పండగ వేళ 'సేల్స్ ఆఫర్ల' మాయలో పడకండి - కొనేముందు AIతో ఇలా చెక్ చేసి తీసుకోండి!
ఈ-కామర్స్ సైట్ల ఆఫర్లలో నిజమెంత? - ఏఐ టూల్స్‌తో డిస్కౌంట్ల గుట్టు కనిపెట్టొచ్చంటున్న నిపుణులు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 12, 2026 at 5:26 PM IST
How to Spot Fake Discounts : పండగ సీజన్ వచ్చిందంటే చాలు ఈ-కామర్స్ సైట్లన్నీ ప్రత్యేక ఆఫర్ల పేరుతో వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి. 50%, 70% డిస్కౌంట్ ఎన్నడూ లేనంతగా అతి తక్కువ ధర అంటూ ప్రకటనలతో హోరెత్తిస్తాయి. ఈ క్రమంలోనే చాలా మందికి అసలు ఈ డిస్కౌంట్లన్నీ నిజమేనా? లేదా నకిలీవా? నిజంగానే రేటు తగ్గిందా? లేదంటే తగ్గినట్టు చూపిస్తున్నారా? ఇలా రకరకాల అనుమానాలు వస్తుంటాయి. అయితే, ఆఫర్ల మాయలో పడి మోసపోకుండా, నకిలీ డిస్కౌంట్ల మాయాజాలాన్ని క్షణాల్లో పట్టుకునేందుకు ఇప్పుడు అనేక AI ఆధారిత షాపింగ్ అసిస్టెంట్లు అందుబాటులోకి వచ్చాయి. మరి, స్మార్ట్ కొనుగోళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న ఈ టెక్నాలజీతో నకిలీ ఆఫర్లకు ఎలా చెక్ పెట్టవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
షాపింగ్ ప్రియులకు ఫెస్టివల్ సీజన్ అంటేనే డిస్కౌంట్ల పండగ! అలాంటి టైమ్‌లో నకిలీ ఆఫర్లు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తుంటాయి. కానీ, ఇకపై ఆ చింత అవసరం లేదు. ప్రస్తుతం నకిలీ డిస్కౌంట్లను ఈజీగా గుర్తించేలా AI ఆధారిత షాపింగ్ అసిస్టెంట్లు అందుబాటులో ఉన్నాయి. బయ్హట్కే, ఫ్లిప్షాప్, ప్రైస్ హిస్టరీ, సూపర్ దోస్త్ ఏఐ వంటి వాటిని ఉపయోగించి ఈ-కామర్స్ వేదికల్లో వస్తువుల రేట్లను సరిపోల్చుకోవచ్చు. గత ధరల వివరాలను గ్రాఫ్ రూపంలో చూడొచ్చు. వస్తువు ధరకు అలెర్ట్ పెట్టొచ్చు. డిస్కౌంట్ కూపన్ల వివరాలు కూడా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు.
మీ ఫోన్లో ఈ 'యాప్' ఉంటే చాలు - కల్తీ ఫుడ్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం చాలా ఈజీ!
ఎలా ఉపయోగించాలి?
- మొదటగా షాపింగ్ అసిస్టెంట్ టూల్స్‌లో ఒకదానిని ఎంచుకుని షాపింగ్ స్టార్ట్ చేయాలి.
- బయ్హట్కే టూల్‌ను ఎంచుకుంటే, వెబ్‌బ్రౌజర్‌లో ఆ పేరును సెర్చ్ చేసి, సైట్‌ను ఓపెన్ చేయాలి.
- అక్కడ కుడివైపున వచ్చే 'యాడ్ టు క్రోమ్' ఆప్షన్‌ను క్లిక్ చేసి ఎక్స్టెన్షన్ని బ్రౌజర్‌కి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వివిధ ఈ-కామర్స్ సైట్లతో కూడిన విండో ఓపెన్ అవుతుంది.
- అక్కడ మీకు నచ్చిన సైట్లో కొనుగోలు చేయాలనుకునే వస్తువులను వెతకొచ్చు.
- ఉదాహరణకు అమెజాన్‌లో ఒక వస్తువును కొనుగోలు చేయాలనుకుంటే, నిజంగా అది డిస్కౌంట్లో వస్తుందా? లేదా అని తెలుసుకునేందుకు దానిపై క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. దాని పక్కన కనిపించే రంగుల ట్యాగ్ డీల్ గురించి చెప్పేస్తుందంటున్నారు నిపుణులు. ఎరుపు రంగు ఉంటే మంచి డీల్ కాదని, ఆకుపచ్చ ట్యాగ్ ఉంటే మంచిదని అర్ధం చేసుకోవాలంటున్నారు.
- డిస్కౌంట్లో వస్తోందా? లేదా? అని ఆ వస్తువును ఓపెన్ చేయాల్సిన అవసరం. ట్యాగ్పైకి కర్సర్‌ను తీసుకెళ్తే చాలు. సగటు ధర ఎంత? ప్రస్తుత రేటు ఎంత? అసలు ఎంత శాతం తగ్గింది? అనేది 'డిక్రీజ్డ్ ప్రెస్'లో చూడొచ్చంటున్నారు.
- కొనుగోలు చేయాలనుకునే వస్తువు గత నెల రోజుల్లో ఎంత ధర ఉంది? చివరి 3 నెలలు, 6 నెలలు, ఆల్‌టైమ్‌లో దాని ధర పెరుగుదల, తగ్గుదల వివరాలు పక్కనే గ్రాఫ్ రూపంలో కనిపిస్తాయి.
- గత సంవత్సరం ధరలు కూడా కనిపిస్తాయి. ఈ ఏడాది అంతకన్నా తక్కువకు వస్తోందా? అనేది ఇక్కడి నుంచి చెక్ చేసుకుని, ఆ వస్తువుపై ఒక అంచనాకు రావొచ్చని చెబుతున్నారు నిపుణులు.
- 'మోర్ ఆప్షన్స్'పై కర్సర్‌ను తీసుకెళ్తే, ఒకే ఉత్పత్తి ధర ఇతర ఈ-కామర్స్ వేదికల్లో ఎంత ఉందో కనిపిస్తుంది. దీనివల్ల మీరు ప్రతి సైట్లోకి వెళ్లాల్సిన పని ఉండదు.
- ప్రతిరోజూ వస్తువుల ధరలను చెక్ చేసుకోకుండా 'ప్రైస్ అలెర్ట్స్' ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. అక్కడ మీకు కావాల్సిన వస్తువు ధరకు అలర్ట్ ఇవ్వొచ్చు. ఆ ధరకు, అంతకన్నా తక్కువకు వస్తే వెంటనే అలర్ట్ వస్తుందంటున్నారు నిపుణులు.
కూపన్ల ఎంపికలోనూ సాయం :
బిల్లు కట్టే టైమ్‌లో ఆఫర్ కూపన్లను వెతికి పట్టుకోవడంలోనూ ఈ AI ఆధారిత టూల్స్ సాయం చేస్తాయంటున్నారు నిపుణులు. ఉదాహరణకు మీరు బయ్హ్యాట్కె టూల్‌ను ఎంచుకుంటే, చెల్లింపు విభాగం వద్దకు వచ్చాక 'ఆటో కూపన్స్ బై బయ్హ్యాట్కె' అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆటోమేటిక్‌గా కూపన్లను వెతికి, ఏదైనా కూపన్ సరిపోలితే దానిని నేరుగా పేమెంట్ విభాగంలో జోడిస్తుందంటున్నారు. దానిని ఉపయోగిస్తే ఎంత తగ్గింపు వస్తుందో చూపిస్తుందని చెబుతున్నారు.
'నో స్కాన్, నో పిన్' - జస్ట్ స్మార్ట్ వాచ్ ట్యాప్ చేస్తే చాలు పేమెంట్ కంప్లీట్!
సూపర్ మార్కెట్లకు వెళ్తున్నారా? - 'ఫుడ్ లేబుల్స్'తో పదార్థాల క్వాలిటీ తెలుసుకోండిలా!

