కాల్చిన టమోటాలు పచ్చిమిర్చితో "రసం" చేసుకోండి - ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!
అందరూ ఇష్టపడే టమోటా చారు - ఇలా కొత్తగా ట్రై చేయండి, టేస్ట్ సూపర్!

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 30, 2025 at 4:56 PM IST
Roasted Tomato Green Chilli Rasam : చాలా మందికి ఎన్ని కర్రీలు, ఫ్రై ఉన్నా భోజనం చివరలో కాస్త రసం లేదా పులుసుతో తినే అలవాటుంటుంది. అందుకే ఇండ్లలో వివిధ రకాల రసం, పులుసు రెసిపీలు చేస్తుంటారు. ఇందులో టమోటా చారు (టమోటా రసం) కూడా ఒకటి. వేడివేడి అన్నంలో ఇది వేసి తింటుంటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అయితే ఇంటిల్లిపాదీ మెచ్చే టమోటా చారును ఎప్పటిలా కాకుండా ఈసారి సరికొత్తగా ట్రై చేయండి. అదే కాల్చిన టమోటాలు, పచ్చిమిర్చితో నోరూరించే రసం. ఇది రెగ్యులర్‌గా చేసుకునే వాటితో పోల్చితే కొత్తగా, భలే కమ్మగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్లీమళ్లీ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.
గోంగూరతో పప్పు, పచ్చడే కాదు ఇలా "గారెలు" చేసుకోండి - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

కావాల్సిన పదార్థాలు :
- టమోటాలు - 5
- పచ్చిమిర్చి - 10
- వెల్లుల్లి రెబ్బలు - 8
- మిరియాలు - 1 టీ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- కందిపప్పు - 3 టేబుల్ స్పూన్లు
- ఎండుమిర్చి - 4
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- మెంతులు - 1 టీ స్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- చింతపండు - 30 గ్రాములు
- పసుపు - 1 టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - అర టీ స్పూన్
- కరివేపాకు - కొద్దిగా

తయారీ విధానం :
- ముందుగా స్టవ్ ఆన్ చేసి జాలి పెట్టి వాటిపై ఐదు టమోటాలు, 10 పచ్చిమిర్చికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కాల్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత టమోటాలు, పచ్చిమిర్చి పైన పొట్టు తీసి కట్ చేసుకోవాలి.
- అలాగే గిన్నెలో 30 గ్రాముల చింతపండు, సరిపడా నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. పదిహేను నిమిషాల తర్వాత చింతపండును పిండి రసం తీసి పక్కనుంచాలి.

- ఇప్పుడు టమోటా పచ్చిమిర్చి ముక్కలను మిక్సీజార్‌లో వేయాలి. అలాగే ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ మిరియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేయాలి.
- ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో మూడు టేబుల్ స్పూన్ల కందిపప్పు, నాలుగు ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ మెంతులు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీజార్‌లో వేసి మిక్సీ పట్టాలి.

- మరోవైపు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో చింతపండు రసం పోయాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు, ఉప్పు పసుపు వేసి మరిగించాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి టమోటా పేస్ట్‌తో పాటు వాటర్ యాడ్ చేసి మరగనివ్వాలి.
- ఈ మిశ్రమం మరుగుతున్నప్పుడు గ్రైండ్ చేసుకున్న కందిపప్పు ధనియాల పొడి వేసి కలపాలి.

- అదేవిధంగా తాలింపు కోసం పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి.
- ఆ తర్వాత తాలింపును మరుగుతున్న రసంలో వేసి మిక్స్ చేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి.
- ఇక అంతే ఘుమఘుమలాడే కాల్చిన పచ్చిమిర్చి టమోటా రసం మీ ముందుంటుంది!
- ఇలా ఇంట్లో చేసి పెడితే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు!
నోట్లో వేసుకోగానే కరిగిపోయే "సేమియా బొబ్బట్లు" - పప్పు ఉడికించే అవసరమే లేకుండా ఇలా చేయండి!
టిఫిన్ ఏదైనా సరే టమోటా కారంతో కమ్మగా తినేయొచ్చు - చట్నీ, పల్లీలు అవసరమే లేదు!

