ఉద్యోగం, చదువు రీత్యా ఊరెళ్లడం కుదరట్లేదా? - 'వర్చువల్ రాఖీ'తో పండగ చేసుకోండిలా!
దూరంగా ఉన్నా అనుబంధాన్ని పంచే 'వర్చువల్ రాఖీ'! - ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 23, 2026 at 11:44 AM IST
Virtual Rakhi : దేశవ్యాప్తంగా భాషా, బేధాలు లేకుండా సెలబ్రేట్ చేసుకునే అతి కొద్ది పండగల్లో 'రాఖీ పౌర్ణమి' ఒకటి. ఈ రోజున అక్కచెల్లెళ్లు, తమ అన్నదమ్ములకు ప్రేమతో వారు సంతోషంగా, క్షేమంగా ఉండాలని రాఖీని కడతారు. తర్వాత స్వీట్లు తినిపించుకోవడం, కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఈ పండగలో ప్రత్యేకం. అయితే, ఉద్యోగం, చదువు, వ్యాపారం తదితర కారణాలతో అన్నాచెల్లెళ్లు వేర్వేరు నగరాలు, దేశాల్లో ఉంటుంటారు. అలా ఉంటే రాఖీ కట్టడం ఎలా అనుకుంటున్నారా? అలాంటి వారికి ఇప్పుడు AI సరికొత్త అనుభూతినిస్తుంది. మీరున్న చోటు నుంచే ఇలా వర్చువల్ రాఖీని రెడీ చేసి పంపొచ్చు. మరి, ఈ వర్చువల్ రాఖీని ఎలా తయారుచేసుకోవాలి? సాంకేతికతను వినియోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రస్తుతం AI హవా నడుస్తోంది. కాబట్టి, మీరు సాంకేతికతను ఉపయోగించి దూరంగా ఉన్న అన్నదమ్ములకు ఇలా సింపుల్‌గా ఆన్లైన్లో రాఖీని తయారు చేసి పంపొచ్చంటున్నారు నిపుణులు. అయితే, టెక్నాలజీని వినియోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ఫొటో నుంచి కదిలే దృశ్యం :
బింగ్, క్లింగ్, జెమినై, హే జెన్ వంటి వాటిలో ఫొటో అప్లోడ్ చేసి, వీడియో రూపంలో ఎలా మార్చాలో సూచించే వివరణ ఇస్తే AI దానికి అనుగుణంగా వీడియో రూపొందిస్తుందంటున్నారు నిపుణులు. కావాలనుకుంటే ఫొటోను అప్లోడ్ చేసి, కావాల్సిన దృశ్యం, కదలికలు, ఆడియో సంబంధిత సూచనలు ఇవ్వవచ్చంటున్నారు.
మోసానికి దారి తీయకూడదు!
- రాఖీ కోసం రూపొందించిన వీడియోను ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోవడం వరకు సాధారణమే. కానీ అదే వీడియోను అందరికీ పబ్లిక్‌గా పోస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? అనేది ఆలోచించాలంటున్నారు.
- ఒక వ్యక్తి ముఖాన్ని ఏఐతో ఎంత సహజంగా మార్చగలుగుతున్నామో, అదే సాంకేతికతను దుర్వినియోగం చేసి నకిలీ వీడియోలు తయారు చేసే అవకాశం కూడా ఉందని గుర్తుంచుకోవాలి.
- ఇప్పటికే డీప్‌ఫేక్‌లను ఉపయోగించి మోసాలు, వ్యక్తి అనుకరణ, సోషల్ ఇంజినీరింగ్ దాడులు జరిగే ఛాన్స్ ఉందని హెచ్చరించింది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ-ఇన్).
- అత్యవసరంగా డబ్బు పంపాలని లేదా వ్యక్తిగత వివరాలు చెప్పాలని కోరే వీడియో, వాయిస్ సందేశాలు వచ్చినప్పుడు వాటిని మరో మార్గంలో నిర్ధారించుకోవాలని సూచించింది.
వర్చువల్ రాఖీని ఎలా తయారుచేసుకోవచ్చంటే?
- అన్నా చెల్లెళ్ల ముఖాలు స్పష్టంగా కనిపించే, నాణ్యమైన ఫొటోలను సెలెక్ట్ చేసుకోవాలి.
- అధికారిక ఆన్లైన్ వేదికలోకి వెళ్లి అవసరమైన ఫొటో సెలెక్ట్ చేసి, పేర్లు అప్లోడ్ చేయాలి.
- ఆ తర్వాత స్పష్టమైన 'ప్రాంప్ట్' ఇస్తే చాలు. అంతే, మీరు కోరుకున్నట్లుగా వర్చువల్ రాఖీ రెడీ అవుతుంది!
అప్లోడ్ చేసే ముందు ఆలోచించండి
- కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఫొటోలను AI వేదికల్లోకి అప్లోడ్ చేస్తున్నప్పుడు గోప్యతా అంశాలను విస్మరించకూడదని సూచిస్తున్నారు నిపుణులు.
- జాతీయ సైబర్ భద్రతా సంస్థ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) కూడా ఆన్లైన్ జనరేటివ్ AI సేవల్లో వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది.
- ముఖ్యంగా తాము పబ్లిక్‌గా కనిపించడానికి ఇష్టపడని సమాచారాన్ని ఏఐ వేదికల్లో ఇవ్వకూడదని సూచిస్తోంది.
మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 'గూగుల్ తల్లి' - ఫన్నీ ట్రిక్స్ మీకు తెలుసా?
అన్నీ పరిశీలించాకే పంపించాలి :
"దూరంగా ఉన్న అన్నాచెల్లెళ్లను ఒకచోట చేర్చలేక పోయినా, వారి జ్ఞాపకాలను ఒక చిన్న వీడియోగా మలచడంలో AI ఉపయోగపడుతోంది. నిజమైన రాఖీ కట్టిన అనుభూతికి ఇది ప్రత్యామ్నాయం కాకపోయినా, దూరాన్ని కాసేపు మరిపించే డిజిటల్ జ్ఞాపకంగా మాత్రం నిలిచిపోవచ్చు. ఫొటోలు అప్లోడ్ చేసే టైమ్‌లో అంతా సవ్యంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసి కుటుంబ సభ్యులకు పంపించాలి."-సాయి సతీష్, సాంకేతిక నిపుణులు
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- ఎదుటి వ్యక్తి వ్యక్తిగత ఫొటోను ఆన్లైన్ వేదికల్లో అప్లోడ్ చేసే ముందు వారి అనుమతి తీసుకోవాలి.
- ఆధార్, పాన్, పాస్‌పోర్టు, అడ్రస్, ఫోన్ నంబర్, లొకేషన్ వంటి వివరాలు కనిపించే ఫొటోలను అప్లోడ్ చేయకూడదంటున్నారు నిపుణులు.
- పిల్లల ఫొటోలను యూజ్ చేసేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
- AI యాప్‌ను అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక యాప్ స్టోర్ నుంచే పొందాలి. తెలియని వెబ్సైట్లలో 'ఫ్రీ ఏఐ వీడియో' పేరుతో యాప్‌లు లేదా ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేయకూడదని సూచిస్తున్నారు.
- అప్లోడ్ చేసిన ఫొటోలను ఆసేవ ఎలా స్టోర్ చేస్తుంది, ఎంతకాలం ఉంచుతుంది, ఇతర ప్రయోజనాలకు ఉపయోగిస్తుందా అనే విషయాన్ని ప్రైవసీ పాలసీలో పరిశీలించాలని చెబుతున్నారు.
- మీరు ఉపయోగించే యాప్, ఆన్లైన్ వేదిక అకౌంట్‌కు స్ట్రాంగ్ పాస్వర్డ్, సాధ్యమైన చోట మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏర్పాటు చేసుకోవాలంటున్నారు.
- సీఈఆర్టీ-ఇన్ ప్రకారం నకిలీ ఏఐ యాప్‌లు మాల్ వేర్‌ను వ్యాప్తి చేయడానికి ఉపయోగపడే ఛాన్స్ ఉంది. అలాగే కృత్రిమ మేధస్సు ఆధారిత డీప్ ఫేక్‌ల వంటి ముప్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
యువత పెళ్లికి భయపడడానికి కారణాలివే! - సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి!
ఈ 'వాటర్ బాటిల్' ధర రూ.10 వేల పైనే! - ప్రత్యేకతలు తెలిస్తే వారెవ్వా అనాల్సిందే!

