మీ కళ్లెదుటే రోడ్డు ప్రమాదం జరిగిందా? - ఈ 8 అడుగులు వేసి చూడండి!
రహదారిపై అనుకోని ప్రమాదాలు - రవాణాశాఖ ట్రాఫిక్ రూల్స్ మాన్యువల్ ఏం చెప్తోందంటే!

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 10, 2026 at 12:12 PM IST
Road Accidents : రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు అనుకోని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. బాధితుల్ని కాపాడేందుకు వెళ్లే వ్యక్తులు కంగారు పడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం ఎంతో ముఖ్యం. బాధితులకు సరైన వైద్య సహాయం అందించడం, అంబులెన్స్‌కు ఫోన్ చేయడం ఒక్కటే సరిపోదు. ప్రమాదం తర్వాత తొలి నిమిషాల్లో తీసుకునే జాగ్రత్తలు ప్రాణరక్షణలో కీలకంగా మారుతాయని రవాణాశాఖ ట్రాఫిక్ రూల్స్ మాన్యువల్ సూచిస్తోంది. ఆ 8 రకాల జాగ్రత్తలు ఏమిటో చూద్దాం.
డ్రైవర్ ఆగకుండా వెళ్తే?
ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఆగకుండా వెళ్ల కూడదు. ప్రమాద ప్రదేశంలో ఉండి కనీస బాధ్యత నిర్వర్తించాలి. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 134 ప్రకారం గాయపడిన వ్యక్తికి వైద్యసాయం అందేలా చర్యలు తీసుకో వాలి. ఈ బాధ్యతను విస్మరిస్తే సెక్షన్ 187 కింద శిక్ష పడే అవకాశం ఉంటుంది. తొలి నేరానికి ఆరు నెలల వరకు జైలు లేదా రూ.5,000 వరకు జరిమానా లేదా రెండూ విధించే నిబంధన ఉంది.
'పాలసీ' మధ్యలో ఆపేస్తే డబ్బులు వెనక్కి వస్తాయా? - రూల్స్ తెలియకపోతే నష్టపోతారు!
సాయం చేస్తే చట్టపరమైన రక్షణ
ప్రమాద సమయాల్లో బాధితులకు మంచి ఉద్దేశంతో సాయం చేస్తే 'గుడ్ సమారిటన్' నిబంధనల కింద వారికి చట్టపరమైన రక్షణ ఉంటుంది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 134ఏ ప్రకారం, ప్రమాద బాధితులకు స్వచ్ఛందంగా అత్యవసర సహాయం అందించిన వారిని అనవసరంగా వేధించరాదు. పదే పదే పోలీసు విచారణకు పిలవడం లేదా బలవంతంగా సాక్షిగా మార్చడం చేయొద్దు.
ముందూ వెనకా చూసుకోవాలి: మనం వాహనంలో వెళ్తున్నప్పుడు రహదారిలో ప్రమాదం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే బాధితుల దగ్గరకు పరుగెత్తకూడదు. ముందుగా రోడ్డు పరిస్థితిని, ఎదురుగా, వెనుక నుంచి వచ్చే వాహనాల పరిస్థితిని గమనించాలి. ఆగిన వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టకుండా చూసుకోవాలి.
112కు సమాచారం ఇవ్వాలి: ప్రమాదం జరిగినట్లు తెలిసిన వెంటనే 112 నంబరుకు సమాచారమివ్వాలి. ప్రమాద ప్రదేశం గురించి వీలైనంత స్పష్టంగా చెప్పాలి. బాధితుల ఆరోగ్య వివరాలు తెలియజేస్తే అత్యవసర సాయం త్వరగా అందుతుంది.
బాధిత వ్యక్తి స్పందన.. శ్వాస చూడాలి: ప్రమాదానికి గురైన వారు స్పందిస్తున్నారా, శ్వాస తీసుకుంటున్నారా గమనించాలి. తీవ్రమైన ఇబ్బంది ఉంటే అత్యవసర సేవలందించే వారికి సూచించాలి.
రక్తస్రావం ఆపాలి: బాధితులకు తీవ్ర రక్తస్రావం అవుతుంటే అంబులెన్స్ వచ్చే వరకు వేచిచూడొద్దు. శుభ్రమైన వస్త్రాన్ని గాయంపై పెట్టి రక్తస్రావాన్ని ఆపేలా చూడాలి. గాయంపై చేతులు పెట్టొద్దు.
తల, మెడ, వెన్నెముక జాగ్రత్త : ప్రమాదంలో తలకు బలమైన దెబ్బ తగిలినా, మెడకు, వెన్నెముకకు గాయమైనట్లు అనుమానం ఉంటే శరీరంలో ఏదైనా అవయవం విరిగినట్లు అనిపిస్తే బాధితుడిని అనవసరంగా లేపడం, కూర్చోబెట్టడం, పక్కకు లాగడం వంటివి చేయొద్దు. దీనివల్ల ప్రమాద తీవ్రత పెరగొచ్చు. అత్యవసర సహాయం లేకపోతే వైద్య సిబ్బంది వచ్చేవరకు బాధితులను ఉన్న స్థితిలోనే ఉంచాలి.
స్పృహ కోల్పోతే : కొన్ని సమయాల్లో ప్రమాద తీవ్రతకు బాధితులు స్పృహ కోల్పోతారు. అయినప్పటికీ వారికి శ్వాస ఆడుతుంది. ఇలాంటి సందర్భాల్లో బాధితుడిని కోలుకునే స్థితిలో పడుకోబెట్టి, వైద్య సిబ్బంది వచ్చేవరకు వేచి చూడాలి.
ఆహారం, నీరు ఇవ్వొద్దు : ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులకు వైద్య సిబ్బంది సూచన లేకుండా ఆహారం, నీరు ఇవ్వడం మంచిది కాదు. కొన్నిసార్లు అత్యవసర వైద్య చికిత్స, శస్త్రచికిత్స అవసరం ఉండొచ్చు.
ఒంటరిగా వదలొద్దు : అంబులెన్స్ వచ్చే వరకు బాధితుల శ్వాస తీరు, స్పందించే విధానం, రక్తస్రావం పెరుగుతోందా ఇలాంటి అంశాలను గమనిస్తూ ఉండాలి.
బాలురపై పెరుగుతున్న లైంగిక వేధింపులు - ఆందోళనకు గురిచేస్తున్న బాధితుల ప్రవర్తనలో మార్పులు!

