డయాబెటిక్ రెటినోపతికి AIతో చెక్ - గుంటూరు జీజీహెచ్‌లో పైలట్ ప్రాజెక్ట్
రెటినోపతి కోసం ప్రత్యేక ఏఐ స్క్రీనింగ్ - డయాబెటిక్ రెటినోపతికి సాంకేతికతతో చెక్ - మధునేత్ర ఏఐ టూల్‌తో కంటి పరీక్షలు - పైలెట్ ప్రాజెక్ట్‌గా గుంటూరు జీజీహెచ్‌లో సేవలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 30, 2026 at 1:26 PM IST
Artificial Intelligence In Hospitals For Eyes test: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. ఈ ప్రస్తావన లేని రోజు ఉండడం లేదు. ఫలానా పని AI అయితే ఎలా చేస్తుంది? అని ఆలోచిస్తున్నారంతా. వైద్య రంగంలో అయితే ఎప్పటికప్పుడు ఈ సాంకేతి కతతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవల్లో కృత్రిమ మేధను వినియోగించుకోవాలని గట్టిగానే సంకల్పించుకుంది. అందులో భాగంగానే సరికొత్త AI ఆధారిత స్క్రీనింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మధుమేహం కారణంగా కంటి చూపు దెబ్బ తినే రెటినోపతి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తుందీ వ్యవస్థ. గుంటూరు, కర్నూలు, విశాఖలోని ప్రభుత్వాసుపత్రుల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. మెుదట గుంటూరు జీజీహెచ్‌లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. బాధితులు కంటిచూపు కోల్పో కుండా జాగ్రత్తపడేందుకు ఈ ఏఐ సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
ఐదేళ్ల లోపు కచ్చితంగా రెటినోపతి పరీక్ష : డయాబెటిస్. ఈ వ్యాధికి మరో పేరు సైలెంట్ కిల్లర్. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికే ఈ జబ్బు పరిమితం అయ్యేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా దాడి చేస్తోంది. శరీరంలోని ఇతర అవయవాలపై గట్టి ప్రభావమే చూపుతోంది ఈ జబ్బు. షుగర్ బాధితులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోకపోతే డయాబెటిక్ రెటినోపతి బారిన పడే ప్రమాదముంటుంది. దీనివల్ల కంటి వెనక భాగంలో ఉండే సున్నితమైన రెటీనాలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తస్రావం జరిగి చూపు మందగించడం లేదా అంధత్వం వచ్చే అవకాశం ఉంది. అందుకే మధుమేహం బారిన పడిన వారు ఐదేళ్ల లోపు కచ్చితంగా ఈ రెటినోపతి పరీక్ష చేయించుకోవాలని సూచిస్తుంటారు వైద్యులు. కానీ ఈ సమస్య పట్ల అవగాహన లేక, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో లేక ఎంతోమంది కంటి సమస్యతో సతమతమవుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం డయాబెటిక్ రెటినోపతికి Aiతో చెక్ పెట్టేలా సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
"మధుమేహంతో బాధపడేవారు ఐదేళ్ల తర్వాత కంటి పరీక్ష చేయించుకోవడం అవసరం. ఈ వ్యాధి కారణంగా కంటి రెటీనాకు ఎంతమేర నష్టం వాటిల్లిందో అంచనా వేయడానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు. వ్యాధిని ముందుగానే గుర్తించి, అవసరమైన చికిత్సను అందించడం ద్వారా దృష్టిని కాపాడేందుకు ఉద్దేశించిన ఒక పైలట్ ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేసింది" -డా. రాజ్ కుమార్, కంటి వైద్యులు, జీజీహెచ్
డయాబెటిక్ రోగుల్లో ప్రారంభ దశలోనే రెటినోపతి సమస్యను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్క్రీనింగ్ వ్యవస్థను అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో ఆటోమే టెడ్ ఫండస్ కెమెరాల ద్వారా కంటి రెటీనా ఫొటోలు తీసి, వాటిని ఏఐ అల్గారిథమ్స్ ద్వారా విశ్లేషించి వ్యాధి నిర్ధరణ చేస్తారు. గుంటూరు, కర్నూలు, విశాఖలోని ప్రభుత్వాసుపత్రుల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించగా ఇప్పటికే గుంటూరు జీజీహెచ్‌లో ఈ ఏఐ సేవలతో రోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఏఐ ఆధారిత యాప్‌లో అప్‌లోడ్ : గుంటూరు జీజీహెచ్‌కు నిత్యం వేలాది మంది వైద్యం కోసం వస్తుండగా కంటి చికిత్స కోసం రోజుకూ 300 మంది రోగులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారిలో మధుమేహం బాధితులే అధికంగా ఉంటున్నారు. వీరిలో కనీసం 15 నుంచి 20 శాతం మందికి డయాబెటిక్ రెటినోపతి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఫండస్ కెమెరాలతో తీసిన చిత్రాలను కంటి వైద్య నిపుణులు పరిశీలించి, వ్యాధి నిర్ధరణ చేస్తున్నారు. ఆ చిత్రాల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. ఏఐ అందుబాటులోకి రావడం వల్ల ఫండస్ కెమెరాతో తీసిన ఇమేజ్‌ను ఏఐ ఆధారిత యాప్‌లో అప్‌లోడ్ చేస్తే, రెటినోపతి ఉందా లేదా, ఉంటే ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని క్షణాల్లో విశ్లేషించి నివేదిక ఇస్తుంది. వైద్యుడు లేకున్నా ప్రాథమిక స్థాయిలో సమస్యను గుర్తించి రోగిని అప్రమత్తం చేసే అవకాశం కలుగుతుంది. దీంతో చికిత్స ఆలస్యం కావడం, సమస్య ముదరడం వంటి పరిస్థితులను గణనీయంగా తగ్గించవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
మధుమేహంతో బాధపడుతున్న రోగుల్లో ఐదేళ్లు దాటితే ఎక్కువ శాతం మంది రెటినోపతి సమస్యలకు గురవుతున్నారు. కంటి చూపు మందగించడం, నరాలు దెబ్బతినడం, రెటీనా పొర విడిపోవడం వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మంది రోగులు సమస్య ముదిరిన తర్వాతే వైద్యులను సంప్రదిస్తుండటం వల్ల శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి ఎక్కువగా గ్రామీణ ప్రాంత రోగులు వస్తున్న నేపథ్యంలో వారిలో ఈ రెటినోపతి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు స్క్రీనింగ్ వ్యవస్థ అవసరం మరింత పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దిల్లీ ఎయిమ్స్, ఎయిమ్స్-రిషికేశ్ సంస్థల సహకారంతో వాద్వాని సంస్థ ఈ మధునేత్ర -AI టూల్‌ను రూపొందిం చింది. ప్రస్తుతం దేశంలోని 45 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ సేవలు అందుతు న్నాయి. అదే నమూనాను గుంటూరు జీజీహెచ్‌లో 3నెలల పాటు పైలట్ ప్రాజెక్టు నిర్వహించనున్నారు.
నాట్కో సెంటర్ ద్వారా క్యాన్సర్ రోగులకు మేలు: నెలకు వెయ్యి మందికి చొప్పున మూడు నెలల్లో 3 వేల మందికి, మూడు ఆసుపత్రుల్లో కలిపి సుమారు 9 వేల మంది మధుమేహ రోగులకు ఈ ప్రాజెక్టులో భాగంగా పరీక్షలు చేయను న్నారు. ఏఐ ఇచ్చే నివేదికలను కంటి వైద్య నిపుణులు పరిశీలించి వాటి కచ్చితత్వాన్ని అంచనా వేయనున్నారు. ఫలితాలు సానుకూలంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇక గుంటూరు జీజీహెచ్ నాట్కో సెంటర్‌లో క్యాన్సర్ బాధితులను పరీక్షించేందుకు కూడా ఏఐ సేవల్ని ఉపయోగిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి ఆంకాలజీ విభాగం నోడల్ సెంటర్‌గా విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు ప్రభుత్వాస్పత్రులను అనుసంధానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రిగా గుర్తింపు తెచ్చుకున్న గుంటూరు జీజీ హెచ్‌లోని నాట్కో సెంటర్‌లో ఈ ఏఐ సేవల ద్వారా వందలాది క్యాన్సర్ రోగులకు మేలు జరుగుతోంది.
AI ఆధారిత వెబ్‌సైట్ : ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు పరిసర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గ్రామీణ నిరుపేద రోగులు క్యాన్సర్ చికిత్స కోసం ఇక్కడకు వస్తుంటారు. అలాంటి వారికి నాట్కో కేంద్రంలో ఉచితంగానే వైద్యం అందిస్తున్నారు. ఈ ఏఐ సేవల వల్ల క్యాన్సర్ రోగాన్ని ప్రారంభంలోనే గుర్తించే అవకాశం ఉండటమే కాకుండా చికిత్స విషయంలోనూ అత్యుత్తమ వైద్యవిధానాన్ని అనుసరించేందుకు వీలు ఉంటుంది. టాటా మెమోరియల్ సెంటర్, హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, నవ్య కేర్ నెట్‌వర్క్ కలిసి ఓ AI ఆధారిత వెబ్‌సైట్ రూపొందించాయి. క్యాన్సర్ రోగుల వివరాలు, రిపోర్టులు ఇందులో పొందుపరిస్తే వారి జబ్బుకు సంబంధించిన సమగ్ర సమాచారం అందిస్తుంది. ఎలాంటి చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు అన్నదీ ఈ ఏఐ సేవల ద్వారా తెలుసుకోవచ్చు. తద్వారా బాధితులు వేగంగా ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో క్యాన్సర్ నిర్ధరణ, చికిత్సకు సంబంధించిన సేవలందించే ఆసుపత్రుల సంఖ్య తక్కువగా ఉంది. ఇక మారుమూల గ్రామాలకు చెందిన వారికి ఈ జబ్బు పట్ల అవగాహన ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రుల్లో క్యాన్సర్ రోగుల డేటాను సేకరించి, వాటిని ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ ద్వారా విశ్లేషించడం చాలా కీలకం. ఆ సమాచారం ఆధారంగా చికిత్స అందించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఏఐ సేవల ద్వారా రోగుల పరిస్థితిని అంచనా వేయడం, అందుబాటులో ఉన్న సిబ్బందితోనే మెరుగైన వైద్యం అందించడం లాంటివి సులువవుతాయి. తద్వారా...క్యాన్సర్ తీవ్రతరం కాకముందే జాగ్రత్త పడి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. దశలవారీగా విశాఖ, కర్నూలులోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ AI సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఎకో టూరిజం హబ్‌గా 'సదాశివకోన' - పర్యాటక రంగానికి ఇక మహర్దశ
అలవాటుగా మొదలై వ్యసనంగా - రోజురోజుకు పెరిగిపోతున్న డ్రగ్స్ వినియోగం

