'పాలసీ' మధ్యలో ఆపేస్తే డబ్బులు వెనక్కి వస్తాయా? - రూల్స్ తెలియకపోతే నష్టపోతారు!
జీవిత బీమా పాలసీని మధ్యలోనే రద్దు చేస్తున్నారా? - ఈ విషయాలు తెలిస్తే అలా చేయరంటున్న నిపుణులు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 9, 2026 at 4:41 PM IST
Life Insurance Policy Surrender Before Maturity : ప్రతి ఒక్కరి లైఫ్‌లో 'జీవిత బీమా' తీసుకోవడం అనేది చాలా ఒక ముఖ్యమైన అంశం. ఊహించని సంఘటనలు జరిగినప్పుడు కుటుంబానికి ఈ పాలసీ ఆర్థికంగా అండగా ఉంటుంది. అయితే, కొంతమంది ప్రీమియం కట్టలేకనో, ఇంకేదైనా కారణం చేతనో మధ్యలోనే పాలసీని ఆపేస్తుంటారు. ఇలా గడువుకు ముందే పాలసీని ఆపేయడం మంచిదా? దీని వల్ల ఎలాంటి నష్టాలుంటాయి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను గడుపు తీరకముందే మధ్యలోనే రద్దు చేసుకుంటే, ఇప్పటివరకూ చెల్లించిన ప్రీమియం మొత్తం తిరిగి రాదు. పాలసీ రూల్స్ ప్రకారం, లెక్కించే స్వాధీన విలువ(సరెండర్ వాల్యూ) మాత్రమే అందుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పాలసీ తీసుకున్న ప్రారంభ సంవత్సరాల్లోనే సరెండర్ చేస్తే, చెల్లించిన మొత్తంతో పోలిస్తే వచ్చేది చాలా తక్కువగా ఉండి, ఆర్థిక నష్టమే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
- పాలసీ గడువు ముగియకముందే పాలసీదారు దాన్ని రద్దు చేసుకుంటే బీమా కంపెనీ చెల్లించే మొత్తాన్ని 'స్వాధీన విలువ(సరెండర్ వాల్యూ)' అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మొత్తం కట్టిన ప్రీమియంతో ఈక్వల్‌గా ఉండదని గుర్తుంచుకోవాలి. ఇది పాలసీ టైమ్, ఎంతకాలం ప్రీమియం కట్టారు, వర్తించే రూల్స్, సరెండర్ వాల్యూ లెక్కించే విధానంపై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు.
- ఉదాహరణకు మీరు సంవత్సరానికి రూ.50 వేల ప్రీమియం కట్టే పాలసీని తీసుకొని, ఐదేళ్లలో రూ.2.50లక్షలు చెల్లించారనుకుందాం. ఐదో సంవత్సరం ఆ పాలసీని సరెండర్ చేసినప్పుడు, రూల్స్ ప్రకారం లెక్కించిన మొత్తాన్నే తిరిగి చెల్లిస్తారు.
- ముఖ్యంగా మీరు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని స్టార్టింగ్ స్టేజ్‌లో సరెండర్ చేస్తే, పాలసీ నిర్వహణ, పంపిణీ, బీమా రక్షణ తదితర ఖర్చుల వల్ల ఎక్కువ నష్టం ఉండొచ్చంటున్నారు నిపుణులు. కొన్ని ప్లాన్లలో నిర్ణీత కాలం గడిచే వరకూ ఎలాంటి స్వాధీన విలువ లభించకపోవచ్చంటున్నారు. అందుకే, పాలసీ తీసుకోవడానికి ముందే కొన్ని విషయాలను తెలుసుకోవడం మంచిదంటున్నారు.
- పాలసీ తీసుకోవడానికి ముందే సరెండర్ వాల్యూ ఎప్పటి నుంచి వర్తిస్తుంది? ఎంతొస్తుంది? దాన్ని ఎలా లెక్కిస్తారు? అనే వివరాలను తెలుసుకోవాలని చెబుతున్నారు.
- ఎండోమెంట్, మనీ-బ్యాక్ వంటి పాలసీలలో పొదుపుతోపాటు బీమా రక్షణ కూడా లభిస్తుంది. అందుకే, అలాంటి పాలసీలకు ప్రత్యేక సరెండర్ రూల్స్ ఉంటాయి. ఇక టర్మ్ పాలసీ విషయానికొస్తే, ఇది కేవలం బీమా రక్షణ కోసమే తీసుకునేది. దీనికి సరెండర్ వాల్యూ ఉండదని గమనించాలి.
'హోమ్ లోన్' తీసుకున్నారా? - వడ్డీ రేట్ల పెంపుతో మీ EMI ఎంత పెరగనుందంటే?
ప్రత్యామ్నాయాలు చూసుకున్నాకే :
ఒకవేళ మీరు పాలసీ ప్రీమియం పెరిగిందన్న కారణంతో దాన్ని సరెండర్ చేయాలనుకుంటే, వెంటనే స్వాధీనం చేయకుండా ప్రత్యామ్నాయాలు పరిశీలించాలంటున్నారు నిపుణులు.
పెయిడప్ :
అర్హత ఉన్న పాలసీల్లో ఇకపై ప్రీమియం కట్టకుండా, తగ్గిన ప్రయోజనాలతో పాలసీని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది.
పాలసీ రుణం :
రూల్స్‌కు లోబడి పాలసీపై ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందంటున్నారు నిపుణులు.
ఎంతొస్తుంది? :
ఒకవేళ మీరు పాలసీని ముగించాలని భావిస్తే, ప్రస్తుతం ఎంత మొత్తం వస్తుందో ముందుగానే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తెలుసుకోవాలి. దాన్ని బట్టి, డెసిషన్ తీసుకోవడం మంచిదంటున్నారు.
బీమా రక్షణ కోల్పోతారు :
పాలసీని సరెండర్ చేయగానే, దాంతోపాటు ఉన్న జీవిత బీమా రక్షణా కోల్పోతారని గుర్తుంచుకోవాలి. ఫ్యామిలీకి ప్రధాన ఆధారమైన వ్యక్తి తన పాలసీని ఆపేస్తున్నప్పుడు ఈ విషయాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. ఫ్యూచర్లో కొత్త ప్లాన్ తీసుకోవాలనుకుంటే, పెరిగే వయసు, ఆరోగ్య పరిస్థితుల ప్రభావం వల్ల ప్రీమియం పెరగొచ్చు. లేదా రూల్స్ కఠినతరం కావొచ్చు.
గుర్తుంచుకోండి :
పాలసీని మధ్యలో ఆపే ముందు కొన్ని విషయాలను పోల్చి చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఇప్పటివరకూ కట్టిన ప్రీమియం మొత్తం, ప్రస్తుతం లభించే సరెండర్ వాల్యూ, పాలసీని కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో వచ్చే బెనిఫిట్స్, ఫ్యామిలీకి రక్షణగా ఉండే జీవిత బీమా కవరేజీ ఇవన్నీ పరిశీలించుకోవాలి. ముఖ్యంగా కేవలం తక్షణ అవసరాల కోసం డబ్బు చేతికి వస్తుందన్న లక్ష్యంతో దీర్ఘకాలిక లక్ష్యాలతో తీసుకున్న పాలసీని రద్దు చేసుకోవడం సరైన నిర్ణయం కాకపోవచ్చని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.
గోల్డ్ లోన్ Vs పర్సనల్ లోన్ : వడ్డీ దేనిలో తక్కువ? - రెండింటిలో ఏది మంచి ఎంపిక?
పండుగ ఖర్చులకు 'లోన్' ప్లాన్ చేస్తున్నారా? - ఈ పొరపాట్లు చేస్తే ప్రమాదంలో పడ్డట్లే!

