టమోటా ధర తగ్గింది - "పండు మిర్చితో నిల్వ పచ్చడి" ఇలా పెట్టేయండి!
"టమోటా పండు మిర్చి పచ్చడి" - సంవత్సరమంతా హ్యాపీగా తినేయొచ్చు
tomato_mirchi_chutney_recipe (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 7, 2026 at 4:57 PM IST
Tomato Mirchi Chutney Recipe : మార్కెట్లో టమోటా ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇదే టైంలో పండు మిర్చి కూడా వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం! టమోటా, పండుమిర్చి నిల్వ పచ్చడి సింపుల్‌గా ఇలా పెట్టేయండి. సంవత్సరం పాటు తినేయొచ్చు. ఒక్కసారి టైం కేటాయించామంటే చాలు! ఇడ్లీ, దోసెల్లాంటి టిఫిన్లలోకి హ్యాపీగా తినేయొచ్చు.
ఘుమఘుమలాడే "వంకాయ జీడిపప్పు మసాలా" - ఇలాంటి కర్రీ అద్భుతంగా ఉంటుంది!

కావల్సిన పదార్థాలు :
- టమోటాలు - అర కేజీ
- మెంతులు - 1 స్పూన్
- ఆవాలు - 2 స్పూన్లు
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- చింతపండు - 50గ్రాములు
- పండు మిర్చి - పావు కేజీ
- ఉప్పు - 50గ్రాములు
- వెల్లుల్లి - 10
- పసుపు - పావు టీ స్పూన్

పోపు కోసం :
- నూనె - 150గ్రాములు
- ఆవాలు - అర స్పూన్
- జీలకర్ర - 1 స్పూన్
- వెల్లుల్లి పాయలు - 8
- ఇంగువ - కొద్దిగా
- ఎండు మిర్చి - 3
- కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ విధానం :
- ముందుగా అర కేజీ టమోటాలను శుభ్రం చేసుకుని క్లాత్‌తో క్లీన్ చేసుకుని ముక్కలు కోయాలి. ఇపుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మెంతులు వేయించి, ఆ తర్వాత ఆవాలు వేసుకుని దోరగా వేయించి తీసుకోవాలి.
- ఇపుడు పావు కప్పు నూనె వేసుకుని వేడెక్కగానే ముక్కలు కట్ చేసిన టమోటాలను వేసుకుని వేయించాలి. టమోటాలతో పాటు 50గ్రాముల చింతపండు రెబ్బలు వేసుకుని కలపాలి. ఇపుడు కలుపుతూ ఉడికించుకుని టమోటాల్లో నీరు ఇంకే వరకు కలుపుకోవాలి. టమోటా గుజ్జులా మారే వరకు బాగా కలుపుతూ ఉడికించి స్టవ్ కట్టేయాలి.

- టమోటా చల్లారేలోగా పండు మిర్చి రెడీ చేసుకోవాలి. అరకేజీ టమోటాల్లోకి పావు కేజీ పండు మిర్చి అవసరం ఉంటుంది. పండు మిర్చి కూడా బాగా కడిగి తడి లేకుండా క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. మిర్చి గట్టిగా ఉన్నవి తీసుకుని ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి
- ఇపుడు మిక్సీజార్‌లోకి వేయించిన మెంతులు, ఆవాలతో పాటు 50 గ్రాముల ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత పండు మిర్చి వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అందులోనే ఉడికించిన టమోటా, చింతపండుతో పాటు వెల్లుల్లి వేసుకుని గ్రైండ్ చేయాలి.

- ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిలోకి మెంతి, ఆవాల పొడి, పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలపాలి. ఇపుడు పచ్చడిలో ఉప్పు, కారం టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే కలపాలి. ఈ చట్నీ జాగ్రత్తగా నిల్వ చేసుకుని అవసరమైనపుడు పోపు వేసుకుంటే సరిపోతుంది. లేదంటే పూర్తిగా ఒకేసారి పోపు పెట్టుకుని అవసరమైనపుడు వాడుకోవచ్చు.
- పోపు కోసం 150గ్రాముల నూనె వేసుకుని వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి పాయలు, ఇంగువ, ఎండు మిర్చి, కరివేపాకు వేసుకుని వేయించాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా తయారు చేసుకున్న పచ్చడిని కలపాలి. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలోకి తీసుకుని భద్రం చేసుకోవచ్చు.
"శివరాత్రికి ఉపవాసం" ఉంటున్నారా? - చిలగడదుంపతో ఇలా చేయండి!
రెస్టారెంట్ స్టైల్ "బెండకాయ మసాలా కర్రీ" - ఇంటిల్లిపాదీకి తెగ నచ్చేస్తుంది!

