ETV Bharat / opinion

ఉపాధ్యాయులకు 'టెట్' తప్పనిసరి - అనుభవం కాదు అర్హతే కీలకమన్న సుప్రీంకోర్టు

ప్రస్తుతం పరీక్ష కాలాన్ని ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు - ఈ ఏడాది మేలో కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

AP TET For In Service Teachers
AP TET For In Service Teachers (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 4, 2026 at 8:00 PM IST

6 Min Read
Choose ETV Bharat

AP TET For In Service Teachers : విద్యార్థులకు పరీక్షలు పెట్టే ఉపాధ్యాయులు ప్రస్తుతం పరీక్ష కాలాన్ని ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం టెట్ నిబంధన. ఒకప్పుడు కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి మాత్రమే పరిమితం అనుకున్న ఈ నిబంధన ఇప్పుడు దశాబ్దాల సర్వీసు ఉన్న పాత ఉపాధ్యాయులకు తప్పనిసరిగా మారింది. ఈ విషయంపై ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2010 కంటే ముందు విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు కూడా టెట్ పరీక్షకు అర్హత సాధించాలని స్పష్టం చేసింది. నిజానికి దేశవ్యాప్తంగా ఇదే హైరానా నడుస్తోంది. ప్రస్తుతం ఓ వైపు న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షకు సన్నద్ధం అవుతున్నారు. ఇంతకీ టెట్ నిబంధన విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఏంటి? ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా మళ్లీ ఇలా ఎందుకు పరీక్ష రాయాల్సి వస్తోంది? పూర్తి వివరాలు ఈ కథనంలో

రివ్యూ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు : రాష్ట్రంలో దాదాపు 1.8 లక్షల నుంచి 2 లక్షల వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు వివిధ యాజమాన్యాల కింద విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో సింహభాగం మంది ప్రస్తుతం పరీక్షలు రాసేందుకు సన్నద్ధం అవుతున్నారు. అదే ఉపాధ్యాయుల అర్హత పరీక్ష అందుకు కారణం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు. ఈ ఏడాది మే 29న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన అత్యున్నత ధర్మాసనం ఉపాధ్యాయుల రివ్యూ పిటిషన్లను కొట్టివేస్తూ కీలక తీర్పు వెల్లడించింది. విద్యాహక్కు చట్టం ప్రకారం పిల్లలకు నాణ్యమైన విద్య అందడం రాజ్యాంగ బద్ధమైన హక్కు అని తెలిపింది. ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం పిల్లల భవిష్యత్తుతో రాజీ పడలేమని స్పష్టం చేసింది. సర్వీసులోని ఉపాధ్యాయులందరూ టెట్ పరీక్షకు ఉత్తీర్ణత తప్పనిసరి అని తేల్చి చెప్పింది. టెట్ పాస్ కావడానికి గతంలో ఇచ్చిన గడువు ఏడాది పొడిగిస్తూ 2028 ఆగస్టు 31 వరకు అవకాశం ఇచ్చింది. ఇదే ఆఖరి అవకాశమని, భవిష్యత్తులో గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది.

ఉపాధ్యాయులకు 'టెట్' తప్పనిసరి - అనుభవం కాదు అర్హతే కీలకమన్న సుప్రీంకోర్టు (ETV Bharat)

వీరికి మినహాయింపు : మరికొన్ని కీలక విషయాలు కూడా కోర్టు చెప్పింది. టెట్‌ పరీక్షకు అర్హత సాధించకపోతే ఉద్యోగాల నుంచి తొలగించడం లేదా నిర్బంధ పదవీ విరమణ తప్పదని హెచ్చరించింది. పదవీ విరమణకు 5ఏళ్ల కంటే తక్కువ పదవీ కాలం ఉండి దాదాపు 57 ఏళ్లు పైబడిన సీనియర్ ఉపాధ్యాయులకు మాత్రం టెట్‌ పరీక్ష రాయడం నుంచి మినహాయింపు ఇచ్చింది. ఐతే, వీరికి ఎలాంటి పదోన్నతులు లభించవని తెలిపింది. ఉపాధ్యాయులకు తగినన్ని అవకాశాలు కల్పించడంతో పాటు, వారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత విద్యాశాఖ అధికారులు ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని ఆదేశించింది.

కనీస ప్రమాణాలు ఉండాలనే లక్ష్యం: మరి, సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వెనకున్న కారణాలేంటని చూస్తే దేశంలో ప్రాథమిక విద్యకు సంబంధించి ఒకటో తరగతి నుంచి 8వరకు బోధించే ఉపాధ్యాయులకు కనీస ప్రమాణాలు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం-2009ని తీసుకొచ్చింది. దీని ఆధారంగా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి 2010 ఆగస్టు 23న మార్గదర్శకాలు విడుదల చేసింది. అప్పటి నుంచి ఉపాధ్యాయ నియామకాలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష - టెట్ కనీస అర్హతగా మారింది. ఐతే, ఇక్కడే ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి.

2010 కంటే ముందు విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు ఇది వర్తించదనే ఉద్దేశంతో వారెవరూ ఇన్నాళ్లూ టెట్ రాయలేదు. కానీ, వారికి కూడా టెట్ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుకోసం తప్పనిసరిగా పరీక్ష రాయాలని తేల్చిచెప్పింది. దీంతో రాష్ట్రంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఐతే, రాష్ట్రంలో టెట్‌ రాయాల్సిన టీచర్లు సుమారు 80 వేల వరకు ఉన్నారు. వీరిలో 56 వేలకు పైగా దరఖాస్తు చేశారు. ప్రస్తుతం వీరంతా పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఐతే, గతేడాది నిర్వహించిన టెట్‌కు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు 31,886 మంది హాజరు కాగా ఇందులో 15,239 మంది అర్హత సాధించారు.

ఆగస్ట్‌ 5 నుంచి 21 వరకు టెట్‌ పరీక్షలు : సుప్రీంకోర్టు తీర్పులను గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందనేది నిపుణులు చెబుతున్న మాట. అందుకే రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే టెట్ పరీక్ష నిర్వహిస్తోంది. జూన్‌ 5 నుంచి జులై 5 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపునకు అవకాశం కల్పించింది. ఆగస్ట్‌ 5 నుంచి 21 వరకు టెట్‌ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్‌లో ఫలితాలు వెల్లడించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు SGT నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా లేదా ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతి పొందాలంటే టెట్‌ పేపర్-2 అర్హతను ప్రభుత్వం విధిగా చేస్తోంది. అలాగే, 2028 లోపు మిగిలిన వారంతా ఉత్తీర్ణులు అయ్యేలా అవకాశాలు కల్పించాలని విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

టెట్ పరీక్షతో పెద్ద పరీక్షనే : అయితే సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ పరీక్షపై ఇప్పటికీ కొందరు టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు అన్యమనస్కంగానే కనిపిస్తున్నాయి. తరగతి గదుల్లో దశాబ్దాల అనుభవం ఉన్న తమను అర్హత పరీక్ష ఎదుర్కోవాలని అనడంతో విచిత్రమైన పరిస్థితుల్లో పడ్డామని అంటున్నారు. ఏదేమైనా 45 నుంచి 55 ఏళ్ల వయసులోని ఉపాధ్యాయులకు ఇప్పుడు మళ్లీ పుస్తకాలు పట్టి, చైల్డ్ డెవలప్‌మెంట్, సైకాలజీ, మ్యాథ్స్ వంటి సబ్జెక్టులు చదవడం కత్తిమీద సాములా మారింది. ఇటీవల డిగ్రీలు పూర్తి చేసి, రాత్రింబవళ్లు చదివే యువ టీచర్లతో కలిసి, అదే పరీక్షా కేంద్రంలో కూర్చుని తాము పరీక్ష రాయడం ఇబ్బందికరంగా ఉందని అంటున్న వారూ ఉన్నారు. గతంలో నిర్వహించిన కఠినమైన డీఎస్సీ పరీక్ష రాసి, మెరిట్ సాధించి ఉద్యోగాల్లో చేరామని, ఇప్పుడు మళ్లీ కొత్తగా టెట్ పరీక్షతో పెద్ద పరీక్షనే ఎదుర్కొంటున్నామని అంటున్నారు.

నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియ : టెట్ పరీక్ష మరో సమస్యకు కారణంగా మారింది. అందేంటంటే ప్రస్తుతం టెట్ దరఖాస్తులు, పరీక్షల వల్ల పాఠశాలల్లో పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. ఏళ్లుగా సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తూ, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాలని ఎదురుచూస్తున్న వారికి 'టెట్ పేపర్-2' తప్పనిసరి కావడం అడ్డంకిగా మారింది. ఈ నిబంధన వల్ల తమ కంటే జూనియర్లు టెట్ పరీక్షకు అర్హత సాధించి పదోన్నతులు పొందుతున్నారని తాము మాత్రం కింది స్థాయిలోనే ఉండిపోవాల్సి వస్తోందని కొందరు సీనియర్లు టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుప్రీంకోర్టు గడువును గౌరవిస్తూ : మొత్తంగా చూస్తే మాత్రం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒకవైపు చట్టపరంగా పోరాడుతూనే- మరోవైపు సుప్రీంకోర్టు గడువును గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నారు. వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఉద్యోగ గండం నుంచి గట్టెక్కేందుకు, పదోన్నతులు సాధించేందుకు మళ్లీ విద్యార్థులుగా మారుతున్నారు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత స్టడీ మెటీరియల్స్ సేకరించడం, ఆన్‌లైన్ క్లాసులు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా సన్నద్ధం అవుతున్నారు. సత్ఫలితాలు సాధిస్తున్నారు కూడా. మునుపటి టెట్ ఫలితాలే అందుకు ఉదాహరణ. జనవరి 2026 ఏపీ టెట్ ఫలితాలను గమనిస్తే పరీక్ష రాసిన వారిలో 47.82% ఉత్తీర్ణత సాధించారు. వయసు నిండి, బాధ్యతలు ఉన్నా దాదాపు సగం మంది మొదటి ప్రయత్నంలోనే క్వాలిఫై కావడం వారి పట్టుదల, సామర్థ్యానికి నిదర్శనం.

రాష్ట్రంలో ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఇప్పటికీ కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు విద్యాహక్కు చట్టంలోని నిబంధనల ఆధారంగా వచ్చింది. కాబట్టి, కేంద్రం చొరవ తీసుకుని పార్లమెంటులో ఈ చట్టానికి సెక్షన్ 23 సవరణ తీసుకురావాలని కోరుతున్నారు. 2010 కంటే ముందు నియమితులైన వారికి టెట్ నుంచి శాశ్వత మినహాయింపు ఇచ్చేలా చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లేదు.

ప్లంబర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్ సేవలు - ఒక్క క్లిక్‌తో సొల్యూషన్

పాపికొండలు విహారయాత్రకు పచ్చజెండా - 20 రోజుల బ్రేక్​ తర్వాత మళ్లీ బోటింగ్