జంతు ప్రపంచంలో ఈ 4 జీవులు ఎంతో ప్రత్యేకం - అవేంటో తెలుసా?
వింత జంతువులు - ప్రకృతి సృష్టించిన మాయాజాలం!

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 10, 2026 at 3:50 PM IST
Rare Creatures in The World : భూగోళంపై కోట్లాది జీవులున్నాయి. ఇందులో పాములు, చేప జాతులు అసంఖ్యాకం కాగా, నేటికీ అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలాయి. ఈ విశాలమైన విశ్వంలో అద్భుతమైన సౌందర్యాన్ని తలచుకుని ఒక్క క్షణం ఆగిపోయేలా చేసే అత్యంత అరుదైన జంతువులు కొన్ని ఉన్నాయి. అందులోనూ ప్రకృతి మాయాజాలంలోని అద్భుతమైన జీవుల గురించి తెలుసుకుందాం.

టార్డిగ్రేడ్ (Tardigrade)
టార్డిగ్రేడ్ అనేది భూమిపై దాదాపు అన్ని చోట్లా కనిపించే ఒక అద్భుత జీవి. మట్టి, నీరు లేదా మంచు ఇలా ఏ పరిస్థితుల్లోనైనా ఇవి జీవించగలవు. 'వాటర్ బేర్స్' (water bears) అని వీటికి మరో పేరు. వీటికున్న అసాధారణమైన దృఢత్వం, జీవశక్తి వీటిని ప్రత్యేకమైనవిగా చేస్తాయి. ఇవి చాలా చిన్నగా కేవలం 0.1 నుంచి 1.5 మిల్లీమీటర్ల పరిమాణంలో మాత్రమే ఉంటాయి.
మన భాష కుక్కలకు అర్థం అవుతుందా? - ఎలా అర్థం చేసుకుంటాయో తేల్చిన పరిశోధనలు!
శాస్త్రవేత్తలు ఈ జీవులను అనేకసార్లు అంతరిక్షంలోకి తీసుకెళ్లి పరిశోధనలు చేశారన్న విషయం మీకు తెలుసా? అంతరిక్షంలోని శూన్య ప్రదేశం, తీవ్రమైన ఉష్ణోగ్రతలను నేరుగా తట్టుకుని జీవించగలిగిన మొదటి జంతువులుగా ఇవి గుర్తింపు పొందాయి. వీటిని తీవ్రమైన వేడి లేదా చలిలో ఉంచినప్పుడు, వాటి శరీరాలు నిద్ర వంటి స్థితిలోకి వెళ్లిపోతాయి. ఈ స్థితిలో వాటి అంతర్గత శారీరక ప్రక్రియలు చాలా వరకు ఆగిపోతాయి, కానీ పరిసరాలు మళ్లీ అనుకూలంగా మారినప్పుడు అవి తిరిగి సాధారణ స్థితికి వస్తాయి.

'ఐ-ఐ' (Aye-aye)
'ఐ-ఐ' అనేది మడగాస్కర్‌లో మాత్రమే కనిపించే అత్యంత అరుదైన లెమూర్ జాతి జీవి. పెద్ద కళ్లు, పెద్ద చెవులు, పొడవైన, సన్నని ముక్కుతో విచిత్రమైన రూపాన్ని కలిగి ఉంటుంది. వీటి వేట పద్ధతి కూడా చాలా ప్రత్యేకమైనది. కీటకాలను గుర్తించిన తర్వాత, అవి తమ ప్రత్యేకమైన వేలితో చెట్లపై తట్టి శబ్దం చేస్తాయి. ఆ తర్వాత, ఆ కీటకాలను బయటకు తీసి నేరుగా నోటిలో వేసుకుంటాయి.
ఐ-ఐలను చూడాలంటే రాత్రిపూట మడగాస్కర్ను సందర్శించాలి. ఎందుకంటే ఇవి ఎక్కువగా రాత్రివేళల్లోనే చురుకుగా ఉంటాయి. కీటకాల జనాభాను నియంత్రించడం ద్వారా ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నా కొన్ని వర్గాల ప్రజలు వీటిని దురదృష్టానికి, మరణానికి సంకేతంగా భావిస్తున్నారు. అందుకే, నేడు ఇవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.

ఆక్సోలోటిల్ (Axolotl)
మెక్సికోలోని సరస్సులలో కనిపించే ఒక అందమైన జలచరం. కోల్పోయిన శరీర భాగాలను తిరిగి పెంచుకోగల అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. కాలు అయినా, తోక అయినా, లేదా మెదడు లేదా గుండెలోని భాగాలు అయినా సరే; ఆక్సోలోటల్ వాటిని తిరిగి పెరిగేలా చూసుకుంటుంది. పురుగులు, కీటకాలు, కొన్ని చిన్న చేపలు ఆక్సోలోటల్కు ఇష్టమైన ఆహారం. అయితే, ఐ-ఐ లాగే, ఈ జంతువులు కూడా కాలుష్యం కారణంగా తీవ్రంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.

పాంగోలిన్ (Pangolin)
పాంగోలిన్ (మన దగ్గర అలుగు) అనేది సిగ్గరి జంతువు. ఇది ప్రధానంగా ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. వాటి శరీరాలు చాలా గట్టిగా ఉండే పొలుసులతో కప్పబడి ఉంటాయి. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, తమను తాము రక్షించుకునేందుకు చిన్న బంతిలా ముడుచుకుంటాయి. వాటికి జిగురుగా ఉండే పొడవైన నాలుకలు ఉంటాయి. చీమలు, చెదపురుగులు వాటి ప్రధాన ఆహారం. వేటగాళ్ల కారణంగా ఇవి కూడా తీవ్రంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.
కోళ్ల ప్రపంచంలో 'లంబోర్గిని' - 'కడక్‌నాథ్' కంటే ఖరీదైన నల్లకోడి!
రోళ్లపాడు 'అతిథి' తిరిగొచ్చింది! - ఏడాదికి ఒకే గుడ్డు పెడుతుంది!

