టేస్టీ, యమ్మీ "దలియా" - ఈ స్వీట్‌తో ప్రతీ వేడుక సంతోషంగా జరుపుకోండి!
కొత్తగా ఈ స్వీట్ రెసిపీ ఇంట్లో ట్రై చేసి చూడండి - ఇంటిల్లిపాదీ సూపర్ అనాల్సిందే!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 4:32 PM IST
Daliya Making in Telugu : ఇండ్లలో వివిధ రకాల మిఠాయిలు తయారు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ ఇవే తిన్నాబోర్ అనిపిస్తుంది. అందుకే ఇవాళ మీకోసం తక్కువ టైమ్‌లో సింపుల్‌గా తయారయ్యే దలియా స్వీట్ రెసిపీని తీసుకొచ్చాం. గోధుమరవ్వతో చేసే ఈ స్వీట్‌ను ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని చాలా తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తగా చేసే వారు కూడా ఈ పద్ధతిని పాటిస్తూ ఈజీగా చేయోచ్చు.
పండుగలు లేదా చిన్నచిన్న వేడుకల్లో ఇలా చేసి ఇంటిల్లిపాదీకి సర్ప్రైజ్ ఇవ్వండి. మీకు స్వీట్ తినాలపించినప్పుడు ఈ విధంగా చేసి తిన్నారంటే మళ్లీమళ్లీ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఈ సింపుల్, టేస్టీ దలియా చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేయండి.
బజ్జీలో మిర్చీ తీసి పడేస్తున్నారా? - ఇలా ట్రై చేశారంటే టేస్టీగా ఎంతో బాగుంటుంది!

కావాల్సిన పదార్థాలు :
- గోధుమరవ్వ - ఒక కప్పు
- బెల్లం - ఒక కప్పు
- నెయ్యి - 6 టేబుల్ స్పూన్లు
- కిస్మిస్ - పావు కప్పు
- జీడిపప్పు - 10
- పిస్తా పలుకులు - 2 స్పూన్లు
- బాదం పలుకులు - 2 స్పూన్లు
- యాలకుల పొడి - అర స్పూన్

తయారీ విధానం :
- ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో కప్పు బెల్లం, రెండు కప్పుల నీళ్లు పోయాలి. బెల్లం కరిగిన తర్వాత వాటర్‌ను జాలితో గిన్నెలో వడకట్టి పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ పాన్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత రెండు స్పూన్ల బాదం పలుకులు, 10 జీడిపప్పు పలుకులు, రెండు స్పూన్ల పిస్తా పలుకులు, పావు కప్పు కిస్మిస్ వేసి వేయించి గిన్నెలో వేయాలి.

- ఇదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత కప్పు గోధుమరవ్వను వేసి దోరగా వేయించాలి. ఇది దోరగా వేగిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న బెల్లం వాటర్, అర స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.
- అనంతరం మూతపెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ పది నిమిషాల పాటు ఉడికించాలి.

- పది నిమిషాల తర్వాత వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
- అంతే టేస్టీటేస్టీ దలియా సిద్ధంగా ఉంటుంది!

- ఈ పద్ధతిని పాటిస్తూ ఇంట్లో చేశారంటే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ స్వీట్‌గా మారుతుంది!
- మీరు ఎక్కువ మోతాదులో ఈ స్వీట్‌ను చేయాలనుకుంటే గోధుమరవ్వ, బెల్లంతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.
బీట్రూట్తో ఇలా "పచ్చడి" చేయండి - అన్నం, టిఫిన్స్‌లోకి అద్దిరిపోతుంది!
లంచ్ బాక్స్‌లోకి "సూపర్ రెసిపీ" - 10 నిమిషాల్లో సింపుల్‌గా ఇలా చేసేయండి!

