ETV Bharat / offbeat

వెండి వస్తువులు నల్లగా మారాయా? - ఈ సింపుల్​ టిప్స్​తో క్లీన్​ చేస్తే కొత్తవాటిలా!

-ఎంత జాగ్రత్త చేసినా వెండి వస్తువులు కలర్​ మారుతున్నాయా? - ఈ టిప్స్​తో సింపుల్​గా క్లీన్​ చేసుకోవచ్చు!

Tips to Clean Silver Articles
Tips to Clean Silver Articles (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : February 25, 2026 at 5:21 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tips to Clean Silver Articles: కాళ్ల పట్టీలు, గంధం గిన్నెలు, దేవుడి విగ్రహాలు, కుంకుమ భరణిలు ఇలా ఎన్నెన్నో వెండి వస్తువులు మార్కెట్​లో లభిస్తుంటాయి. కొన్నప్పుడు షైనింగ్​గా​ ఉండే సిల్వర్​ వస్తువులు కొన్ని రోజుల తర్వాత కళను కోల్పోతుంటాయి. నల్లగా మారి అంత ఆకర్షణీయంగా ఉండవు. దీంతో చాలా మంది వివిధ రకాలుగా వీటిని క్లీన్​ చేస్తుంటారు. అయినా పెద్దగా ఫలితం ఉండదు. మరి మీ వెండి వస్తువులు కూడా నల్లగా మారాయా? అయితే ఓసారి ఈ టిప్స్​ పాటించి క్లీన్​ చేయండి. కొత్త వాటిలా కనిపిస్తాయి.

గాల్లోని తేమ కారణంగా జరిగే రసాయనిక చర్య వల్ల వెండి నల్లగా మారిపోతుందని.. ఫలితంగా అది మెరుపుని కోల్పోతుందని నిపుణులు అంటున్నారు. అందుకే వెండి వస్తువులను వీలైనంత వరకూ గాలి, తేమ తగలని ప్రదేశంలో జాగ్రత్త చేయాలని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వెండి వస్తువులకు మునుపటి మెరుపు తీసుకొచ్చేందుకు చిట్కాలు చెబుతున్నారు. అవేంటంటే..

ఉప్పు నీళ్లు: కూరలకు మంచి రుచిని అందించే ఉప్పుతో కూడా వెండి వస్తువులను తెల్లగా మార్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని కొద్దిగా ఉప్పు కలపాలి. ఆ నీటిలో నల్లగా మారిన వెండి వస్తువుల్ని కాసేపు ఉంచి ఆ తర్వాత మెత్తటి బ్రష్‌తో క్లీన్​ చేస్తే నలుపు పూర్తిగా వదిలిపోయి కొత్త వాటిలా మెరిసిపోతాయని చెబుతున్నారు.

వేడి నీరు: వెండి నగలు, వస్తువులపై మురికి పేరుకుపోయినప్పుడు వేడి నీళ్లతో వాటిని సులభంగా శుభ్రం చేయచ్చని చెబుతున్నారు. ఈ క్లీనింగ్​ కోసం రెండు కప్పుల వేడి నీళ్లలో కొద్దిగా డిటర్జెంట్‌ పౌడర్‌ని కలిపి.. అందులో శుభ్రం చేయాలనుకుంటున్న వెండి వస్తువుల్ని వేసి కాసేపు ఉంచాలి. అనంతరం బయటకు తీసి, మెత్తని బ్రష్‌తో సున్నితంగా రుద్ది, పొడిగా ఉన్న మెత్తని వస్త్రంతో తుడిచేస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

బేకింగ్‌ సోడా: బేకింగ్‌ సోడాతో కూడా వెండి వస్తువులకు కొత్త మెరుపును తీసుకురావొచ్చని నిపుణులు అంటున్నారు. దీని కోసం బేకింగ్‌ సోడాలో కొన్ని నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. మెత్తని బ్రష్‌తో ఈ మిశ్రమాన్ని తీసుకుని వెండి వస్తువులపై నిధానంగా రుద్ది.. ఆ తర్వాత వేడి నీటితో కడిగేయాలంటున్నారు. ఇలా చేయడం వల్ల వెండి వస్తువులు కొత్త వాటిలా మెరిసిపోతాయని వివరిస్తున్నారు.

టూత్‌పేస్ట్‌: పళ్లు రుద్దుకోవడానికి ఉపయోగించే టూత్​పేస్ట్​ను వెండి వస్తువులు క్లీన్​ చేయడానికి ఉపయోగించవచ్చని చెబుతున్నారు. టూత్‌పేస్ట్‌లో ఉండే క్యాల్షియం వెండి వస్తువులను కొత్తవాటిలా మెరిపిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో కొద్దిగా పేస్ట్‌ని తీసుకుని దాన్ని వెండి వస్తువుకు పల్చని పొరలా అప్లై చేసి టూత్‌పేస్ట్‌ పూర్తిగా ఆరిపోయే దాకా ఆగాలి. ఆ తర్వాత టిష్యూ పేపర్‌తో తుడిచి నీటితో శుభ్రం చేసేయాలి. ఇలా చేయడం వల్ల వాటి మెరుపు తిరిగొస్తుందని చెబుతున్నారు. ఇంకా వెండి వస్తువుల నలుపు పూర్తిగా వదలకపోతే ఇదే పద్ధతిని మరోసారి ఫాలో అయితే ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

గోరింటాకు: గోరింటాకు అంటే అందరి ఆడవాళ్లకు ఇష్టమే. ఆకులను రుబ్బి చక్కగా కాళ్లకు, చేతులకు పెట్టి మురిసిపోతుంటారు. అయితే గోరింటాకు పెట్టుకున్న తర్వాత చాలా మంది మిగిలిన పేస్ట్​ను పడేస్తుంటారు. కానీ అందులో పట్టీలు లేదా ఇతర వెండి వస్తువులు వేసి కొన్ని నీళ్లు పోసి రాత్రంతా అలానే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే మెత్తటి బ్రష్​కు డిటర్జెంట్​ అద్ది స్మూత్​గా రుద్దితే పట్టీలు కొత్త వాటిలా మెరిసిపోతాయి.

స్టీల్ సింక్​ని ఎలా క్లీన్ చేస్తున్నారు? - ఇలా చేస్తే జిడ్డు పోయి కొత్తదానిలా మెరుస్తుంది!

"కళ్లద్దాలు" ఎలా శుభ్రం చేస్తున్నారు? - మరకలు పోవాలంటే ఈ టిప్స్ వాడండి!