చెట్లకు 'నంబర్లు' ఎందుకు వేస్తారో తెలుసా? - అందుకు గల కారణాలివే!
చెట్టు చరిత్ర, ఆరోగ్యాన్ని తెలియజేసే నంబర్! - అనేక రకాల ఉపయోగాలూ ఉంటాయంటున్న నిపుణులు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 28, 2026 at 11:31 AM IST
Why are Numbers Written on Trees : అడవిలో, రోడ్ల పక్కన చెట్ల కాండాలపై పెయింట్‌తో వేసిన నంబర్లు, లేదంటే చిన్న మెటల్ ట్యాగ్లు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే చాలా మందికి చెట్లకు అలా నంబర్లు ఎందుకు వేస్తారు? అనే సందేహం వస్తుంటుంది. కానీ, మీకు తెలుసా? మీకు కేవలం ఒక నంబర్‌గా కనిపించే దాని వెనుక ఆ చెట్టు చరిత్ర, ఆరోగ్యం దాగి ఉంటుందంటున్నారు నిపుణులు. అంతేకాదు, పరిశోధనల కోసమూ అవి ఉపయోగపడతాయంటున్నారు. మరి, అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అటవీ శాఖ చెట్లకు నంబర్లు వేయడం వెనుక అనేక శాస్త్రీయ కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఒక్కో చెట్టుకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం ద్వారా ఆ వృక్షం జాతి, పరిమాణం, పెరుగుదల, ఆరోగ్యం, వయసు తదితర వివరాలను నమోదుచేసి, ఏళ్ల తరబడి పర్యవేక్షించవచ్చంటున్నారు. రోడ్ల విస్తరణ సమయాల్లో 'ట్రీ ట్రాన్స్ లొకేషన్' (చెట్ల తరలింపు) చేయడానికి ఈ నంబర్స్ ఉపయోగపడతాయంటున్నారు.
వేల ఎకరాల్లో అడవి, శాంపిల్ ప్లాట్‌తో లెక్క :
దేశంలో 3708 రకాల వృక్షజాతులున్నాయని అంచనా. తెలంగాణలో ఆ సంఖ్య 535. అడవి అంటే వరుసగా నాటిన తోటలా ఉండదు. చెట్లు ఒకదానికొకటి దూరంగా, జిగ్ జాగ్గా, వేర్వేరు జాతులకు చెందినవిగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో దట్టంగా, మరి కొన్ని చోట్ల పలుచగా ఉంటుంటాయి చెట్లు. వందల, వేల ఎకరాల్లో ఉన్న ప్రతి చెట్టును లెక్కించడం, కొలవడం ఆచరణలో చాలా కష్టతరమైన పని. అందుకే అటవీ శాస్త్రంలో 'శాంపిల్ ప్లాట్' లేదా నమూనా ప్రాంతాల పద్ధతిని ఉపయోగిస్తారు. మొత్తం అడవికి ప్రాతినిధ్యం వహించేలా అక్కడక్కడా నిర్దిష్ట పరిమాణంలో ప్రాంతాలను ఎంపిక చేసి, ఆ ప్రాంతంలోని చెట్లను లెక్కిస్తారు.
ఉదాహరణకు 0.1 హెక్టారు నమూనా ప్రాంతంలో ఎన్ని చెట్లున్నాయి? ఏయే జాతులు ఉన్నాయి? ఒక్కో చెట్టు చుట్టుకొలత, ఎత్తు, వయసెంత ఉండొచ్చు? పెరుగుదల ఎలా ఉంది? వంటి వివరాలను నమోదు చేస్తారు. ఆ నమూనా ప్రాంతం సమాచారాన్ని పెద్ద విస్తీర్ణానికి వర్తింపజేసి మొత్తం అడవిలోని వృక్ష సంపదను అంచనా వేస్తారని చెబుతున్నారు నిపుణులు.
ట్రీ ఐడీతో చెట్టుకు శాశ్వత గుర్తింపు :
శాంపిల్ ప్లాట్లోని చెట్లకు నంబర్లు వేయడం వల్ల ఒక్కో చెట్టుకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఉదాహరణకు ఒక చెట్టుకు '101' నంబర్ ఉంటే, ఆ నంబర్‌కు సంబంధించిన రికార్డులో ఆ చెట్టు జాతి, వ్యాసం లేదా చుట్టుకొలత, ఎత్తు, స్థానం తదితర వివరాలను నమోదు చేయొచ్చు. కొంతకాలం అయ్యాక అదే చెట్టును మళ్లీ పరిశీలిస్తే, పొడవు, చుట్టుకొలత ఎంత పెరిగాయి? ఆరోగ్యం ఎలా ఉంది? ఎండిపోయిందా? వ్యాధులు లేదా పురుగుల ప్రభావం ఉందా? వంటి అంశాలను చెట్టుకు కేటాయించే ప్రత్యేక నంబర్‌తో ఈజీగా తెలుసుకోవచ్చంటున్నారు.
భూమిపై అత్యంత సంతోషకరమైన జంతువు - దీనిని చూడగానే పర్యటకులూ నవ్వేస్తారు!
అడవి ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు :
ఒక ప్రాంతంలో ఏ జాతి వృక్షాలు అధికంగా ఉన్నాయి? కొత్తవి, పాతవి ఎన్ని? పెరుగుదల రేటు ఎలా ఉంది? వంటి అంశాలను తెలుసుకోవడానికి శాంపిల్ ప్లాట్లు ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు. ఆ ప్రాంతం నేల స్వభావం, భౌగోళిక పరిస్థితులు, భూభాగం ఆకృతి(టెరైన్), తేమ, వృక్ష సంపద తదితర అంశాలను కూడా పరిశీలిస్తారు. ఎర్రనేల, నల్లనేలలున్న ప్రాంతాల్లో వృక్షజాతుల్లో తేడాలు ఉన్నాయా? ఏ ప్రాంతంలో ఏ చెట్లు బాగా పెరుగుతున్నాయి? అనే అంశాలపై కూడా అధ్యయనం చేయొచ్చు.
ఒకే చెట్టును సంవత్సరాల తరబడి కొలిస్తే పెరుగుదలపై దీర్ఘకాలిక సమాచారంతో పాటు, వర్షపాతం మార్పులు, ఉష్ణోగ్రతలు, కరువు పరిస్థితులు వంటి పర్యావరణ మార్పుల ప్రభావం అడవిపై ఎలా ఉంది? చెట్ల పెరుగుదలలో మార్పులు వస్తున్నాయా? వంటి అంశాలనూ అధ్యయనం చేయొచ్చంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వు, అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వుల్లోని ఎంపికచేసిన నమూనా ప్రాంతాల్లో చెట్లకు నంబర్లు వేసి, వివరాలను నమోదు చేస్తుంటారు. ముఖ్యంగా టేకు, ఎర్రచందనం వంటి విలువైన కలప ఉన్న ప్రాంతాల్లో స్మగ్లింగ్ నేపథ్యంలోనూ నంబర్లు వేసే పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. పక్షులు, చిన్న జంతువులు, ఇతర వన్యప్రాణులు ఏ చెట్లపై ఆధారపడుతున్నాయో తెలుసుకునే పరిశోధనల కోసమూ వృక్షాలపై వేసే నంబర్లు ఉపయోగపడతాయంటున్నారు.
భూసేకరణకు ఉపయోగపడతాయి :
రైల్వే లైన్లు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, విద్యుత్, పైప్లైన్లు వంటి మౌలిక సదు పాయాల ప్రాజెక్టులకు భూసేకరణలో అటవీభూములనూ తీసుకుంటుంటారు. అక్కడ ఎన్ని చెట్లు ప్రభావితం అవుతాయి? అందులో ప్రత్యేక రకాల వృక్ష సంపద ఉందా? అనే అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రక్రియలో చెట్ల లెక్కింపు కీలకంగా ఉంటుంది. చెట్లు ఉన్న ప్రాంతాన్ని 'డీమ్డ్ ఫారెస్ట్'గా గుర్తించాలంటే ఐదు ప్రామాణికాల్ని చూస్తారు. ఒక హెక్టార్ ప్రాంతంలో 240కి పైగా చెట్లు ఉండటాన్ని అందులో కీలకమైందిగా పరిగణిస్తారంటున్నారు నిపుణులు.
కొత్త బియ్యం కంటే పాత బియ్యం ఎందుకు మంచివి? - రుచి, వాసనలో ఏవి బెస్ట్?
సోషల్ మీడియాలో 'హోమ్ టూర్' వీడియోలు పెడుతున్నారా? - ఆ తర్వాత ఆలోచించుకోవాల్సిందే!

