ETV Bharat / offbeat

ఖాళీగా ఉండలేం.. కనీసం కరెంట్ షాకైనా కొట్టించుకుందాం!

- 55 మందిలో 19 మంది కావాలనే కరెంటును పట్టుకున్నారు! - ఏ పనీ చేయకుండా ఉండడం మనిషికి సాధ్యం కాదా? - వర్జీనియా, హార్వర్డ్​ పరిశోధనలో కీలక విషయాలు

virginia and harvard experiment
virginia and harvard experiment (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : May 30, 2026 at 11:15 AM IST

3 Min Read
Choose ETV Bharat

"మీరు.. ఏమీ చేయకుండా ఖాళీగా ఉండగలరా?"

దీనర్థం టీవీ, ఫోన్ చూస్తూ కూర్చోమని కాదు. దేన్నీ ఆస్వాదించకూడదు. ఏ వస్తువునూ టచ్​ చేయకూడదు. చివరకు మీలో మీరు పాటలు కూడా పాడుకోకూడదు. అలా శూన్యంలోకి చూస్తూ కూర్చోవాలి. కేవలం 15 నిమిషాలు చేయగలరా? "దానికేముంది వెరీ సింపుల్" అంటున్నారా? అది అంత ఈజీకాదని ట్రై చేసిన తర్వాత అర్థమవుతుంది! ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా తేల్చారు పరిశోధకులు. కొంత మందిని గదిలో కూర్చోండని చెబితే.. అందులో కొందరు ఖాళీగా ఉండలేక కరెంట్ షాక్​ ను టచ్​ చేశారు!

ఏళ్ల తరబడి కొనసాగిన అలవాట్ల ప్రభావమో.. కుదురులేని ఆలోచనల ఎఫెక్టో తెలియదుగానీ మనిషి ఖాళీగా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. అది ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకునేందుకు 2014 లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా, హార్వర్డ్ వర్సిటీ పరిశోధకులు మొత్తం 11 పరిశోధనలు చేశారు. అందులోని ఒక ప్రయోగంలో భాగంగా.. 55 మందిని సెలక్ట్​ చేసి ఒక ఖాళీ గదిలో కూర్చోబెట్టారు. వీరిలో ఆడ, మగ ఇద్దరూ ఉన్నారు. వీరు చేయాల్సిన పని ఏమిటంటే.. ఏమీ చేయకుండా ఉండటమే!

ఆ గదిలో గోడకు ఒకే ఒక్క స్విచ్​ బటన్​ లాంటిది ఉంచారు. దాన్ని టచ్​ చేస్తే కరెంట్​ షాక్​ కొడుతుంది. ప్రాణాలకు ముప్పు కలగదుగానీ షాకైతే గట్టిగానే తగులుతుంది. ఈ ప్రయోగం స్టార్ట్ కావడానికి ముందే అందరికీ ఓసారి రుచి చూపించారు. ఆ షాక్​ దెబ్బకు.. "వామ్మో మళ్లీ దాన్ని ముట్టుకోబోం" అని అందరూ అన్నారు.

అప్పుడు పరిశోధకులు ఇలా చెప్పారు. గదిలోకి వెళ్లిన తర్వాత మీరు చేయాలనుకుంటే ఈ స్విచ్​ను ముట్టుకోవడమనే ఒక్కపని మాత్రమే చేయొచ్చు. అంతకు మించి ఏమీ చేయకూడదు. పక్కవారి వైపు కూడా చూడొద్దు. వారితో మాట్లాడొద్దు. ఇంకా దేన్నీ టచ్​ కూడా చేయొద్దని చెప్పారు. 15 నిమిషాల పాటు అలా ఖాళీగా కూర్చోవాలని సూచించారు.

కానీ, తర్వాత జరిగింది చూస్తే ఆశ్చర్యపోతారు! మొత్తం 55 మందిలో ఏకంగా 19 మంది కరెంట్ షాక్​ కొట్టించుకోవడానికి సిద్ధపడ్డారు. వారిలో ఒకరు ఏకంగా 190 సార్లు షాక్‌ తగిలించుకున్నాడు! ఈ ప్రయోగం ద్వారా మనుషులు ఖాళీగా ఉండడం సాధ్యం కాదని పరిశోధకులు తెలిపారు. శారీరక నొప్పి కన్నా.. ఖాళీగా ఉండడం భయంకరంగా ఉంటుందని రుజువైందని అన్నారు.

55 మందిలో మిగిలిన 36 మంది ఖాళీగా ఉండగలిగారు. ఈ లెక్కన మెజారిటీ జనం ఖాళీగా ఉండగలరు అనిపించినప్పటికీ.. సమయం పెరిగే కొద్ది ఆ సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. కేవలం 15 నిమిషాలే కాబట్టి వీరు తమను తాము నియంత్రించుకున్నారు.. అదే రోజు మొత్తం ఉండాల్సి వస్తే? దాదాపుగా అందరూ ఈ పని చేయడానికి అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక షాక్​ తగిలించుకున్న 19 మందిలో ఏకంగా 13 మంది పురుషులే. ఆరుగురు మాత్రమే మహిళలు!

ఈ ప్రయోగం మనిషి మనసు గురించి కీలక విషయాన్ని వెల్లడించిందని పరిశోధకులు చెప్పారు. బయటి ప్రపంచం నుంచి మనిషికి ఏదో ఒక చర్య ఉండాల్సిందే. పంచేంద్రియాలైన కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, చర్మంలో.. ఏదో ఒకటి బాహ్యప్రపంచం నుంచి తనలోకి దేన్నో ఒకదాన్ని స్వీకరించాల్సిందే. లేకపోతే మానసికంగా ఇబ్బంది పడిపోతాడు. పాత విషయాలు, భవిష్యత్తు ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే ఒత్తిడి పెరిగిపోయి కోపం, నిరాశ, డిప్రెషన్​ వంటివి పెరిగిపోతాయని అంటున్నారు. అందుకే, మనిషి ఏదో ఒకటి చేయకుండా ఉండలేడని చెబుతున్నారు. ఆ ఏదో ఒకటి చేయడం.. దానికి ఏదో ఒక ఫలితం రావడం.. వాటివల్ల తాను ప్రభావితం కావడం.. ఈ ప్రక్రియలో పడి ముందుకు సాగిపోతుంటాడు!

అయితే, మానసిక ప్రశాంతతకు ఖాళీగా ఉండగలగడమే సరైన మందు అంటారు నిపుణులు. ఇందుకోసం పుట్టిందే ధ్యాన మార్గమని చెబుతారు. మెల్లగా ధ్యానం అలవాటు చేసుకుంటే.. మనసుపై, ఆలోచనలపై నియంత్రణ వస్తుందని, అప్పుడు ప్రశాంతత సిద్ధిస్తుందని కొందరు చెబుతున్నారు.