ETV Bharat / opinion

ఏఐతో మెరుగుపడనున్న జీవన ప్రమాణాలు - 15-20 ఏళ్లలో ఉచిత సేవలు!

అనేక పనులను సులభంగా చేసి పెడుతోన్న ఏఐ - ఐతే ఏఐతో కొన్ని సవాళ్లు ఉన్నాయంటున్న నిపుణులు - ఏఐ వల్ల ఉద్యోగాలో కోత, పరిష్కారాలపై సమ్మిట్​లో నిపుణుల సలహాలు

Idi Sangathi on  AI Opportunities And Threats
Idi Sangathi on AI Opportunities And Threats (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 17, 2026 at 6:40 PM IST

4 Min Read
Choose ETV Bharat

Idi Sangathi on AI Opportunities And Threats: నిన్నా మొన్నటి వరకు మనుషులకు ఏ సందేహం వచ్చినా మొదట గుర్తుకు వచ్చే పేరు గూగుల్‌. అయితే ఇప్పుడు ఆ రోజులు దూరం అవుతున్నాయి. ఎందుకంటే అంతకు ఎన్నో రెట్లు మెరుగైన ఏఐ రావడమే. సమాచారాన్ని కావాల్సిన రీతిలో అందించడమే కాదు వ్యవసాయం, విద్య, వైద్యం ఇలా అనేక రకాల సేవలను అందిస్తూ మనిషి జీవితాన్ని సులభతరం చేస్తోంది ఏఐ.

ఇంత వరకు బాగానే ఉంది కానీ ఇది ఉద్యోగాలకు ఎసరు పెట్టే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా గొప్పగా భావించే ఐటీ ఉద్యోగాలను కబళించబోతోందని నిపుణుల హెచ్చరిక. అదే కాదు ఏఐతో మరి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. మరి నాలుగు రోజుల ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ ఇలాంటి సానుకూలతలు, ప్రతికూలతలపై ఏం చర్చించనుంది. సానుకూలతల్లో అవకాశాలను, ప్రతికూలతలకు పరిష్కారాలు ఎలా వెతకనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏఐతో ఉద్యోగాలకు ప్రమాదమా? పరిష్కారాలపై సమ్మిట్​లో సలహాలను ఇవ్వనున్న నిపుణులు (ETV Bharat)

లోతైన మేథోమథనం: ఏదైనా కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చినపుడు మంచితో పాటు చెడును కూడా మోసుకురావడం సహజం. కాలంతో పాటు కొన్ని ప్రతికూలతలు దూరం అవుతుంటాయి కూడా. ఏఐ ఇప్పుడు అనేక పనులను సులభంగా చేసి పెడుతోంది అని సంబరపడుతున్నా నిపుణులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాల ప్రకారం కొన్ని సవాళ్లు పొంచి ఉన్నాయి. 5 రోజుల ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ ఇలాంటి అంశాలతో పాటు సానుకూలతల నుంచి మరిన్ని అవకాశాలను ఎలా వెతుక్కోవడం అనే విషయాలపై లోతైన మేథోమథనం జరపనుంది.

ప్రపంచ నలుమూలల నుంచి దిగ్గజ ఐటీ ప్రముఖులు, పలువురు దేశాధినేతలు కూడా తరలివస్తున్న ఈ సదస్సులో ఐదు రోజుల పాటు 700 సెషన్లు నిర్వహిస్తూ ఉండడమే ఇందుకు నిదర్శనం. భారత్‌ నిర్వహిస్తున్న సమ్మిట్‌లో ఏఐకి సంబంధించి మన మార్కెట్‌ సైజు, పరిశోధనలు, ఇక్కడ ఉన్న అవకాశాల గురించి వివరించడమే ప్రధాన అంశమైనా ఆ సాంకేతికతకు సంబంధించిన ప్రతి అంశంపైనా విస్తృతంగా చర్చిస్తారు. ఏఐ వల్ల ఉద్యోగాల్లో కోత, దానికి పరిష్కారాలు, ఏఐ భద్రత, పాలన, నైతిక వినియోగం, డేటా రక్షణ ఇలా దానితో ముడిపడిన ప్రతి అంశంపైనా శక్తిమంత చర్చలకు ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ వేదిక కానుంది.

శక్తిమంత చర్చలకు వేదిక: ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని చాలా కాలంగా వినిపిస్తున్న మాటే. ఒక రకంగా ఏఐతో పొంచి ఉన్న మొదటి సవాలు కూడా ఇదే. ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు జరుగుతున్న వేళ పలువురు నిపుణులు ఇదే అభిప్రాయం మరోసారి వ్యక్తం చేశారు. బిలియనీర్‌ వినోద్‌ ఖోస్లా మాటల ప్రకారం రానున్న 5ఏళ్లలో ఏఐ టూల్స్‌ వల్ల ఐటీ సేవలు, బీపీఓలు దాదాపు మాయం కానున్నట్లు అంచనా. 15 ఏళ్లలో నైపుణ్య ఆధారిత వృత్తులు ఉండబోవని హెచ్చరించారు. కార్మికుల స్థానంలో భర్తీ చేసే రోబోలకు చెల్లించే వ్యయం చాలా తక్కువ ఉండనుందని అన్నారు.

తాజాగా నాస్కామ్‌, ఇండీడ్‌ నివేదిక కూడా అచ్చు ఇదే అభిప్రాయం వెల్లడించింది. ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలు ఏఐ ఆక్రమిస్తోందని, నిపుణులు బహుళ నైపుణ్యాలు నేర్చుకోవడంతో పాటు నిరంతర నైపుణ్యాభివృద్ధి తోనే ఉద్యోగ ప్రస్థానంలో ముందుకు సాగే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇక ఏఐతో రాబోయే ఇతర సవాళ్ల విషయానికి వస్తే సగానికి పైగా సందర్భాల్లో అసంపూర్ణ, తక్కువ నాణ్యత కల్గిన ఫలితాలు వస్తున్నాయనే వాదన ఉంది.

నిపుణులు సమగ్ర చర్చల ద్వారా పరిష్కారం: దీంతో పాటు సమాచార భద్రత, గోప్యత ప్రమాదాలు, డీప్‌ ఫేక్‌ సాంకేతికతతో దుర్వినియోగం చేయడం, విలువలు, పరిపాలన సమస్యలు వంటి ఇతర అనేక సవాళ్లు ఉన్నాయి. ఇలాంటి ప్రతి అంశంపైనా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో నిపుణులు సమగ్ర చర్చలు సహా ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా పరిష్కారం రాబట్టే ప్రయత్నం చేయనున్నారు.

అన్నింటా ఏఐ హవా: కృత్రిమ మేధ వల్ల తలెత్తే సవాళ్లను అధిగమిస్తూనే దాని సమర్థ వినియోగంపైనా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ చర్చించనుంది. ప్రపంచ మానవాళి శ్రేయస్సుకు దాన్ని ఎలా ఉపయోగించ వచ్చనే అంశంపై నిపుణులు సూచనలు, సలహాలు అందజేస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏఐ వల్ల రాబోయే రోజుల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. రానున్న 15 నుంచి 20 ఏళ్లలో చాలా వరకు సేవలు ఉచితం కావచ్చు. విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది.

ఉద్యోగులు, కార్మికులు, వ్యవసాయ రంగంలో చెల్లించే కూలీల ఖర్చు తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థపైనా సానుకూల ప్రభావం ఉంటుంది. ఇప్పటికే రోబోలు వైద్య సేవలు, వ్యవసాయ రంగంలో విత్తు విత్తడం, కలుపు తీయడం వంటివి చేస్తున్నాయి. ఇవే కాదు ఏఐ లేని రంగం ఏదీ అనిపిస్తూ అన్నింటా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఏఐ ప్రపంచ మానవ జీవన గతిని సమూలంగా మార్చేయవచ్చన్న అభిప్రాయం ఉంది. ఇలాంటి మార్పులు, అవి చూపించే ప్రభావాలపై ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో చర్చిస్తారు.

భవిష్యత్‌ మానవాళికి ఆలంబనగా: మానవ ప్రస్థాన క్రమంలో ఒక్కో తరంలో ఒక్కో అద్భుతం జరిగింది. ఇప్పటి మాటనే తీసుకుంటే మానవ జీవితంస్మార్ట్‌ ఫోన్‌కు ముందు, దాని తర్వాత అని లెక్కలు వేస్తే సంభవించిన మార్పులు, జీవితం సులభరంగా మారిన తీరు గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఏఐ వల్ల అతి త్వరలోనే అంతకు మించిన మార్పులు, సులభతరం జీవితం రానుంది. ఈ నేపథ్యంలో భారత్‌ వేదికగా జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో వెలువడే సూచనలు, అభిప్రాయాలు, తీసుకునే నిర్ణయాలు రాబోయే భవిష్యత్‌ మానవ జీవితానికి ఆలంబన కానున్నాయి.

గ్లోబల్ సౌత్‌లో మొదటిసారి - దేశ రాజధాని దిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌

ఎప్‌స్టీన్ ఫైల్స్‌ ఎఫెక్ట్ : భారత ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్ గైర్హాజరు!