ఫ్రెండ్ కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్లి - Where is My Train యాప్ కనిపెట్టాడు!
- రైల్వే ప్రయాణికులు అధికంగా వినియోగించే యాప్ పుట్టుక వెనుక ఆసక్తికర కథనం! - శూన్యం నుంచి మొదలై వందల కోట్ల టర్నోవర్ కంపెనీగా!!

Published : August 16, 2026 at 12:22 PM IST
Where is my Train : "మనం ప్లాట్‌ఫాం నంబర్ 1లో ఉన్నాం. రైలు అటువైపు నాలుగో ప్లాట్‌ఫాంపైకి వచ్చేసిందట. మరో ఐదు నిమిషాల్లో బయలుదేరుతుందట. త్వరగా పదండి!" అంటూ పరుగులు తీయడం చాలా మందికి అనుభవమే. అయితే, ఇప్పుడు ఈ పరిస్థితి చాలా వరకు మారిపోయిందనే చెప్పాలి! దీనికి కారణం "వేర్ ఈజ్ మై ట్రైన్" యాప్. రైలు ప్రస్తుతం ఎక్కడుంది? ఎంత సేపట్లో మన స్టేషన్‌కు వస్తుంది? ఏ ప్లాట్‌ఫాంపైకి రాబోతోంది? ఎప్పుడు మన గమ్యం రీచ్ అవుతాము? వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. మరి, ఈ యాప్ ఎలా పుట్టిందో మీకు తెలుసా? ఎవరు తయారు చేశారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది? ప్రస్తుతం యాప్ పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.
ఓసారి ఇంజినీరింగ్ స్టూడెంట్ అహ్మద్ నిజాం మొహాయిదీన్ తన స్నేహితుడిని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాతే తెలిసింది, రైలు అరగంట ఆలస్యమని! ఈ సంఘటన అతనిలో ఆలోచనలు రగిలించింది. నాకు ఈ ఒక్కరోజు అరగంట ఎదురుచూడటమే అసహనంగా అనిపిస్తే, నిత్యం రైళ్లలో ప్రయాణించేవారు లక్షలాదిగా ఉంటారు. వారు ఎన్ని గంటలు ఇలా ఎదురుచూస్తుంటారో కదా అనిపించింది. ఈ పరిస్థితి లేకుండా రైలు ఎంత ఆలస్యం అవుతుందో? ఎప్పుడు స్టేషన్‌కు చేరుకుంటుందో అనే సమాచారం ముందుగానే తెలిస్తే బాగుంటుంది కదా! అనిపించింది. ఈ ఆలోచనే "వేర్ ఈజ్ మై ట్రైన్" పుట్టుకకు కారణమైంది.
అలా అహ్మద్, అరుణ్ ఆధ్వర్యంలోని "సిగ్మాయిడ్ ల్యాబ్స్" బృందం 2018లో యాప్‌ను ఆవిష్కరించింది. కానీ, ఇది అనుకున్నంత సులువుగా ఏమీ జరగలేదు. దీనికి ముందు అనేక ప్రయోగాలు చేశారు. ఎంతో కష్టపడ్డారు. రైలు కదలికలను సాధ్యమైనంత కచ్చితంగా గుర్తించేందుకు దాదాపు ఇరవై రకాల పద్ధతులను పరీక్షించారు. టాక్సీ యాప్‌లో కారు ఎక్కడుందో మ్యాప్‌పై కనిపించినట్టుగా, రైలు ఎక్కడుందో కూడా తెలుసుకునే వ్యవస్థ ఉంటే బాగుంటుందని భావించారు. కానీ, ఆ టెక్నాలజీ అభివృద్ధి చేయడం ఒక సమస్య అయితే, దాన్ని ప్రజలకు చేరవేయడం మరో పెద్ద సమస్యగా మారింది.
టీమ్ సభ్యులే స్వయంగా రైల్వే స్టేషన్లకు వెళ్లి ప్రయాణికులతో మాట్లాడేవారు. యాప్ గురించి వివరించి డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరేవారు. గంటల తరబడి ఎంతో మందిని కోరితే.. ఒకరిద్దరు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునేవారు. తమ స్నేహితులు. తెలిసినవాళ్లు రైలు ప్రయాణం చేస్తున్నారని తెలిస్తే, యాప్‌ను ఉపయోగించాలని కోరేవారు. వాళ్లు ఇచ్చిన సూచనలు, కంప్లైట్స్‌ను పరిశీలించి లోపాలను ఒక్కొక్కటిగా సరిచేస్తూ వచ్చారు.
ఇలా ఎన్నో సమస్యలను, సవాళ్లను అధిగమిస్తూ యాప్ ముందుకు సాగినప్పటికీ, ఆదాయం మాత్రం రాలేదు. యాడ్స్ లేకపోవడంతో టీమ్ మొత్తం ఆర్థికంగా ఇబ్బందులు ఫేస్ చేసింది. ఒక దశలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయారు. అయినా అహ్మద్ బృందం వెనక్కి తగ్గలేదు. వాళ్ల టార్గెట్ ఒక్కటే.. యాప్‌ను వీలైనంత ఎక్కువ మందికి చేరవేయాలి. అలా డౌన్ లోడ్స్ పెరిగితే, ఆ తర్వాత యాడ్స్, ఇన్వెస్ట్ మెంట్స్ వస్తాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. ఇదీ వారి క్లారిటీ.
ఆఫర్ వచ్చేసింది :
ఎట్టకేలకు వారి ఎదురు చూపులు ఫలించాయి. ఓ చైనా సంస్థ "వేర్ ఈజ్ మై ట్రైన్" యాప్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. ఇందుకోసం ఏకంగా 5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధపడింది. అంత పెద్ద ఆఫర్ రావడంతో మొదట టీమ్ ఆనందించింది. కానీ ఆ తర్వాత ఒక ప్రశ్న వేసుకుంది. "ఇప్పుడు యాప్ అమ్మేస్తే.. ఆ తర్వాత కొంత కాలానికి ఆ సంస్థ వేరే వాళ్లకి అమ్మితే లాభం ఎవరికి వస్తుంది?" అని ఆలోచించింది. అలా ఆ ఆఫర్‌ను వదులుకున్నారు.
ఆ తర్వాత గూగుల్ నుంచి పార్ట్నర్ షిప్ ఆఫర్ వచ్చింది. దానికి ఓకే చెప్పేశారు. గూగుల్ ఈ సంస్థలో భారీగా పెట్టుబడి పెట్టింది. దాంతో యాప్‌ను మరింత డెవలప్ చేయడానికి, కొత్త ఫీచర్స్ యాడ్ చేయడానికి అవకాశం లభించింది. అలా "వేర్ ఈజ్ మై ట్రైన్" తీరే మారిపోయింది.
రైలు ప్రయాణానికి సంబంధించిన సమాచారం ఇచ్చే యాప్స్ చాలానే ఉన్నాయి. అయితే, అవి ఇంటర్నెట్, జీపీఎస్ వంటి టెక్నాలజీపై ఆధారపడతాయి. కానీ "వేర్ ఈజ్ మై ట్రైన్" సెల్‌టవర్ల నుంచి ఇన్ఫో తీసుకొని, రైలు కదలికలను అంచనా వేస్తుంది. అందువల్ల ఇంటర్నెట్ సరిగా లేని ప్రాంతాల్లోనూ రైలు సమాచారం తెలుసుకోవచ్చు.
మరిన్ని సేవలు :
ప్రయాణికుడి కోచ్, బెర్త్ నంబర్ వంటి వివరాలను కూడా ఈ యాప్‌లో చూసుకోవచ్చు. మనం దిగాల్సిన స్టేషన్ చాలా దూరం ఉందని నిద్రలోకి జారుకుంటే ఇబ్బందే. అందుకే ఈ యాప్‌లో అలారం సెట్ చేసుకోవచ్చు. ఇంకా ట్రైన్ టైమింగ్స్, జర్నీ వివరాలు, టికెట్ బుకింగ్ వంటి సదుపాయాలు కూడా లభిస్తున్నాయి. అంతకాదు, నగరాన్ని మార్చుకుంటే అక్కడి లోకల్ ట్రైన్స్, మెట్రో రైళ్ల సమాచారాన్ని కూడా చూసుకోవచ్చు. ఇంగ్లిష్‌తోపాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, మలయాళం, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ఈ యాప్‌ను వాడుకోవచ్చు.
ఒక స్నేహితుడిని స్టేషన్‌లో రిసీవ్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు ఎదురైన సమస్య.. వందల కోట్ల రూపాయలు విలువ చేసే కంపెనీ పుట్టుకకు కారణమైంది. అందుకే, ఆరంభం ఏదైనా చిన్నగానే ఉంటుంది. సిన్సియర్‌గా చేసే నిరంతర ప్రయత్నమే దాన్ని ఇంతింతై అన్నట్టుగా ఎదిగేలా చేస్తుందని చెప్పడానికి "వేర్ ఈజ్ మై ట్రైన్" మరో చక్కటి ఉదాహరణ.

