కూల్ కూల్‌గా "వాటర్మెలన్ జ్యూస్" - మస్త్ టేస్టీగా ఉంటుంది!
- వాటర్ మెలన్‌ను నేరుగా తింటున్నారా? - ఇలా జ్యూస్ చేసుకుని తాగండి - 10 నిమిషాల్లో రెడీ!


Published : March 4, 2026 at 4:36 PM IST
|Updated : March 4, 2026 at 4:48 PM IST
Summer Special Watermelon Juice: ఎండలు మొదలయ్యాయి. రోజురోజుకూ పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇక సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే మెజార్టీ పీపుల్ వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్‌ను తీసుకుంటుంటారు. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్ అయిన వాటర్ మెలన్‌ను ప్రతి ఒక్కరూ తింటుంటారు. అయితే, పుచ్చకాయను నేరుగా తినడం కాకుండా అద్దిరిపోయే స్టైల్లో జ్యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా సులువే. కేవలం 10 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ డ్రింక్‌ను పిల్లలైతే చుక్క మిగల్చకుండా తాగుతారు. మరి, లేట్ చేయకుండా కమ్మని పుచ్చకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- పుచ్చకాయ - సగ భాగం
- పంచదార - 2 టీస్పూన్లు
- కాచి చల్లార్చిన పాలు - ఒకటిన్నర కప్పులు
- సబ్జా గింజలు - 1 టేబుల్‌స్పూన్
- బాదం పప్పులు - 5
- జీడిపప్పులు - 5
- రోజ్ సిరప్ - 2 టీస్పూన్లు
తయారీ విధానం :

- ముందుగానే ఈ జ్యూస్ కోసం పాలను కాచి చల్లార్చి రెడీగా ఉంచాలి. ఓ గిన్నెలోకి సబ్జా గింజలు తీసుకుని సరిపడా వాటర్ పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. జీడిపప్పు, బాదంపప్పును సన్నగా కట్ చేసుకోవాలి.
- ఈలోపు పుచ్చకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెండు కప్పుల కొలత ప్రకారం తీసుకోవాలి.
- అదే విధంగా గార్నిష్ కోసం చిన్న భాగం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అర కప్పు కొలత ప్రకారం పక్కన ఉంచాలి.
- మిక్సీజార్‌లోకి పుచ్చకాయ ముక్కలు, పంచదార వేసి అస్సలు పలుకులు లేకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్‌ను గిన్నెలోకి తీసుకోవాలి. అందులోకి కాచి చల్లార్చిన పాలు, నానబెట్టిన సబ్జా గింజలు, చిన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు, తరిగిన బాదం, జీడిపప్పు వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- చివరగా రోజ్ సిరప్ వేసి మరోసారి కలుపుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయ జ్యూస్ రెడీ.
చిట్కాలు :

- పుచ్చకాయ ముక్కలు తియ్యగా ఉంటే పంచదార పెద్దగా అవసరం ఉండదు. కాబట్టి వాటర్ మెలన్ స్వీట్‌ను బట్టి షుగర్ యాడ్ చేసుకోవచ్చు.
- ఇందులో రోజ్ సిరప్ ఆప్షనల్ మాత్రమే. వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు.
- మీరు గేదె పాలు వాడుతుంటే ముందుగానే కాగబెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత వాడాలి. అదే ప్యాకెట్ పాలు వాడుకుంటే డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చు.
- ఈ జ్యూస్‌ను అప్పటికప్పుడు చేసుకుని తాగొచ్చు. లేదంటే ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచి ఆ తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు.
బీట్ రూట్‌తో చెక్కలు, కొబ్బరితో కోవా! - టేస్ట్‌కు ఫిదా అయిపోతారు
నారింజ తొక్కలతో "క్యాండీలు" - సూపర్ టేస్టీగా ఉంటాయి - 3 నెలలు నిల్వ!

