ETV Bharat / offbeat

'తిరుపతి'కి చేరిన తెలంగాణ పెద్ద పులి! - నల్లమల టు శేషాచలం!

నంద్యాల మీదుగా కారిడార్‌ ఏర్పాటు - శేషాచలం కొండల్లో పెద్దపులి మకాం

పులి
nallamala_tiger_reserve (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 24, 2026 at 3:54 PM IST

|

Updated : August 25, 2026 at 12:01 PM IST

2 Min Read
Choose ETV Bharat

Nallamala Tiger Reserve : నల్లమల అభయారణ్యంలో పెద్దపులుల సంఖ్య పదేళ్లలో రెట్టింపయ్యింది. ప్రస్తుతం 50కి పైగా పులి కూనలు ఉన్నట్లు అధికారిక అంచనా. మరో వైపు శేషాచలంలో పులుల ఆవాసానికి అవకాశం ఉన్నా అక్కడ చిరుతలు మాత్రమే తిరుగాడుతున్నాయి. ఈ నేపథ్యంలో నల్లమల నుంచి శేషాచలం దిశగా పులుల వలస వెళ్తున్నాయి. తాజాగా ఓ పులి శేషాచలం కొండలకు వెళ్లడం ట్రాప్​ కెమెరాల్లో రికార్డయ్యింది. కొద్ది రోజుల కిందట వెంకటగిరి రేంజ్‌ వెంబలూరు బీట్ పరిధిలోని కెమెరా ట్రాప్‌లలో పెద్దపులి కదలికలు గుర్తించగా, నల్లమల నుంచి లంకమల మీదుగా శేషాచలం వెళ్లినట్లు భావిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి శేషాచలం కొండల్లోనే ఉండడం తెలిసిందే.

అది ఏ పులి?

శేషాచలం కొండల్లోకి వచ్చిన పులి ఎక్కడ నుంచి వచ్చిందనేది అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటీవల ఆమ్రాబాద్‌ పులుల అభయారణ్యం నుంచి రెండు, మార్కాపురం డివిజన్‌ నుంచి మరో పులి ఆత్మకూరు అటవీ డివిజన్‌లోకి వెళ్లాయి. రెండేళ్ల కిందట ఆత్మకూరు డివిజన్‌లోని 'టి-106' పులితో పాటు మరో పులి నెల్లూరు జిల్లా పెనుశిల నృసింహ అభయారణ్యం అడవుల్లోకి వెళ్లి రాగా, తాజాగా శేషాచలం కొండల్లోకి వెళ్లిన పులి ఏది అనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు శ్రీశైలం బయోల్యాబ్‌లో కెమెరా ట్రాప్‌లలో నమోదైన పులుల చిత్రాలను అటవీ అధికారులు విశ్లేషిస్తున్నారు.

పులి తన సామ్రాజ్యానికి హద్దులు ఎలా పెడుతుందో తెలుసా? - "నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం"

విస్తీర్ణం పెంచుకునేందుకు చర్యలు

దేశంలోనే అతి పెద్దదైన నాగార్జున సాగర్‌- శ్రీశైలం అభయారణ్యంలో పులుల సంఖ్య పెరుగుతోంది. దీంతో వాటి వాటి ఆవాస విస్తీర్ణం పెంచడానికి అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు నల్లమల నుంచి నంద్యాల-గిద్దలూరు మీదుగా కడప-నెల్లూరు జిల్లాల నుంచి శేషాచలం కొండల్లోకి ప్రవేశించేలా అటవీ కారిడార్‌ ఏర్పాటు చేశారు.

ఫలించిన ప్రయత్నం

తాజాగా ట్రాప్ కెమెరాల్లో నమోదైన పులుల చిత్రాలను గమనిస్తే, పులులను శేషాచలం కొండల్లోకి తీసుకెళ్లాలనే అటవీ అధికారుల ప్రయత్నం ఫలించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఓ పెద్దపులి శేషాచలం అడవుల్లోకి తొలిసారిగా ప్రవేశించినట్లు భావిస్తుండగా, పులుల సంతతి పెరుగుదలకు అనుకూలంగా వాతావరణం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ విస్తీర్ణం కలిగి శేషాచలం కొండల్లో పులులు ఆవాసం ఏర్పాటు చేసుకుంటే వాటి సంతతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

క్రమంగా పెరుగుతున్న సంతతి

నల్లమల అడవుల్లో పులుల సంతతి గడిచిన దశాబ్ద కాలంలో విస్తృతంగా పెరిగింది. 2010 సంవత్సరంలో 45 పులులు కాస్తా 2024లో 87కి చేరినట్లు గుర్తించారు. ప్రస్తుతం నార్త్‌ కోస్టల్‌ ఆంధ్రా రీజియన్, పాపికొండలు నేషనల్‌ పార్క్‌లో పెద్ద పులులతో పాటు పులి కూనల ఆనవాళ్లు కనిపించడంతో భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సంరక్షణకు చర్యలు

నల్లమలలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టిన అటవీ అధికారులు, వాటికి ఆహారంగా జింకలు, దుప్పులు, అడవి పందుల పెరుగుదలకు అనుకూల ఆవాసం కల్పించారు. అడవిలోని నిషిద్ధ ప్రాంతాల్లోకి జనం వెళ్లకుండా పటిష్ఠ చర్యలు చేపట్టడంతో పాటు జంతువులకు నీటి వసతి కల్పించారు. అక్కడక్కడా 'సాసర్‌ పిట్‌'లు ఏర్పాటు చేసి నీరు నిలిచేలా చూస్తున్నారు. వాగుల్లో చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సోలార్‌ బోర్లతో కుంటలు నింపుతున్నారు.

పంజా విసిరిన "ప్రాజెక్ట్ చీతా" - అరుదైన మైలురాయి సాధించిన ఇండియా!

ఏ రెండు పులుల చారలు ఒకేలా ఉండవు! - అడవుల్లో వ్యాఘ్రాలను ఎలా లెక్కిస్తారంటే!

Last Updated : August 25, 2026 at 12:01 PM IST