"టమాటా కోడిగుడ్డు కర్రీ" ఇలా వండండి - సరికొత్త రుచిలో అదుర్స్ అనిపిస్తుంది!
- ఇంటిల్లిపాదీ మెచ్చే కమ్మని 'గుడ్డు కూర' - బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు!

Published : December 5, 2025 at 12:26 PM IST
Tomato Egg Curry Preparation : కోడిగుడ్డుతో చేసే వంటలంటే ఇంటిల్లిపాదీకి ఇష్టమే. పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది ఇంట్లో ఎగ్స్ ఉన్నాయంటే ఆమ్లెట్, రెండు ఉల్లిపాయలతో ఎగ్ ఫ్రై వంటివి చిటికెలో చేసేస్తుంటారు. ఇక బాయిల్డ్ ఎగ్ కర్రీ విషయానికొస్తే చాలా మంది టమాటా కాంబినేషన్లో వండుతుంటారు. కానీ, కొన్నిసార్లు "టమాటా ఎగ్ కర్రీ" అంత రుచికరంగా రాదు. అలాంటి వారు ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మసాలా ఫ్లేవర్స్‌తో సూపర్‌గా ఉంటుంది. అలాగే, దీన్ని చాలా తక్కువ పదార్థాలతో ఎవరైనా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్‌కు కూడా ఇది బెస్ట్ ఆప్షన్. మరి, ఈ నోరూరించే టమాటా కోడిగుడ్డు మసాలా కర్రీని ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- కోడిగుడ్లు - నాలుగైదు
- టమాటా గుజ్జు - ఒక కప్పు
- ఉల్లిపాయలు - ఒకట్రెండు
- ఉప్పు - రుచికి తగినంత
- కారం - టేస్ట్‌కి సరిపడా
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక చెంచా
- గరంమసాలా - కొద్దిగా
- నూనె - తగినంత
- పచ్చిమిర్చి - మూడు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
పచ్చిమిర్చితో పసందైన "చికెన్ కర్రీ" - ఇలా చేస్తే ఇంట్లో పండగే!!

తయారీ విధానం :
- ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో కోడిగుడ్లను కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
- అవి ఉడికేలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే, ఒక కప్పు పరిమాణంలో టమాటా గుజ్జును రెడీ చేసుకోవాలి.
- ఇందుకోసం టమాటాలను శుభ్రంగా కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్‌లా మిక్సీ పట్టుకుని పక్కనుంచాలి.
- ఇప్పుడు ఉడికిన కోడిగుడ్లను పై పొట్టు తొలగించుకోవాలి. తర్వాత ఒక్కో గుడ్డును నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి.

- అనంతరం కర్రీ తయారీకి స్టవ్ పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త రంగు మారేంత వరకు వేయించాలి.
- ఆ తర్వాత అందులో రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ను వేసి ఒకసారి కలపాలి. ఆపై అల్లంవెల్లుల్లి పేస్ట్, సన్నని పచ్చిమిర్చి తరుగు, రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకుని ఒకసారి అన్నీ కలిసేలా కలపాలి.
- ఆపై అందులో గ్రేవీకి తగినన్ని నీళ్లు పోసుకుని కలిపి ఆ మిశ్రమం వేడెక్కే వరకు ఉడికించుకోవాలి.
చలికాలం పిల్లలకు బలాన్నిచ్చే "నువ్వుల లడ్డూలు" - పాకంతో పని లేదు, విరిగిపోవు!

- టమాటా మిశ్రమం బాయిల్ అవుతున్నప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను యెల్లో పార్ట్ పైకి ఉండేలా వేసుకుని ఒకసారి లైట్‌గా కలపాలి. తర్వాత పాన్‌పై మూతపెట్టి ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక చివర్లో మూత తీసి ఒకసారి నెమ్మదిగా కలిపి గరంమసాలా, కొత్తిమీర తరుగు వేసి కలిపి ఒక నిమిషం ఉంచి దింపేసుకుంటే చాలు.
- అంతే, మసాలా ఫ్లేవర్‌తో సూపర్ టేస్టీగా ఉండే "కోడిగుడ్డు టమాటా కర్రీ" రెడీ అవుతుంది!
- మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ పద్ధతిలో బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసి చూడండి. ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతుంది!

వహ్వా అనిపించే "ఉలవచారు - చికెన్" - ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అయిపోద్ది!

