ప్రపంచంలో ఈ నగరాలు రాత్రిళ్లూ "మేల్కొనే" ఉంటాయి! - ఇండియాలో కూడా ఒకటి!
- చీకటి విహారాన్ని అలవాటుగా మార్చుకుంటున్న నవతరం! - రకరకాల పనులతో 24/7 బిజీగా మారుతున్న నగరాలు!

Published : June 3, 2026 at 4:44 PM IST
Top Sleepless Cities in World: సాధారణంగా రాత్రి అంటేనే విశ్రాంతి తీసుకునే సమయం. ఎన్ని పనులు ఉన్నా చీకటి పడిందంటే అన్నీ ఆపేసి నిద్రించే సమయం. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. గ్లోబలైజేషన్ పుణ్యమా అని రాత్రి, పగలు తేడా లేకుండా పోయాయి. అర్ధరాత్రి దాటినా ప్రయాణాలు, ఆఫీసు పనులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోని కొన్ని నగరాలైతే 24/7 బిజీగానే ఉంటున్నాయి. రాత్రి సమయాల్లోనూ వర్క్, ఎంటర్టైన్మెంట్ అంటూ నిద్రపోని నగరాలుగా మారిపోయాయి. మరి, అవి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
టోక్యో: జపాన్‌లోని షిబుయా, షింజుకూ వంటి ప్రాంతాలు రాత్రి సమయంలో కూడా జనాలతో కిటకిటలాడుతుంటాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే షిబుయా క్రాసింగ్ అర్ధరాత్రి కూడా వేలాదిమంది జనాలతో సందడిగా ఉంటుంది. ఇక సమయంతో పనిలేకుండా తెల్లవార్లూ ఫుడ్ స్టోర్లు సహా ఇతర దుకాణాలు తెరిచే ఉంటాయి. టెక్నాలజీ, గేమింగ్, యానిమేషన్ స్టోర్లు అక్కడి కుర్రాళ్లతో రాత్రివేళ కిటకిటలాడుతుంటాయి. అంతేకాకుండా వేలాది పబ్‌లు, క్లబ్‌లు, రోబోట్ రెస్టారెంట్లు 24 గంటలు తెరిచే ఉంటాయి.
లాస్ వెగాస్: యూఎస్ఏ లోని ఈ ప్రాంతం క్యాసినోలకు పెట్టింది పేరు. రాత్రి వేళ ఇక్కడి లైటింగ్ చూస్తే పగలు ఏదో, రాత్రి ఏదో అర్థం కాకుండా ఉంటుంది. కేవలం ఇవి మాత్రమే కాకుండా క్లబ్స్, భారీ హోటళ్లు, నైట్ పార్టీలు అంటూ రకరకాల వినోద కార్యక్రమాలతో ఉదయం కంటే రాత్రిళ్లే ఈ నగరం చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు వస్తుంటారు.
బ్యాంకాక్ : థాయ్‌లాండ్‌లోని ఈ ప్లేస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తక్కువ ఖర్చుతో విహారాన్ని, వినోదాన్ని అందించే నగరంగా బ్యాంకాక్ ప్రసిద్ధి చెందింది. ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లే ప్రాంతం కూడా ఇదే కావడం గమనార్హం. రాత్రిళ్లు ఇక్కడి వీధుల్లో నైట్ మార్కెట్లు, స్ట్రీట్ ఫుడ్, రూప్‌టాప్ బార్లు, నైట్ క్లబ్స్, ఓపెన్-ఎయిర్ రెస్టారెంట్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి.
బెర్లిన్ : జర్మనీలోని ఈ నగరాన్ని 'పార్టీ సిటీ' అని పిలుస్తుంటారు. ఇక్కడి యువతలో సంగీతం, ఆర్ట్ కల్చర్ ఎక్కువ. బెర్లిన్ టెక్నో మ్యూజిక్ అండ్ క్లబ్ సంస్కృతికి ఉన్న క్రేజ్ చూసి, జర్మనీ ప్రభుత్వం 'సాంస్కృతిక వారసత్వ సంపద' గుర్తింపును కూడా ఇచ్చింది. దీంతో మ్యూజిక్ కాన్సర్ట్స్, నైట్ క్లబ్బులతో నిత్యం బిజీగా ఉంటుంది. వీకెండ్ లాంగ్ పార్టీల పేరిట కొన్ని క్లబ్బులైతే వరుసగా రెండు మూడు రోజులైనా తెరిచే ఉంటాయి. ఇక్కడ ఓపెన్ ఎయిర్ కల్చరల్ ఈవెంట్స్ కూడా భారీగా జరుగుతాయి.
దుబాయ్: దుబాయ్ అనగానే చాలా మందికి బంగారం, లగ్జరీ, ఎత్తైన భవనాలు మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ ఇక్కడ రాత్రిళ్లు కూడా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు కస్టమర్లతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ప్రపంచ వ్యాపార కేంద్రం, టూరిస్ట్ ప్రాంతం కావడంతో వర్తకులు, టూరిస్టుల రాకపోకలతో 24 గంటలూ బిజీబిజీగానే ఉంటుంది. ఇక దుబాయ్ ఫౌంటైన్ షో, గ్లోబల్ విలేజ్, వరల్డ్ క్లాస్ పబ్‌లు కూడా ఇట్టే ఆకర్షిస్తాయి.
ముంబయి: భారత ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబయి కూడా 24 గంటలూ నిద్రపోని నగరం పేరుగాంచింది. సినిమా, వెబ్ సిరీస్ షూటింగ్‌లు నాన్-స్టాప్‌గా జరుగుతూనే ఉంటాయి. ఇక మీడియా, ఫైనాన్స్ రంగాలవారీతో నిత్యం రద్దీ కనిపిస్తుంటుంది. పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఫుడ్ స్టోర్లు తెరిచే ఉంటాయి. ఇక్కడ చాలా రకాల ఆహార పదార్థాలు ఎంతగానో నోరూరిస్తాయి. పర్యాటకులు నైట్ లైఫ్‌ను ఆస్వాదిస్తుంటారు.
మాడ్రిడ్: స్పెయిన్ ప్రజల లైఫ్స్టైల్లో నైట్ లైఫ్ అనేది ఒక భాగం. ముఖ్యంగా మాడ్రిడ్ నగర ప్రజలు తెల్లవారుజాము వరకూ పార్టీలు చేసుకుంటారు. బార్లు, లైవ్ మ్యూజిక్, స్ట్రీట్ కల్చర్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ నైట్ క్లబ్‌లు అర్ధరాత్రి 12 తర్వాతనే ప్రారంభమవుతాయంటే ప్రజలు నైట్‌లైఫ్‌కు ఎంతగా అలవాటు పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రపంచంలోనే అత్యంత ఆలస్యంగా డిన్నర్ చేసే అలవాటు స్పానిష్ ప్రజలకు ఉంది. ఇక్కడ రాత్రి 10 లేదా 11 గంటల సమయంలో రెస్టారెంట్లు కస్టమర్లతో నిండిపోతాయి.
షాంఘై: చైనాలో అత్యంత బిజీగా ఉండే నగరాల్లో ఇదీ ఒకటని చెప్పుకోవచ్చు. ఇక్కడి ఫ్యూచరిస్టిక్ నైట్ వ్యూస్ ప్రపంచవ్యాప్తంగా పర్యాకుటల్ని ఆకర్షిస్తాయి. టెక్నాలజీ, ఇతర రంగాల వ్యాపార కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతుంటాయి. రాత్రి వేళల్లో షాంఘై టవర్, ఓరియంటల్ పర్ల్ టవర్లు లైటింగ్‌తో మిరుమిట్లు గొలుపుతుంటాయి. ఇక్కడ రాత్రి పూట కూడా రోబోటిక్ స్టోర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డెలివరీ సర్వీసులు నడుస్తూనే ఉంటాయి.
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని ఈ నగరం హార్బర్, పర్యాటకం, కార్పొరేట్ కార్యకలాపాలతో 24/7 యాక్టివ్గానే ఉంటుంది. క్లబ్బులు, మ్యూజిక్ కాన్సర్ట్స్ సందడిగా కనిపిస్తుంటుంది. నైట్ ఎకానమీ పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు కూడా అమలు చేస్తోంది. రాత్రి వేళల్లో సిడ్నీ ఓపెరా హౌజ్, సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ అద్భుతమైన లైటింగ్‌తో కస్టమర్లను, పర్యాటకులను ఆకర్షిస్తాయి. రాత్రి వేళ వాటర్ ఫ్రంట్ రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్‌లతో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంది.
సూర్య బ్రోకు నిద్రే రాదు! - ఈ భూమ్మీద చీకటి పడని దేశాలు ఇవే!

