'బాలాత్రిపుర సుందరీ' మన్నించమ్మా! - 'యునిసెఫ్' నివేదికలో ఏముందంటే!
15ఏళ్లు నిండకుండానే బాల్య వివాహాలు - ప్రతి మూడింట ఒకటి మన దేశంలోనే!

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 12, 2026 at 3:06 PM IST
UNICEF Report on Child Marriage : సృష్టికి మూలమైన స్త్రీ శక్తిని చిన్న వయసు నుంచే గౌరవించాలనే భావన కలిగిన ఈ దేశంలో ముక్కుపచ్చలారని బాలికలకు తీరని అన్యాయం జరుగుతోంది. దేశంలో 9 కోట్ల మంది బాలికలకు 15 ఏళ్లు నిండకుండానే వివాహం చేసినట్లు యునిసెఫ్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 3 సెకన్లకు ఓ బాల్య వివాహం జరుగుతుంటే అందులో ఒకటి ఇండియాలో నమోదవుతోందని వెల్లడించింది.
ఓ వైపు దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల ఈ ఉత్సవాల్లో రోజుకో అవతారంలో అమ్మవారిని పూజిస్తుంటారు. లలితా త్రిపుర సుందరీ దేవిని తొమ్మిదేళ్ల బాలికగా.. బాలా త్రిపుర సుందరీ దేవిగానూ ఆరాధిస్తారు. ఈ సందర్భంగా ఇంట్లో 2 నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావిస్తూ 'కుమారి పూజ' నిర్వహిస్తుంటారు. సాక్షాత్తూ జగన్మాతనే (శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి) బాలిక రూపంలో పూజిస్తుంటారు. కానీ, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు, బాల్య వివాహాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
దేశంలో 20-24 ఏళ్ల వయసు కలిగిన యువతుల్లో 22.4 కోట్ల మంది 17 ఏళ్ల వయసు నిండకుండానే పెళ్లి పీటలెక్కారని యునిసెఫ్ (UNICEF) వెల్లడించింది. వీరిలో 9 కోట్ల మందికి 15 ఏళ్లు నిండకుండానే వివాహాలు జరిగాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 సెకన్లకు ఓ బాలికకు పెళ్లవుతోందని యూనిసెఫ్ అంచనా వేసింది. 2030 నాటికి బాల్య వివాహాలను అంతమొందించాలన్న లక్ష్యం దిశగా భారత్ ముందుకెళ్తోందని నిపుణులు పేర్కొంటున్నా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ బాల్య వివాహాలు సంఖ్యం ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం చిన్నారుల కల్యాణాల్లో ఉత్తర భారతం ముందుంది. అందులో ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో సగం కంటే ఎక్కువగా ఉంటున్నాయని యునిసెఫ్ తేల్చింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి 3 బాల్య వివాహాల్లో ఒకటి భారత్లో నమోదవుతోందని వెల్లడిస్తూ ప్రతి ఐదుగురు యువతుల్లో ఒకరు 18 ఏళ్లు నిండకుండానే దాంపత్య బంధంలోకి అడుగిడుతున్నారని పేర్కొంది. 'అంతర్జాతీయ బాలికా దినోత్సవం' నేపథ్యంలో ఈ వివరాలను వెల్లడించింది.
2019-21 సర్వే బాల్య వివాహాల్లో తగ్గుదల చూపించినా, నేటికీ కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ కుటుంబ సర్వే వెల్లడించింది. బాల్య వివాహాల కారణంగా కౌమార దశలోనే గర్భం దాల్చుతున్నారని, ఆడుతూ పాడుతూ చదుకోవాల్సిన వయస్సులో సంతానం, పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నారని పేర్కొంది. ఆయా వివరాలను రాష్ట్రాలు, జిల్లాల వారీగా విడుదల చేసింది. విద్య, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, ప్రసవాల తీరు, మహిళా సాధికారత సహా మొత్తం 93 అంశాలపై నివేదిక రూపొందించింది.

