ETV Bharat / opinion

'ఛాంపియన్ ఫార్మర్'తో రైతు కష్టాలకు చెక్​ - కలెక్టర్ హిమాన్షు శుక్లా వినూత్న ఆలోచన

ప్రతి గ్రామానికి ఒక ఛాంపియన్​ ఫార్మర్​ ఎంపిక - వ్యవసాయ విధానాలపై అన్నదాతలకు శిక్షణ - ఎంపిక చేసిన రైతులే ఛాంపియన్‌ ఫార్మర్ ప్రాజెక్టుకు రోల్ మోడల్‌

AP Champion Farmers Project in Nellore District
AP Champion Farmers Project in Nellore District (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 30, 2025 at 11:54 AM IST

2 Min Read
Choose ETV Bharat

AP Champion Farmers Project : రైతుల కష్టాలు, నష్టాలు అందరికీ తెలిసినవే. అడుగడునా ఆటంకమే అన్నట్లు సాగుతుంది వ్యవసాయం. దుక్కి దున్నడం నుంచి విత్తనాలు, ఎరువులు, కోతతో పాటు బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, మద్దతు ధర ఇలా ఒక్కటేమిటి అన్నింటా సమస్యలతో సావాసమే. ఐనా రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండిస్తారు అన్నదాతలు. అలాంటి రైతన్నల సమస్యలకు పరిష్కారం చూపాలని ఆలోచించారు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా. అన్నదాతలకు సాగులోని మెళకువలు సహా అనేక అంశాలపై అవగాహన కల్పించాలని భావించారు. అందుకోసం ఛాంపియన్ ఫార్మర్ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి సీఎం చంద్రబాబు నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇంతకీ ఏంటీ ప్రాజెక్టు? ఎలా అమలు చేస్తున్నారు? రైతులకు జరిగే మేలేంటి? ఇప్పుడు చూద్దాం.

ఆరుగాలం శ్రమించిన రైతులకు అన్నీ కష్టాలే. కొన్ని సార్లు ఆది నుంచి ఇబ్బందులు మొదలు అవుతాయి. అందుకు కారణాలు ఏవైనా ఉండొచ్చు. కానీ, వాటన్నింటిని తట్టుకుని పంటలు వేస్తారు. ఐతే, సాగులో సరైన మెళకువలు పాటించకుంటే నష్టాలు తప్పవు. ఎందుకంటే, విత్తనాలు, ఎరువులు, రుణాలు, మిశ్రమ పంటలు, పంట మార్పిడులు వంటి అనేక అంశాలపై నూటికి 90% మంది రైతులకు సరైన అవగాహన లేదనేది వాస్తవం. నష్టాలకు అదే అసలు కారణం కూడా.

ఛాంపియన్ ఫార్మర్ అనే ప్రాజెక్ట్ రైతుల కష్టాలకు చెక్​ - కలెక్టర్ హిమాన్షు శుక్లా వినూత్న ఆలోచన (ETV)

ఈ నేపథ్యంలో గ్రామంలోని రైతులతోనే మిగతా వ్యవసాయదారులకు సాగులోని వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని సంకల్పించారు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా. రైతుల సమస్యలు దృష్టిలో ఉంచుకుని సాగులో సమగ్ర సంస్కరణలు తీసుకురావడానికి కార్యాచరణ రూపొందించారు హిమాన్షు శుక్లా. అందులో భాగంగా ఛాంపియన్ ఫార్మర్స్ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

ప్రతి గ్రామానికి ఒక ఛాంపియన్​ ఫార్మర్​ ఎంపిక : నెల్లూరు జిల్లాలో ఉన్న 727 గ్రామాల్లో గ్రామానికి ఒక రైతుని ఛాంపియన్‌ ఫార్మర్‌గా ఎంపిక చేశారు. వారికి వ్యవసాయ విధానాలు, మెళకువలు, తదితర అంశాలపై పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు. ఎంపిక చేసిన రైతులే ఛాంపియన్‌ ఫార్మర్ ప్రాజెక్టుకు రోల్ మోడల్‌ అని కలెక్టర్ హిమాన్షు శుక్లా అంటున్నారు. అన్నదాతల ఆదాయం పెరగాలన్నదే ఛాంపియన్ ఫార్మర్ ముఖ్య ఉద్దేశం.

ఐతే, చాలా మంది రైతులకు వ్యవసాయ విధానాలు, పెట్టుబడి, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ వంటి అంశాలపై అవగాహన ఉండదు. అందుకోసం సంబంధిత అధికారుల ద్వారా రైతులకు సమాచారం అందిస్తున్నట్లు కలెక్టర్ వివరిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు, పెట్టుబడి, దిగుబడి అంశాలతో పాటు మార్కెట్‌పై కూడా అవగాహన కల్పిస్తున్నారు. దాంతోపాటు ఎంపిక చేసిన ఆదర్శ రైతులకు డ్రోన్స్ సహా ఇతర వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

'గత కొద్ది సంవత్సరాలుగా చూస్తే గనక వ్యవసాయ విధానంలో చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. జిల్లాలో ఛాంపియన్ ఫార్మర్ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాం. జిల్లాలో ఈ ప్రాజెక్టు కోసం మూడు భాగాలుగా విభజించాం.' - హిమాన్షు శుక్లా, జిల్లా కలెక్టర్

ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ఛాంపియన్ ఫార్మర్ కాన్సెప్ట్‌ను అభినందించారు. నెల్లూరులో విజయవంతమైతే రాష్ట్రమంతా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఫలితంగా ఛాంపియన్ ఫార్మర్‌ కార్యక్రమాన్ని అన్నిశాఖల అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. శాఖలన్నింటినీ అనుసంధానం చేస్తూ రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించేలా కృషి చేస్తున్నారు.

నెరవేరిన ఎన్నో ఏళ్ల కల - పొందూరు ఖాదీకి అదనపు బ్రాండ్‌ వాల్యూ

అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ముందడుగు​ - విజయవంతమైన బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్