ఘుమఘుమలాడే "టమాటా రసం" - ఈ పొడితో ఒక్కసారి చేసుకుంటే టేస్ట్ అస్సలు మర్చిపోలేరు!
కమ్మని "టమాటా రసం" - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

Published : January 8, 2026 at 3:29 PM IST
Tomato Rasam Recipe: కూరలు, పచ్చళ్లు ఎన్ని ఉన్నా చారుతో ఓ ముద్ద తింటే ఆ ఫీలింగ్ వేరే లెవల్. అందుకే చాలా మంది రెగ్యులర్‌గా రసం రెసిపీలు చేసుకుంటుంటారు. అందులో మెజార్టీ పీపుల్ టమాటా రసం తయారు చేస్తుంటారు. అయితే టమాటా రసాన్ని ఎప్పుడూ చేసేలా కాకుండా ఓసారి ఈ పద్ధతిలో అది కూడా ఈ పొడి వేసి చేయండి. కిర్రాక్ ఉంటుంది. ఎన్నడూ తినని రుచిలో అద్దిరిపోతుంది. తయారు చేసుకోవడం కూడా సులువే. ఈ రసాన్ని కేవలం అన్నంలోకి పోసుకుని తినడమే కాకుండా నేరుగా తాగేస్తారు కూడా. మరి లేట్ చేయకుండా కమ్మని టమాటా రసం ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- చింతపండు - 100 గ్రాములు
- కందిపప్పు - 3 టేబుల్‌స్పూన్లు
- ధనియాలు - 2 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - 1 టేబుల్‌స్పూన్
- మిరియాలు - పావు టేబుల్‌స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 10
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - అర టీస్పూన్

తాలింపు కోసం:
- నూనె - తగినంత
- టమాటాలు - 4
- ఎండుమిర్చి - 8
- తాలింపు గింజలు - 1 టీస్పూన్
- దంచిన వెల్లుల్లి రెబ్బలు - 7
- కరివేపాకు - 2 రెమ్మలు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం:
- ఓ గిన్నెలోకి చింతపండు తీసుకుని ఓసారి కడిగి సరిపడా వాటర్ పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి.
- ఈలోపు టమాటాలను మీడియం సైజ్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- మిక్సీజార్‌లోకి కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

- అందులోకి వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- చింతపండు నానిన తర్వాత గట్టిగా పిండి రసం తీసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జులోకి పులుపుకు తగినట్లుగా వాటర్ పోసుకోవాలి.
- ఇప్పుడు ఆ వాటర్లోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, గ్రైండ్ చేసిన మసాలా పొడి వేసి ఓసారి అంతా కలిసేలా మిక్స్ చేసి పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్స్పూన్ల నూనె వేసుకోవాలి. కాగిన నూనెలో కట్ చేసిన టమాటా ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించాలి.

- టమాటా ముక్కలు మెత్తగా ఉడికినాక వీటిని ఓ ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచాలి.
- అదే పాన్‌లో మరో రెండు టేబుల్స్పూన్ల నూనె వేసి తాలింపు గింజలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయాలి.
- తాలింపు గింజలు వేగినాక తొడిమలు తీసేసిన ఎండుమిర్చి వేసి ఓ నిమిషం పాటు వేయించాలి.
- అనంతరం అందులోకి కరివేపాకు వేసి క్రిస్పీగా మారే వరకు వేయించాలి. ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

- ఈ తాలింపు మిశ్రమం చల్లారిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న రసంలోకి వేసుకోవాలి. అనంతరం ఉడికించిన టమాటా ముక్కలు కూడా వేసి ఎండుమిర్చి, టమాటా ముక్కలను ప్రెస్ చేస్తూ చేతితో కలపాలి.
- ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకున్నాక ఈ రసం గిన్నెను స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు మరిగించాలి.
- రసం మరుగుతున్నప్పుడు కొత్తిమీర తరుగు చల్లి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- రసం మరింత టేస్టీగా కావాలనుకుంటే కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలను లో ఫ్లేమ్‌లో దోరగా వేయించి పొడి చేసుకుని కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది.
- ఇందులో ఎండు కారం సెపరేట్‌గా ఏమీ వేయం. కాబట్టి ఎండుమిర్చిని మీరు తినే కారానికి సరిపడేలా యాడ్ చేసుకుంటే సరి.
- టమాటాలను ఇలా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుంటే రసం రుచికరంగా ఉంటుంది.
గోధుమపిండి, మెంతి కాంబోలో "చిప్స్" - కరకరలాడుతూ నెల రోజుల నిల్వ ఉంటాయి!
కొత్త పద్ధతిలో నోరూరించే "టమాటా గుడ్డు పులుసు" - బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు!

