ఏపీలో ప్రాజెక్ట్ 'సంజీవని'తో మెరుగైన వైద్యం - ఇకపై అనారోగ్య వివరాలన్నీ డిజిటల్
ప్రాజెక్ట్ సంజీవనితో మెరుగైన ఆరోగ్య సేవలు - రాష్ట్ర పౌరుల అనారోగ్య వివరాలన్నింటినీ డిజిటల్ రికార్డుల రూపంలో సంక్షిప్తం - వైద్యులకు అందుబాటులో పేషెంట్స్ వివరాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 16, 2026 at 4:50 PM IST
Better health services with Project Sanjeevani: ఆరోగ్య రంగాన్ని సంస్కరించాలి. వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి. ఇందు కోసం పెద్ద ఎత్తున సాంకేతికతను వినియోగించుకోవాలి. ఇవీ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు. అందులో భాగంగానే ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. సంజీవని ప్రాజెక్ట్ ఇందుకు ఉదాహరణ. రాష్ట్ర పౌరుల అనారోగ్య వివరాలన్నింటినీ డిజిటల్ రికార్డుల రూపంలో సంక్షిప్తం చేయడం నుంచి మెరుగైన ఆరోగ్య సేవలు అందించడం వరకూ నిర్దేశిత లక్ష్యాలతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసింది.
ఇప్పటికే పైలట్ ప్రాజక్టుగా మొదలైన ఈ కార్యక్రమం దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. ఈ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహకారం కూడా తీసుకోనుంది ప్రభుత్వం. గేట్స్ ఫౌండేషన్ ఈ మేరకు పెద్ద ఎత్తున సాంకేతికత సాయం అందించనుంది. ఇంతకీ ఏంటీ సంజీవని ప్రాజెక్ట్? ఆరోగ్య సేవలు మెరుగు పరచడంలో ఇది ఏ విధంగా సాయ పడుతుంది? లాంటి వివరాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శస్త్రచికిత్సలు చేస్తున్న రోబోలు: కొన్నేళ్లుగా ఆరోగ్య రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. క్రమంగా ఇందులో సాంకేతికత వినియోగం పెరుగుతోంది. ఎప్పుడూ ఊహించనంతగా రోబోలు శస్త్రచికిత్సలు చేస్తున్నాయి. దిల్లీ ఎయిమ్స్‌లో ఇప్పటికే ఇది సర్వసాధారణమైపోయింది. మిగతా నగరాల్లోనూ ఈ తరహా వైద్యం వైపు అడుగులు పడుతున్నాయి. టెలీ మెడిసిన్‌తో మొదలైన టెక్నాలజీ అంతకంతకూ అప్‌గ్రేడ్ అవుతోంది. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాంకేతికతనూ ఆరోగ్య రంగానికి జోడించే రోజులు వచ్చేశాయి.
వ్యాధులను ముందస్తుగా గుర్తించడం నుంచి ఫలానా రోగానికి ఏ చికిత్స అందించాలి అని నిర్ణయాలు తీసుకునేంత వరకూ అన్ని విధాలుగా ఏఐ ఉపయోగపడనుంది. ఎక్స్‌రేలు, స్కాన్‌లను విశ్లేషించి అనుభవమున్న వైద్యులలాగే పూర్తి స్థాయి సమాచారాన్ని అందించే స్థాయికి చేరుకుంది ఈ సాంకేతికత. ఈ మార్పులను అందింపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రోగుల సమాచారాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుకే సంజీవని అనే పేరు పెట్టింది.
బడ్జెట్‌లో రూ.19,300 కోట్లు కేటాయింపు: సంజీవని రాష్ట్రంలోని 5 కోట్ల మంది పౌరుల ఆరోగ్య వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. ఇందులో భాగంగా డిజిటల్ హెల్త్ కార్డ్‌లను ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇది అమలవుతోంది. ప్రతీ పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అందించడం ద్వారా నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం వీలవుతుంది అన్నది ప్రభుత్వ ఆలోచన. తద్వారా రోగి ఏ ఆసుపత్రికి వెళ్లినా పూర్తి వివరాలు వైద్యులకు అందుబాటులో ఉంటుంది. అప్పుడు ఆ వ్యాధిని విశ్లేషించడం సులభతరం అవుతుంది.
హైరిస్క్ కేసులను గుర్తించడం, వాటిని సంజీవని ప్రాజెక్ట్‌తో అనుసంధానించడం కూడా ముఖ్య ఉద్దేశం. తద్వారా సులువుగా చికిత్స అందించేందుకు వీలవుతుంది. జబ్బు బారిన పడకముందే ముందస్తు చికిత్స చేయడమే కాకుండా, ఏఐ విశ్లేషణ ద్వారా వ్యాధిని ముందే గుర్తించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే ఈసారి బడ్జెట్ పద్దులో రూ.19,300 కోట్లు కేటాయించింది.
వ్యాధి సోకకముందే నివారణపై దృష్టి: ప్రజలకు సులభంగా ఆరోగ్య సేవలు అందించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందుకే ఈ సంజీవనిని తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రజల ఆరోగ్య రికార్డులు డిజిటలైజ్ చేయవచ్చు. వారి అనారోగ్య పరిస్థితుల వివరాలు తెలుసుకోవడం ద్వారా వ్యాధి సోకకముందే నివారణపై దృష్టి సారించగలిగే అవకాశం ఉంటుంది. ఏఐ ఆధారిత విశ్లేషణల ద్వారా ఎక్కువ మంది ప్రజలను ఇబ్బంది పెడుతున్న వ్యాధులను గుర్తించి, వాటి నివారణపై దృష్టి సారించేందుకు వీలవుతుంది.
గేట్స్ ఫౌండేషన్‌తో పాటు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సహకారంతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సహకరించడంలో భాగంగానే బిల్‌గేట్స్ ఏపీ పర్యటన ఖరారైంది. గేట్స్ ఫౌండేషన్ ఏ విధమైన సహకారం అందిస్తుందన్న దానిపై ఈ పర్యటనతో ఓ స్పష్టత వస్తుంది. ఇక ఈ సంజీవని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మరీ ఎక్కువగా ఇబ్బంది పడే 10 వ్యాధులను గుర్తిస్తారు. ఆ తరవాత వాటిని విశ్లేషిస్తారు. తద్వారా చికిత్సా విధానాల్లో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. ఫలితంగా ప్రజలకు ఆరోగ్య భద్రత అందించవచ్చు.
ఆరోగ్య సేవల్లో పారదర్శకత: ఇక ఈ సంజీవని ప్రాజెక్ట్‌లో భాగంగా పేషెంట్స్‌కు సంబంధించిన హెల్త్ రికార్డులు డిజిటలైజ్ చేసిన తరవాత ఈ వివరాలు హెల్త్ కేర్ ప్రొవైడర్స్‌కు అందించాలని భావిస్తోంది ప్రభుత్వం. ఈ విధంగా ఆరోగ్య సేవల్లో పారదర్శకత పెంచాలన్నది మరో ప్రధాన ఉద్దేశం. ఇక ఈ రికార్డులలో ఏమేం ఉంటాయన్నదీ ప్రభుత్వం ప్రాథమికంగా కొన్ని వివరాలు వెల్లడించింది. ఇందులో ముఖ్యంగా పౌరుల మెడికల్ కండీషన్స్ ఎలా ఉన్నాయన్నది పొందపరుస్తారు. వీటితో పాటు వాళ్లు ఏయే వ్యాధులకు ఎలాంటి చికిత్సలు తీసుకున్నారు, ఏ మందులు వాడుతున్నారు, ల్యాబ్ రిపోర్ట్స్ వివరాలు ఎలా ఉన్నాయి? అన్న విషయాలన్నీ ఈ హెల్త్ రికార్డులో ఉంటాయి.
ఎప్పుడైనా ఓ వ్యక్తి వైద్యుడిని సంప్రదించినప్పుడు ఈ డిజిటల్ హెల్త్ రికార్డు చూస్తే సరిపోతుంది. తద్వారా ఆ వ్యాధిని సరైన విధంగా డయాగ్నైజ్ చేయడంలో తోడ్పడుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 42 రకాల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని లక్షలాది మందికి ఈ పరీక్షలు చేయనున్నారు. గ్రామ, వార్డుల స్థాయిలో ఈ టెస్ట్‌లు చేస్తారు. తద్వారా మారుమూల గ్రామాల్లోని ప్రజలకూ మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు వీలవుతుంది.
డిజిటల్ రూపంలో అందుబాటులోకి: రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష. పలు వ్యాధులను ముందుగానే గుర్తించడం వల్ల ఆయా కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఆరోగ్య ప్రమాణాలు పెంచవచ్చు అన్నది సీఎం ఆలోచన. ఆరోగ్య పరీక్షలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా అవగాహన లేమి, దీర్ఘకాలం పాటు వ్యాధితో ఇబ్బందులు పడడం లాంటి సమస్యలు తొలగిపోతాయి. అయితే ఈ సేవలు అందించేందుకు వీలుగా సంజీవని మొబైల్ అప్లికేషన్ తీసుకురానుంది ప్రభుత్వం.
ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉంది. ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే పౌరులు అందులో లాగిన్ అయ్యి వివరాలు పొందు పరచవచ్చు. ఫలితంగా ఆ సమాచారం అంతా డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తుంది. మిగతా హెల్త్ స్కీమ్స్‌కు సంజీవనికి ప్రధాన తేడా టెక్నాలజీ. సంజీవని ప్రాజెక్ట్ పూర్తిగా సాంకేతికత ఆధారంగా రూపుదిద్దుకుంది. భారీ మొత్తంలో మెడికల్ స్క్రీనింగ్, డిజిటల్ హెల్త్ రికార్డులు మెయింటేన్ చేయడం, ఏఐ సాంకేతికత సహకారం తీసుకోవడం ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన మైనవి. క్యాన్సర్ తరహా ప్రమాదకరమైన వ్యాధులకు సరైన సమయానికి చికిత్స అందించేలా చేయడమూ మరో ముఖ్య ఉద్దేశం.
అల్లూరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్: సంజీవని ప్రాజెక్ట్‌తో పాటు ఉచిత క్యాష్‌లెస్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా అమలయ్యేలా ఏర్పాటు చేశారు. 2026 జనవరి 1 నుంచి విస్తరణకు ప్రణాళికలు రూపొందించారు. ఈ ఏడాది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంజీవని ద్వారా జులై నాటికి 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్ చేయాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
వీటితోపాటు శ్వాస సంబంధిత సమస్యలు, క్యాన్సర్, లివర్ సమస్యలు, న్యూరో ఇబ్బందులు, ఒబెసిటీ, అనీమియా, పిల్లల వ్యాధులనూ గుర్తించి అందుకు తగ్గట్టుగా చికిత్స అందిస్తారు. ఈ సంజీవనితో సాంకేతిక పరంగా మరో అడుగు ముందుకు వేసింది ప్రభుత్వం. గిరిజన, మారుమూల ప్రాంతాలకు అత్యవసరమైన మందులు సరఫరా చేయడం సవాలుగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగానే ఎమర్జెన్సీ మెడిసిన్‌ను 20 నిముషాల్లో సరఫరా చేసే విధంగా మెడికల్ డ్రోన్ల పైలట్ ప్రాజెక్ట్‌ను అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఇప్పటికే విజయవంతంగా నిర్వహించారు. ఇది కూడా సంజీవనిలో భాగమే.
ఈ ప్రాజెక్టుకు సాంకేతికతే వెన్నెముక: సంజీవని ప్రాజెక్టుకు సాంకేతికతే వెన్నెముక. ఈ టెక్నాలజీ పరంగా బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో పాటు టీసీఎస్ కూడా సహకారం అందించనుంది. ఇందులో భాగంగానే ఏఐ టెక్నాలజీని పలు దశల్లో వినియోగించనున్నారు. అంతే కాదు. ఇప్పటికే సెంట్రల్ డిజీ నెర్వ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్‌తో పాటు హాస్పిటల్స్ నుంచి సేకరించిన పేషెంట్స్ హెల్త్ డేటాను ఈ కేంద్రంలో నిక్షిప్తం చేస్తారు. ఏఐ సాయంతో ఈ వివరాలన్నీ డిజిటలైజ్ అవుతాయి.
అయితే ఏ దశలో అయినా ఏఐ అనేది కేవలం క్లినికల్ సపోర్ట్ టూల్‌గా ఉండాలని, ఫిజీషియన్స్ స్థానాన్ని అది భర్తీ చేయకూడదని కొంత మంది నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇందులో మరో ముఖ్యమైన విషయం హెల్త్ స్కోర్. ఏఐ అల్గారిథమ్ ద్వారా దీన్ని జనరేట్ చేస్తారు. టెస్ట్ రిజల్ట్స్, మెడికల్ హిస్టరీ ఆధారంగా ఓ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది విశ్లేషించి చెబుతుంది ఈ సాంకేతికత. వీటి ద్వారా ఆయా వ్యక్తులు ఎప్పుడెప్పుడు పరీక్షలు చేయించుకోవాలి, ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అప్రమత్తం చేస్తుంది.
ఇక ఈ సంజీవని ప్రాజెక్టులో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. యాప్ అందుబాటులోకి వచ్చిన తరవాత ఇందులో నుంచే డాక్టర్ అపాయింట్‌మెంట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు వస్తుంది. తద్వారా సమయం వృథా తగ్గుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఈ సౌకర్యం మేలు చేయనుంది. ఇలాంటి ఎన్నో సౌకర్యాలను కల్పించి ఆరోగ్య రంగాన్ని సంస్కరిం చాలని భావిస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పట్టాలెక్కించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఎన్నో ఇబ్బందులు - వ్యాయామం ఊసే ఎత్తని జనం
వ్యాధి వచ్చాక చికిత్స కాదు - ఏఐ ద్వారా ముందే గుర్తించేలా 'సంజీవని'

