా తగ్గించవచ్చు. 2030లోపు 90శాతం వరకు ప్రతి మహిళా టీకా వేయించుకోవాలనేది డబ్యూహెచ్​ఓ లక్ష్యం" - డాక్టర్​ సుధారాణి బైర్రాజు, సీనియర్​ గైనకాలజిస్ట్​

లక్షణాలు ఇవే : వ్యాధి ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ వ్యాధి ముదిరే కొద్దీ లక్షణాలను కనిపిస్తాయి. అవి నెలసరి మధ్యలో లేదా మెనోపాజ్ తర్వాత అసాధారణ రక్తస్రావం, దుర్వాసన, నడుము, కాళ్లు లేదా పెల్విస్ ప్రాంతంలో నిరంతర నొప్పి, బరువు తగ్గడం, తీవ్రమైన అలసట వంటివి ఉంటాయి. అప్పుడు తప్పక వైద్యుల్ని సంప్రదించాలి.

"ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే దానికి మార్గాలు ఒకటి వ్యాక్సినేషన్​. అప్పట్లో కరోనా వైరస్​ వ్యాక్సిన్​ను చాలా మంది వేసుకున్నారు. దానిలాగే గర్భసంచి ముఖద్వారా క్యాన్సర్​కు కూడా వ్యాక్సిన్​ ఉందని చాలామందికి తెలియదు. అది కచ్చితంగా అందరూ తెలుసుకోవల్సిన విషయం. రెండో మార్గం దీనిని ప్రారంభంలోనే గుర్తించటం ఎలా అంటే దీనికి స్క్రీనింగ్​ టెస్ట్​ అందుబాటులో ఉంటుంది. గర్భసంచి ముఖద్వారం వద్ద పాప్​స్మియర్​ అనేటువంటి ద్రవం ఉంటుంది. దానిని తీసి టెస్టింగ్​కు పంపించటం వల్ల క్యాన్సర్​ కణాలను ముందుగానే గుర్తించి అవి ప్రమాద దశకు చేరకుండా చికిత్స తీసుకోవచ్చు" - డాక్టర్​ స్రవంతి, గైనిక్​ అంకాలజిస్ట్​

3వ స్థానంలో భారత్ ​: ప్రపంచంలో క్యాన్సర్‌ బాధితుల సంఖ్యపరంగా చైనా, అమెరికా తర్వాత భారత్‌ 3వ స్థానంలో ఉంది. 2040 నాటికి దేశంలో క్యాన్సర్‌ రోగుల సంఖ్య ఏటా 20లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 2కోట్ల మంది క్యాన్సర్‌ బారిన పడుతుండగా వీరిలో 15లక్షల మంది భారతీయులే ఉన్నట్లు ప్రభుత్వ నివేదికల తేలింది. ఇందులోనూ లక్ష మందికి పైగా గర్భాశయ క్యాన్సర్‌ బాధితులే ఉండడం ఆందోళనకర అంశం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా హెచ్​పీవీ టీకాలు అందించటం క్యాన్సర్‌ కట్టడి దిశగా ముందడుగు వేస్తునట్టే. టీకా సుమారు 4వేల రూపాయలు ఉండడం వల్ల పేద మహిళలు వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఉపశమనం కల్గనుంది. మొత్తం మీద గర్భాశయ క్యాన్సర్‌ పని పట్టాలన్న సంకల్పానికి వ్యాక్సిన్‌ కార్యక్రమం పెద్ద బలం. స్క్రీనింగ్, టీకా, అవగాహన ఈ మూడు కలిస్తే గర్భాశయ క్యాన్సర్‌ నిర్మూలన సాధ్యమౌతుంది.

స్వయం సహాయక సంఘాల మహిళలకు హెల్త్​ చెకప్​​లు - ఎప్పుడంటే?

నగరవాసులకు ఎక్కువగా వచ్చేవి అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలే!