మంచు కురిసే వేళలో మజానిచ్చే "ఎగ్ సూప్" - వేడి వేడిగా సిప్ చేస్తుంటే ఆహాఁ!
- కోడిగుడ్లతో కమ్మని "సూప్ రెసిపీ" - వేడి వేడిగా గొంతులోకి దిగుతుంటే ఆ కిక్కే వేరబ్బా!

Published : January 6, 2026 at 9:56 AM IST
Egg Drop Soup Recipe in Telugu : చల్లని క్లైమేట్లో వేడి వేడిగా సూప్ తాగుతుంటే ఆ కిక్కే వేరు. అందుకే, చాలా మంది ఈ సీజన్లో రకరకాల సూప్‌లు తయారు చేసుకుంటూ ఉంటారు. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని ఇవ్వడంతోపాటు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు మీ అందరి కోసం అలాంటిదే ఒక హెల్దీ అండ్ టేస్టీ సూప్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, టేస్టీ టేస్టీగా నోరూరించే "ఎగ్ సూప్". ఇది రుచిలో చికెన్ సూప్‌కి ఏమాత్రం తీసిపోకుండా రెస్టారెంట్ స్టైల్లో భలే కమ్మగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. గుడ్డుతో చేసే ఈ సూప్ నీచు వాసన కూడా రాదు. అలాగే, దీన్ని పదే పది నిమిషాల్లో క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మరి, లేట్ చేయకుండా కోడిగుడ్లతో అద్దిరిపోయే ఈ సూప్‌ను ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :
- కోడిగుడ్లు - రెండు
- నెయ్యి - ఒక టీస్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
- సన్నని ఉల్లిపాయ తరుగు - నాలుగు టేబుల్‌స్పూన్లు
- సన్నని క్యారెట్ ముక్కలు - నాలుగు టేబుల్‌స్పూన్లు
- ఉప్పు - రుచికి తగినంత
- మిరియాలు - ఒక టీస్పూన్
- కార్న్‌ఫ్లోర్ - మూడు టీస్పూన్లు
- సన్నని కొత్తిమీర తరుగు - కొద్దిగా
- నిమ్మరసం - నాలుగైదు టీస్పూన్లు
స్పైసీ స్పైసీగా అద్దిరిపోయే "చికెన్ రసం" - ఈ సీజన్లో తప్పక ట్రై చేయాల్సిందే!

తయారీ విధానం :
- ఈ సూప్ తయారీ కోసం ముందుగా రెసిపీలోకి అవసరమైన పరిమాణంలో సన్నని ఉల్లిపాయ తరుగు, క్యారెట్ ముక్కలను రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే, మిరియాలను కచ్చాపచ్చాగా పొడిలా దంచుకుని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక అందులో ఫ్రెష్‌గా దంచిన అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి.
- ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు వేసి దోరగా వేయించుకోవాలి.
- ఆనియన్స్ వేగాక సన్నని క్యారెట్ ముక్కలు వేసుకుని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.

- అనంతరం అందులో నాలుగు గ్లాసుల నీళ్లు (ఒక లీటర్) పోసుకోవాలి. ఆపై రుచికి తగినంత ఉప్పు, దంచి పెట్టుకున్న మిరియాల పొడి వేసుకుని కలిపి బాగా మరిగించుకోవాలి.
- అది మరిగేలోపు ఒక చిన్న గిన్నెలో రెండు గుడ్లను పగులగొట్టి పోసుకుని అంతా కలిసేలా బాగా బీట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద ఉన్న సూప్ మరగడం స్టార్ట్ అయ్యాక అందులో బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని నెమ్మదిగా కొద్దికొద్దిగా పోసుకుంటూ బాగా కలపాలి. అప్పుడే ఎగ్ అనేది చిన్న చిన్న పీసెస్‌గా వస్తుంది.
- అలా ఎగ్ మిశ్రమం మొత్తం వేసుకుని కలిపాక ఒక నిమిషం మరగనివ్వాలి.

- ఈలోపు సూప్ చిక్కగా ఉండడానికి ఒక చిన్న గిన్నెలో మొక్కజొన్న పిండిని తీసుకుని కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా పల్చని పేస్ట్‌లా కలుపుకోవాలి.
- తర్వాత దాన్ని స్టవ్ మీద మరుగుతున్న సూప్‌లో వేసి బాగా కలిపి మరో మూడ్నాలుగు నిమిషాలు మరిగించుకోవాలి.
- ఆ విధంగా మరిగించుకున్నాక చివర్లో మంచి టేస్ట్ కోసం కొత్తిమీర తరుగు, నిమ్మరసం యాడ్ చేసుకుని కలిపి దింపేసుకుంటే చాలు.
- అంతే, వేడి వేడిగా సూపర్ టేస్టీ అండ్ హెల్దీ "ఎగ్ సూప్" నిమిషాల్లోనే మీ ముందు ఉంటుంది!
- మరి, నచ్చితే మీరూ ఈ సీజన్లో తప్పకుండా ఓసారి ఇలా ఎగ్ సూప్ ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ వావ్ సూపర్ అంటూ జుర్రుతూ తాగేస్తారు!

చిట్కాలు :
- సూప్‌లో ఎగ్ మిశ్రమాన్ని పోసేటప్పుడు కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అలాకాకుండా ఒక్కసారే వేసుకుంటే ఎగ్ మిశ్రమం పెద్ద పెద్ద పీసెస్‌లా కనిపిస్తుందని గుర్తుంచుకోవాలి.
- ఒకవేళ మీరు నెయ్యి వద్దనుకుంటే దాని ప్లేస్‌లో బటర్ లేదా నూనె తీసుకుని కూడా దీన్ని రెడీ చేసుకోవచ్చు.
- అలాగే, మీరూ ఈ సూప్‌ను తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఎగ్స్తోపాటు ఇతర పదార్థాలను తగ్గించి తీసుకుంటే సరిపోతుంది.
పల్లీలను ఇలా వేయించి "చట్నీ" చేయండి - టేస్ట్ అదుర్స్, వారం రోజులు నిల్వ!
హోటల్ స్టైల్ "మటన్ కీమా కర్రీ" - మసాలా ఘాటుతో అద్దిరిపోతుంది - పిల్లలూ లైక్ చేస్తారు!

