ఒక్క తోటకూరతో రెండు కర్రీలు! - వారెవ్వా అనిపిస్తాయి!
- ఆకులతో ఒక రెసిపీ.. కాడలతో మరో రెసిపీ! - ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు

Published : November 9, 2025 at 5:16 PM IST
Thotakura : మార్కెట్లో తోటకూర తాజా తాజాగా కనిపిస్తుంది. చూడగానే నిగనిగలాడుతోంది కదా అని మనసు కొనేసెయ్ అంటుంది. కానీ, ఇంటికి వెళ్లిన తర్వాత లెక్క మారిపోతుంది. ఇప్పుడు తోటకూర వండాలంటే శుభ్రంగా క్లీన్ చేయడానికి, ఆకులు తెంపడానికి చాలా టైమ్ పడుతుందని ఫ్రిజ్ లో పెట్టేసి, వేరే కూరలు వండేస్తారు. ఆ తర్వాత ఎప్పుడో ఫ్రిజ్ తెరిచి చూస్తే సగం అప్పటికే పాడైపోయి ఉంటుంది. సగం వాడిపోయి పాడైపోయే దశలో ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే తేగానే ఇగురు కూర వండేస్తే సరి అంటున్నారు పాకశాస్త్ర నిపుణులు. మరి, ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి? ఇందుకోసం కావాల్సిన పదార్థాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- 4 కట్టల తోట కూర
- 1 కప్పు పెసరపప్పు
- అర స్పూన్ పసుపు
- 2 స్పూన్ల కొబ్బరి తురుము
- 1 స్పూన్ కారం
- పావు స్పూన్ జీలకర్ర
- తగినంత ఉప్పు
తయారీ విధానం :
- ముందుగా పెసరపప్పును ఒక గిన్నెలో వేసుకొని కనీసం అరగంట సేపు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత తోటకూరను నాలుగుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. (లేకపోతే అందులో ఉండిపోయిన మట్టి, ఇసుక కూరలోకి వచ్చేస్తుంది.)
- శుభ్రం చేసుకున్న తర్వాత ఆకును సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- కాడలను పూర్తిగా పక్కన పెట్టేయాలి. కేవలం ఆకు మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.
- స్టౌ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకొని చిటపటలాడనివ్వాలి.
- ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూరను ఇందులో వేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకొని ఓసారి మొత్తం కలుపుకోవాలి.
- మూత పెట్టి ఐదారు నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి, మరోసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం కారం, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి మరో మూడ్నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి.
- ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నీరు మొత్తం ఇగిరిపోయే వరకు ఉంచుకొని, ఉప్పు టేస్ట్ చూసుకోవాలి. సరిపోకపోతే మరికాస్త వేసుకొని దించేస్తే సరి.
- ఈ కర్రీలో పప్పు ఎక్కువగా మెత్తబడకూడదు. ఇదే ఇందులో స్పెషాలిటీ. తింటున్నప్పుడు పంటి కింద నలుగుతుంటేనే అద్భుతంగా ఉంటుంది.
- ఈ రెసిపీని వేడి వేడి అన్నంలో వేసుకొని, అందులో కావాల్సినం నెయ్యి వేసుకుని తిన్నారంటే చెప్పడానికి మాటలుండవ్!
- ఇంట్లో గుమ్మడికాయ లేదా మరేవైనా వడియాలు ఉంటే.. వాటిని ఓ వాయి వేపుకొని సైడ్ డిష్ గా పెట్టుకున్నారంటే ఇంతకు మించి ఇంకేం కావాలి? అంటారు!!
పెసరపప్పుతో నోరూరించే "పూరీలు" - తక్కువ నూనెతో చక్కగా పొంగుతాయి!
కాడలతో ఇలా :
- కేవలం ఆకులతో పై పద్ధతిలో కర్రీ చేసుకున్న తర్వాత కాడలతోనూ మరో రెసిపీ తయారు చేసుకోవచ్చు.
- ఈ తోటకూర కాడలను చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేసినప్పుడు అంచుల నుంచి వచ్చే పీచును తీసి పారేయాలి.
- తర్వాత స్టౌ మీద గిన్నె పెట్టి ఆ ముక్కలను అందులో వేసి, ఒక కప్పు కందిపప్పు కూడా యాడ్ చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి, ఆయిల్ వేేయాలి.
- వేడెక్కిన తర్వాత కాసింత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు సిద్ధం చేయాలి.
- అందులో ఉడికించి పెట్టుకున్న తోటకూర కాడలు, కందిపప్పు వేసుకోవాలి.
- తగినన్ని నీళ్లు, నిమ్మకాయంత సైజు చింత పండు వేసుకొని ఆవపెట్టాలి
- నాలుగైదు నిమిషాల అనంతరం ఉప్పు, కారం వేసి సన్నని మంట మీద ఉడకనివ్వాలి.
- ఉడికిందనుకున్న తర్వాత కొత్తిమీర తరుగు వేసుకొని దింపేసుకుంటే సరి.
- వేడి వేడిగా తోటకూర కాడల కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది.
టిఫెన్స్లోకి నిమిషాల్లోనే చేసుకునే "చట్నీ" - ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చేస్తుంది!

