ETV Bharat / opinion

దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీ - అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ ప్రత్యేకతలివే?

దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీగా ఏపీ సెంట్రల్ వర్సిటీ - 2018లో అనంతపురానికి సెంట్రల్ వర్సిటీ మంజూరు - యూనివర్సిటీ నిర్మాణానికి రూ.711 కోట్లు కేటాయింపు

Anantapur Central University
దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీగా ఏపీ సెంట్రల్ వర్సిటీ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 29, 2026 at 5:00 PM IST

5 Min Read
Choose ETV Bharat

Anantapur Central University : రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అత్యాధునిక బోధన సదుపాయాలు కల్పించి ఆంధ్రప్రదేశ్‌ని విద్యా హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయమే అందుకు ఉదాహరణ.

రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేసింది. వర్సిటీ నిర్మాణం కోసం రూ.711 కోట్లు కేటాయించింది. అందులో భాగంగానే విశ్వవిద్యాలయం తొలి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో పాటు అద్భుతమైన విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. మరో ముఖ్య విషయం ఏంటంటే మొదటి దశ పనులతోనే దేశంలోనే తొలి స్మార్ట్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది.

దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీ - అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ ప్రత్యేకతలివే? (ETV Bharat)

వర్సిటీ నిర్మాణానికి రూ.711 కోట్లు కేటాయింపు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలో భాగంగా 2018లో కేంద్ర ప్రభుత్వం అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసింది. గత టీడీపీ ప్రభుత్వం సహకారంతో అనంత పురం జేఎన్టీయూ భవనంలో తాత్కాలికంగా సెంట్రల్ వర్సిటీ తరగతులు ప్రారంభమయ్యాయి. ఓవైపు తరగతుల నిర్వహణపై దృష్టి పెట్టి, శాశ్వత భవన నిర్మాణం కోసం భూ అన్వేషణ చేపట్టింది. బుక్కరాయసముద్రం మండలం జంతులూరు వద్ద ఒకేచోట 461 ఎకరాల భూమి లభ్యం కావడంతో ఆ భూమిని సేకరించి విశ్వవిద్యాలయ నిర్మాణానికి కేటాయించింది. భూ కేటాయింపులు పూర్తి కాగానే సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణానికి కేంద్రం 711 కోట్ల రూపాయలు కేటాయించింది.

రెండు దశలుగా యూనివర్సిటీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని తెలిపింది. మొదటి విడత పనుల కోసం 350 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో 2020లో ఆ భూమిని యూనివర్సిటీ అధికారులకు అప్పగించారు. ఫలితంగా 2023 మార్చిలో విశ్వవిద్యాలయ నిర్మాణ పనులను మొదలు పెట్టారు. 2025 మార్చి నాటికి తొలి దశ పనులు పూర్తి చేశారు.

అధికారిక కార్యకలాపాలు ఇక్కడే: ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్ యూనివర్సిటీ తొలి విడత పనుల్లో ఎస్టేట్ భవన కార్యాలయం, పరిపాలన భవనం, రహదారులు, తరగతి గదులు నిర్మించారు. 2,200 మంది విద్యార్థులు ఉండేలా వసతి భవనాలు నిర్మించారు. అందులో రెండు అబ్బాయిలకు, ఓ భవనం అమ్మాయిలకు కేటాయించారు. వాస్తవానికి 2024 జూలైలోనే పరిపాలన భవనం, తరగతి గదుల నిర్మాణం, విద్యార్థినుల వసతి గృహాలు పూర్తయ్యాయి. దీంతో ఆగస్టులోనే జేఎన్టీయూలో కొనసాగుతున్న సెంట్రల్ యూనివర్సిటీని బుక్కరాయ సముద్రం జంతులూరులోని శాశ్వత ప్రాంగణానికి తరలించారు. అప్పటి నుంచి తరగతుల నిర్వహణ, అధికారిక కార్యకలాపాలు ఇక్కడే జరుగుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న కోర్సులనూ: 2018లో 4 యూజీ, 2 పీజీ కోర్సులతో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తొలి బ్యాచ్ ప్రారంభ మైంది. ప్రస్తుతం దేశంలో ఏ సెంట్రల్ యూనివర్సిటీలో లేని ప్రత్యేక కోర్సులను అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టారు. ఎమ్మెస్సీ జీనోమిక్స్ సైన్సెస్, ఎమ్మెస్సీ అప్లైడ్ సైకాలజీ, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటేషనల్‌ సోషల్ సైన్సెస్‌, జియోస్పేషియల్‌ ఇన్ఫర్మటిక్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వంటి అనేక కొత్త కోర్సులు ఉన్నాయి. వాటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పలు కోర్సులనూ ప్రవేశపెట్టారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రముఖ విశ్వవిద్యాలయాలు అమలు చేస్తున్న సోషల్, సైన్స్ మిళితంగా కొత్త కోర్సులను అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో అమలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీలో 30 యూజీ, 6 పీజీ, 4సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఏ సెంట్రల్ వర్సిటీలో లేని కోర్సులు ఇక్కడ ఉండటంతో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు యూజీ, పీజీ కోర్సుల్లో ఏటా 1,470 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. మొత్తం 10 వేల మంది విద్యార్థులకు సౌకర్యాలు కల్పించే ప్రణాళికతో మరిన్ని వసతులు కల్పించనున్నారు. మరో విషయం ఏంటంటే ఇక్కడ ఆధునిక కోర్సులు చదివిన విద్యార్థులు మల్టీ నేషనల్ కంపెనీలకు సేవలు అందించడానికి సిద్ధం అవుతున్నారు. అందుకోసం సొంతంగా స్టార్టప్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి కొందరు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.

650కి పైగా అత్యాధునిక సీసీ కెమెరాలు: ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్ యూనివర్సిటీకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వర్సిటీ ఆధునిక సాంకేతిక, సమాచార పరిజ్ఞానం 100% అమలు చేస్తోంది. విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశించడం మొదలుకుని ఎక్కడికి వెళ్లారు? వర్సిటీలోని ఏ భవనం వద్ద ఎంత సమయం గడిపారు? ఎప్పుడు తిరిగి వెళ్లారు? వంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు నమోదు అవుతాయి. యూనివర్సిటీలో ప్రతి అంగుళాన్ని కవర్ చేసేలా 650కి పైగా అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

కెమెరాలన్నీ విద్యుత్ సరఫరా నిలిచిపోయిన అంటే చీకటిలో కూడా ప్రతి కదలికను రికార్డు చేస్తాయి. అలాగే, తరగతి గదులు, వసతి గృహాలు సహా ఎక్కడైనా ఇబ్బంది జరిగినా వెంటనే స్పందించే సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీన్నిబట్టి విద్యార్థుల భద్రతకు సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం పెద్దపీట వేసిందని అర్థం చేసుకోవచ్చు. అందుకే, ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే తొలి స్మార్ట్ సెంట్రల్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది.

ఏకైక యూనివర్సిటీగా ప్రత్యేక గుర్తింపు: యూనివర్సిటీలోని ప్రతి తరగతి గదిలో స్మార్ట్ బోర్టులు ఏర్పాటు చేశారు. బోర్టులన్నీ వర్సీటీ సొంతంగా ఏర్పాటు చేసుకున్న డేటా సెంటర్‌కు అనుసంధానమై ఉంటాయి. ప్రపంచంలో కొత్త విషయాలతో పాటు, వివిధ దేశాల నుంచి నిపుణులు బోధించేలా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ డేటా సెంటర్‌లో విద్యార్థుల వివరాలు, పరీక్షలు, ఫలితాలు, భద్రతా వ్యవస్థ వంటివన్నీ నిక్షిప్తమై ఉంటాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి కూడా భిన్నంగానే ఉంటుంది. సెమిస్టర్ పరీక్ష రాసిన మూడు, నాలుగు గంటల్లోనే ఫలితాలను విద్యార్థుల మొబైల్స్‌కి పంపిస్తున్నారు. దేశంలో పరీక్ష రాసిన రోజు ఫలితాలు అందించే ఏకైక యూనివర్సిటీగా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి గుర్తింపు వచ్చింది. అలాగే, సోలార్‌ పార్క్, ఏఐ ఆధారిత ల్యాబ్‌లు, డిజిటల్‌ లైబ్రరీ ఇతర సౌకర్యాలు కల్పించారు.

మొత్తంగా చూస్తే అత్యాధునిక సదుపాయాలు, సాంకేతికత, సరికొత్త కోర్సులతో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలను వంద శాతం అమలు చేస్తోంది. ఫలితంగా దేశంలోనే స్మార్ట్ వర్సిటీగా గుర్తింపు పొందింది. ఇక రెండో దశ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అది పూర్తయితే ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలు ఈ యూనివర్సిటీలో అందుబాటులోకి రానున్నాయి.

దేశంలో చక్కెర ధరల పెరుగుదలకు 'ఇథనాల్' కారణమా?

ఉచితంగా ఖరీదైన వైద్యం - 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ క్యాన్సర్‌ ఆసుపత్రి