చేనేత కార్మికుల జీవితాల్లో ఆశాకిరణం - స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఆప్కో
ఆప్కో ఎదుగుదలకు, చేనేతల ఉపాధికి పునాది వేసిన "జనతా వస్త్రాలు" పథకం - ఆప్కోకు పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తోన్న కూటమి ప్రభుత్వం

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 7, 2026 at 3:12 PM IST
|Updated : July 7, 2026 at 3:19 PM IST
APCO 50 Years Celebrations: చేనేత రంగానికి చేయూత అందించాలి. ఏ కార్మికుడూ ఇబ్బంది పడకూడదు. చేతి నిండా సంపాదించుకోవాలి. ఒకప్పుడు ఇవే లక్ష్యాలతో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్ లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (ఆప్కో). 1976 జులై 6వ తేదీన ప్రారంభమైన ఈ సంస్థ 5 దశాబ్దాలుగా సేవలు అందిస్తోంది. ఈ ప్రస్థానంలో ఎన్నో ఒడుదొడుకులున్నాయి. వాటన్నింటినీ దాటుకుంటూ బలంగా నిలబడింది. అలాంటి సంస్థ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మనుగడ కోల్పోయే స్థాయికి దిగజారింది. పొరుగు రాష్ట్రాల మరమగ్గాలకు పెద్దపీట వేయడం వల్ల చేనేత కళను నమ్ముకున్న కార్మికులు కూలీలుగా మారాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం చొరవతో మళ్లీ ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. సవరించిన కూలీ రేట్లు, డిజిటల్ సంస్కరణలకు దక్కిన జాతీయ 'స్కోచ్' అవార్డుతో కొత్త ఊపిరి పీల్చుకుంటోంది. ఆప్కో సంస్థ మొదలై 50 ఏళ్లు పూర్తైన ఈ సందర్భంగా ఓ సారి ఆ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం.
ఆప్కో అంటే ఆసరా. ఆప్కో అంటే భరోసా. చేనేత కార్మికులు దళారీ వ్యవస్థలో పడి నలిగి పోకుండా అత్యంత జాగ్రత్తగా కాపాడిన సంస్థ ఇది. గంటల కొద్దీ కూర్చుని తమ చెమటను ధారబోస్తూ ఎన్నో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసే చేనేత కార్మికుల జీవితాల్లో ఇదో ఆశాకిరణం. ఇంతటి ఘన చరిత్ర ఉన్న సంస్థ విజయవంతంగా 50వ వసంతంలోకి అడుగు పెట్టి స్వర్ణోత్సవాలు జరుపుకుంటోంది.
1976 జులై 6న ఏర్పాటు : దళారుల దోపిడీ నుంచి కార్మికులను రక్షించి, వారి నైపుణ్యానికి సరైన మార్కెటింగ్ వేదికగా నిలవాలన్న లక్ష్యంతో 1976 జులై 6న ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘం. దీన్నే అంతా సంక్షిప్తంగా ఆప్కో అని పిలుచుకుంటున్నారు. విజయవంతంగా 50 ఏళ్లుగా సేవలు అందిస్తూ స్వర్ణోత్సవాల వరకూ చేరుకుంది ఈ సంస్థ ప్రయాణం. హైకో ఫ్యాబ్రిక్స్, రాయా ఫ్యాబ్రిక్స్, ఆంధ్ర హ్యాండ్లూమ్స్ పేరిట ఉన్న మూడు ప్రాంతీయ సంస్థల విలీనంతో ఆప్కో ఆవిర్భవించింది. నాడు చిన్న మొక్కగా మొదలై, నేడు వెయ్యికి పైగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నీడను ఇస్తున్న మహావృక్షంగా ఎదిగింది. స్వర్ణోత్సవ సంబరాల వేళ ఆప్కో వైభవం, ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని స్మరించుకోవడమే కాదు. క్షేత్ర స్థాయిలో కార్మికులను ఇంకా ఇబ్బంది పెడుతున్న దళారీ వ్యవస్థను, లోపాల్ని విశ్లేషించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సంస్థకు జవసత్వాలు : చేనేత పరంగా చూస్తే ధర్మవరం పట్టు, ఉప్పాడ జమ్‌దానీ, మంగళగిరి, వెంకటగిరి, చీరాల ఇలా రాష్ట్రంలోని ప్రతి భౌగోళిక ప్రాంతానిదీ ఒక్కో ప్రత్యేకత. ఈ వస్త్రాలన్నింటికీ దేశవ్యాప్తంగా ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడంలో ఆప్కోది కీలక పాత్ర. ముఖ్యంగా మహాత్ముడి మన్ననలు పొందిన శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీ నేడు కేంద్ర ప్రభుత్వ 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్' జాబితాలో చోటు దక్కించుకుందంటే అది ఆప్కో కృషి ఫలితమే. నాడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన "జనతా వస్త్రాలు" పథకం ఆప్కో ఎదుగుదలకు, చేనేతల ఉపాధికి బలమైన పునాది వేసింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చేనేత కార్మికుల్లో నైపుణ్యాలు పెంచడం, అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించడంపై దృష్టి సారించి సంస్థకు జవసత్వాలు అందించింది.
వై.ఎస్. జగన్ ప్రభుత్వంలో నిర్లక్ష్యం : 2014-2019 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జీవో 24, విభజిత రాష్ట్రంలో తెచ్చిన జీవో 142 ప్రకారం ప్రభుత్వ సంక్షేమ శాఖలు తమకు అవసరమైన వస్త్రాలను ఆప్కో ద్వారానే కొనుగోలు చేసేవి. కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్. జగన్ ప్రభుత్వం ఈ విధానాన్ని నిర్లక్ష్యం చేసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇచ్చిన యూనిఫామ్‌ను రాష్ట్ర చేనేతల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల మరమగ్గాల నుంచి కొనుగోలు చేశారు. నాణ్యతను నిర్ధరించే సంస్థ వద్దన్నా కూడా నాసిరకం వస్త్రాలను కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముడిసరుకు అందక, ఉపాధి లేక ఎందరో కార్మికులు భవన నిర్మాణ కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా మారిపోయిన దుస్థితి గత ఐదేళ్లలో కనిపించింది. చేనేత సహకార సంఘాలు బలహీన పడ్డాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఆప్కోకు కొత్త శక్తి : కూటమి ప్రభుత్వం చేనేతలకు కొంత ఊరట ఇస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఆప్కోకు కొత్త శక్తినిచ్చాయి. ఇందులో ముందుగా మాట్లాడుకోవాల్సింది ఆదాయం పెంపు గురించి 2025లో ప్రభుత్వం బ్లీచింగ్, డైయింగ్ చార్జీలను భారీగా సవరించింది. బెడ్‌షీట్లు, టవళ్లు నేసే కార్మికుల కూలీ పెరగడం వల్ల ఒక్కో నేతన్నకు సగటున రోజుకు రూ. 108 అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇక డిజిటల్ విప్లవంతోనూ ఆప్కోకు సహకారం అందిం చేందుకు ముందుకొచ్చింది ప్రభుత్వం. విక్రయ కేంద్రాల్లో కంప్యూటరైజ్డ్ ఆన్‌లైన్ బిల్లింగ్, తక్షణమే ఇన్వెంటరీ అప్‌డేట్ అయ్యే విధానాలను పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈ పారదర్శక విధానాలకు గుర్తింపుగా 2025లో ఆప్కోకు ప్రతిష్ఠాత్మక 'స్కోచ్ అవార్డు-2025' దక్కింది.
టీటీడీ నుంచి రూ.22 కోట్ల ఆర్డర్ : తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు పంపిణీ చేసే సంప్రదాయ చేనేత వస్త్రాల సరఫరా కోసం ఆప్కో సంస్థకు సుమారు రూ. 22 కోట్ల వరకు విలువైన ఆర్డర్‌ను అందించింది ప్రభుత్వం. ఆప్కో 50 ఏళ్ల చరిత్రలో టీటీడీ నుంచి ఇంతటి భారీ ఆర్డర్ లభించడం ఇదే తొలిసారి. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు, ప్రముఖులకు వేదాశీర్వచనం సమయంలో అందించే కండువాలు, శాలువాలు, కాటన్ బ్లౌజ్ పీస్‌లను ఆప్కో సరఫరా చేయనుంది. తొలి దశలో భాగంగా ఆప్కో మూడు వేల కండువాలు, ఐదు వేల శాలువాలు, 90 వేల కాటన్ అప్పర్ వస్త్రాలు, 75 వేల కాటన్ బ్లౌజ్ పీస్‌లను టీటీడీకి అందించనుంది. టీటీడీ నిబంధనల ప్రకారం ఈ వస్త్రాలపై శంఖు, చక్రాల గుర్తులతో పాటు " ఓం నమో వేంకటేశాయ " అనే మంత్రాన్ని తెలుగు, సంస్కృతం రెండు భాషల్లోనూ ముద్రించనున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేనేత రంగానికి ఊతం అందిస్తున్నా ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలున్నాయంటున్నాయి సహకార సంఘాలు.
చేనేత వస్త్రంపై 5% జీఎస్టీ : ముఖ్యమంత్రి స్థాయిలో చేనేతను బతికించాలని చెబుతున్నా జిల్లాల కలెక్టర్లు ఆ దిశగా దృష్టి సారించాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనబడుతోంది. కొన్ని చోట్ల దళారుల వ్యవస్థ ఇంకా కొనసాగుతోందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ సంక్షేమ శాఖలు వస్త్రాలను ఆప్కో ద్వారానే కొనాలన్న నిబంధన జీవో 142 పూర్తి స్థాయిలో ఇంకా అమలు కావడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు కావాల్సిన దుప్పట్లు, తువ్వాళ్లను నేతన్నల నుంచి కాకుండా, దళారులు తమిళ నాడు నుంచి తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ అధిక ధరకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. చేనేత వస్త్రంపై కేంద్రం 5% జీఎస్టీ విధించడం మరో ఇబ్బందికర పరిస్థితి. ఇక చేనేత రిజర్వేషన్ డిజైన్లు అయిన 11 రకాలను పవర్ లూమ్స్‌లో ఉత్పత్తి చేస్తుండటాన్ని అడ్డుకోలేకపోవడం నేతన్నలకు ఇబ్బందికరంగా మారింది.
ఆప్కోకు పూర్వవైభవం : సమస్యలున్నప్పటికీ వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు చొరవ చూపిస్తోంది కూటమి సర్కార్. ఆప్కోకు పూర్వవైభవం తీసుకురావాలని భావిస్తోంది. అది జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దళారీ వ్యవస్థను తొలగించాలి. జీవో 142ను నూటికి నూరు శాతం కఠినంగా అమలు చేయాల్సిన అవసరమూ ఉంది. ప్రభుత్వం ఎంత సదుద్దేశంతో ఉన్నా కిందిస్థాయి అధికారులు కూడా అదే నిబద్ధతతో పని చేస్తేనే ఆప్కోకు మేలు జరుగుతుంది. ఈ స్వర్ణోత్సవ సందర్భంగా ఆ దిశగా అడుగులు పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
వందేళ్ల తర్వాత నల్లమలకు అడవి దున్నలు - మూడేళ్లలో మధ్యప్రదేశ్ నుంచి 50
ఖరీఫ్, రబీల్లో పంటల బీమాకు ప్రభుత్వ మార్గదర్శకాలు - ఇలా నమోదు చేసుకోండి

