ఇంటి లోపల "మొక్కలు" పెంచాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే 'నైస్ లుక్'!
-అలంకరణ వస్తువుల్లా కాకుండా నిత్యనూతనంగా ఉండటం మొక్కల ప్రత్యేకత - అయితే ఇంట్లో పెంచుకునే విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Published : August 27, 2026 at 11:47 AM IST
Tips for Indoor Gardening: గార్డెనింగ్.. ప్రస్తుతం చాలా మందికి అలవాటుగా మారింది. ఇంటి అందం కోసం, మానసిక ప్రశాంతత కోసం చాలా మంది మొక్కలను పెంచుతున్నారు. పెరడు, మిద్దెతోట, బాల్కనీ గార్డెన్ ఇలా ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేస్తున్నారు. కేవలం ఇంటి బయట మాత్రమే కాదు ఇంట్లోనూ మొక్కలను పెంచుతున్నారు ప్రకృతి ప్రేమికులు. అయితే మిగతా అలంకరణ వస్తువుల్లా కాకుండా నిత్యనూతనంగా ఉండటం మొక్కల ప్రత్యేకత కాబట్టి వీటిని ఇంట్లో ఏర్పాటు చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చిట్టడవి వద్దు: ఇంటిని మొక్కలతో నింపేయకూడదని, అలా చేస్తే ఇంట్లోనూ ఒక చిట్టడవి తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొక్కల అమరికకూ ఓ పద్ధతి ఉండాలంటున్నారు. అందుకే ప్రతి మూలనీ మొక్కలతో నింపొద్దని, ఎక్కడైతే బోసిగా ఉన్నట్లనిపిస్తుందో అక్కడ మొక్కల్ని చేర్చాలంటున్నారు. ముఖ్యంగా ఏదో ఒక సమయంలో ఎండ పడే చోటనే మొక్కలు పెట్టాలంటున్నారు.
వైవిధ్యం పాటించాలి: అందంతోపాటే ఆహ్లాదం తద్వారా ఆరోగ్యం పొందేలా వీటిని తీర్చిదిద్దాలంటున్నారు. ఈ క్రమంలోనే ఒకే పరిమాణంలోని మొక్కల్ని ఒకచోట పెట్టకుండా.. పొడవైన, మధ్యస్థ, తక్కువ ఎత్తులో మొక్కలను పక్కపక్కన పెట్టాలంటున్నారు. అలాగే వీటి ఆకుల ఆకారాలూ విభిన్నంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. బాల్కనీ, మిద్దె, కారిడార్లలో మాత్రం ఒకే తరహా మొక్కల్ని వరుసలో పెట్టొచ్చని వివరిస్తున్నారు.
సహజత్వం పెంచాలి: మొక్కల చుట్టూ చెక్క, వెదురు, లినెన్, కాటన్, రాళ్లు... వీటిని ఏదో రూపంలో జోడిస్తే సహజత్వం పెరుగుతుందని వివరిస్తున్నారు. స్థలం తక్కువగా ఉంటే బోన్సాయ్ మొక్కలు, రాళ్లు, కలప-మెటల్ యాంటిక్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దొచ్చంటున్నారు.
చిన్న స్థలంలోనూ: హాలు, గదుల్లో తగినంత స్థలం లేకపోయినా ఏదైనా ఒక గోడను ఆనించి మినీ గార్డెన్‌ని సిద్ధం చేసుకోవచ్చంటున్నారు. దీనికోసం తక్కువ వెలుగులో పెరిగే మొక్కల్ని ఎంచుకోవాలంటున్నారు. గోడలకు వేలాడేలా ప్లాంట్ హ్యాంగర్స్ వస్తున్నాయని, వాటిని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఇక చెట్టు తరహా స్టాండ్‌లు వస్తున్నాయని, వాటిపైన కుండీల్ని పెట్టుకోవచ్చంటున్నారు. 3 నుంచి 4 అరలు ఉండే నిచ్చెన మాదిరి ప్లాంట్ స్టాండ్‌ని తేవచ్చని, పెద్ద మొక్కల్ని కింద, చిన్నవీ, వేలాడేవీ పైన ఉండేట్టు పెట్టుకోవచ్చంటున్నారు.
ఇల్లు మొత్తం: కిచెన్, డైనింగ్ టేబుల్, కాఫీ టేబుల్.. ఇలా ప్రతిచోటా మొక్కల్ని పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కిచెన్‌లో అయితే కొత్తిమీర, మెంతి, పెసలు, శనగలు, గోధుమగడ్డి, తోటకూర వంటి మైక్రో గ్రీన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. అలాగే తులసి, అలొవెరా వంటివీ పెంచొచ్చని వివరిస్తున్నారు. టేబుళ్లపైన ఆకర్షణీయ వాజ్‌లలోనూ మొక్కల్ని పెట్టొచ్చని, కానీ ఇవి మరీ పెద్దగా కాకుండా ఉండాలంటున్నారు.
వర్షాకాలంలో పాముల భయమా? - ఈ మొక్కలు ఉంటే ఇంట్లోకి రావట!
ఇంటిపైన 'మొక్కలు' పెంచుతున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే "మిద్దె" క్షేమం!

