సరికొత్తగా "టమాటా కూర" - అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్!
-ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇది చాలా బెస్ట్ ఆప్షన్ - సింపుల్‌గా, రుచికరంగా చేసుకోవచ్చు!

Published : January 8, 2026 at 12:42 PM IST
Tomato Onions Curry: అందరి ఇంట్లో ఉల్లిపాయలు, టమాటాలు కామన్‌గా ఉంటాయి. ఇక ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా మంది ఈ రెండింటిని యూజ్ చేసి కర్రీ చేస్తుంటారు. పుల్లగా, కారంగా ఉండే ఈ టమాటా కూర చాలా బాగుంటుంది. అయితే ఈ రెసిపీని ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా ఓసారి ఇలా చేయండి. ఇంకా ఇంకా బాగుంటుంది. తయారు చేసుకోవడం కూడా సులువే. ఈ కర్రీ అన్నం, చపాతీ, పూరీ, పరోటాల్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా కమ్మని టమాటా కూరను ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- టమాటాలు - అర కేజీ
- ఉల్లిపాయలు - 4
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- పచ్చిమిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు
- పసుపు - అర టీస్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్‌స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - తగినంత
- కొత్తిమీర తరుగు - గుప్పెడు

తయారీ విధానం:
- ముందుగా ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఉల్లిపాయలపై పొట్టు తీసేసి రెండువైపులా చివర్లు కట్ చేసి సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి తొడిమలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- అదే విధంగా టమాటాలను శుభ్రంగా కడిగి తొడిమలు తీసేసి వీటిని కూడా సన్నగా, పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి.

- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి తుంపలు వేసి దోరగా వేయించుకోవాలి.
- తాలింపు గింజలు వేగాక సన్నగా, పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్‌లో మగ్గించాలి.
- ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు కరివేపాకు వేసి ఓ నిమిషం వేయించాలి. అనంతరం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.

- అల్లం మగ్గినాక టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.
- టమాటా ముక్కలు మెత్తగా ఉడికినాక తగినంత కారం వేసి కలుపుకుని మగ్గించుకోవాలి.

- కారం మగ్గినాక అర కప్పు వాటర్ పోసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలేవరకు ఉడికించాలి.
- టమాటా ముక్కల్లోనుంచి నూనె పైకి తేలినాక కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే టమాటా కర్రీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- కారాన్ని మీరు తినే ఘాటుకు సరిపడేలా వేసుకోవాలి. అయితే టమాటాలు కాస్త పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ కూరకు కాస్త కారం ఎక్కువే పడుతుంది.
- టమాటాలు, ఉల్లిపాయలను నార్మల్‌గా కాకుండా సన్నగా, పొడుగ్గా కట్ చేసుకుంటే కూర మరింత రుచికరంగా ఉంటుంది.
అన్నం, టిఫెన్స్లోకి "టమాటా పచ్చడి" - పుదీనాతో కలిపి ఇలా చేస్తే ఆ టేస్ట్ నెక్ట్స్ లెవల్!
వీలైతే "అమెరికన్ గేట్ కేక్", కుదిరితే "ఇటలీ బాల్ కేక్" - మెల్ట్ చేసేస్తాయి!

