మంచుకొండల్లో ప్రయాణం ఆహ్లాదమే! - కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే ట్రిప్ "హ్యాపీ"!
-ప్రకృతి అందాల్ని ఆస్వాదించేందుకు మంచు కొండలు బెస్ట్ - కానీ హిమసీమలకు వెళ్లాలనుకునేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలని నిపుణుల సూచన!

Published : August 29, 2026 at 2:51 PM IST
Tips to Stay Safe while Travel in Mountains: ఎత్తైన మంచు శిఖరాలు, లోతైన లోయలు.. నింగినుంచి దూకే జలపాతాలు.. ప్రకృతి అందాల్ని ఆస్వాదించేందుకు హిమాలయాలకన్నా అనువైన ప్రాంతం భూమిపైనే లేదంటారు యాత్రికులు. అందుకే కాస్త కష్టమైన అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా నేపాల్, భూటాన్ వంటి దేశాలతో పాటు లద్దాఖ్, మనాలి, రోహ్తంగ్ పాస్, గ్యాంగ్‌టక్ -నాథులా పాస్, బదరీనాథ్, కేదారనాథ్, కైలాస్ మానసరోవర్ వంటి ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ఇటీవల హిమసీమలు చాలా మందికి కన్నీళ్లు తెపిస్తున్నాయి. నేపాల్ జలప్రళయమే తాజా ఉదాహరణ. ఈ క్రమంలోనే నేపాల్ సహా పర్వత ప్రాంతాలు, మంచుకొండలకు వెళ్లాలనుకునేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు వివరిస్తున్నారు.
మంచుకొండల్లో ప్రయాణం ఎందుకంత ముప్పు:
- నిమిషాల్లో మారే వాతావరణం: పర్వతాలను ఢీకొన్నప్పుడు గాలి చల్లబడుతుందని, తేమ ఎక్కువుంటే మేఘాలు వేగంగా ఏర్పడి ఒక్కసారిగా భారీ వర్షం, మంచు కురుస్తుందంటున్నారు.
- కుంభవృష్టి: తక్కువ సమయంలో కొద్దిప్రాంతంలోనే ఆకాశానికి చిల్లులుపడ్డట్టు వాన కురుస్తుందని, నేల, రాళ్లు ఈ నీటి ప్రవాహాన్ని మోయలేకపోతే బురద, రాళ్లతో కూడిన ప్రవాహాలు ఏర్పడతాయంటున్నారు.
- విరిగే కొండచరియలు: భారీ వర్షంతో మట్టి బరువు పెరిగి రాళ్ల మధ్య పట్టుతగ్గి మట్టి, రాళ్లు చెట్లు కిందికి జారిపడతాయని చెబుతున్నారు.
- అవలాంచ్: కొత్త, పాత మంచు పొరల మధ్య బలహీనత ఏర్పడితే మంచు కొండచరియలు ఒక్కసారిగా కిందికి జారతాయంటున్నారు.
- రోడ్ల విధ్వంసం: నీటి ప్రవాహంతో రోడ్డు కింద మట్టి కొట్టుకుపోతుందని, వాగులు ఉప్పొంగి రోడ్లు, వంతెనలు ఆకస్మాత్తుగా దెబ్బతింటాయంటున్నారు.
ఈ విషయాలు తెలుసుకోవాలి: అనువైన కాలం ఏది? కొండ చరియలు, అవలాంచ్‌లు, వరదల ముప్పుందా? సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? గాలి తక్కువుంటే ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్లాలా? అనే విషయాలు తెలుసుకోవాలంటున్నారు. అదే విధంగా వైద్య సదుపాయాలు, సెల్‌ఫోన్ సిగ్నలింగ్ ఉందా? ట్రెక్కింగ్ ఎంత దూరం? ఎంత ఎత్తుకు వెళ్లాలి? ఎన్ని గంటలు నడవాలి అనే విషయాలు గమనించాలని అంటున్నారు. అదే విధంగా బయలుదేరడానికి ముందేకాదు ప్రయాణం కొనసాగుతున్నంత సేపూ వాతావరణ హెచ్చరికలను పరిశీలించాలని, స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలంటున్నారు.
ప్రయాణానికి ముందు ఈ జాగ్రత్తలు:
- వాతావరణ సూచనలే కాకుండా అవలాంచ్, ల్యాండ్ స్లైడ్ అలర్ట్లనూ చూడాలంటున్నారు.
- స్థానిక జిల్లా యంత్రాంగం లేదా పోలీసులు రోడ్డు మూసివేశారని చెబితే ప్రత్యామ్నాయ మార్గం ఉందని బలవంతంగా వెళ్లకూడదంటున్నారు.
- ఆగస్టు, సెప్టెంబర్‌లో హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, లద్దాఖ్‌లో వాతావరణ పరిస్థితులను రోజూ పరిశీలించాలంటున్నారు.
- రాత్రివేళ పర్వత మార్గాల్లో ప్రయాణాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని వివరిస్తున్నారు.
ప్రయాణ సమయంలో:
- కొండ అంచున, రాళ్లు వేలాడుతున్న ప్రాంతంలో వాహనం ఆపొద్దంటున్నారు.
- భారీ వర్షం మొదలైతే నదులు, వాగులు, నాళాలు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదంటున్నారు.
- కొండపైనుంచి చిన్న రాళ్లు పడటం, చెట్లు వంగడం, నేలలో పగుళ్లు, నీరు కొత్తగా ఊరడం వంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లాలంటున్నారు.
- ల్యాండ్ స్లైడ్ జరిగిన ప్రదేశం దాటిపోయామని భావించి ఫొటోలు తీయడానికి ఆగకూడదంటున్నారు.
- అవలాంచ్ హెచ్చరికలున్న ప్రాంతాల్లో గైడ్ లేకుండా వెళ్లకూడదని సూచిస్తున్నారు.
"హిమాలయ ప్రాంతాలకెళ్లే వారు అక్కడి వాతావరణంపై అవగాహన పెంచుకోవాలి. స్థానిక జలపాతాలు, డ్యామ్‌ల వద్ద అప్రమత్తత అవసరం. కుంభవృష్టి, భారీ వర్షాలు, కొండచరియలు, అవలాంచ్‌లు విరిగిపడే సమయంలో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిందే" - రంగారావు, ఫౌండర్, అడ్వంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ.
టూర్ నిర్వాహకుడికి అనుభవం ఉందా?:
- పర్వత ప్రాంతాల్లో ప్రయాణం, వాటర్ రాఫెల్లింగ్ సాహసయాత్రల్లో అనుభవం ఉన్న సంస్థను ఎంపిక చేసుకోవడం కీలకం అంటున్నారు. తక్కువ ధరకు ప్యాకేజీ ఇస్తున్నారనే కారణంతో ఏదో ఒకదాన్ని ఎంచుకోకూడదంటున్నారు.
- గైడ్లు, సిబ్బంది శిక్షణ పొందారా? తెలుసుకోవాలంటున్నారు.
- ప్రయాణ ప్రణాళిక, బస ప్రాంతాలు, నిర్వాహక సంస్థ వివరాలు, అత్యవసర సంప్రదింపు నంబర్లను కుటుంబసభ్యులకు తప్పనిసరిగా పంపాలని, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటున్నారు.
ఏ వాహనం సురక్షితం: హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచు, బురద, కొండచరియలు, జారుడు రోడ్లు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ప్రయాణించే వాహనం ఎంపిక అత్యంత కీలకం అంటున్నారు. ఫోర్ వీలర్లో నాలుగు చక్రాలకూ ఇంజిన్ శక్తినిపంపే వాహనాలు ఎంచుకోవాలంటున్నారు. మంచు, బురద, రాళ్ల రోడ్లపై గ్రిప్ దొరుకుతుందని, మంచు పేరుకున్న రోడ్లలో వాహన టైర్లకు ప్రత్యేకంగా స్నో చైన్లు అమర్చుకుంటే టైర్లు, రోడ్డు మధ్య గ్రిప్ ఉంటుందంటున్నారు. లేదంటే మంచులో టైర్లు కదలకపోవడం, జారిపోవడం వంటి ప్రమాదాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
వానాకాలంలో ప్రయాణమా! - ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్ అంటున్న నిపుణులు
పొగమంచులో ప్రయాణం చేస్తున్నారా? - అయితే ఈ టిప్స్ పాటించండి!

